Friday 16 November 2012

నాగదేవతకు అపచారం

నాగుల చవితి సందర్భంగా అందరూ పుట్టలో పాలు పోయడం,పసుపుకుంకుమలు చల్లడం చేస్తాం.నాగపూజ చేయండి కాని కాస్త ఈ విషయాలను తెలుసుకొని నాగదేవతకు అపచారం చేయకుండా పూజించండి.

నిజానికి పాములు పాలు త్రాగవు.కేవలం క్షీరదాలు(mammals)మాత్రమే పాలు త్రాగుతాయి.అవి సరీసృపాలు(reptiles)కనుక పాలు త్రాగవు.వాటికి పాలు అరగకపోగా,వాటి మరణానికి కారణమయ్యే అవకాశం కూడా ఉంది.కొన్ని సమయాల్లో మాత్రం దాహాన్ని తీర్చుకోవడానికి,నీరు దొరకని సమయంలోనే,కొద్ది మోతాదులో(quantity) మాత్రమే పాలు త్రాగుతాయి.మరి మన ప్రాచీనులు ఎందుకు అలా చెప్పారు?

ఏదైన ఒక ఆనందకరమైన విషయం చెప్పినప్పుడు,చెప్పిన వారి "నెత్తిన పాలు పోస్తా"అని అంటుంటారు.మనది వ్యవసాయప్రధానమైన దేశం.పాములు పంటపొలాల్లో ఎలుకలను తిని రైతులకు ఎంతో సాయం చేస్తున్నాయి.వాటి సహాయనికి గుర్తుగా,ఆనందంతో వాటికి పాలు సమర్పించమన్నారు.పాలు సమర్పించడం అంటే ఒకటి లేదా రెండు చెంచాల పాలు పుట్టదగ్గర సమర్పించి,మిగితావి నాగదేవత నైవెద్యంగా స్వీకరించమని అర్ధం.ఆవు పాలు మాత్రమే సమర్పిస్తాం.ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచిది.అంతేకాని పుట్ట మునిగిపోయేవరకు పాలు పోసి పామును ఇబ్బంది పెట్టమని కాదు.

వాటిని పూజించండి అంటే గౌరవించండి,రక్షించండి అని అర్ధం చేసుకోవాలి.వాటిని పూజిస్తాం కనుక చంపకూడదు,ఎవరినా ఆ పని చేస్తుంటే ఆపాలి.

ఇక పుట్టవద్ద పసుపుకుంకుమ చల్లమని ఎక్కడ చెప్పలేదు.పసుపు పాములకు పడదు.ఎక్కడ పసుపు వాసన వస్తే అక్కడకు పాములు రావు.పసుపు వాటి శరీరానికి అంటుకుంటే,దాని వల్ల అవి చనిపోయే అవకాశం ఉంది.అందువల్ల పాము పుట్ట దగ్గర పసుపు చల్లకండి.కుంకుమ పసుపుతో తయారు చెస్తారు కనుక అది కూడా చల్లకండి.

ఇక కొంతమంది నాగదేవత అనుగ్రహం కోసం పాముపుట్టవద్ద టపాసులు కాలుస్తుంటారు.అది కూడా పాములకు ఇబ్బంది కలిగిస్తుంది,భయానికి గురి చేస్తుంది.కనుక దయ చేసి అటువంటి పనులు చేయకండి,ఎవరైనా టపాసులు కాలుస్తుంటే తప్పని చెప్పి,ఆపండి.

ఇక మన వాటికి సమర్పించే నైవెద్యం చలిమిడి,చిమ్మిలి మొదలైనవి.చిమ్మిలి వంటివి ఆహారంగా తీసుకోవడం చేత స్త్రీలకున్న గర్భదోషాలు తొలగిపోతాయి.పుట్టదగ్గర పాలు పోసినప్పుడు మట్టి వాసనతో పాటు కొన్ని రకాల వాయువులు వెలువడతాయి.అవి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.అందువల్ల నైవెద్యం సమర్పించండి,కొద్దిగా ఆవుపాలు మాత్రమే సమర్పించండి.

మీ ఇంటి ముందుకు ఎవరైన పాములను తీసుకుని వస్తే,వెంటనే స్నేక్ సెల్ (snake cell)లేదా  అటవీశాఖ(forest department) వారికి సమచారమివ్వండి.పాములను పట్టుకొచ్చేవారి దగ్గర పాములు బ్రతకవు,వారికి అవి కేవలం డబ్బుసంపాదనకు వస్తువులుగానే కనిపిస్తాయి.వారు వాటికి 6,7 నెలలుగా ఆహారం అందివ్వని  కారణంగా అవి ఆకలిని తట్టుకోలేక పాలు త్రాగుతాయి.కాని అలా త్రాగిన కొంతకాలానికే అవి మరణిస్తాయి.అందువల్ల మీకు నిజంగా నాగదేవత మీద భక్తి విశ్వాసాలు కనుక ఉంటే అటువంటి వారిని స్థానికి పోలిస్ స్టేషన్లో అప్పగించండి,లేదా ఫిర్యాదు చేయండి.

తల్లిదండ్రులను చూడకపొయినా,వారిని తిట్టినా,హింసించినా అది కూడా నాగదోషమే.అంతేకాదు ధూమపానం(smoking),మద్యపానం(alchol drinking) వంటి అలవాట్లు కూడా నాగదోషంగా సంక్రమించి మొత్తం వంశాన్నే సర్వనాశనం చేస్తాయి అని గుర్తుపెట్టుకోని,అటువంటి అలవాట్లు ఉన్నవారు మానండి.

కాస్త ఈ విషయాలను గుర్తుంచుకొని నాగపూజ చేయండి.నాగదేవత అనుగ్రహానికి పాత్రులవ్వండి.

నాగులచవితి శుభాకంక్షలు.        

No comments:

Post a Comment