Monday 3 June 2013

ఇంకుడు గుంతలు


ఇది సాధారణంగా సమాజంలో జరుగుతోంది. అజ్ఞానపు ఆలోచనలతో కూడిన ఆవేశంతో చేయాల్సిందంతా చేయడం, తరువాత మనం చేసిందానికి ఫలితం అనుభవించలేక బాధపడడం మాములుగా మారిపోయింది.

ఒక్క ఏడాది వర్షాకాలంలో మన మూడు సంవత్సరాల అవసరాలకు సరిపడా నీరు వర్షం ద్వారా భూమి చేరుతుంది. నలుగురు ఉండే 750-850 చదరపు అడుగుల ఇంటి పైకప్పు మీద ఒక వర్షాకాలంలో సగటున 75,000 నుంచి 90,000 లీటర్ల నీరు వర్షం ద్వారా పడుతుందట. దాన్ని శుద్ధి చేసి ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. బయట ఒక ఒక లీటరు నీరు కొనాలంటే కనీసంలో కనీసం 10 రూపాయలైన అవుతుంది. నీటిని శుద్ధి చేసే యంత్రం ఖరీదు 10,000-15,000 ఉంటుంది. మనం ఈ నీటిని శుద్ధి చేసుకుని వాడుకోకపోగా వృధా చేస్తున్నాం. మన ఇంట్లో నీరు ఇంకడానికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే ఈ వర్షపు నీటిని అందులోకి మళ్ళించవచ్చు. తద్వారా బోరు ఎండిపోకుండా ఉంటుంది. అవసరమైతే భవిషత్తులో బోరు నీటిని రివర్సు ఆస్మోసిస్ పద్దతి ద్వారా శుద్ధి చేసి త్రాగడానికి వాడుకోవచ్చు.

కాని మనం ఏం చేస్తున్నాం? మన ఇంట్లో మట్టి కనిపిస్తే అదేదో పెద్ద పాపం అన్నట్టు మొత్తం సిమెంటు ప్లోరింగ్ వేయించేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా రోడ్డుకు ఇరివైపులా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయకుండా మొత్తం సెమెంటు రోడ్లు వేయిస్తోంది. ఇప్పుడు పడ్డ వర్షపు నీళ్ళన్ని ఎక్కడో ఒక చోట నిలిచిపోయి ట్రాపిక్ జాం అవుతుంది. చివరకు ఈ నీరంతా డ్రైనేజిలో కలిసి ఎక్కడొ దూరంలో ఉన్న నదిలో కలుస్తుంది. జనానికి నీటి అవసరాలు తీర్చడం కోసం మళ్ళీ అదే నీటిని కొన్ని ప్రాంతాల్లో ఎత్తిపోతల పధకాల ద్వారా, కొన్ని ప్రదేశాల్లో మోటార్ల ద్వారా మళ్ళీ అదే నీరు మన ఇళ్ళు చేరడానికి సర్ఫరా చేస్తారు. దీనికి బోలుడంత విద్యుత్ వృధా.  దాదాపు మనమే వర్షపు నీటిని సరిగ్గా వాడుకోలేక సంవత్సరానికి అక్షరాలా 7 నుంచి 9 లక్షల రూపాయలు వృధా చేస్తున్నాం. దానికి తోడు ప్రభుత్వాలు మనకు నీటిని సర్ఫరా చేయడం కోసం వాడే విద్యుత్ ఖరుచును కలిపితే అది మరింత పెరుగుతుంది. అదే రాష్ట్ర వ్యాప్తంగా లెక్క చూస్తే ఎన్నో వందల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నామో ఆలోచించండి. అదే దేశావ్యాప్తంగా అయితే ఇంకెన్ని కోట్లు అవుతుంది.

మనం ఒక్కసారి ఆలోచించాలి. మన దేశసంపదను వృధా చేసే హక్కు ఎవరికి లేదు. మన దేశానికి లాభం చేసే పనులు చేయకపోయినా సరే, నష్టం చేసే పనులు చేయకుండా ఉంటే చాలు.

వర్షాకాలం పూర్తిగా ప్రవేశించకముందే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయండి. దీనికి ప్రభుత్వం కూడా తగిన సహాయం అందిస్తోంది. దాన్ని సక్రమంగా వినియోగించుకోండి. వర్షపు నీటి ఒడిసిపట్టండి.

నీరు లేనేదే జీవం లేదు. నీటితోనే మన బ్రతుకు. నీరు లేక పోతే భవిష్యత్తు లేదు.  

No comments:

Post a Comment