Monday 14 October 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 17 వ భాగము



అయిదవ అధ్యాయము
శ్రీ దక్షిణామూర్తి
నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాంగురవే సర్వలోకానాం శ్రీ దక్షిణామూర్తయే నమః

సర్వ విద్యలకు నిధి అయిన వాడు, భవరోగమును అనగా సంసారమనే రోగానికి వైద్యుడైన వాడు, సర్వలోకాలకు గురువు అయిన శ్రీ దక్షిణామూర్తికి నమస్కారములు. (గురు గీత)

కైలాస పర్వతం మీద అందంగా అనేక మణులతో అలంకరించిన ఒక పెద్ద సభామండపంలో పార్వతీదేవి తన పక్కన కూర్చోపెట్టుకొని. శివుడు ఆశీనుడై ఉన్నాడు. ఆ సమయంలో అమ్మవారు స్వామిని పూజించి, తను దక్షుని కుమార్తె కనుక దాక్షాయణిగా పేరొచ్చిందని, ఆ పేరు మార్చమని విజ్ఞప్తి చేసింది. ఈ దక్షుడు శివుని అవమానించినందుకు మరియు తన అహంకారం చూపినందుకు శివుని చేత వధించబడ్డాడు. ఈ విజ్ఞప్తి విన్న శివుడు పార్వతీదేవిని సంతానం కోసం తీవ్రమైన తపస్సు చేస్తున్న పర్వతరాజు కుమార్తెగా జన్మించమని ఆదేశిస్తాడు. అలాగే ఆయన పార్వతీ దేవి వద్దకు వచ్చి వివాహం చేసుకుంటానని చెబుతాడు. శివుడు ఆదేశించిన విధంగా పార్వతీదేవి పర్వతరాజు కుమార్తెగా పుట్టింది, మరియు శివుడిని వరునిగా పొందుట కొరకు తన అయిదవ సంవత్సరం నుంచే తీవ్రమైన తపస్సు చేసింది.

దేవి లేని సమయంలో శివుడు ఒంటరిగా ఉన్నప్పుడు, బ్రహ్మ దేవుని కుమారులైన - సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు- శివుని యొక్క దర్శనం కోసం వచ్చి ఆయనకు నమస్కరించారు. వారు స్వామిని తమ అవిద్యను తొలగించుకుని మోక్షం పొందే మార్గం చూపమని అడిగారు. ఎంతో దీర్ఘంగా లోతుగా గ్రంధాలను అధ్యయనం చేసిన తర్వాత కూడా వారికి మనశ్శాంతి దొరకలేదు మరియు మోక్షం పొందటానికి అవసరమైన రహస్యాలను వారు తెలుసుకోవాలని కోరుకుని, ఈ ప్రశ్న అడిగారు.

ఋషుల విన్నపాన్ని విన్న పరమశివుడు దక్షిణామూర్తి రూపాన్ని స్వీకరించి, ఆది గురువుగా మౌనంలో ఉంటూ, తన చేతితో చిన్ముద్ర చూపుతూ, వారికి అనేకమైన రహస్యాలను బోధించారు. ఆ ఋషులు ఆ వాక్యాల మీద ధ్యానం చేసి, అంతులేని ఆనందాన్ని, బ్రహ్మానంద స్థితి పొందారు.

అలా శివుడు దక్షిణామూర్తిగా లోకానికి తెలియబడ్డాడు. దక్షిణామూర్తి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండుగాక! ఆయన యొక్క అనుగ్రహంతో మనందరం అంతులేని శాంతి మరియు ఆనందాన్ని అనుభూతి చెందటానికి ఆత్మజ్ఞానమనే లోతుల్లోకి వెల్లేదము గాక! ఓం శాంతిః శాంతిః శాంతిః

No comments:

Post a Comment