Thursday 27 June 2013

భారీ వర్షాలకు అలకానంద, భగీరథీ, మందాకిని నదులకు వరదలు వచ్చాయి. కానీ అక్కడ అంత నష్టం ఎందుకు జరిగింది?

బాగా వర్షాలు పడినప్పుడు, వానాకాలంలో ప్రతి నదికి సహజంగానే వరదలు వస్తాయి. ఈ ఏడాది కూడా ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాలకు అలకానంద, భగీరథీ, మందాకిని నదులకు వరదలు వచ్చాయి. కానీ అక్కడ అంత నష్టం ఎందుకు జరిగింది?

భగీరథీ జన్మస్థానమైన గోముఖ్ నుంచి ఉత్తరకాశి వరకు గల 135 కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ పరంగా అతి సున్నితమైన ప్రాంతం(eco-sensitive zone)
గా గుర్తిస్తూ గత ఏడాది 18 డిసెంబరు 2012 న కేంద్ర అటవి, పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 కింద ఉత్తర్వులు జారి చేసింది. దీని ప్రకారం ఆ ప్రాంతంలో నిర్మాణాలను నిషేధించింది.  

ఈ ఉత్తర్వులను అమలు చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న 1,734 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టులు, గనుల ప్రాజెక్టులు, హోటళ్ళు, రిసార్టులు మొదలైన నిర్మాణాలను, మూసివేయాల్సి ఉంటుంది(నిజానికి ఇవన్నీ పర్యావరణానికి వ్యతిరేకంగా నిర్మించినవే). ఇది ఆ ప్రాంతంలో అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వాదించింది. ఆ రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతిపక్షాలు కలిసి ఈ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. ఉత్తర్వులను రద్దు చేయాలంటూ గత నెలలో ఈ తీర్మానం తీసుకుని ఉత్తారఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగణ ప్రధానిని కలవడం జరిగింది.

ఇది ఒక్కటే కాదు, అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నదీ గర్భంలో కూడా నిర్మాణాలు చేపట్టారు. ఓట్ల కోసం తాపత్రయపడే ప్రభుత్వాలు, పార్టీలు ఆ అక్రమ నిర్మాణాలను సక్రమం చేశారు. విచ్చిలవిడిగా నదిలో నిర్మాణాలను చేశారు. ఇప్పుడు దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు.

ఎంత వర్షం పడాలో, వరదలు వస్తే అ వరదనీరు ఏ దారిగుండా పోవాలో, ఆ వరదను ఎన్ని దారుల గుండా బయటకు పంపాలో ఇవన్నీ ప్రకృతికి తెలుసు. కానీ మనవాళ్ళే ప్రాజెక్టులు మొదలైన వాటి పేర్లు చెప్పి ప్రకృతికి ఉన్న అన్ని దారులను మూసివేశారు. పైగా నదీగర్భాన్ని కూడా ఆక్రమించారు. ఏ నదైనా తన మార్గంలో అడ్డువచ్చిన వాటిని తనలో కలిపేసుకుని ముందుకుపోతుంది.....ఇక్కడ కూడా నది తన ప్రవాహ మార్గంలో అడ్డువచ్చిన అన్నిటిని తనలో కలుపుకుంటూ ముందుకుసాగిపోయింది. అక్రమంగా నిర్మించిన హోటళ్ళూ, ఊళ్ళూ, భవనాలు, వంతెనలు అన్ని నదీ ప్రవహాంలో కొట్టుకుపోయాయి. భారి నష్టం సంభవించింది. దీనికి కారకులు ఎవరు?............మనుష్యులే.                

No comments:

Post a Comment