Sunday 1 September 2024

శ్రీ గరుడ పురాణము (281)

 

మనస్సుకి ప్రసన్నతనిచ్చేదే మంగళకరం, శుభం. ఇతరుల సేవకై సమర్పింపబడేదే నిజమైన జీవనం. ధనం అందరికీ ఉపయోగపడినపుడే దానికి సార్ధక్యముంటుంది. సమర భూమిలో శత్రువుకెదురుగా నిలబడిచేసే గర్జనయే వాస్తవిక గర్జన. మదోన్మత్తత లేని స్త్రీయే శ్రేష్ఠవనిత. జితేంద్రియుడే నిజమైన పురుషుడు.


ఎంత గొప్ప రాజ్యైశ్వరాలైనా బ్రాహ్మణుని శాపంతగిలితే నశించిపోతాయి. ఎంత గొప్ప బ్రాహ్మణ తేజమైనా పాపాచార భూయిష్టమైతే నశించిపోతుంది. అశిక్షిత గ్రామంలో నివసించే బ్రాహ్మణుని సదాచారం సమాప్తమైపోతుంది. అలాగే దుష్ట స్త్రీల వంశం మిగలకుండా పోతుంది.


సంగ్రహానికి క్షయమూ, ఉత్కర్షకి పతనమూ, సంయోగానికి వియోగమూ, జీవనానికి మృత్యువూ అంతాన్ని తెస్తాయి. మరణమృదంగాన్ని వాయిస్తాయి.


రాజులేని రాజ్యంలోగాని అనేక రాజులున్న రాజ్యంలోగాని నివాసముండకూడదు. అలాగే ఆడపెత్తనం, బాలురకే అధికారం వున్న ఆవాసాలూ త్యాజ్యాలే.


(ఆచార .. 115/63)


డబ్బే ప్రాణమైన వానికి మిత్రులు, బంధువులు మిగలరు. స్త్రీ వ్యసనం కానీ, ఇతర వాంఛలు కానీ విపరీతంగా నున్న వానికి సిగ్గూ, భయమూ వుండవు. చింతామగ్నునికి అనగా నిత్యం బాధలూ వాటి ఆలోచనలే గల వానికి సుఖమూ, నిద్రా రావు. ఎంత తిన్నా ఆకలి తీరని వానికి బలం, తేజం నిలబడవు.


అర్థాతురాణాం న సుహృన్న బంధుః 

కామాతురాణాం న భయం న లజ్జా । 

చింతాతురాణాం న సుఖం న నిద్రా 

క్షుధాతురాణాం న బలం న తేజః ॥


(ఆచార ..115/67)


తన బాధలూ, వాటికి సంబంధించిన ఆలోచనలూ ఉన్నవానికే కాదు దుష్టునికీ ఇతరుల ధనాన్ని అపహరించడంలో విపరీతాసక్తి గలవానికి కూడా నిద్ర పట్టదు. పరకాంతా సక్తునికీ నిద్రపట్టదు. దోషికి నిద్రపట్టదు. ఋణమూ, రోగమూ లేనివాడూ, ఆడదాని జోలికే పోనివాడూ మాత్రమే నిద్రనొక భోగంలాగ అనుభవించగలరు.


కమలానికి జలంలో నిలబడివున్నంత కాలమే వరుణ, సూర్యదేవుల స్నేహం లభిస్తుంది. పడిపోతే ఏమీలేదు. ఎవరూ లేరు. మనిషైనా పదవిలో నున్నపుడే అంతా మిత్రత్వాన్ని పాటిస్తారు. దిగిపోయిన తరువాత ఎవరూ పట్టించుకోరు. ఆ అయ్యగారి సౌభాగ్యాలు అధికారాంతంలో చూద్దామన్నా మిగలవు. పైగా పదవిలోనున్నపుడు ఆయన చేసిన పనులకి ఇప్పుడు శత్రువులు బయట పడుతుంటారు. కేశములూ, దంతములూ, గోళ్ళూ శరీరంపై నున్నంతకాలమే గదా, వాటికి విలువ!


స్థానా స్థితాని పూజ్యంతే పూజ్యంతే చ పదేస్థితాః |

స్థానభ్రష్టా న పూజ్యంతే కేశా దంతా నఖా నరాః ॥


(ఆచార .. 115/73)


No comments:

Post a Comment