Wednesday 4 September 2024

శ్రీ గరుడ పురాణము (284)

 


అనంగ త్రయోదశీవ్రతం


బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి ఇలా ఉపదేశించసాగాడు. హే మహర్షి! మార్గశిర శుక్ల త్రయోదశి నాడు ఈ అసంగత్రయోదశి అనే వ్రతాన్నిచేయాలి.


మల్లికా వృక్షపు దంతపు పుల్ల, ఉమ్మెత్తపూలతో పండ్లతో శివుని పూజించాలి. తరువాత అనంగాయేతి... అదే మంత్రాన్ని పూర్తిగా చదువుతూ భగవంతుడైన శివునికి తేనెను నైవేద్యంగా అర్పించాలి. పుష్యమాసంలో ఆయననే యోగేశ్వరుడును పేర బిల్వ పత్రాలతో, కదంబ దంతపు పుల్లతో (పలుదోముపుల్ల) చందన, కృసరా (నైవేద్యం) దులతో పూజించాలి. 


మునులారా! మాఘమాసంలో నటనాగరుడైన శివదేవుని కుందపుష్పాలతో ముత్యాలమాలతో పూజించి పాకడ చెట్టు నుండి విరిచిన దంతధావనం పుల్లనూ పూరికా నైవేద్యాన్ని సమర్పించాలి. ఫాల్గునమాసంలో మరూబక (మండక) ములను పేరుగల పూలతో వీరేశ్వరనామక శివుని పూజించి ఆయనకు చక్కెర, కూర, గంజిలను నివేదించి మామిడి పల్డోము పుల్లను సమర్పించాలి.


చైత్రమాసంలో సురూప భగవానుని పూజించాలి. రాత్రి కొంచెం కర్పూరం నివేదించాలి. స్వామికి దంతధావనకి మజ్జిపుల్లనీ నైవేద్యానికి పూరీలను సమర్పించాలి. వైశాఖమాసంలో శివదేవుని సంహారకారక దమనక రూపంలో పూజించి ఉప్మా, బెల్లం నైవేద్యాలుగాను, గూలర (మేడి) పుల్లను దంతాల పనికనీ సమర్పించాలి. ప్రాశ్నకై జాతి ఫలాలను అర్పించాలి.


జ్యేష్టమాసంలో ప్రద్యుమ్నదేవుని చంపక పుష్పాలతో పూజించి బిల్వ దంతపు పుల్లని, లవంగమొగ్గలనూ సమర్పించాలి. ఆషాఢమానంలో ఉమాభద్రుని పూజించి అగరుగంధాన్ని పూసి ఉత్తరేని దంతపు పుల్లని సమర్పించాలి.


శ్రావణమాసంలో శూలపాణియైన శివుని పూజించాలి. గన్నేరుపూలు, గంధం, నెయ్యి, కలిపిన భోజనం, గన్నేరుపుల్ల పూజాద్రవ్యాలు భాద్రపదంలో సద్యోజాత నామంతో శివుని పొగడపూలతో పూజించి అరిసెలను వైవేద్యం పెట్టాలి. ఆశ్వియుజమాసంలో సురాధిపుడైన శివుని చంపకపుష్పాలు, బంగారు కలశతో నీరు, సువాసన వచ్చు మోదకాలు పూజాద్రవ్యాలుగా చేసి ఆరాధించాలి. దంతధావనపు పుల్లగా దమనకాన్ని సమర్పించాలి. కార్తికమాసంలో చంద్రపుల్లని దంతాలకీ, మదనపుష్పాలనూ, పాలనూ కూరగాయలను శివపూజానైవేద్యాలకి సమర్పించాలి. ఈ ఏడాదిలో ప్రతిరోజూ కమలపుష్పాలతో శివుని అర్చించాలి.


పైన చెప్పబడిన విధంగా సంవత్సరంపాటు పూజలు చేసిన తరువాత రతీసహితుడైన అనంగదేవుని స్వర్ణ ప్రతిమను స్వర్ణనిర్మితమైన మండలంలో స్థాపించి వారికి గంధాదులతో పూజ చేసి తిలలతో బియ్యంతో హవనసామగ్రిని తయారుచేసి వారికి పదివేల ఆహుతుల నివ్వాలి. రాత్రి జాగరణ చేసి గీత వాద్యాదులతో ఆనందభరితంగా గడిపి ప్రాతః కాలంలో ఆ దేవతలను మరల పూజించాలి. తరువాత బ్రాహ్మణులకు శయ్య, పాత్ర, చత్ర, వస్త్ర, పాదరక్షాదులను దానం చేసి గోవులకూ బ్రాహ్మణులకూ ఆత్మకింపయిన భోజనాలను భక్తి పూర్వకంగా పెట్టాలి. వ్రతం పూర్తయినాక ఉద్యాపన చేయాలి. ఈ విధంగా ఈ అనంగ త్రయోదశీ వ్రతాన్నాచరించిన వారికి లక్ష్మీ, పుత్ర సంతానం, ఆరోగ్యం, సౌభాగ్యం ఈ లోకంలో అక్షయంగా లభిస్తాయి. దేహాంతంలో స్వర్గం ప్రాప్తిస్తుంది. 


(అధ్యాయం-117)

No comments:

Post a Comment