Saturday, 7 September 2024

శ్రీ గరుడ పురాణము (285)

 


అఖండ ద్వాదశీ వ్రతం


మునులారా! ఇప్పుడు మోక్ష శాంతిప్రదమైన అఖండ ద్వాదశీ వ్రతాన్ని వినిపిస్తాను. మార్గశిర శుద్ధ ద్వాదశినాడు ఆవుపాలు, పెరుగులను మాత్రమే భోజనంగా స్వీకరించి జగన్నాథుడైన విష్ణువును పూజించాలి. నాలుగు నెలలపాటు అనగా ఫాల్గున మాసం దాకా ప్రతి ఇలా ప్రతి ద్వాదశినాడూ చేసి చివర అయిదు రకాల ధాన్యాలను అయిదు రకాల ధాన్యాలను పాత్రలలో నింపి బ్రాహ్మణునికి దానం చేసి విష్ణుభగవానుని ఈ విధంగా ప్రార్ధించాలి. 


సప్త జన్మని హేవిష్ణో యన్మయా హి వ్రతం కృతం |

భగవంస్త్వ ప్రసాదేన తదఖండ మిహాస్తు మే ॥

యథాఖండం జగత్సర్వం త్వమేవ పురుషోత్తమ ।

తథాఖిలాన్య ఖండాని వ్రతాని మమ సంతువై ॥ (ఆచార ..118/3,4)


ఇలా తాను ఏడు జన్మలలో చేసే ప్రతిపుణ్య కర్మఫలాన్నీ అఖండం చేయుమని దేవుని ప్రార్థిస్తూ చైత్రాది నాలుగు మాసాల్లో సక్తు (సక్తు = పేలపిండి) తో నింపిన పాత్రలను, శ్రావణాది నాలుగు మాసాలలో నేయి నింపిన పాత్రలనూ బ్రాహ్మణునికి దానం చేయాలి. (సామర్థ్యం లేనివారు సంవత్సరంలో మూడు మార్లే దానమీయవచ్చును) ఈ విధంగా ఒక సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని చేసినవారికి ఉత్తమ స్త్రీ, మంచి కొడుకులూ లభిస్తారు. దేహాంతంలో స్వర్గలోక ప్రాప్తి వుంటుంది. (అధ్యాయం 118)


అగస్త్యార్ఘ్య వ్రతం


భుక్తి ముక్తి ప్రదాయకమైన ఈ వ్రతాన్ని కన్యారాశిలో సూర్యసంక్రాంతికి మూడు రోజుల ముందు ప్రారంభించాలి. కాశపుష్పాలతో (రెల్లుపూలతో) అగస్త్యుని మూర్తిని తెలతెల వారుతుండగా పూజించి కుంభంలోని నీటితో ఆ మహనీయునికి అర్ఘ్యమివ్వాలి. ఆ రోజంతా ఉపవసించి రాత్రి జాగరం చేసి తెల్లవారినాక బంగరు లేదా వెండి పాత్రలో, అయిదు రంగులున్నదానిలో, సప్తధాన్యములను పోసి, పెరుగునీ చందనాన్నీ కూడా రంగరించి అగస్త్యఃఖనమానః... అనే ఋగ్వేద (1/179/6) మంత్రం చదువుతూ మరల అర్ఘ్యప్రదానం చేయాలి. దీనికి ముందే పెరుగులో ముంచిన అక్షతలతోనూ, పూలతోనూ, పండ్లతోనూ ఆయన మూర్తిని పూజించాలి.


అర్ఘ్యానంతరం ఈ మంత్రంతో ప్రార్థించాలి.


కాశపుష్ప ప్రతీకాశ అగ్ని మారుత సంభవ |

మిత్రా వరుణయోః పుత్ర కుంభయోనే నమోస్తుతే ॥ (ఆచార .. 119/5)


ఈ వ్రతాన్ని శూద్రులు, స్త్రీలు కూడ చేయవచ్చును. పూజానంతరం ఒక కుండలో బంగారాన్నీ, వేరే దక్షిణనీ పెట్టి బ్రాహ్మణునకు దానమివ్వాలి. వేరే ఏడుగురు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా ప్రతి సంక్రాంతినాడూ చేస్తూ ఒక యేడాది పాటు చేసినవారు సర్వ ప్రకారాల శ్రేయస్సులకూ అధికారులౌతారు. ( అధ్యాయం -119)


No comments:

Post a Comment