Sunday 30 July 2017

హిందూ ధర్మం - 247 (అమెరికా = పాతాళ లోకం ??)

అయితే మహాభారతంలోని కొన్ని విషయాలను అనుసరించి కూడా అమెరికానే కొన్ని ఇతిహాసాల్లో పాతాళలోకంగా చెప్పారని మనం భావన చేయవచ్చు.

మయసభ నిర్మాణం గురించి మనకు తెలిసిందే. దాన్ని నిర్మించినవాడు మయాసురుడు. అతనే మయా/ మయాన్ నాగరికతకు ఆద్యుడని చెబుతారు. (ఆ వివరాలను మానం చాలా కాలం క్రితం వివరించుకున్నాము కూడా). ఈ మయా నాగరికత మధ్య అమెరికాలో వర్ధిల్లింది. వారికి మనకు లాగే వాస్తు శాస్త్రం ఉంది. నిజానికి మయుడు మనకు వాస్తు శాస్త్రంలో ఎన్నో విషయాలు నేర్పించాడు. ఒకసారి వి.గణపతి స్థపతి గారు దక్షిణ అమెరికా ఖండం పెరు దేశంలోని ఆండెస్ పర్వతాల్లో ఉన్న మచు పిచ్చు అనే పురాతన నాగరికత అవశేషాలను, ఇంకాస్, మయా నాగరికతలను పరిశీలించడానికి వెళ్ళారు. శిల్పకళ, నగరనిర్మాణం, వాస్తు శాస్త్రం మీద మనదేశంలో మయమతం అనే ప్రామాణిక గ్రంథం లభ్యమవుతుంది, అది మయుడు రాసిన గ్రంథం. అందులో 8/ 8 చతురస్రాలతో 64 ప్రమాణములతో (Units) ఉంటుంది వాస్తుపురుష మండలం. అక్కడ వారు గమనించింది కూడా అదే. అక్కడున్న నిర్మాణాలన్నీ ఆ వాస్తుపురుష మండలాన్ని కలిగి ఉన్నాయి. వారు అక్కడి ఇంకాస్ నాగరికతకు చెందిన పురాతన ఆవాసానికి ఉన్న గోడను పరిశీలించి, దాని మందం ఒక కిష్కు హస్తం ఉంది (అనగా 33 ఇంచులు). దక్షిణ భారతదేశంలో మయుడి వాస్తు శాస్త్రం ఆధార నిర్మాణాల్లో ఉండే ప్రమాణం (Standard) అది..... అక్కడి గైడ్, స్థపతితో ఇవి ఇక్కడ ఎలా నిర్మించారో తెలియదు, రాళ్ళను ఎలా మోసుకొచ్చారో తెలియదు అనగా, వారు పర్శీలించి, ఇదేమి తమకు కొత్త కాదని, భారతదేశంలో వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించే నిర్మాణాలకు భారీ శిలలను ఎలా తరలిస్తారో, అలానే వీటిని తరలించారని, అందుకు ఉదాహరన వాటిపై ఉన్న గుర్తులే నిదర్శనమని చెప్పారు.  

అర్జునుడు పాతాళలోకానికి చెందిన నాగ కన్య అయిన ఉలూపిని వివాహం చేసుకుంటాడు. ఆమె అమెరికా ఖండానికి చెందిన యువరాణి. ఇది మెక్సికోలోని అక్కడి కథల్లో కనిపిస్తుంది. వారు అర్జునిడిని చిలి పెప్పర్ మ్యాన్ గా చెప్పుకుంటారు. ఈ చిలి పెప్పర్ మ్యాన్ యుద్ధ విజేత మరియు 'తుల' అనే మహారాజు అల్లుడు అని వారు చెబుతారు.

మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడుతుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార చాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు, కొన్ని దురాచారాలయిన చేతబడులు (sorcism ) నమ్ముతారు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారత దేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం “the light of india” లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు. వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు ఆఖరికి మానవ బలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఇంచుమించి వారు పూజించే Quetzalcoatl ( పాలను మనం క్షీరం అని పిలుస్తాం, ఆంగ్లంలో milk అంటాం. అలాగే వారి పిలుపులో తేడా వున్నా వారి ఇతిహాసం మన కధనే చెబుతుంది) .

కలియుగం మనకు సా.శ.పూ.3102 లో మొదలైంది, అప్పటి నుంచి కలియుగ కాలమానం లెక్కిస్తున్నాము. మయా నాగరికతలో వారి క్యాలెండర్ సా.శ.పూ.3114 లో మొదలైంది. మన పంచాంగానికి, క్యాలెండర్ కు చాలా పోలికలు ఉన్నాయి.  మయా స్త్రీలు భారతీయ స్త్రీల మాదిరిగానే ఎడమముక్కు రంధ్రానికి ముక్కుపుడుక పెట్టుకుంటారు. వారి వద్ద కూడా మనకులాగే జ్యోతిష్యం, దూరశ్రవణం (telepathy) వంటి విద్యలు ఉన్నాయి. మయన్లు కూడా హిందువుల వలే దేవతల ముందు ఆహారం నివేదన చేసి అప్పుడు ఆరగిస్తారు. ఆహారంలో కూడా మనకు వారికి ఎన్నో పోలికలున్నాయి. హిందువుల వలె మెక్సికన్లు కూడా ప్రాథమికంగా శాఖాహారులు.

సూర్య సిద్దాంతాన్ని చదివితే, లాటిన్ అమెరికా ప్రాంతం పాతాళదేశమని అర్దమవుతుంది. అందులో 12 వ అధ్యాయంలో - దేవతలు అసురులు ఈ భూమి మీదే ఉంటారు. దేవతలు ఉత్తరార్ధగోళంలో, అసురులు దక్షిణార్ధగోళంలో నివసిస్తారు. ధృవాల చుట్టూ ఉన్న సముద్రం ఈ భూమిని రెండు పెద్ద ఖండాలుగా విభజించింది. దేవతల ఖండము, అసురల ఖండము (ఇప్పుడు మనం చూస్తే, ఆసియా, యూరోపు, అఫ్రికా భూభాగల మధ్య సముద్రం లేదు, అమెరిక (ఉత్తర, దక్షిణ) ఖండాన్ని మాత్రమే మిగితా ఖండల నుంచి సముద్రం వేరు చేసింది. సూర్యుడు ఉత్తరార్ధగోళంలో అంటే మేషరాశిలో ఉన్నప్పుడు మొదట దేవతలకు, దక్షిణార్ధగోళంలో ఉన్నప్పుడు అసురులకు మొదట కనిపిస్తాడు. సూర్యుడు భూమధ్యరేఖ దగ్గరున్నప్పుడు, సురలు, అసురులు పగలురాత్రుళ్ళను సమానంగా అనుభవిస్తారు. సూర్యుడు ఉత్తరార్ధగోళం వైపు పయనించగా, దేవతలు గ్రీష్మ ఋతువును చూస్తారు. అప్పుడు అసురులకు పెద్దగా సూర్యకిరణాల వేడిమి ఉండదు. ఎందుకంటే సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఉన్నాడు కనుక. అప్పుడు వారికి చలికాలం ఉంటుంది - ఇది గమనిస్తే పాతాళం దక్షిణ అమెరికా ఖండమని అర్దమవుతుంది. 
అయితే పాతాళంలో ఉండేవారంతా దుష్టులని ఎక్కడా చెప్పబడలేదు. అది మనం ఏర్పర్చుకున్న దురభిప్రాయం మాత్రమే. విభీషణుడు, ప్రహ్లాదుడు, బలి మొదలైనవారంతా కూడా రాక్షసులే. కానీ మంచివారు. రక్షణ కోసం బ్రహ్మవారిని సృష్టించాడు కనుక రాక్షసులను పేరు వచ్చింది. ఆ తర్వాతా వారు నివసించడానికి కొంత స్థలం కూడా బ్రహ్మదేవుడే ఇచ్చాడు. కానీ రక్షణ మరిచి, కొందరు దురాశతో దేవతలపై యుద్ధం చేయడంతో వారిని పరమాత్ముడు సంహరించాడు. అంతేకానీ ప్రతి రాక్షసుడు చెడ్డవాడు కాదు.

పితృలోకం దక్షిణంలో ఉందని చెప్తారు, మీరు గనక భూమికి ఆగ్నేయమూలకు వెళితే, అక్కడ అనేక నాగశిలలను ప్రతిష్టించి జనులు పూజిస్తుంటారు అంటారు పూజ్యగురువులు వి.వి.శ్రీధర్ గారు. నాగదేవతలకు పితృదేవతలకు సంకేతం. నాగుల గురించి మన సంస్కృతి చాలా చెప్పింది. వారిని నదులు, చెరువులకు రక్షకులుగా చెప్పింది. మలయేషియా కథల్లో నాగులను భారీ ఆకారంలో చూపుతారు. జావా, థాయిలాండ్ దేశాల్లో నాగులను దేవతలుగా, భూమికి క్రింద ఉండే లోకల వాసులుగా, సంపదలకు అధిపతులుగా భావిస్తారు. థాయిలాండ్ లో మన ఆదీశేషుని పోలిన ఐదుతలల నాగదేవత కూడా ఉంది. మెక్సికో లో నాగాల్ (Nagal) అనే పదం ఉంది. అది రక్షకులుగా ఉండే కొన్ని నాగదేవతల గురించి చెబుతుంది. కాంబోడియా రాజ్యాన్ని నాగులే స్థాపించాయని అక్కడి జనుల విశ్వాసం. 

ఇలా మన పురాణాల్లో చెప్పిన వివిధ లోకాలు ఈ భూమ్మీదే దర్శించడం ఒక కోణం మాత్రమే. ఇంతకముందు చెప్పిన విషయాలు, ఇక ముందు చెప్పబోయే విషయాలను సమన్వయం చేసుకుంటే, ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుంది. 

To be continued .........
ఇందులో కొంతభాగం Kiran Mva గారి రచన నుంచి సేకరణ

No comments:

Post a Comment