Tuesday 15 October 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 18 వ భాగము



ఆరవ అధ్యాయము
శ్రీ గురు దత్తాత్రేయుడు మరియు ఆయన 24 గురువులు

ఆదౌ బ్రహ్మ మధ్యే విష్ణుర్ అంతే దేవాః సదాశివః |
మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే ||

ఆది లో బ్రహ్మ గాను, మధ్యలో విష్ణువు గాను, అంతంలో శివుని గాను, త్రిమూర్తుల స్వరూపంగా ఉన్న దత్తాత్రేయ నమస్కారములు.

బ్రహ్మజ్ఞానమయీ ముద్ర వస్త్రేచాకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధయ దత్తాత్రేయ నమోస్తుతే ||

గిర్నార్ పర్వతశ్రేణులకు ప్రభువైనవాడు, బ్రహ్మ జ్ఞానమే ముద్రగా వాడు ధరించినవాడు; భూమి, ఆకాశాన్ని తన వస్త్రములుగా కట్టుకున్నవాడు, ఘనమైన జ్ఞాన స్వరూపుడు, అయిన దత్తాత్రేయునకు మళ్ళీ మళ్ళీ నా నమస్కారములు. (శ్రీ ఆది శంకరాచార్యులు)

అనసూయ మాతను పాతివ్రత్యానికి ఉదాహరణగా చెబుతారు మరియు ఆవిడ సప్తఋషులలో ఒకరైన, గొప్ప ఋషి అయిన అత్రి మహర్షి యొక్క ధర్మపత్ని. ఆవిడ పతివ్రత ధర్మంలో ఎంతో గొప్పగా నిలబడింది. ఆమె తన భర్తను గొప్ప భక్తితో సేవించింది. బ్రహ్మ విష్ణు మరియు శివులకు సమానమైన పుత్రులను పొందుట కొరకు ఆవిడ ఎంతో కాలం తీవ్రమైన తపస్సు చేసింది.

ఒకసారి నారదుడు ఒక చిన్న ఇనుప - గుళిక (గోళము) తీసుకొని సరస్వతీదేవి వద్దకు వెళ్లి, ఆమెతో ఇలా అన్నారు; "సరస్వతి దేవి! దయ చెసి ఈ ఇనుపగుళికను వేయించండి. ఈ ఇనుపగుళికను నేను నా ప్రయాణం లో ఆరగిస్తాను." సరస్వతీదేవి నవ్వి "నారదమహర్షి ఈ ఇనుపగుళికను ఎలా వేఁపగలరు? దీన్ని ఎలా తినగలరు?" అని అలా అన్నది. అటు తర్వాత నారదుడు మహాలక్ష్మి మరియు పార్వతి దేవి వద్దకు వెళ్లి ఆ ఇనుప గుళికను వేఁపమని అర్ధించాడు. వాళ్లు కూడా నారదుడిని చూసి నవ్వారు. అప్పుడు నారదుడు ఇలా అన్నారు; "దేవిలారా! చూడండి, నేను ఈ భూ ప్రపంచంలోనే అతి గొప్ప పతివ్రత, అత్రి మహర్షి భార్య అయిన అనసూయ మాత వద్దకు వెళ్ళి, దీన్ని వేయించి, తీసుకువస్తాను" అన్నారు.

అప్పుడు నారదుడు అనసూయమాత వద్దకు వచ్చి ఆ ఇనుపగుళికను వేయించమని అర్ధించాడు. అనసూయ మాత ఆ ఇనుప గుళికను పెన్నంలో పెట్టి, ఆమె భర్త యొక్క రూపం మీద ధ్యానం చేసి, తన భర్త పాదాలను కడుగగా ఉన్న నీటిలో కొన్ని చుక్కలను, ఆ గుళిక మీద చల్లింది. ఒక్కసారిగా ఆ ఇనుపగుళిక వేఁపబడింది. నారదుడు సరస్వతీదేవి లక్ష్మీదేవి మరియు పార్వతి దేవులకు వద్దకు వెళ్లి, వేయించిన ఆ గుళికను వారి ముందే తిన్నారు. మరియు వారికి కూడా కొంచెం కొంచెం ఇచ్చారు. అతడు ఆమెను మరియు ఆమె యొక్క పాతివ్రత్యాన్ని ఎంతగానో పొగిడారు. అప్పుడు నారదుడు ఆమెకు బ్రహ్మ విష్ణు శివులకు కు సమానమైన పుత్రుడు కలగాలన్న కోరిక నెరవేర్చాలని సంకల్పించారు.

ఆయన సరస్వతీ, లక్ష్మీ, పార్వతులతో : "మీ గనక మీ యొక్క పతులకు విశ్వాసంతో, నిజాయతీతో మరియు భక్తితో సేవ చేసి ఉంటే మీరు కూడా ఇనుపగుళికను వేయించి ఉండేవారు. అనసూయ యొక్క పతివ్రతా ధర్మాన్ని పరీక్షించమని మీ యొక్క భర్తలను అర్ధిన్చండి."

అప్పుడు సరస్వతీ, లక్ష్మీ, పార్వతులు తమ పతులను అత్రి మహర్షి యొక్క పత్ని అయిన అనసూయమాత యొక్క పాతివ్రత్య ధర్మాన్ని పరీక్షించమని, వారికి నిర్వాణ భిక్ష అనగా వస్త్రము లేకుండా వివస్త్రగా బిక్ష ఇమ్మని అడగమన్నారు.


త్రిమూర్తులు నారదుని యొక్క చర్యలు, అలాగే అనసూయ మాత యొక్క తపస్సు మరియు కొరికను తమ జ్ఞాన దృష్టి ద్వారా తెలుసుకున్నారు. వారు అంగీకరించారు. అప్పుడు త్రిమూర్తులు సన్యాసి రూపం ధరించి, అనసూయ మాత ముందు ప్రత్యక్షమై, ఆమెను నిర్వాణ భిక్ష ఇమ్మన్నారు. అనసూయమ్మ గొప్ప సంధిగ్దానికి గురైంది. భిక్షుకులకు ఆమె కాదు అని చెప్పలేదు. అలాగే ఆమె యొక్క పాతివ్రత్య ధర్మాన్ని నిలుపుకోవాలి. కాబట్టి ఆమె తన భర్త రూపాన్ని ధ్యానించి, ఆయన పాదముల యందు సరణాగతి చేసి, తన భర్త పాదాలను కడుగగా ఉన్న నీటి నుంచి కొన్ని చుక్కలను ఆ సన్యాసుల మీద చిలకరించింది/ చల్లింది. త్రిమూర్తులు ఆ చరణామృత మహిమ చేత ముగ్గురు పిల్లలుగా మారిపోయారు. అదే సమయంలో యొక్క స్తన్యములలో పాల ఉత్పత్తి జరిగింది. ఆమె ముగ్గురు పిల్లలను తన కన్నబిడ్డలుగా భావించి, నగ్నస్థితిలోనే వారికి పాలు పట్టి, ఊయలలో వేసింది ఊపింది. అంతకముందే స్నానానికి వెళ్లిన భర్త రాక కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూడసాగింది.

అత్రి మహర్షి తన ఆశ్రమానికి తిరిగి రాగానే, ఆయన లేని సమయంలో జరిగినవన్నీ అనసూయ మాత పూసగుచ్చినట్టు చెప్పింది. ఆ పిల్లలను ఆయన పాదాల వద్ద ఉంచి, ఆయనను పూజించింది. కానీ అత్రిమహర్షికి తన దివ్యదృష్టి ద్వారా జరిగినదంతా ముందే తెలుసు. ఆ ముగ్గురు పిల్లలను ఆయన దగ్గరకు తీసుకున్నారు. ముగ్గురు పిల్లలు రెండు కాళ్లతో, ఒక మొండెంతో, మూడు శిరస్సులతో మరియు ఆరు చేతులతో ఒకే పిల్లవానిగా మారారు. అత్రి మహర్షి తన భార్యను ఆశీర్వదించి, త్రిమూర్తులు పసిపిల్లలుగా రూపంలో తన వద్దకు వచ్చి అనుగ్రహించారని ఆమెకు తెలియపరిచారు.


నారదుడు బ్రహ్మలోకానికి, వైకుంఠానికి మరియు కైలాసానికి వెళ్ళి సరస్వతి, లక్ష్మీ మరియు పార్వతులకు తమ భర్తలు అనసూయ మాత వద్ద నిర్వాణ బిక్షకు వెళ్ళి ఆమె యొక్క పాతివ్రత్య ధర్మం యొక్క శక్తి చేత చిన్న పిల్లలుగా మారిపోయారని, ముగ్గులు అమ్మవార్లు అక్కడకు వెళ్లి అత్రిని భర్తబిక్ష అడగని యెడల, వారు తిరిగి తమ రూపం తీసుకోలేరని చెప్పారు. సరస్వతీ, లక్ష్మీ, పార్వతులు సామాన్య స్త్రీ రూపం ధరించి, అత్రి మహర్షి వద్దకు వెళ్లి పతిబిక్ష పెట్టమని అడిగారు. "ఓ మహర్షి మా భర్తలను తిరిగి మాకు ఇవ్వండి" అన్నారు. అత్రి మహర్షి ఆ ముగ్గురు స్త్రీలను విధిగా గౌరవించి, చేతులు జోడించి ప్రార్థన చేసి, తన కోరిక మరియు తన భార్య అయిన అనసూయ కోరిక నెరవేర్చమని వేడుకున్నారు. అప్పుడు త్రిమూర్తులు అత్రి ముందు తన నిజరూపం స్వీకరించి ఇలా అన్నారు- "ఈ పిల్లవాడు నీ మాట ప్రకారం గొప్పఋషి అవుతాడు మరియు అనసూయ మాత యొక్క కోరిక మేరకు మాకు సమానుడౌతాడు. ఈ పిల్లవాడు దత్తాత్రేయ నామముతో ప్రసిద్ధి పొందుతాడు". అలా చెప్పి వారు అదృశ్యమయ్యారు.

దత్తాత్రేయుడు యుక్తవయసుకు వచ్చాడు. ఆయనలో త్రిమూర్తుల అంశతో ఉన్నందున మరియు ఆయన గొప్ప జ్ఞాని అయినందువలన ఋషులు మరియు సాధువులందరూ పూజించారు. ఆయన సౌమ్యముగా, శాంతముగా మరియు మరియు స్నేహపూర్వకంగా ఉండేవారు. ఆయనను నిత్యము ఎంతోమంది జనులు అనుసరిస్తూ ఉండేవారు. దత్తాత్రేయుడు వారందరినీ వదిలించుకోవాలని అనుకున్నప్పటికీ, ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకసారి ఆయనను ఎంతో మంది వ్యక్తులు చుట్టుముట్టి ఉన్నప్పుడు, ఆయన స్నానం కోసం అనే నదిలోకి ప్రవేశించి, మూడు రోజుల వరకు బయటకు రాలేదు. ఆయన నీటిలోనే సమాధి స్థితిలో ఉన్నారు. ఆయన మూడవ రోజు బయటకు వచ్చినప్పుడు, ఆయన యొక్క రాకకోసం జనులు ఆ నది ఒడ్డున కూర్చుని ఉండడం చూసారు.

ఈ పద్ధతిలో వదిలించుకోవడం ఆయనకు సాధ్యం కాలేదు. ఆయన వేరొక ప్రణాళికను అనుసరించారు. ఆయన తన యోగశక్తితో ఒక అందమైన అమ్మాయి మరియు ఒక మందు/ సారాయి సీసాలను సృష్టించారు. ఆయన నీటిలో నుంచి ఒక చేత్తో అమ్మాయిని మరియు ఇంకొక చేతితో సారాయి సీసాను పట్టుకుని బయటకు వచ్చారు. జనులందరూ ఆయన తన యోగం నుంచి భ్రష్టుడయ్యాడని తలచి, ఆయనను వదిలి వెళ్ళిపోయారు.

దత్తాత్రేయుడు ఆయన వద్ద ఉన్న అన్ని రకాల వస్తువులను, అలాగే తన దుస్తులను సైతం కూడా అవతలపడేసి, అవధూతగా మారారు. వేదాంతం యొక్క సత్యాలను ప్రవచించి బోధించడానికి దేశాటనకు వెళ్లారు. దత్తాత్రేయుడు సుబ్రహ్మణ్య స్వామి లేదా కార్తికేయునకు అవధూత గీత పేరుతో తన గీతను బోధించారు. వేదాంతం మరియు ఆత్మసాక్షాత్కారం యొక్క అపరోక్షానుభూతి లేదా ప్రత్యక్ష అనుభవం గురించిన ఎన్నో సత్యాలు మరియు రహస్యాలు కలిగిన అత్యంత విలువైన పుస్తకము ఈ అవధూత గీత.

No comments:

Post a Comment