Wednesday 22 February 2017

మహాపురుషుడు - స్వామి దయానంద సరస్వతి

భారతదేశంలో ఆధునిక కాలంలో పుట్టిన ముగ్గురు మహాపురుషులు స్వామి దయానంద సరస్వతీ, స్వామి వివేకానంద, శ్రీ అరొబిందో.
నేడు స్వామి దయానంద సరస్వతి జయంతి.

వైదిక ధర్మం నుంచే పుట్టి, వేరు పడిన 70 పైగా అవైదిక మతాలను ఖండించి, సనాతన ధర్మాన్ని ఆది శంకరులు పునఃస్థాపితం చేశారని మనం ఎలా చెప్పుకుంటున్నామో, అచ్చం అలానే దయానందుల గురించి కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆదిశంకరులు సనాతనధర్మాన్ని ప్రక్షాళన చేసిన తర్వాత మళ్ళీ ఈ ధర్మంలో ఎన్నో అవైదిక వాదనలు ఉద్భవించాయి. సమాజమంలో వచ్చిన రుగ్మతలకు ఆది శంకరుల వలె, భగవద్రామానుజులు, మధ్వాచార్యులు తమదైన శైలిలో పరిష్కారం చూపి, ధర్మాన్ని రక్షించారు. సనాతనధర్మంలో ప్రతి ఆచార్యుడు గొప్పవాడే. ఎవరికి వారే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఎందరో సంస్కర్తలు వచ్చినా, కాలక్రమంలో ధర్మంలో అనేక అనాచారాలు, దురాచారాలు ప్రబలాయి. వ్యక్తి గుణకర్మలను బట్టి నిర్ణయించే వర్ణం, జన్మతః నిర్ణయించడం మొదలుపెట్టారు. అంటరానితనం అనే దురాచారం వచ్చింది. బాల్య వివాహాలు, సతిసహగమనం కూడా సమాజాన్ని పట్టి పీడించాయి. అనవసరమైన, కుతర్కమైన మూఢనమ్మకలాతో భారాతావని ఎన్నో బాధలు అనుభవించింది. ప్రజల్లో చైతన్యాన్ని, క్రియాశీలత్వాన్ని నింపాల్సిన ధర్మప్రభోధం, అకర్మను, తమస్సును నింపింది. అటువంటి సమయంలో మాఘబహుళ దశమి రోజు, 12 ఫిభ్రవరి 1824 లో, గుజరాత్ రాష్ట్రంలోని టంకర అనే గ్రామంలో జన్మించారు స్వామి దయనంద సరస్వతీ. వీరి పూర్వాశ్రమ నామం మూలశంకర. చిన్నవయసులోనే సత్యాన్వేషణతో ఇల్లు వదిలిన మూలశంకరుడు, అనేక ప్రాంతాలను తిరిగి ఆఖరికి మథురలో స్వామి విరాజానంద అనే సన్యాసి వద్ద శిష్యరికం చేశారు. విరజానందుడు అంధుడే అయినా, జ్ఞాన దృష్టి కలవాడు. సమాజంలో చెప్పబడుతున్న వేదప్రోక్తమైన సనాతన ధర్మం కాదని, అసలు ధర్మాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని, ఆ పనిని దయానందునికి అప్పగించారు విరజానందుడు.

అప్పటి నుంచి దయానందుడు భారతదేశ నిర్మాణానికి, సనాతన ధర్మ పునరుద్ధరణకు ఎంతో కృషి చేశారు. ఎందరొతోనో వాదించారు. సనాతనధర్మంలో వివక్ష లేదని, అంటరానితనం వేదాల్లో లేదని, ఉంటే ఎక్కడ ఉందో చూపమని సవాల్ విసిరారు. అంటరానివారికి యజ్ఞోపవీతాలు చేసి, ఉపనయనం చేసి, వేదాధ్యనానికి బాటలు వేశారు. స్త్రీలు కూడా వేదం చదవచ్చని, వితంతువులు పునర్వివాహం చేసుకోవడం శాస్త్రబద్దమని వేదప్రమాణంగా నిరూపించారు. స్త్రీల కోసం వేదపాఠశాలలను స్థాపించారు. దైవం పేరుతో సనాతనధర్మంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను ఖండించారు. గోవధ మీద ఆంగ్లేయ ప్రభుత్వంతో మాట్లాడి, గోవధను నిషేదించాలని చెప్పిన వారిలో అగ్రగణ్యుడు దయానందుడు. అనేకమంది రాజులను కలిసి, వారిలో ధర్మానురక్తిని నింపారు. 1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో కీలకపాత్ర పోషించడంతో పాటు, భారతదేశానికి సంపూర్ణం స్వరాజ్యం రావాలని ఎలుగెత్తి అరిచారు. భారతదేశ స్వరాజ్యం గురించి భారతీయుడు ఇచ్చిన తొలి పిలుపు అదే. ఆ తర్వాత దాన్నే లోకమాన్య బాలగంగాధర తిలక్ కొనసాగించారు. తాను బ్రతికింది 59 ఏళ్ళే అయినా, అందులో ఋగ్వేదానికి సంపూర్ణంగానూ, యజుర్వేదానికి సగం వరకు భాష్యం రాశారు. వారు రాసిన వేదభాష్యం అప్పటి వరకు వేదంపై ఉన్న అభిప్రయాలను మరింత పెంచింది. ఆ కాలంలోనే ఋగ్వేద భాష్యం రాస్తూ, రేడియో, విమానాల గురించి ప్రస్తావించారు. కాశీవెళ్ళి కాశీ బ్రాహ్మణులతో శాస్త్రవాదం చేసి, వారిని ఓడించారు. సర్వమత సభను ఏర్పాటు చేసి, అన్ని మతాల పెద్దలను దానికి పిలిచి, ఈ లోకానికి వేదమే ప్రమాణమని, అందరూ వేదాన్నే అనుసరించాలని,  అని పిలుపిచ్చారు. వారు ఎవరూ ఒప్పుకోకపోవడంతో తన ఆశయసాధనకు ఆర్యసమాజ్ అనే సంస్థను స్థాపించారు. మేడం కామ, పండిత లేఖా రాం, స్వామి శ్రద్ధానంద, సావర్కర్, రాం ప్రసాద్ బిస్మల్, లాలా లజపతి రాయ్ మొదలైన వారిపై వీరి ప్రభావం తీవ్రంగా ఉంది. అంతెందుకు అరబిందో, సర్వేపల్లి రాథాకృష్ణన్ మొదలైనవారు వీరిని, ఆధునిక భారత నిర్మాతగా అభివర్ణించారు.

వీరి ప్రభావం ఎంతగా ఉండేదంటే ఆంగ్లేయులకు వీరంటే హడల్. గుండెలు జారిపోయేవి. వీరిని హిందూ మిలిటెంట్ గా అభివర్ణించారు. ఈ కాలంలో మనం చూసిన రాజీవ్ దీక్షిత్, ప్రస్తుత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మొదలైనవారికి దయానందులే స్ఫూర్తి ప్రదాత. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల పై వీరి ప్రభావం ఎంతగానో ఉంది. వీరి కారణంగానే వారు అంత వీరోచితంగా పోరాడారు. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఎందరో యోధులకు స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, అరబిందులే స్ఫూర్తి. దాదాపుగా దయానందుల ప్రభావం లేనివారు ఆ కాలంలో లేరని చెప్పవచ్చు. సనాతనధర్మంలో వచ్చిన ప్రతి సంస్కరణోద్యమంలో దయానందుల ప్రభావం ఎంతో ఉంది.

విగ్రహారాధన, అవతారవాదన మొదలైన వాటిని  దయానందులు ఖండించినా, అది ఆ కాలానికి అవసరమైనది కనుక అలా చేశారని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ధర్మంలో ఉన్న ప్రతి ఆచార్యుడు, సమాజం extreme లో ఉన్నప్పుడు, తాను ఇంకోextreme కి వెళ్ళి, బలంగా వాదించి balance చేస్తారు. అదే దయానందులు కూడా చేశారు. బుద్ధుడు, శంకరాచార్యులు, రామానుజుల జీవితాలను పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్దమవుతుంది. ధర్మ పునరుద్ధరణ ఒక లక్ష్యం అయితే, సమాజాన్ని balance చేయడం ఒక లక్ష్యం.

దయానందులు లేకపోతే, ఈనాడు హిందూ జాతి మిగిలి ఉండేది కాదు. మూఢనమ్మకాలతో, అంటారానితనం, బాల్యవివాహాలతో, మతమార్పిడులతో అంతరించిపోయి ఉండేదేమో. లేదా బానిస మనస్తత్త్వంతో ఉండేది. Colonise అయిన భారతీయ సమాజాన్ని Decolonise చేసే పని ప్రారంభించిన వ్యక్తులలో ప్రథముడిగా స్వామి దయానందులను చెప్పవచ్చు. అటువంటి దయానందులు సనాతన ధర్మంలో ప్రాతఃస్మరణీయులు.

ఇప్పటికీ వేదాల్లో ఏసు, మహమ్మదు అంటూ చేస్తున్న విషప్రచారాలను ఖండించగలిన, ఖండిస్తూ, జాకీర్ నయిక్ ను సైతం హడలుగొట్టిన సత్తా కలిగిన ఏకైక సంస్థ ఆర్య సమాజమే, దయానందుల భాష్యమే. అంత గొప్పవారు దయానందులు. మనం స్వామి వివేకానందను స్మరిస్తాం కానీ వారు చెప్పింది విస్మరిస్తాం. అరబిందులను, దయానందులను స్మరించడం కాదు, పూర్తిగా విస్మరించాం.

No comments:

Post a Comment