Showing posts with label నిరుక్తము. Show all posts
Showing posts with label నిరుక్తము. Show all posts

Sunday, 20 December 2015

హిందూ ధర్మం - 188 (నిరుక్తము - 6)

వైదిక వాజ్ఞ్మయంలో ఇంద్రుడిని ఏడు ప్రవాహాలకు మూలమైన ఆత్మగా చెప్పారు. ఋగ్వేదం 4.28.1 స్పష్టంగా చెప్తున్నదేమిటంటే ఇంద్రుడు, అనగా ఆత్మ, ఈ 7 ప్రవాహాల చలనంలో పెడుతుంది, మూసుకుపోయిన ఇంద్రియాలను తెరిపిస్తుంది. వేదంలో నదుల పేర్లు చారిత్రిక, భౌగోళిక, లేక నశించిపోయే వస్తువులను సూచించవు. వాటికి ఆధ్యాత్మిక అర్దాలున్నాయి. సరస్వతీ అనగా వాక్కు. వాసన గ్రహించటానికి కారణమవుతూ నాసికల ద్వారా బయటకు ప్రవహించే ప్రవాహం గంగ. చెవి ద్వారా ప్రవహించే శక్తి యమున. స్పర్శ ప్రవాహం శతదృ. శిరస్సువైపుగా ప్రవహించేది విపస. అరవిందులవారు కూడా వేదంలో సప్తనదుల ప్రస్తావన భౌగోళిక, తాత్కాలిక పదార్ధాలను సూచిస్తుందని అంగీకరించలేదు.

ఇమంమే గంగేయమునే అంటూ ఋగ్వేదం 10 వ మండలం, 75 సూక్తం, 5 వ మంత్రంలో 10 నదుల ప్రస్తావన ఉంది. నిజానికి అవి నదుల పేర్లు కాదు. ఆధ్యాత్మిక శాస్త్రంలో అవి శరీరంలోని నాడుల పేర్లు. నాదం (శబ్దం) చేస్తాయి కనుక వాటిని నదులు అన్నారు. చెవులు మూసుకున్నప్పటికి వాటి ప్రవాహ శబ్దాన్ని వినవచ్చు. (ఇది వ్యక్తిగతంగా ఎవరికి వారే ఇప్పుడే ధృవపరుచుకోవచ్చు. నిశబ్దంగా కూర్చుకుని, చెవులు మూసుకున్నా, లోపల వేగంగా ఏదో ప్రవహిస్తున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అదే నాడీ ప్రవాహం).

పైన చెప్పుకున్న మంత్రానికి విదేశీయులు భౌగోళికమైన అర్దం చెప్పగా, దాని అసలు అర్దం ఇలా ఉంది. ఓ గంగా, ఇడా నాడి, ఓ యమునా, పింగళ నాడీ, శతధృ, పరూషిని, సరస్వతీ - సుషుమ్నా నాడీ, నా స్తోత్రాన్ని వినండి. ఓ మరుద్వృధా - సుషుమ్నా, వితస్తతో కూడిన ఆర్జికియా - సుషుమ్నా, నా స్తోత్రాన్ని వినండి. (ఇడా, పింగళా, సుషుమ్నా మొదలైన నాడుల ప్రస్తావన యోగశాస్త్రంలో ఉంటుంది. యోగం పరిచయం ఉన్నవారికి ఇది తేలికగా అర్దమవుతుంది.)

యోగశాస్త్రంలో ఇవే నామాలను తన మీద ధ్యానం చేత జనుల కష్టాలను దూరం చేసి, మోక్షాన్ని ప్రసాదించగల భగవంతునికి కూడా అన్వయం చేశారు.

ఈ నామాలనే ధమనులకు కూడా వాడారు. పండిత పాళి రత్న గారు చెప్పేదేమిటంటే గంగ, దేహంలో రక్త ప్రసరణ సక్రమంగా సాగడానికి కీలకమైన నాడి. అన్ని శరీర భాగాల కదలికలను నియంత్రించేది యమున. ఈ నాడి బలహీనపడితే, పక్షవాతం వస్తుంది. జ్ఞానాన్ని కలిగించే నాడిని సరస్వతీ అన్నారు. అదే సుషుమ్నా కూడా. శతధృ అనేది సుషుమ్నా నాడిలో ముఖ్యమైన భాగం. అది వేగంగా జ్ఞానం కలిగిస్తుంది. దేహమంతా ఉష్ణతను కలిగిస్తూ, అన్ని అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూసే నాడి పరూషిని. వాహికలు లేని గ్రంధులను అసిక్ని అన్నారు. దేహానికి పుష్టినిచ్చే ప్రాణాన్ని మరుద్వృధా అన్నారు. మాంసం అంతటా వ్యాపించి ఉన్న నాడిని వితస్తా అన్నారు. ఎటువంటి నియంత్రణలు, అదుపులేకుండా పని చేసే నాడి ఆర్జికియా, లేదా విపుషా. ఎప్పుడు తడిగా ఉండే నాడి సుషుమ్నా. (యోగంలో త్రివేణీ సంగమం అనగా ఇడా, పింగళా, సుషుమ్నా నాడుల సంగమం. ఇది భృకుటి (రెండు కనుబొమ్మల మధ్యనున్న) వద్ద ఆజ్ఞాచక్రంలో జరుగుతుంది. ధ్యానంలో అక్కడ దృష్టి నిలిపితే, క్రమంగా సాధకుడు ఉన్నతమైన అనుభూతులకు లోనై, జ్ఞానం పొంది, పరబ్రహ్మంలో లీనమవుతాడు. ఆ త్రివేణీ సంగమమే బొట్టుపెట్టుకునే స్థానం.)

(*కొంత వరకు ఇతర విషయాలను ప్రస్తావించడం మినాహా మిగిలినదంతా యజుర్వేదానికి దేవీచంద్ గారు రాసిన భాష్యం నుంచి తెలుగు అనువాదం చేయడమైనది. వారికి పాదాభివందనాలు.)

To be continued ......................  

Sunday, 13 December 2015

హిందూ ధర్మం - 187 (నిరుక్తము - 5)

14. వేదంలో భృగు అనేది నిర్దిష్ట నామవాచకం కాదు, మహర్షి నామధేయం కాదు. భృ అనగా స్వీయ నిర్వహణ. తమ సంపాదన / శక్తి మీద బ్రతకడం. గు అనేది తీవ్రమైన శ్రమను సూచిస్తోంది. తమ స్వశక్తి మీద జీవించటానికి తీవ్రమైన కృషి చేసేవారు భృగువులు.

*వేదం అన్నప్పుడు ఈ సందర్భంలో మంత్రసంహితగానే అర్దం చేసుకోవాలి. బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులో ఋషుల పేర్లు ఉంటాయి. కాని సంహిత వరకు మాత్రం అది కాలానికి, చరిత్రకు అతీతం, సనాతనం కనుక అందులో వ్యక్తులు, నదులు, చారిత్రిక ప్రదేశాల పేర్లు ఉండవు. అలాగే ఋషుల పేర్లకు వేరే అర్దాలున్నాయని, అందువల్ల అసలు ఋషులే లేరని చెప్పకూడదు. ఈ రెండు వేర్వేరు అంశాలు. ఉదాహరణకు 'వేద' అని ఒక వ్యక్తి పేరు ఉన్నంతమాత్రాన, వేదం అతని జీవితం గురించి చెప్తుందని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ............ అలా కాదు వేదం అనేది ఒక గ్రంధం అని, దాని గురించి ఎవరైనా వివరిస్తే, అసలు 'వేద' అనేది గ్రంధం పేరు కాబట్టి ఆ పేరుతో వ్యక్తి అనేవాడు లేడని చెప్పడం అంతే మూర్ఖంగా ఉంటుంది. వేదం (మంత్రసంహిత) లో ఉన్న అనేక పేర్లను వ్యక్తులు పెట్టుకున్నారు. యుక్తిని ఉపయోగించి అర్దం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ రెండిటిని కలిపేసి విపరీతాలకు తావు ఇవ్వకూడదు.

15. వేదంలో భరతుడనగా మృదు స్వభావం కలవాడు, అభివృద్ధి, పురోగతి కోరుకునేవాడిని అర్దం. అంతేకానీ శ్రీ రామచంద్రుని తమ్ముడిగా అర్దం స్వీకరించకూడదు.

16. తన వాళ్ళు / ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంలో నిష్ణాతుడిని వేదంలో వశిష్ఠుడిగా చెప్పారు. వసు బ్రహ్మచారుల మధ్య ఉంటూ, ఉన్నతమైన స్థానాన్ని పొందిన గురువును కూడ ఇది సూచిస్తుంది.

17. వేదంలో సరస్వతీ అనేది నది యొక్క నామం కాదు. బ్రాహ్మణాల్లో సరస్వతీ అనే పదానికి 13 అర్దాలున్నాయి. నిఘంటులో 57 పర్యాయపదాలున్నాయి. దయానంద సరస్వతీ గారు సరస్వతీ అనేది భగవంతునికున్న నామాల్లో ఒకటని సత్యార్ధ ప్రకాశ్ లో చెప్పారు. ఆయనే వివాహ సందర్భంలో సరస్వతీ అనే పదం కనిపించినప్పుడు భార్యగా అర్దం చెప్పాల్సి ఉంటుందని వివరించారు. ఋగ్వేదం 7 వ మండలం 9 వ సూత్రం 5 వ మంత్రంలో సరస్వతీ అంటే వివరణాత్మకమైన ప్రసంగం అని చెప్పారు.

సాయనుడి ప్రకారం ఋగ్వేదంలో 15 చోట్ల సప్తనదుల ప్రస్తావన ఉంది. ఆయన వాటిని గంగా, యమునా నదులుగా అనువదించారు. కానీ దయానందులు, నిరుక్తం ఇత్యాదుల ప్రకారంగా ఆత్మ కేంద్ర స్థానం, అదే ముఖ్యశక్తి కేంద్రం. దాని నుంచి 7 నదులు ప్రవహిస్తాయి (అవి శక్తి ప్రవహాలు). 1. అహంకారం, 2. మనసు, 3. శబ్ద, 4. స్పర్శ, 5. రస (రుచి), 6. రూప, 7. గంధం (వాసన). చివిరి ఐదింటిని పంచతన్మాత్రలు అంటారు. అహంకారం అనే ప్రవాహం అహం అనే క్షేత్రం/ మార్గంద్వారా పయనిస్తుంది. (అహం నశిస్తే అన్నీ నశిస్తాయి, ఆత్మజ్ఞానం కలుగుతుంది అని రమణమహర్షి ఉపదేశం. అహం కారణంగానే కర్తృత్వం ఏర్పడుతుంది. అహం అనగా 'నేను' అనే భావన. అహం నుంచే క్రమంగా 'నేను ఇంత వాడిన్నన్న అహంకారం బయలుదేరుతుంది.) ధ్యానం అనే మార్గం ద్వార మనసు ప్రవహిస్తుంది. (ఒక వస్తువు మీద దృష్టి నిలపడమే ధ్యానం. ఆత్మ శక్తే మనసు ద్వారా భావనల రూపంలో వ్యక్తమవుతోంది.) పదాలు (శబ్దాలు) ఎటు నుంచి వినిపిస్తాయో, ఆ దిశగా చెవుల ద్వారా శబ్ద ప్రవాహం ఉంటుంది. స్పర్శ ప్రవాహాం చర్మం ద్వారా స్పర్శ క్షేత్రానికి ప్రవహిస్తుంది. రస ప్రవాహం నాలుకను క్షేత్రంగా చేసుకుని రుచి కలిగించే దిశ యందు ప్రవహిస్తుంది. అదే విధంగా రూప ప్రవహాం కంటిని ఆధారంగా చేసుకుని దృశ్యం (చూడబడుతున్న వస్తువు) దిశగా ప్రవహిస్తుంది. గంధ ప్రవాహం ముక్కును ఆధారంగా చేసుకుని శ్వాస ద్వారా ప్రవహిస్తుంది. ఆత్మ నుంచి వచ్చే ఈ 7 ప్రవాహాలు నిత్యం బయటకు ప్రవహించి, కర్మలు చేయగా, సుషుప్తి అవస్థలో (గాఢనిద్రలో) లోపలికి ప్రవహించి ఆత్మ యందు ఐక్యమవుతాయి. ఈ సప్త ప్రవాహాలే సప్త ఋషులు, సప్త కిరణాలు, ఆత్మ యొక్క సప్త హస్తాలు. (ఈ ఏడింటికి ఆత్మయే కీలకం. ఆత్మ లేకపోతే వీటికి అస్థిత్వం లేదు.)  

To be continued ................. 

Sunday, 6 December 2015

హిందూ ధర్మం - 186 (నిరుక్తము - 5)

7. వేదంలో దేవాపి అనగా మహాభారత ఇతిహాసంలో కనబడే ఋషి కాదు. ఏ వ్యక్తైతే విద్యావంతులను గౌరవించి, వారితో స్నేహం చేస్తాడో అతడు దేవాపి, అది ఉరుములకు గల ఒక పేరు కూడా.
8. వేదంలో శంతను మహాభారతంలో ఉన్న శంతన మహారాజు కాదు. యాస్కుడి ప్రకారం మానసిక ప్రశాంతత కలిగి ఉన్న వ్యక్తే శంతనుడు. నీటిని కూడా శంతను అంటారు ఎందుకంటే అది మానవాళికి శాంతిని, మేలును చేకురుస్తుంది.
9. వేదంలో అంగీసరుడనేది వ్యక్తి పేరు కాదు. ప్రజ్వలిస్తున్న అగ్నియే అంగీరసుడు. భగవంతుడే అంగీరసుడు, ఎందుకనగా భగవంతుడే అగ్ని. మనం ఊపిరి తీసుకునేలోపే ఈ భూమి అంతటికి వెలుగును పంచగలవాడు, కాల్చివేయగలవాడు కనుక వేదంలో అంగీరసుడనగా భగవంతుడనే అర్దం కూడా వస్తుంది. విద్యావంతుడిని అంగీరసుడంటారు. స్వామి దయానందులు రాస్తూ అంగీరః అనగా 'అంగతి  జానాతి యో విద్వాన్'. జ్ఞానం తెలిసినవాడు అంగీరసుడంటారు.
10. యజుర్వేదం 13వ కాండలో వశిష్ట, భరద్వాజ, జమదగ్ని, విశ్వకర్మ ఇత్యాది నామాలు కనిపిస్తాయి. ఐతిహాసిక పద్ధతిలో వాటిని ఋషులుగా చెప్పగా, శతపధ బ్రాహ్మణం వాటిని ఈ విధంగా చెప్తుంది.
* ప్రాణోవై వశిష్ట ఋషిః - అన్ని వాయువులలోకి శ్రేష్టమైనది కనుక ప్రాణాన్ని వశిష్ట ఋషి అన్నారు.
* మనోవై భర్ద్వాజ ఋషిః - ఆహారం వలన బలం పొందుతుంది కనుక మనసుకు భరద్వాజ ఋషి అని పేరు.
* చక్షుర్వై జమదగ్ని ఋషిః - ప్రపంచాన్ని చూస్తుంది కళ్ళకు జమదగ్నిఋషి అని పేరు.
* శ్రోత్రంవై విశ్వామిత్ర ఋషిః - అన్ని దిశల నుంచి వచ్చే అన్ని విషయాలను వింటుంది కనుక చెవులను విశ్వామిత్ర ఋషి అన్నారు.
* వాగ్వై విశ్వకర్మ ఋషిః - విషయాలను వ్యక్తిపరిచి, విశదపరిచి, వాటికి వైభవాన్ని చేకుర్స్తున్న వాక్కు విశ్వకర్మ ఋషి.
బ్రాహ్మణాల్లో వశిష్ట, జమదగ్ని, విశ్వకర్మ పదాలను ప్రజాపతి, భగవంతుడు, రాజు, ఇంటిపెద్దకు అర్దంగా వివరించారు. విశ్వామిత్రుని వాక్కుగా చెప్పారు. యాజ్ఞవల్క్య మహర్షి కుడి చెవిని గౌతముడని, ఎడమ చెవిని జమదగ్ని అని, కుడి ముక్కును వశిష్టుడని, ఎడమ నాసికను కశ్యపుడని, వాక్కును అత్రి అని అంటారు.

11. ఊర్వశి అనేది కూడా వ్యక్తి నామం కాదు. ఊరు వశే యస్యాః - ఉరుములే ఊర్వశి, అన్నిటిని నియంత్రించేది, అధికంగా భుజించేది. పిడుగును ఊర్వశి అన్నారు ఎందుకంటే పిడుగుపాటు అనేక వస్తువులను నశింపజేస్తుంది.
12. మహాభరతంలో కనిపించే చంద్రవంశానికి చెందిన పురూరవుడు వేదంలో కనిపించే పురూరవుడు ఒకరు కాదు. నిరుక్తం ఆధారంగా 5-46, వేదంలో పురూరవుడనేది బాగా గర్జించే, ఉరుమే మేఘం పేరు.
13. అప్సరసలు దేవవేశ్యలు కారు. ఉపనిషత్తుల్లో అప్సరసలు ప్రాణాలకు సంకేతం. (యోగి సాధనలో ఉన్నప్పుడు ఒక్కో ప్రాణం విజృంభించి తపోభంగం చేస్తూ ఉంటుంది. ఒక్కో ప్రాణాన్ని గురుపర్యవేక్షణలో జయించి, అదుపులో పెట్టుకుని సాధుకుడు ముందు వెళ్ళి, పరబ్రహ్మాన్ని చేరుతాడు.) శిల్పసంగీతంలో పింగాణి పాత్రలు, గిన్నెలు. జ్యోతిష్యంలో దిక్కులు, దిశలు. జీవాణు విజ్ఞాన (Bacteriology) శాస్త్రంలో రోగకారక క్రిములు. రసవిజ్ఞాన (Alchemy) శాస్త్రంలో విద్యుత్ ప్రవాహం. (చూడండి, ఒక్క అప్సరస అనే పదమే ఒక్కో శాస్త్రంలో ఒక్కో అర్దాన్ని సూచిస్తుంది. ఎక్కడ ఏ అర్దం అవసరమో అక్కడ అదే ఉపయోగించాలి. అది అర్దం చేసుకోకుండా వేదానికి వక్రభాష్యం రాయడం వల్లనే వేదంలో గోవధ, యుద్ధాలు, జంతుబలులు, ఆర్య-ద్రావిడ సిద్ధాంతాలు కుట్రదారులకు కనిపించాయి. అయినా వారి ముఖ్య ఉద్దేశం హిందువులని తప్పుదోవ పట్టించడమే కనుక వారికి ఇవన్నీ తెలుసుకోవలసిన పనిలేదు. ఒక సామన్య అర్దాన్ని అన్ని చోట్లా అన్వయం చేసి, నానా రాద్ధాంతం చేశారు.)

To be continued ...................

Sunday, 29 November 2015

హిందూ ధర్మం - 185 (నిరుక్తము - 4)



మాక్స్ ముల్లర్ మొదలైన పండితులు వేద భాష్యానికి చేసిన అవకతవకలు ఎటువంటి వంటే మాక్స్ ముల్లర్ ఒక్క వేద ఋక్కుకు ఇచ్చిన దురర్ధాన్ని ఖండిస్తూ అరవిందులువారు ఒక పుస్తకమే రాసారట. ఐరోపా 'పండితులకు' వేదంలో చరిత్ర కనిపించింది. కానీ స్వామి దయానందులు (ఆర్యసమాజం) వేదంలో చరిత్ర ఉందని అంగీకరించలేదు. గ్రిఫ్ఫిత్, మాక్స్‌ముల్లర్, మోనియర్ విల్లియంస్, మెక్‌డొన్నెల్, బ్లూంఫీల్డ్ ఇత్యాది పాశ్చ్యాతుల భాష్యాలను ఖండించారు. దీని గురించి ఋగ్వేద భాష్య భూమికలో విస్తృతంగా ప్రస్తావించారు. వారి ప్రభావంతో, ఆర్యసమాజానికి చెందిన దేవీచంద్ గారు కూడా యజుర్వేద భాష్యంలో ఇటువంటి అనేక విషయాలను శాస్త్ర ప్రామాణికంగా ఖండిచారు.

వారి మాటల్లోనే 'సాధారణ సంస్కృతంలో 'ల'కార త్రయం భూతకాలాన్ని (గడిచిన కాలాన్ని) సూచిస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకుని అనేకులు వేదంలో చరిత్ర ఉందని నిర్ధారించారు. కానీ ఇది తప్పు. కష్కుడు చెప్పిందేమిటంటే వేదంలో 'ల'కార త్రయం కనిపిస్తే, అది త్రికాలాలకు (భూత, వర్తమాన, భవిష్యత్) సంబందించినదై ఉంటుంది. అది ప్రత్యయం అవుతుంది. అందువల్ల వాటిని కేవలం భూతకాలానికే పరిమితం చేయడం తప్పు. అదే విధంగా వైదిక పదాలు ధాతువులే కానీ, వ్యక్తులు, సంప్రదాయల పేర్లు కావు. ఎప్పుడైతే పండితులు ముఖ్య వేదాంగాలైన నిరుక్తం, వ్యాకరణాలను విడిచిపెట్టారో అప్పుడే వేదంలో చరిత్ర ఉన్నట్టుగా భావించడం మొదలుపెట్టారు.

పతంజలి మహర్షి మాహాభాష్యంలో కష్కుడి వివరణ గురించి వ్యాఖ్యానం చేస్తూ, వేదంలో లకార త్రయాన్ని భూతకాలానికి పరిమితం చేసి అర్దం చెప్పడం, వ్యాకరణ శాస్త్రానికి వ్యతిరేకం. పాణిని వ్యాకరణాన్ని ప్రామాణికంగా తీసుకున్నంతవరకు వైదిక పదజాలానికి చరిత్రను అంతగట్టడం వేదవ్యాక్యాలను నిందించడమే అవుతుంది అన్నారు.

వైదిక పద ధాతువుల ప్రాముఖ్యతను అర్దం చేసుకోవడంలో విఫలమై, వాటిని చారిత్రిక వ్యక్తుల పేరులుగా అనువదించారు. వాటి అసలు ప్రాముఖ్యతను నేను చెప్తాను.

1. సీతా - వేదంలో సీతా అనే పదం శ్రీ రామచంద్రుని భార్యను సూచించదు. పొలంలో నాగలితో దున్నడాన్ని సూచిస్తుంది.
2. బాబర - అనేది రాజు లేక వ్యక్తి పేరు కాదు. ఉరుములు వంటి గట్టి శబ్దాలు చేస్తూ ప్రవహించే గాలిని సూచిస్తుంది.
3. సూదాస్ - అనేది రాజు పేరు కాదు. 'సూదః కళ్యాణదానః| నిరుక్తం 2-25' చక్కటి దానాలు చేస్తూ ఉండేవాడని అర్దం.
4. పైజ్వాన్ అనేది రాజు నామాన్ని సూచించదు. నిరుక్తం 2-24 ఆధారంగా ఏ వ్యక్తైతే సదా అనాలోచితంగా ఉంటూ తొందరపడి వేగంగా పనులు చేసేవాడు పైజ్వాన్.
5.దేవాస్ - రాజు నామం కాదు. వేద విద్యనభ్యసించిన పండితుడు, ఎవరి ఆధ్వర్యంలోనైతే యాగం జరుగుతుందో అతడు.
6. అగు - అనగా చారిత్రాత్మిక వ్యక్తి కాదు. వేద జ్ఞానం, వైదిక పదజాలం తెలియని వ్యక్తి అని అర్దం.

To be continued ..........................

Monday, 19 October 2015

హిందూ ధర్మం - 180 (నిరుక్తము - 3)

మహాభారత యుద్ధానికి పూర్వం వరకు వేదానికి నిరుక్తము, శాస్త్రీయ, గూఢార్ధ పద్ధతుల ద్వారానే భాష్యం స్వీకరించడం జరిగింది. యుద్ద్గం ముగుసి కలియుగం ప్రారంభమైన తర్వాత ఈ పద్ధతిలో కొన్ని స్వల్ప మార్పులు జరిగాయి. కానీ భారతదేశంపై మహమ్మదీయ దండయాత్రలు మొదలైన తర్వాత మొత్తం పరిస్థితి తారుమారైంది. అవి జరగడానికి ముందే ఈ దేశంలో జైనం, భౌద్ధం వంటి మతాలు ఉద్భవించాయి. బౌద్ధమత విస్తరణ కోసం బౌద్ధాన్ని స్వీకరించ్న రాజులు వైదిక మతంపై దాడులు జరిపి, ధార్మిక గ్రంధాలను కాల్చివేశారు, వాటికి వక్రభాష్యాలిచ్చారు, భౌద్ధ పరమైన, నాస్తికమైన అర్దాలను అన్వయం చేశారు. గురుకుల వ్యవస్థను, ఆశ్రమ వ్యవస్థను నిర్వీర్యం చేసే యత్నం చేశారు. అటువంటి సందర్భంలో క్రీ.పూ.7 వ శత్బాదంలో వచ్చినవారే ఆదిశంకరులు. దేశంలో ఎక్కడ చూసినా, వక్రభాష్యాలే, నాస్తిక వాదమే. అటువంటి సమయంలో గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం చేసిన శంకరులు, తన మేధాశక్తితో వేదానికి ఇచ్చిన అవైదిక, వక్రభాష్యాలను ఖండించి, శాస్ర్తీయమైన అర్దాన్నిచే ప్రయత్నం చేశారు. వారి తర్వాత 1500 ఏళ్ళ పాటు వారి ప్రభావం కొనసాగింది.

కానీ మహమ్మదీయ దండయాత్రలు కొత్త పోకడలను తీసుకువచ్చాయి. వైదిక ధర్మం తార్కిక ఆలోచనకు, తాత్త్వికతకు, బుద్ధి వికసనానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. కానీ అబ్రహామిక్ మతాలు అలా కాదు. (అబ్రహం అనే మూలపురుషుడి నుంచి ఉద్భవించినవిగా భావించే క్రైస్తవం, ఇస్లాం, యూదు మొదలైన మతాలు). అవి ప్రశ్నించే తత్త్వానికి, వ్యక్తి తార్కిక ఆలోచనకు అడ్డుకట్ట వేస్తాయి. ఆ దండయాత్రల్లో అనేక వైదిక గ్రంధాలు తగలబెట్టబడ్డాయి. భారతదేశానికి అక్కడి నుంచి చీకటి యుగం ప్రారంభమైంది. వాటి ప్రభావం భారతీయ సంస్కృతిపై చాలా పడింది. ఈ సందర్భంలోనే వేదాలకు నిరుక్తం ఆధారంగా అర్దం చెప్పక, పురాణాల ఆధారంగా చెప్పే పద్ధతి ప్రచారంలోకి వచ్చింది. ఇంకోకప్రక్కన దండయాత్రులు చేసిన ముష్కరులు, కొందరిని బెదిరించి, ధార్మిక గ్రంధాల్లో నూతన విషయాలను ప్రవేశపెట్టారు.

వేదాలతో పోల్చి చూసినప్పుడు పురాణాలు అత్యంత నవీన సాహిత్యం. వేదం ఈశ్వరునిలానే సనాతనం. ఈశ్వర సృష్టిలో ఉండే కోటానుకోట్ల బ్రహ్మాండాలకు సంబంధించినది. సముద్రపు అలలపై ఏర్పడే నురుగులో అప్పటికప్పుడు ఉద్భవించి, నశించిపోయే నీటి బుడగల వలే అనేక బ్రహ్మాండాలు నిత్యం ఉద్భవిస్తూ ఉంటాయి, లయిస్తుంటాయి. ఆయా బ్రహ్మాండాల్లో నడుస్తున్న యుగాలతో సంబంధం లేకుండా, అన్నిటికి వేదమే పరమ ప్రమాణం. అందుకే వేదం కాలాతీతం. కానీ ఈ పురాణమనే సాహిత్యం ఈ సృష్టిలో ఇప్పుడున్న కలియుగంలో మానవులకు ధర్మం, వేదం యొక్క సందేశం అందించడం కోసం వ్యాసుని ద్వారా ద్వాపరయుగాంతంలో ఇవ్వబడింది. ఈ పురాణల్లో అనేక కల్పాలు, మన్వంతరాలు, ఇతర సృష్టిల్లో జరిగిన సంఘటనలు కనిపిస్తాయి. అవి వేదంలో చెప్పబడ్డ ధర్మాన్ని వివరించేవే కానీ, వాటిలో ఉన్న పాత్రలను వేదంలో ఉన్న పదాలకు అన్వయం చేయడం వంటివి చేయకూడదు. కానీ ఈ దండయాత్రల ప్రభావంతో వేదాలకు కొంత పురాణాల ఆధారంగా భాష్యం చెప్పడం ప్రారంభమైంది. అదేగాక మాములు సంస్కృతార్దాలను వైదిక వాజ్ఞ్మయానికి అన్వయం చేయడం కూడా ఈ తర్వతే ప్రారంభమైంది. ఫలితంగా నిరుక్తం మూలనపడింది. 14 వ శత్బాదానికి చెందిన సుప్రసిద్ధ భాష్యకారుడైన సాయనాచార్యుడు వేదానికి నిరుక్తం, పౌరాణిక పద్ధతులలో భాష్యం అందించారు.

అటు తర్వాత ఆంగ్లేయుల దండయాత్రలు జరిగాయి. వైదిక ధర్మాన్ని నాశనం చేయడమే, తమ మతాన్ని స్థాపన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆంగ్లేయులు వేదాల్లో లేని అనేక విషయాలు, ఉన్నాయని భ్రమలు కల్పించి, సంస్కృతిని కూకటివేళ్ళతో పెకిలించాలని విశ్వప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా వచ్చినవే ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం, వేదాల్లో గోవధ, జంతుబలి వంటి కల్పిత సిద్ధాంతాలు.

To be continued .................

Sunday, 11 October 2015

హిందూ ధర్మం - 179 (నిరుక్తము - 2)

వేదాలకు అనేక విధాలుగా అర్దాలను అన్వయం చేయవచ్చని యాస్కాచార్యులు చెప్పారు. ప్రధానంగా వేదాలకు 6 పద్ధతుల్లో అర్దం చెప్తారు. ఈ విషయాన్ని ఆర్యసమాజ స్థాపకులు మహర్షి దయానంద్ సరస్వతీగారు తమ ఋగ్వేద్ భాష్యభూమికలో వివరించారు.

1. నిరుక్తం ఆధారంగా చెప్పేది మొదటి విధానం. ఇది ప్రధానంగా పదాల ఆవిర్భావం, ధాతువులు (మూలశబ్దాలను) అన్వయించి చెప్పేది. వైదిక వాఙ్మయాన్ని అనుసరించి ఉంటుంది. ఇది సులభంగానే అనిపించినా, అత్యంత క్లిష్టమైనది, పరిపూర్ణంగా విశ్లేషించి చెప్పేది. ఇది యాస్కుడి నిరుక్తం ఆధారంగా వచ్చింది. ఈ పద్ధతి దోషరహితంగా, ఎంతో మేధస్సును ఉపయోగించేదిగా ఉంటుంది.

2. ఐతిహాసిక పద్ధతి. దీన్నే చారిత్రిక విధానం అని కూడా అంటారని యాస్కుడు చెప్పారు. ఇందులో చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు ప్రత్యేక సంఘటనల ఆధారంగా వేదమంత్రాలకు అర్దాలను అన్వయం చేస్తారు. భారతదేశంలో పూర్వం నుంచి జీవించిన రాజులు, మహానుభావుల పేర్లను వైదిక మంత్రాలకు అన్వయం చేసి అర్దం చెప్తారు. ఇలా అర్దాలు వెతకడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే వేదాల్లో ఉన్న అనేక పదాలను అనేకులు ఇంతకముందు పేర్లుగా పెట్టుకుని ఉంటారు. వారిని ఆయా మంత్రాలకు అన్వయం చేసి, ఉదాహరణలు చెప్పడం, వేదాన్ని వివరించడం సులభమే. కానీ కాలక్రమంలో ఈ పద్ధతి ప్రాభవాన్ని కోల్పోయింది. ఎందుకంటే ప్రజలు వైదిక సత్యాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి, ఆయా పాత్రలకు, వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు.

3. పౌరాణిక పద్ధతి - ఇందులో వేదానికి పురాణాల్లోని సంఘటనల ఆధారంగా అర్దాలు చెప్తారు. ప్రతి మంత్రానికి లేదా సూక్తానికి ఒక కధను ఉదాహరణగా చెప్తారు. ఈ పద్ధతి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పద్ధతిలో వేదమంత్రాలను వివరించని సందర్భం ఉండదు. యాస్కుడు దీన్ని కూడా ఐతిహాసిక పద్ధతి అనే అన్నారు.

4. శాస్త్రీయ (Scientific) పద్ధతి - నిరుక్తం తర్వాత ఇదే అత్యంత కష్టమైన పద్ధతి. ఇందులో వైదిక సత్యాలను భౌతిక శాస్త్ర సూత్రాలు, సహజంగా ప్రకృతిలో జరిగే చర్యల రూపంగా వివరిస్తారు. ఇది కష్టమైన పద్ధతియే అయినా, సరైన అర్దాలను ఇవ్వగలుగుతుంది కనుక పండితులు ఈ పద్ధతినే ఎంచుకుంటారు.

5. గూఢార్ధాలు, యోగపద్ధతి - ఇది ఎంతో క్లిష్టమైన పద్ధతి. కఠినమైన యోగపరమైన జీవితం గడిపేవారు మాత్రమే వేదమంత్రాలకు ఈ విధమైన అర్ధాలను దర్శించగలుగుతారు. ఈ పద్ధతిలో వేదం మొత్తం పరబ్రహ్మం, ఆత్మ, మానవశరీరం గురించి, బహిర్దృష్టి, అంతర్దృష్టిల గురించి వివరిస్తుంది. యాస్కాచార్యులు ఈ పద్ధతిని తన గ్రంధంలో 14 వ అధ్యాయంలో ఉపయోగించారు. వేదంలోని కొన్ని మంత్రాలకు యోగపరమైన అర్దాలు మాత్రమే చెప్పవలసి ఉంటుంది. మరే ఇతర అర్దాలు చెప్పినా, దుష్ఫలితాలు కలుగుతాయి.

6. కర్మకాండకు సంబంధించిన పద్ధతి. వైదిక అర్దాలను చెప్పడంలో ఇది చాలా సులువైన మరియు ప్రత్యక్ష పద్ధతి. ఉదాహరణకు ఏదైనా ఒక సూక్తం జగత్తుకు సంబంధించిన సత్యాన్ని చెప్పేది అవచ్చు, లేదా ఈశ్వర ప్రార్ధన కావచ్చు. కానీ అది పుట్టువెంట్రుకలు తీసే సమయంలో పఠించవలసి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ పద్ధతి ప్రకారం అర్దాన్ని చెప్తే, దాన్ని అసలు అర్దాన్ని పక్కనబెట్టి, కేవలం పుట్టువెంట్రుకలు తీసే సమయంలో మాత్రమే చదువుతారు. అనగా కేవలం కర్మకు మాత్రమే ఉపయోగిస్తారు.

అన్ని పద్ధతులను గమనిస్తే, ఐతిహాసిక, పౌరాణిక, కర్మకాండకు చెందిన పద్ధతులు కాలక్రమంలో వచ్చినవే తప్పించి, వాటి మీద ఆధారపడకూడదు. ఏదో తాత్కాలికంగా, సమయానుకూలంగా చెప్పుకోదగ్గవి మాత్రమే. అవి ఎల్లప్పుడూ సత్యాలను వ్యక్తపరుస్తాయని చెప్పలేము.

To be continued .................

Sunday, 4 October 2015

హిందూ ధర్మం - 178 (నిరుక్తము - 1)

నిరుక్తము - ఈ వేదాంగము వేదానికి చెవి వంటిది. ఇది వైదిక పదాల యొక్క ఆవిర్భావం గురించి వివరిస్తుంది. నిరుక్తం అనేది కఠినమీన వైదిక పదాల సమాహారమైన నిఘంటువుగా భాష్యం వంటిది. వేదాన్ని యధార్ధంగా అర్దం చేసుకోవడానికి నిరుక్తం ఉపయోగపడుతుంది. వేదం ఈశ్వరీయము. మొత్తం సంస్కృతంలోనే ఉంటుంది. అలా అని కేవలం సంస్కృతం నేర్చుకున్నంత మాత్రాన వేదానికి సరైన అర్దం చెప్పలేరు. ఎందుకంటే వైదిక సంస్కృతం వేరు, వ్యావహారిక సంస్కృతం వేరు. వేదం ఉన్నది వైదిక సంస్కృతంలో. ఇది చాలా పైస్థాయి పదజాలం, ఎంతో లోతైన, గంభీరమైన అర్దంతో కూడిన పరిభాష. వ్యవహారంలో వాడేది వ్యావహారిక సంస్కృతం. ఇది మామూలు స్థాయిది. ఈ రెండిటిని కలిపి, వైదిక సంస్కృతంలో ఉన్న వేదానికి, వ్యావహారిక సంస్కృతంలో అర్దం చెప్తే, అది దోషభూయిష్టంగానే ఉంటుంది. అందువలన సంస్కృతంలో పాండిత్యం వలన వేదానికి అర్దం చెప్పచ్చు అనడం తప్పే అవుతుంది. అంతేగాక, వేదంలో చెప్పబడ్డ ఏ పదానికైనా ఒకే అర్దం ఉండదు. ఒకే పదానికి నానార్దాలు ఉంటాయి. మంత్రక్రమాన్ని అనుసరించి, సమయసందర్భాలను అనుసరించి, ఆయా పదాలకు అర్దలాను అన్వయం చేయాల్సి ఉంటుంది. అందుకోసమే నిరుక్తమ్ను ఏర్పరిచారు ఋషులు. ఇది వేదానికి నిఘంటువు వంటిది.

ఎప్పుడు ఏ అర్ధాన్ని స్వీకరించాలనే దానికి ఆర్యసమాజ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతీ గారు సత్యార్ధ ప్రకాశ్‌లో చెప్పిన ఉదాహరణ చూడండి. ఎక్కడ ఏదీ ప్రకరణమో, అక్కడ దాన్ని గ్రహించటం ఉచితము. ఎట్లనగా, ఒకడు ఒక వ్యక్తితో 'హేభృత్య! త్వం సైంధవమానయ' అన్నాడు, అనగా ఓ సేవకుడా! నీవు సైంధవం తీసుకురా అని అర్దం. అప్పుడు ఆ సేవకుడు సమయము, ప్రకరణము (సందర్భము) గురించి ఆలోచించటం అవశ్యకం. ఎందుకంటే సైంధవం అనే పదానికి రెండు అర్దాలున్నాయి. ఒకటి గుఱ్ఱము, రెండవది లవణము (ఉప్పు). అతని యజమానికి అది బయటకు వెళ్ళే సమయం అయితే, అతడు గుఱ్ఱాన్ని తీసుకువెళ్ళాలి, భోజన సమయం అయితే ఉప్పు తీసుకువెళ్ళడం సరైన పద్ధతి. అలా కాక భోజన సమయంలో గుఱ్ఱాన్ని, గమన సమయంలో ఉప్పుని తీసుకువెళితే, అది యజమానికి ఆగ్రహాన్ని కలిగించి, సమయం, సందర్భం తెలియనివాడు తనకెందుకు అనుకోవచ్చు. అప్పుడు అతడి ఉద్యోగానికే ముప్పు వాటిల్లవచ్చు. అదే విధంగా వేదం విషయంలో అర్దాలను అన్వయం చేసేటప్పుడు ప్రకరణము - సమయము గురించి తప్పక ఆలోచించాలి. దానికి నిరుక్తం సహాయపడుతుంది.

నిఘంటువు మీద అనేక భాష్యలున్నా, యాస్కుడు రాసిన భాష్యాన్నే వేదాంగాల్లో ఒకటిగా స్వీకరించారు. ఇది కేవలం వైదిక పదాల గురించే కాక, వాటి ధాతువుల గురించి, ఒకే ధాతువును నుంచి ఉద్భవించిన సారూప్యత కలిగిన అనేక ఇతర పదాల గురించి వివరిస్తుంది.

To be continued ..............