Thursday, 20 July 2017

షేర్ చేయకపోతే ఏమవుతుంది?ఒకప్పుడు కొందరు దేవుడి పేరు కరపత్రాలు (Pamphlets) పంచి, ఇది చదివిన వారు ఇలాంటివే ఇంకో 10 లేదా 100 కరపత్రాలు పంచిపెట్టాలి అని రాసి పంచిపెట్టేవారు. అది ఒక రకమైన emotional blackmail . ఇప్పుడది ఫేస్‌బుక్‌లో కూడా దాపురించింది. ఈ ఫోటొ చూసిన 3/5/7 సెకెన్లలో షేర్ చేయండి, లేదా ఈ ఫోటో చూసినవారు ఆ దైవం పేరును కామెంట్ బాక్సులో రాయండి, చూసినవెంటనే లైక్ చేయండి, శుభం జరుగుతుంది అంటూ చాలా కనిపిస్తుంటాయి. కొందరైతే ఇవి ఫలానా దైవానికి చెందిన 13 నామాలు, మీరు చదివి ఇంకో 13 మందికి పంపితే మీకు రేపటికల్లా శుభం జరుగుతుంది, లేదంటే దరిద్రం పట్టుకుంటుందని రాసి మెసెజ్స్ పంపుతారు. అది చూసి, కొందరేమో భయంతో షేర్‌లు చేయడం, కామెంట్స్ రాయడం చేస్తారు. పైగా వాట్సాప్‌లో కూడా అవే సందేశాలు. ఇదంతా ఒక emotional blackmail. మనోభావాలతో ఆడుకోవడమే.

ఇంకో రకం కూడా ఉంది. తిరుమల గుడిలో స్వామి వీడియో రహస్యంగా చిత్రించారు. ఇది అందరికీ షేర్ చేసి, స్వామి దర్శన భాగ్యం కలిగించండి అంటూ రాస్తారు. అది నిజమో, అబద్దమో ......... ఒక్క తిరుమలే కాదు. ఇంకా చాలా పుణ్యక్షేత్రాలు. ఎక్కడో ఏదో గుడికి వెళ్ళడం, అక్కడ సిబ్బంది కళ్ళుగప్పి కెమెరా తీసుకెళ్ళి అక్కడి విశేషాలను రహస్యంగా చిత్రించడం, అది మనమంతా షేర్ చేయడం. ఇందులో తప్పేముంది అనకండి. ప్రతి ఆలయానికి ఆగమం ఉంటుంది. దానికి అనుగుణంగా నియమాలు ఉంటాయి. ఆగమం అనేది ఆయా దేవతలే చెప్పిన విధిపూర్వక నియమావళి. మీరొక ఆలయానికి వెళితే, తప్పకుండా అక్కడి నియమాలను పాటించాలి. కొన్ని ఆలయాల్లో మూలమూర్తులను, ఇతర మూర్తులను చిత్రించే అవకాశం ఉంటుంది. కొన్నిట్లో ఉండదు. మనం అక్కడి నియమాలను తప్పకుండా పాటించాలి. నేనే వీరభక్తుడిని అనుకుని, పదిమందికి చూపితే ఏమవుతుందని ప్రశ్నించడం కాదు. నిజంగా అంత భక్తి ఉంటే, అక్కడి నియమాలకు బద్ధుడవ్వాలి. భక్తి ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు రావు, అహం వున్నప్పుడు వస్తాయి.

షేర్ చేసేవారు కూడా కాస్త ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. ఒక ఆలయ ఆగామన్ని మీరడం పాపం. అలా చేసి ఎవరైనా, ఏదైనా చేస్తే మనం దాన్ని ఖండించాలే కానీ ప్రోత్సహించకూడదు. ప్రోత్సహిస్తే మనకూ అదే పాపం వస్తుంది. అది కర్మసిద్దాంతం. రెండవది, ఫోటోలు షేర్ చేస్తేనో, కామెంట్‌లు రాస్తేనో శుభం చేయడానికి, చేయకపోతే శపించడానికి దేవుడేమీ శాడిస్టు కాడు, భక్తి మనస్సులో ఉండాలి. నచ్చిన విషయాన్ని షేర్ చేయడంలో తప్పేమీ లేదు, కానీ బలవంతంగా చేయడమెందుకు? పైగా ఇలా చేస్తే మేలు చేస్తానని భగవంతుడు ఎక్కడైనా చెప్పాడా? ఏ శాస్త్రంలో చెప్పడానికి అలాంటి ఫోటోలు, వీడియో పెట్టినవాడిని అడగండి. చూసిన వెంటనే షేర్ చేయండి అంటాడు, నేను చేయను. అప్పుడేమీ అవుతుంది, ఏమీ కాదు. వాడు పెట్టిన పోస్ట్ మహా అయితే వృధా అవుతుంది. అంతే.

నిజానికి భగవంతుడు పరమకారుణ్యమూర్తి. చూస్తే షేర్ చేయండి లాంటి దిక్కుమాలిన సందేశాలు ప్రోత్సహించి ఆయన్ను మనమే శాడిస్టులా భావిస్తున్నాము. శుభాశుభాలు మీ కర్మను అనుసరించి ఉంటాయి. భగవంతుని యందు అపారమైన భక్తి, విశ్వాసాలుంటే ఆయన అనుగ్రహం చాలా సులభంగా దక్కుతుంది. దైవత్వం గురించి తెలియనప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతుంటాయి.

No comments:

Post a Comment