పాడ్యమి నుండి పంచమి దాకా వివిధ తిథి వ్రతాలు
వ్యాసమహర్షీ! ఇప్పుడు నేను ప్రతిపదాది తిథుల వ్రణాలను ఉపదేశిస్తాను. ప్రతిపదా అనగా పాడ్యమి తిథి నాడు చేయవలసిన ఒక విశేషవ్రతం పేరు శిఖి వ్రతం. ఈ ప్రతాన్నాదరించిన వారికి వైశ్వానరపదం సిద్ధిస్తుంది. పాడ్యమి నాడు ఏకభుక్తవ్రతం. అనగా పగటిపూట ఒకేమారు భోజనం చేసి వుండిపోవాలి. వ్రతం చివర్లో కపిల గోవును దానమివ్వాలి. చైత్రమాసారంభంలో విధిపూర్వకంగా గంధ, సుందరపుష్ప, మాలాదులతో బ్రహ్మను పూజించి హవనం చేసినవారు అభీష్ట ఫలప్రాప్తి నందగలరు. కార్తిక శుద్ధ అష్టమినాడు పూలను వాటి మాలలనూ దానం చేయాలి. ఇలా ఏడాదిపొడవునా చేసిన వారికి రూప సౌందర్యం లభిస్తుంది.
శ్రావణ కృష్ణ తదియనాడు లక్ష్మీ, శ్రీధర విష్ణుల మూర్తులను బాగా అలంకరించబడిన శయ్య పై స్థాపించి పూజించి రకరకాల పండ్లను నివేదించి ఆ శయ్యాదులను బ్రాహ్మణునికి దానం చేసి ఈ విధంగా ప్రార్ధించాలి. శ్రీధరాయనమః శ్రియైనమః. ఈ తదియనాడే ఉమామహేశ్వరులనూ, అగ్నినీ కూడా పూజించాలి. ఈ దేవతలందరికీ హవిష్యాన్నీ, తన కిష్టమైన పదార్థాలనూ, తెల్లకమలాల (దమనకాల) నూ నివేదించాలి.
ఫాల్గునాది తదియల వ్రతంలో వ్రతి ఉప్పు తినరాదు. వ్రతాంతమున బ్రాహ్మణుని ఆయన పత్నితో సహా పూజించి అన్న, శయ్యా, పాత్రాది ఉపస్కరయుక్తమైన ఇంటిని దానం చేసి భవానీ ప్రియతాం అనాలి. ఇలా చేసిన వారికి దేహాంతం లో భవానీలోకం ప్రాప్తిస్తుంది. ఈ లోకంలో కూడా సర్వసుఖాలూ లభిస్తాయి.
మార్గశిర తదియనుండి క్రమంగా తిథి నాటి కొకరుగా గౌరి, కాళి, ఉమ, భద్ర, దుర్గ, కాంతి, సరస్వతి, మంగళ, వైష్ణవి, లక్ష్మి, శివా, నారాయణి దేవీ స్వరూపాలను పూజించాలి. దీనివల్ల ప్రియజన వియోగాది కష్టాలు కలగకుండా వుంటాయి.
No comments:
Post a Comment