Tuesday 15 October 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - విశ్వశాంతి యాగం - భృగు మహర్షి శాపం

ఓం నమో వేంకటేశాయ 

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరుడు. కలౌ వేంకటనాయకః అన్నారు, ఒక్కో యుగంలో ఒక్కో అవతారంలో పూజలందుకున్న స్వామి, కలియుగంలో శ్రి నివాసుడిగా ఆరాధించబడుతున్నాడు. శ్రీ నివాసుడి దివ్యలీలా విశేషాల గురించి, వేంకటాచల మహాత్యం గురించి 12 పురాణాల్లో ప్రస్తావించబడింది.

'వైకుంఠానికి సమానంగా ఈ వేంకటాచలంలో పరమాత్ముడు ఎందుకు ఉన్నాడు?' అని సనకాది మహామునులు సూతమహర్షిని ఒకసారి అడుగుతారు.

అప్పుడు సూతులవారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. ఒకప్పుడు మహర్షులంతా కలిసి ఒక మహాయజ్ఞం చేయాలనుకున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నారద మహర్షి, మహర్షులను ఉద్ద్యేశించి కొన్ని ప్రశ్నలు వేస్తారు. "ఎవరి గురించి మీరు ఈ కర్మను చేస్తున్నారు? ఈ యజ్ఞ కర్మ యొక్క ఫలాన్ని ఎవరికి సమర్పిస్తారు? ఈ యజ్ఞానికి భోక్త ఎవరు? సర్వకర్మలను ఎవరికి సమర్పించాలి? ఇవన్నీ స్వీకరించే సర్వోత్తముడు ఎవరు?"

యజ్ఞభోక్త అంటే యజ్ఞంలో వేసిన హవిస్సును స్వీకరించేవాడని అర్ధం. మనం ఎవరిని ఉద్ద్యేశించి యజ్ఞం చేస్తామో, అది ఆ దేవతకు చేరవేస్తాడు అగ్నిహోత్రుడు, ఆ హవిస్సుతో తృప్తి పొందిన దేవత మన కోరికలను తీరుస్తుంది. అందరూ, అన్ని యజ్ఞాలు కోరికల కోసం చేయరు. విశ్వశాంతి కోసం కొన్ని చేస్తారు, ఎటువంటి ఫలితం ఆశించకుండా ఇంకొన్ని చేస్తారు. మరి ఇవన్నీ ఎవరు స్వీకరిస్తారన్నది నారదమునీంద్రుల ప్రశ్న.

యజ్ఞం అంటే నిష్కామ కర్మ, స్వార్ధరహిత కర్మ. ఇక్కడ యజ్ఞం అంటే అగ్నిహోత్రం పెట్టి చేసేది మాత్రమేనని అనుకోకూడదు. మనం ఎవరికో రక్తదానం చేస్తాం, ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తాం, గోమాతలు కబేళాలకు తరలిపోకుండా అడ్డుకుంటాం. ఎన్నో దానాలు చేస్తాం, సేవకార్యక్రమాలు నిర్వహిస్తాం, పేదలకు అహారం పంచిపెడతాం. ఇవన్నీ కూడా యజ్ఞాలే. యజ్ఞం అంటేనే నిస్వార్ధంగా చేసేది. మరి మనం నిత్యం చేసే ఈ కర్మలు ఎవరిని చేరుతాయి? వీటిని ఎవరు స్వీకరిస్తారు? ఇది నారద మహర్షి అడిగిన ప్రశ్నల సారం.

నారదుడి ప్రశ్నతో మహర్షుల్లో ఎవరు సర్వోత్తముడు? ఎవరికి సర్వకర్మఫల సమర్పణ చేయాలి? యజ్ఞభోక్త ఎవరు? అన్న చర్చ మొదలైంది. అందరూ తీవ్రంగా చర్చించి, ఆ మహర్షుల్లో ప్రముఖుడైన భృగు మహర్షికి ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత అప్పగించారు. పరిష్కారం చూపవలసిందిగా ప్రార్ధించారు.

వీటికి సమాధానం తెలుసుకోవడం కోసం భృగుమహర్షి బ్రహ్మదేవుడు, సరస్వతీ దేవి ఉండే సత్యలోకానికి వెళ్ళారు. ఆ సమయానికి బ్రహ్మాసరస్వతులు ఏకాంతంలో ఉంటారు. భృగుమహర్షి వారికి నమస్కారం చేస్తారు, కానీ బ్రహ్మదేవుడు ఏమి గమనించనట్లుగా ఉంటారు.

బ్రహ్మదేవుడు సృష్టికర్త, మహాజ్ఞాని. ఆయనకు తెలియందేముంటుంది?  కలియుగంలో కలిపురుషుడి ప్రభావం నుంచి జనులను ఉద్ధరించడానికి విష్ణువు వేంకటాచలం మీద అవతరించవలసి ఉంది. ఆ అవతారం స్వీకరించే దశలో సాగుతున్న జగన్నాటకం ఇది. ఈ ఋషి ద్వారానే విష్ణువు భులోకానికి వెళ్తాడన్నది బ్రహ్మదేవుడికి తెలుసు. కనుక ఏమి ఎరగనట్లు మౌనం వహించాడు.

మనకన్నా యోగ్యులైనవారి వద్దకు, పెద్దవారి వద్దకు వెళ్ళినప్పుడు నమస్కరించడం (సాష్టాంగా నమస్కారం, ప్రణామం మొదలైనవి చేయడం) మన కర్తవ్యం. నమస్కారం స్వీకరించినవారు దాన్ని భగవంతునకు అర్పించి, ఆశీర్వదించడం, నమస్కారం స్వీకరించిన పెద్దల కర్తవ్యం. ఇది ధర్మం. ఈ మాత్రం కూడా బ్రహ్మదేవునికి తెలియదని భావించాడు భృగుమహర్షి.

'ఈ లోకంలో నీకు ఆలయం లేకుండు గాకా' అంటూ బ్రహ్మను శపించాడు భృగుమహర్షి. అందుకే బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయం కట్టి పూజించరు.

బ్రహ్మదేవుడి ఆలయం పుష్కర్‌లో ఒకటి ఉంది. అక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. దానికి గుర్తుగా ఒక చిన్నసరస్సు కూడా ఉంది. అటు తర్వాత మన రాష్ట్రంలో పవిత్ర గోదావరి నదీతీరంలో, బ్రహ్మదేవుడు సరస్వతీ దేవితో కలిసి యజ్ఞం చేసిన ప్రదేశంలో, ముక్కామల క్షేత్రంలో ఈ మధ్యకాలంలో ఆలయం నిర్మించారు ముక్కామల పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ శ్రీధర స్వామి.

బ్రహ్మను శపించిన భృగువు కోపంతో కైలాసానికి చేరుకుంటాడు. ఆ సమయంలో శివుడు కైలాసంలో పార్వతీదేవితో ఏకాంతంలో ఉంటాడు. శివుడి ఆజ్ఞా లేనిదే చీమైనా కుట్టదని శాస్త్రం. అటువంటి శివుడు భృగువు వచ్చాడాన్న విషయాన్ని గమనించనట్లు నటిస్తాడు. దాంతో కోపం వచ్చి, 'మహర్షుల ఆగమనాన్ని కూడా గుర్తించక కామాంధుడవై ఉన్న నీవు సర్వోత్తమ్ముడు కానేరవు. లోకంలో నీకు మూర్తి పూజ లేకుండు గాకా' అంటూ శపించాడు భృగు మహర్షి. అందుకే మనం శివుడిని విగ్రహరూపంలో పూజించమని పెద్దల మాట. కానీ, భృగు మహర్షి శపించకముందు నుంచి లోకంలో లింగారాధనే ఉన్నది. శివుడి విగ్రహాన్ని పూజించేవారికంటే శివ లింగాన్ని పూజించేవారు శక్తిమంతులని, వారిని ఎవరు ఓడించలేరని మహాభారతంలో కృష్ణపరమాత్మ చెప్తారు. పరమాత్మ మాటకు కొనసాగింపుగా మహర్షి శాపం ఇచ్చాడు (ఇప్పించాడు పరమాత్ముడు). ఇదో దైవలీల.

మనకు దగ్గరలో శివుడిని విగ్రహరూపంలో కొలిచే ఒక క్షేత్రం చిత్తురు జిల్లా, సురుటపల్లిలో ఉంది. ఇక్కడ శివుడు పార్వతీదేవి ఒడిలో నిద్రిస్తునట్లుగా ఒక పెద్ద శిలాముర్తి ఉంటుంది.

ఆవేశంతో ఉన్న భృగుమహర్షి వైకుంఠం చేరుకుంటాడు. వైకుంఠంలోనూ అదే పరిస్థితి. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి ఏకాంతంలో ఉంటారు. భృగుమహర్షి ఆగమనాన్ని పట్టించుకోనట్ట్లు ఉంటారు. తెలియక కాది, లోక కల్యాణం కోసమని.......................... ముందు రెండులోకాల్లో పరిస్థితే ఇక్కడా అనుభమయ్యేసరికి భృగుమహర్షి ఆవేశం కట్టలుతెంచుకుంటుంది. అంతే, కోపంతో విష్ణుమూర్తి వక్షస్థలంపై (లక్ష్మీదేవి నివాసముండే ప్రస్దేశంలో) కాలితో తంతాడు........

అప్పుడే గమనించినట్లు విష్ణుమూర్తి భృగుమహర్షి వైపు చూసి ఆయనకు ఉపచారాలు చేస్తాడు...... అతి కాఠిన్యమైన నా దేహ్న్ని తగిలి మీ పాదానికి నొప్పి కలిగి ఉంటుందంటూ ఆ కాలి వత్తి ఉపశమనం కలిగిస్తాడు. శ్రీమహాలక్ష్మీని ఆదేశించి మహర్షికి పాదపూజ చేస్తాడు. మహర్షి పాదోదకం తన పై చల్లుకుని, లక్ష్మీదేవీపై చల్లి, తన మందిరమంతా, వైకుంఠమంతా చల్లిస్తాడని పురాణవచనం.

భృగుమహర్షికి అరికాలిలో మూడవకన్ను ఉంటుంది. ఆ కన్ను కారణంగానే అతనిలో అవేశం ఎక్కువ ఉంటుంది. ఎంతటి గొప్ప సాధకుడైనా, క్రోధం ఉంటే, అతని సాధన వ్యర్ధమవుతుంది. భృగుమహర్షి గొప్పవాడు, తపోశక్తితో మూడులోకాలకు కాలినడకన వెళ్ళగలిగాడు. కానీ, అతనిలో కోపం కారణంగా బ్రహ్మను, శివుడిని శపించి, తను ఎన్నో ఏళ్ళ తరబడి తపస్సు చేసి పొందిన తపశ్శక్తిని మొత్తం వృధా చేసుకున్నాడు.

తన భక్తులు ఎప్పటికి నాశనం పొందరని పరమాత్మ గీతలో చెప్తారు. తన భక్తుడు ఎంతటి దుర్మార్గుడైనా, అతన్ని నిందించరాదని, భగవంతుని నమ్మాడు కనుక ఎప్పటికైన బాగుపడతాడని చెప్తాడు. తన భక్తులను ఉద్ధరించడం తన బాధ్యతగా స్వీకరిస్తాడు పరంధాముడు. మనం ఏ రూపంలో పీజిస్తే, ఆ రూపంలోనే మనలని ఉద్ధరిస్తాడు. అలాగే భృగుమహర్షిని కూడా ఉద్ధరించాలి, క్రోధం నుంచి విముక్తి కలిగించాలని భావించాడు శ్రీ మహావిష్ణువు.

భృగుమహర్షికి పాదపూజ చేస్తూ, అతని అరికాలిలో ఉన్న నేత్రాన్ని చిదిపేస్తాడు. క్రోధం నశించగానే, భృగు మహర్షికి తాను చేసిన తప్పు అర్ధమవుతుంది. విష్ణువును క్షమించమని వేడుకుంటాడు. తాను చేసినపనికి పశ్చత్తాప పడతాడు. విష్ణువు సర్వోత్తముడని, భూలోకానికి తిరిగి వచ్చి మహర్షులకు చెప్తాడు.

To be continued....

No comments:

Post a Comment