Sunday 15 September 2024

శ్రీ గరుడ పురాణము (289)

 


శివరాత్రి వ్రతకథ విధానం


ఒకప్పుడీ వ్రతాన్ని శంకరభగవానుడు గౌరీదేవికుపదేశించాడు.


మాఘ, ఫాల్గున మాసాల మధ్యలో వచ్చే కృష్ణ చతుర్దశినాడు ఉపవాస, జాగరణాలు చేసి శివుని పూజించిన వారికాయన 'ఇక్కడ' భుక్తినీ 'అక్కడ' ముక్తినీ ప్రసాదిస్తాడు.


చాలాకాలం క్రిందట అర్బుద దేశంలో సుందరసేనుడను ఒక పాపాత్ముడైన నిషాద రాజుండేవాడు. అతడొకనాడు కుక్కలను వెంటబెట్టుకుని వేటకై ఒక అడవికి వెళ్ళాడు. దైవవశాన అతడికి ఏ జంతువూ దొరకలేదు. వెంట తెచ్చుకున్న ఆహారమూ, నీరూ నిండుకోవడంతో ఆకలి దప్పులతో అలమటిస్తూ వాటి కోసం కూడా తిరిగి దారి తప్పి రాత్రంతా నిద్రలేకుండా వెదకి చివరికి ఒక తటాకాన్ని చేరుకుని అక్కడే నిలచిపోయాడు. ఆకలి వల్ల నిద్రపట్టలేదు. అక్కడే ఒడ్డు మీద ఒక చెట్టు క్రింద అతనికి శివలింగం కనిపించింది. అతడు చెట్టుపైన రాత్రిని గడపడం కోసం ఎక్కగా అతడు కదిలినపుడల్లా ఆ చెట్టు ఆకులు శివలింగం మీద పడ్డాయి. అది బిల్వవృక్షం. అవి బిల్వపత్రాలు. అతడు త్రాగడానికి తెచ్చుకున్న నీళ్ళు శివలింగం మీద పడ్డాయి. పాత్ర నుండి పడిన నీటితో శివునికి అభిషేకం జరిగింది. అతని పొదిలోని బాణమొకటి జారి శివలింగం ప్రక్కన పడింది. అతడా బాణాన్ని తీసుకోవడానికి చేయి సాచినపుడా చేతికి శివలింగం తగిలింది.


* ఈ ప్రకారమా కొండరాజు ద్వారా రాత్రి జాగరణ, ఉపవాసము, బిల్వపత్రాలతో శివపూజ, లింగాభిషేకం అతనికి తెలియకుండానే జరిగిపోయాయి. అతనికి తెలియని విషయం మరొకటి కూడా ఉంది. ఆ రాత్రి శివరాత్రి తెల్లవారాక అతడు తన నిషాద రాజ్యానికి వెళ్ళిపోయాడు.


* శివలింగ సమీపంలో అతని బాణం పడిపోయినపుడతడు వంగి మోకాళ్ళపై కూర్చుని చేతిని ముందుకి చాచి దానినందుకున్నపుడతని చేయి శివలింగానికి తగిలింది కదా! తద్వారా అతనికి మోకాటిపూజ, శివస్పర్శన పుణ్యం కూడా కలిగాయి.


అతడు కొంతకాలానికి మరణించాడు. యమ దూతలాతని పాశబద్ధుని చేసి గొనిపోవుచుండగా శివదూతలడ్డుపడ్డారు. యమదూతలకు శివరాత్రి పుణ్యాన్ని వివరించి ఆ నిషాదుడు తన కుక్కలతో సహా నిష్పాపుడెలాగైనాడో బోధపరచి వానిని కైలాసానికి గొంపోయారు. ఈ విధంగా తెలియక చేసిన అసంకల్ప ప్రతికే ఇంత అదృష్టం పట్టినపుడు ఇక తెలిసి, సంకల్పించి మరీ శివరాత్రి వ్రతాన్ని చేసిన వారి సంగతి వేరే చెప్పాలా?


ఈ వ్రతానికి త్రయోదశినాడే దీక్షాగ్రహణం చేసి శివుని పూజించి ఇలా ప్రార్థించాలి.


ప్రాతర్దేవ చతుర్దశ్యాం జాగరిష్యా మ్యహం నిశి |

పూజాం దానం తపోహోమం కరిష్యామ్యాత్మక శక్తితః ||

చతుర్దశ్యాం నిరాహారో భూత్వా శంభు పరే హని ॥

భోక్ష్యేఽహం భుక్తి ముక్త్యర్థం శరణం మే భవేశ్వర ॥ (ఆచార 124/12,13)


మహాదేవునికి పంచామృతాలతో స్నానం చేయించి 'ఓం నమో నమశ్శివాయ' అనే మంత్రంతో పూజ చేయాలి. తదనంతరం పెరుగు, తిలతండులాలతో, వరి ధాన్యంతో నిర్మితమైన 'చరు' ని ఆహుతులుగా అగ్నిలో వ్రేల్చి పూర్ణాహుతినివ్వాలి. ప్రతి రాత్రి గీత వాద్యాలతో ఉత్సవాన్ని చేయించి హరి కథలను కూడా పెట్టించి తాను కథలను వినాలి. అర్ధరాత్రి, మూడోజాము, నాలుగోజాములు మొదలుకాగానే కాసేపు శివపూజ చేస్తూ మూలమంత్రాన్ని జపిస్తుండాలి. తెల్లవారగానే స్వామినీ విధంగా అర్థించాలి.


అవిఘ్నేనవ్రతం దేవత్వత్ప్ర సాదాన్మయార్చితం !

క్షమ స్వ జగతాం నాథ త్రైలో క్యాధి పతేహర ॥


యన్మయాద్యకృతం పుణ్యం యద్రుద్యస్య నివేదితం !

త్వత్ర సాదాన్మయాదేవ వ్రత మద్య సమాపితం ॥


ప్రసన్నో భవమే శ్రీమన్ గృహం ప్రతిచ గమ్యతాం |

త్వదాలోకన మాత్రేణ పవిత్రోస్మి న సంశయః ॥ (ఆచార.. 124/17-19)


తరువాత ధ్యాన నిష్ఠుడైన బ్రాహ్మణుని భోజనంతో తృప్తిపఱచి వస్త్ర, ఛత్రాదులతో, యథాశక్తి, ఆయనను పూజించి మరల పరమశివుని ఇలా వేడుకోవాలి.


దేవాదిదేవ భూతేశ లోకానుగ్రహ కారక ॥

యన్మయా శ్రద్ధయాదత్తం ప్రీయతాం తేన మే ప్రభుః॥॥ (ఆచార124/20,21)


ఇలా క్షమాపన స్తుతి చేయడంతో శివరాత్రి వ్రతమైపోతుంది. శివుడు సంప్రీతుడవుతాడు. సాధారణంగా ఈ వ్రతాంతంలోనే ద్వాదశ వార్షిక సంకల్పం చేస్తారు. ప్రతి ద్వాదశి నాడూ ఉపవాసజాగరణలతో సహా ఇలాగే ఏడాదిపాటు శివపూజను చేస్తారు. దీనివల్ల వ్రతికి సంపదలు, కీర్తి, పుత్రులు, అధికార ప్రాప్తి- ఇవన్నీ కలుగుతాయి. దేహాంతంలో శివలోకమూ ఒనగూడుతుంది. ఏడాది చివర పన్నెండుగురు బ్రాహ్మణులను భోజనం ద్వారా సంతృప్తి పఱచి దీపదానం చేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి వుంటుంది. (అధ్యాయం -124)

No comments:

Post a Comment