Sunday 20 December 2015

హిందూ ధర్మం - 188 (నిరుక్తము - 6)

వైదిక వాజ్ఞ్మయంలో ఇంద్రుడిని ఏడు ప్రవాహాలకు మూలమైన ఆత్మగా చెప్పారు. ఋగ్వేదం 4.28.1 స్పష్టంగా చెప్తున్నదేమిటంటే ఇంద్రుడు, అనగా ఆత్మ, ఈ 7 ప్రవాహాల చలనంలో పెడుతుంది, మూసుకుపోయిన ఇంద్రియాలను తెరిపిస్తుంది. వేదంలో నదుల పేర్లు చారిత్రిక, భౌగోళిక, లేక నశించిపోయే వస్తువులను సూచించవు. వాటికి ఆధ్యాత్మిక అర్దాలున్నాయి. సరస్వతీ అనగా వాక్కు. వాసన గ్రహించటానికి కారణమవుతూ నాసికల ద్వారా బయటకు ప్రవహించే ప్రవాహం గంగ. చెవి ద్వారా ప్రవహించే శక్తి యమున. స్పర్శ ప్రవాహం శతదృ. శిరస్సువైపుగా ప్రవహించేది విపస. అరవిందులవారు కూడా వేదంలో సప్తనదుల ప్రస్తావన భౌగోళిక, తాత్కాలిక పదార్ధాలను సూచిస్తుందని అంగీకరించలేదు.

ఇమంమే గంగేయమునే అంటూ ఋగ్వేదం 10 వ మండలం, 75 సూక్తం, 5 వ మంత్రంలో 10 నదుల ప్రస్తావన ఉంది. నిజానికి అవి నదుల పేర్లు కాదు. ఆధ్యాత్మిక శాస్త్రంలో అవి శరీరంలోని నాడుల పేర్లు. నాదం (శబ్దం) చేస్తాయి కనుక వాటిని నదులు అన్నారు. చెవులు మూసుకున్నప్పటికి వాటి ప్రవాహ శబ్దాన్ని వినవచ్చు. (ఇది వ్యక్తిగతంగా ఎవరికి వారే ఇప్పుడే ధృవపరుచుకోవచ్చు. నిశబ్దంగా కూర్చుకుని, చెవులు మూసుకున్నా, లోపల వేగంగా ఏదో ప్రవహిస్తున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అదే నాడీ ప్రవాహం).

పైన చెప్పుకున్న మంత్రానికి విదేశీయులు భౌగోళికమైన అర్దం చెప్పగా, దాని అసలు అర్దం ఇలా ఉంది. ఓ గంగా, ఇడా నాడి, ఓ యమునా, పింగళ నాడీ, శతధృ, పరూషిని, సరస్వతీ - సుషుమ్నా నాడీ, నా స్తోత్రాన్ని వినండి. ఓ మరుద్వృధా - సుషుమ్నా, వితస్తతో కూడిన ఆర్జికియా - సుషుమ్నా, నా స్తోత్రాన్ని వినండి. (ఇడా, పింగళా, సుషుమ్నా మొదలైన నాడుల ప్రస్తావన యోగశాస్త్రంలో ఉంటుంది. యోగం పరిచయం ఉన్నవారికి ఇది తేలికగా అర్దమవుతుంది.)

యోగశాస్త్రంలో ఇవే నామాలను తన మీద ధ్యానం చేత జనుల కష్టాలను దూరం చేసి, మోక్షాన్ని ప్రసాదించగల భగవంతునికి కూడా అన్వయం చేశారు.

ఈ నామాలనే ధమనులకు కూడా వాడారు. పండిత పాళి రత్న గారు చెప్పేదేమిటంటే గంగ, దేహంలో రక్త ప్రసరణ సక్రమంగా సాగడానికి కీలకమైన నాడి. అన్ని శరీర భాగాల కదలికలను నియంత్రించేది యమున. ఈ నాడి బలహీనపడితే, పక్షవాతం వస్తుంది. జ్ఞానాన్ని కలిగించే నాడిని సరస్వతీ అన్నారు. అదే సుషుమ్నా కూడా. శతధృ అనేది సుషుమ్నా నాడిలో ముఖ్యమైన భాగం. అది వేగంగా జ్ఞానం కలిగిస్తుంది. దేహమంతా ఉష్ణతను కలిగిస్తూ, అన్ని అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూసే నాడి పరూషిని. వాహికలు లేని గ్రంధులను అసిక్ని అన్నారు. దేహానికి పుష్టినిచ్చే ప్రాణాన్ని మరుద్వృధా అన్నారు. మాంసం అంతటా వ్యాపించి ఉన్న నాడిని వితస్తా అన్నారు. ఎటువంటి నియంత్రణలు, అదుపులేకుండా పని చేసే నాడి ఆర్జికియా, లేదా విపుషా. ఎప్పుడు తడిగా ఉండే నాడి సుషుమ్నా. (యోగంలో త్రివేణీ సంగమం అనగా ఇడా, పింగళా, సుషుమ్నా నాడుల సంగమం. ఇది భృకుటి (రెండు కనుబొమ్మల మధ్యనున్న) వద్ద ఆజ్ఞాచక్రంలో జరుగుతుంది. ధ్యానంలో అక్కడ దృష్టి నిలిపితే, క్రమంగా సాధకుడు ఉన్నతమైన అనుభూతులకు లోనై, జ్ఞానం పొంది, పరబ్రహ్మంలో లీనమవుతాడు. ఆ త్రివేణీ సంగమమే బొట్టుపెట్టుకునే స్థానం.)

(*కొంత వరకు ఇతర విషయాలను ప్రస్తావించడం మినాహా మిగిలినదంతా యజుర్వేదానికి దేవీచంద్ గారు రాసిన భాష్యం నుంచి తెలుగు అనువాదం చేయడమైనది. వారికి పాదాభివందనాలు.)

To be continued ......................  

No comments:

Post a Comment