Sunday 6 December 2015

హిందూ ధర్మం - 186 (నిరుక్తము - 5)

7. వేదంలో దేవాపి అనగా మహాభారత ఇతిహాసంలో కనబడే ఋషి కాదు. ఏ వ్యక్తైతే విద్యావంతులను గౌరవించి, వారితో స్నేహం చేస్తాడో అతడు దేవాపి, అది ఉరుములకు గల ఒక పేరు కూడా.
8. వేదంలో శంతను మహాభారతంలో ఉన్న శంతన మహారాజు కాదు. యాస్కుడి ప్రకారం మానసిక ప్రశాంతత కలిగి ఉన్న వ్యక్తే శంతనుడు. నీటిని కూడా శంతను అంటారు ఎందుకంటే అది మానవాళికి శాంతిని, మేలును చేకురుస్తుంది.
9. వేదంలో అంగీసరుడనేది వ్యక్తి పేరు కాదు. ప్రజ్వలిస్తున్న అగ్నియే అంగీరసుడు. భగవంతుడే అంగీరసుడు, ఎందుకనగా భగవంతుడే అగ్ని. మనం ఊపిరి తీసుకునేలోపే ఈ భూమి అంతటికి వెలుగును పంచగలవాడు, కాల్చివేయగలవాడు కనుక వేదంలో అంగీరసుడనగా భగవంతుడనే అర్దం కూడా వస్తుంది. విద్యావంతుడిని అంగీరసుడంటారు. స్వామి దయానందులు రాస్తూ అంగీరః అనగా 'అంగతి  జానాతి యో విద్వాన్'. జ్ఞానం తెలిసినవాడు అంగీరసుడంటారు.
10. యజుర్వేదం 13వ కాండలో వశిష్ట, భరద్వాజ, జమదగ్ని, విశ్వకర్మ ఇత్యాది నామాలు కనిపిస్తాయి. ఐతిహాసిక పద్ధతిలో వాటిని ఋషులుగా చెప్పగా, శతపధ బ్రాహ్మణం వాటిని ఈ విధంగా చెప్తుంది.
* ప్రాణోవై వశిష్ట ఋషిః - అన్ని వాయువులలోకి శ్రేష్టమైనది కనుక ప్రాణాన్ని వశిష్ట ఋషి అన్నారు.
* మనోవై భర్ద్వాజ ఋషిః - ఆహారం వలన బలం పొందుతుంది కనుక మనసుకు భరద్వాజ ఋషి అని పేరు.
* చక్షుర్వై జమదగ్ని ఋషిః - ప్రపంచాన్ని చూస్తుంది కళ్ళకు జమదగ్నిఋషి అని పేరు.
* శ్రోత్రంవై విశ్వామిత్ర ఋషిః - అన్ని దిశల నుంచి వచ్చే అన్ని విషయాలను వింటుంది కనుక చెవులను విశ్వామిత్ర ఋషి అన్నారు.
* వాగ్వై విశ్వకర్మ ఋషిః - విషయాలను వ్యక్తిపరిచి, విశదపరిచి, వాటికి వైభవాన్ని చేకుర్స్తున్న వాక్కు విశ్వకర్మ ఋషి.
బ్రాహ్మణాల్లో వశిష్ట, జమదగ్ని, విశ్వకర్మ పదాలను ప్రజాపతి, భగవంతుడు, రాజు, ఇంటిపెద్దకు అర్దంగా వివరించారు. విశ్వామిత్రుని వాక్కుగా చెప్పారు. యాజ్ఞవల్క్య మహర్షి కుడి చెవిని గౌతముడని, ఎడమ చెవిని జమదగ్ని అని, కుడి ముక్కును వశిష్టుడని, ఎడమ నాసికను కశ్యపుడని, వాక్కును అత్రి అని అంటారు.

11. ఊర్వశి అనేది కూడా వ్యక్తి నామం కాదు. ఊరు వశే యస్యాః - ఉరుములే ఊర్వశి, అన్నిటిని నియంత్రించేది, అధికంగా భుజించేది. పిడుగును ఊర్వశి అన్నారు ఎందుకంటే పిడుగుపాటు అనేక వస్తువులను నశింపజేస్తుంది.
12. మహాభరతంలో కనిపించే చంద్రవంశానికి చెందిన పురూరవుడు వేదంలో కనిపించే పురూరవుడు ఒకరు కాదు. నిరుక్తం ఆధారంగా 5-46, వేదంలో పురూరవుడనేది బాగా గర్జించే, ఉరుమే మేఘం పేరు.
13. అప్సరసలు దేవవేశ్యలు కారు. ఉపనిషత్తుల్లో అప్సరసలు ప్రాణాలకు సంకేతం. (యోగి సాధనలో ఉన్నప్పుడు ఒక్కో ప్రాణం విజృంభించి తపోభంగం చేస్తూ ఉంటుంది. ఒక్కో ప్రాణాన్ని గురుపర్యవేక్షణలో జయించి, అదుపులో పెట్టుకుని సాధుకుడు ముందు వెళ్ళి, పరబ్రహ్మాన్ని చేరుతాడు.) శిల్పసంగీతంలో పింగాణి పాత్రలు, గిన్నెలు. జ్యోతిష్యంలో దిక్కులు, దిశలు. జీవాణు విజ్ఞాన (Bacteriology) శాస్త్రంలో రోగకారక క్రిములు. రసవిజ్ఞాన (Alchemy) శాస్త్రంలో విద్యుత్ ప్రవాహం. (చూడండి, ఒక్క అప్సరస అనే పదమే ఒక్కో శాస్త్రంలో ఒక్కో అర్దాన్ని సూచిస్తుంది. ఎక్కడ ఏ అర్దం అవసరమో అక్కడ అదే ఉపయోగించాలి. అది అర్దం చేసుకోకుండా వేదానికి వక్రభాష్యం రాయడం వల్లనే వేదంలో గోవధ, యుద్ధాలు, జంతుబలులు, ఆర్య-ద్రావిడ సిద్ధాంతాలు కుట్రదారులకు కనిపించాయి. అయినా వారి ముఖ్య ఉద్దేశం హిందువులని తప్పుదోవ పట్టించడమే కనుక వారికి ఇవన్నీ తెలుసుకోవలసిన పనిలేదు. ఒక సామన్య అర్దాన్ని అన్ని చోట్లా అన్వయం చేసి, నానా రాద్ధాంతం చేశారు.)

To be continued ...................

No comments:

Post a Comment