Showing posts with label అశ్వమేధం. Show all posts
Showing posts with label అశ్వమేధం. Show all posts

Sunday, 1 May 2016

హిందూ ధర్మం - 207 (అశ్వమేధయాగంలో అశ్వబలి లేదు - 3)

ఇంతకముందు చెప్పుకున్నట్టుగానే అశ్వమేధాన్ని కూడా అగ్ని లేకుండా జ్ఞానకాండలో భాగంగా నిర్వహించవచ్చు. దీన్ని నిర్వహించడానికి వర్ణాశ్రమ బేధం ఉండదు. దేశరక్షణ, సంగ్రత, సమైఖ్యత కొరకు చేసే కర్మలన్నీ అశ్వమేధానికి సమానమైన ఫలితానిస్తాయి. దేశంలో విఛ్ఛినకరశక్తులు, దేశద్రోహులు తమ విషపడగలను విప్పి, దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న తరుణంలో, దేశప్రజలలో బుద్దిపరమైన జాగృతిని కలిగించి, ప్రజలను ఆలోచింపజేసి, వారిని సంఘటితం చేయడం, దేశద్రోహుల మనసులు మార్చే ప్రయత్నం చేయడం, అది కుదరని పక్షంలో వారిని దేశం నుంచి తరిమికొట్టడం అశ్వమేధం. ఒక దేశానికి రెండు రకాల శతృవులుంటారు. ఒకరు అంతర్గత శతృవులు, రెండవవారు శతృదేశాల వారు. శతృదేశాలవారి ఎత్తులను చిత్తు చేయడం, యుద్ధం చేయడం అంత కఠినం కాకపోవచ్చు కానీ, అంతర్గత శతృవులను పట్టుకుని, వారిని మట్టుబెట్టడం చాలా కష్టం. వీళ్ళు ఇంటిదొంగలు. ఇక్కడే ఉంటూ, ఇక్కడే తింటూ మాతృభూమినే ముక్కలు చేయాలని చూసే పరమకౄరులు. వీరు చేసే అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. అట్లాగే దేశప్రజలలో శక్తి క్షీణించి, దేశం పతనం దిశగా వెళుతున్న క్రమంలో, వారిలో పునరుజ్జీవాన్ని నింపి, నూతున శక్తులను సృష్టించి, దేశపతనాన్ని ఆపటం అశ్వమేధం. ఇవి అగ్ని లేకుండా చేసే అశ్వమేధ యాగాలు. నిరంతరం ఇవి జరుగుతూనే ఉండాలి.

అశ్వం అంటే విశ్వాత్మ అయిన సూర్యుడని, సర్వజీవుల యందు అంతర్గతమైన ఆత్మ అని, ప్రాణశక్తులు ఆత్మతో సంయోగం చెందేలా జీవించడమే అశ్వమేధమని దయానంద సరస్వతీ వివరించారు.  ప్రాణం ఇక్కడ దేహంలోని ప్రాణశక్తులను సూచిస్తోంది, ఆత్మను కాదు. భోజనం చేయనప్పుడు నీరసంగా అనిపిస్తుంది, ఆ నీరసానికి కారణం ప్రాణం. నచ్చిన, ఆసక్తికరమైన విషయం విన్నప్పుడు తెలియని ఉత్తేజం కలుగుతుంది, అది ఉత్తేజితమైన ప్రాణం యొక్క బహిర్ రూపం. అలా దేహంలో నిత్యం ప్రాణశక్తి సంచారం చేస్తూ ఉంటుంది. జీవి యొక్క ప్రతి కదలిక వలన అది దేహం నుంచి బయటకు వెళుతూ ఉంటుంది. ఉద్రేకాలు, అధికమైన ఆలోచనలు, భావాల మీద నియంత్రణ లేకపోవడం, మితిమీరిన శృంగారం, వీర్యనష్టం లాంటి వాటి వలన అది శరీరం నుంచి అధికంగా బయటకు వెళ్ళిపోతుంది. దాని వలన నాడీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ ప్రాణశక్తి బయటకు వెళ్ళిపోవడాన్ని యోగులు తమ సూక్ష్మ దృష్టితో దర్శించగలుగుతారు. అందుకే గురువులు ఉపదేశం చేస్తూ 'ఏ పనిని ఇష్టం లేకుండా చేయకండి. ఇష్టపడి పనిచేయండి. కష్టంగా భావించకండి' అంటారు. ఎందుకంటే భారమనుకుని చేసే కర్మ ప్రాణశక్తిని అధికంగా బయటకు లాగేస్తుంది. ఈ ప్రాణశక్తిని ప్రాణాయామం మొదలైన సాధనాలతో, ధ్యానంతో, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహాలతో, యోగంతో ఆత్మవైపు మళ్ళించడం అశ్వమేధం.

ఆ సందర్భంలో మేధం ఇక్కడ చక్కని బుద్ధిని తెలియజేస్తుంది. బుద్ధి ఎలా వికసిస్తుందంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా. మంచి ఆహారం, శుద్ధమైన, ఔషధ మొక్కల నుంచి వీచే గాలి, అన్నీ అవసరమే అయినా, బుద్ధి ధర్మ శాస్త్రాన్ని తెలుసుకోవడం వలననే వికసిస్తుంది. అట్లా బుద్ధిని, మేధస్సును వృద్ధి చేసుకుని, గురువు చెప్పిన విషయాన్ని మననం చేసుకుని, దానిపై ధ్యానించి, ప్రాణశక్తిని ఆత్మవైపు మళ్ళించటమే అశ్వమేధం.

కర్మసాక్షి సూర్యనారాయణ మూర్తి. ఆయనతో జీవనాన్ని ముడి వేసింది సనాతనధర్మ వైద్యశాస్త్రమైన ఆయుర్వేదం. సూర్యోదయం నుంచి మరునాడు సూర్యోదయం వరకు ఒక రోజులో ఏ సమయంలో ఏది తినాలో, ఎప్పుడు ఏ పనికి అనుకూలంగా ఉంటుందో ఋషులు పరిశోధించి ఆయుర్వేద గ్రంధాల్లో నిక్షిప్తం చేశారు. ఆ సమయపట్టీని పాటించడం వలన వ్యక్తి ఆరోగ్యవంతుడై సూర్యునితో దృఢమైన సంబంధం ఏర్పరుచుకుంటాడు. అతడు చేసే జపధ్యానాదులు కొన్ని వేల జన్మల పరిణామ దశలను దాటిస్తాయి. అటువంటి జీవితాన్ని గడపడం అశ్వమేధం.

To be continued ...........

Monday, 25 April 2016

హిందూ ధర్మం - 206 (అశ్వమేధయాగంలో అశ్వబలి లేదు - 2)

వక్రీకరణ - అశ్వమేధయాగంలో గుర్రాన్ని చంపి యజమాని (యాగం చేసేవారు) భార్య చచ్చిన గుర్రంతో ఒక రాత్రి నిద్రిస్తుంది. ఆ తర్వాత, ఆ మృత గుర్రం నుంచి తీసిన వప అనే ఒక ప్రత్యేక రసాయనాన్ని యజ్ఞంలో అర్పిస్తారు.
వాస్తవం - అశ్వమేధయాగంలో యజమాని భార్య జ్వలిస్తున్న అగ్ని వద్ద ఒక రాత్రి శయనిస్తుంది. మరునాడు ఆ అగ్నిలో ప్రత్యేక ఆయుర్వేద మూలికల నుంచి సేకరించిన ఔషధగుణములు కలిగి రసాన్ని (వప) యజ్ఞంలో అర్పిస్తారని స్వామి దయానంద సరస్వతీ సత్యార్ధ ప్రకాశంలో వివరించారు. అశ్వన్ని బలి ఇస్తారన్న వాదనను తీవ్రంగా ఖండించారు.


వివరణ - అశ్వమేధయాగ విషయంలో ఆంగ్లేయులు, కమ్యూనిష్టులు చేసిన వక్రీకరణ క్షమించదగ్గది ఎంతమాత్రము కాదు. శతపధ బ్రాహ్మణంలోనే దీనికి సమాధనం ఉంది.
అగ్నిర్వా అశ్వం అని శతపధబ్రాహ్మణం 13.16.3 స్పష్టం చేసింది. ప్రకాశవంతంగా వెలుగుతున్న అగ్నియే అశ్వం. యాగవివరణ మంత్రాల్లో అగ్ని, అశ్వం అనే రెండు అర్దాలు వచ్చే పదాన్ని ఉపయోగించారు. అయితే ధర్మద్వేషులు చేసిందేమిటంటే అగ్ని అనే అర్దానికి బదులు గుర్రం అనే అర్దాన్ని స్వీకరించారు. వైదిక శబ్దాలకు ఎప్పుడు ఏ అర్దం ఉపయోగించాలో నిర్ధారించేది నిరుక్తం. అలా అర్దాన్ని స్వీకరిస్తేనే అది సప్రమాణికం. అదీగాక ఇక్కడ శతపధబ్రాహ్మణమే చెప్తున్నది అక్కడ అగ్నియే అశ్వమని. కానీ వారు దీన్ని విస్మరించారు. ఈ విషయంలో సాయనాచార్యుడు, మహీధరుడు మొదలైన భారతీయ భాష్యకారులు కూడా పొరబడ్డారని దయానందులు అన్నారు.  అశ్వమేధం ముగిసే ముందు రాణి ఆ రాత్రంతా జ్వలిస్తున్న అగ్ని వద్ద ఏ భయం లేకుండా, తన భర్త తన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా నిద్రిస్తుందో, అంత ధైర్యంగా నిద్రిస్తుంది. ఆ అగ్ని చల్లారకుండా, ఆ రాత్రంత్రా ఋత్విక్కులు వేదమంత్రాలతో ఆ యజ్ఞాగ్నిలో ఆహుతులిస్తూ, అగ్ని ప్రజ్వరిల్లేలా చేస్తూనే ఉంటారు.

దేశం అశ్వం వంటిది అయినప్పుడు, ఆ చిన్న, చితకా రాజపరివారం, మంత్రులు, చిన్న చిన్న జంతువుల వంటి వారు. ఆ యాగానికి అనేక పెద్ద, చిన్న సామంత రాజులు, మంత్రులు హాజరవుతారు. రాజు నుంచి మంత్రులు, సామంతరాజులు మొదలైనవారికి ఆ సమయంలోనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, దేశభద్రత, సరిహద్దులు పటిష్టకు సంబంధించిన అంశాల పట్ల చర్చ జరుగుతుంది. యాగసమాప్తిలో ప్రత్యేక మూలికల నుంచి తీసిన పసరును యాగంలో సమర్పిస్తారు. అది అందరి దేహాలను శుద్ధి చేస్తుంది.

అయితే దీనికి నికృష్టులైన కమ్యూనిస్టులు, అంగ్లేయులు చేసిన అతి నీచమైన వక్రీకరణ చూసినవారు ఎవరైనా వారు కమ్యూనిష్టులు కారని, కమీనేలు, నికృష్టులని ఒప్పుకుని తీరుతారు. వారి మీద ఆవేశంతో రగిలిపోతారు. పైన చెప్పిన వక్రీకరణ కాక, వీరు దీనికి వీరుకున్న జాడ్యాలన్నీ అంటించి, వారి మనసులో అణుచుకున్న కోరికలను ఆ యాగంలో జరిగే ప్రక్రియలుగా వర్ణించారు. సాయనాచార్యుడు మొదలైన భాష్యకారులు చెప్పిందే చెప్తున్నామంటూ, మకు అర్దమైనట్లుగా సాయనుడికి వేదహృదయం అర్దం కాలేదు, అందుకని మేము చెప్పిందే స్వీకరించండి అని చెప్పేశారు. ఆ వక్రీకరణకారులు ఏమంటారంటే ఆ యగంలో చిన్న చిన్న పశువులను, పక్షులను బలి ఇస్తారు. అటు తర్వాత రాణి ఆ అశ్వానికి కత్తితో 3 గాట్లు పెడుతుంది. తర్వాత అశ్వాన్ని చంపుతారు. ఆ చచ్చిన అశ్వంతో యజమాని భార్య ఒక రాత్రి శయనిస్తుంది. తన భర్తతో శయనించిన విధంగా. ఆమె దానితో సంభోగిస్తుంది. దీనివలన ఆమెకు గర్భశుద్ధి అవుతుంది. ఇదంతా వేదపండితుల సమక్షంలోనే జరుగుతుంది. వారు అది చూస్తూ, దాన్ని ప్రోత్సహిస్తూ, చపట్లు కొడుతూ, ఆ రాత్రంతా అక్కడే ఉంటారు. మరునాడు ఉదయం ఆ అశ్వాన్ని చంపి, దాని శరీరభాగం నుంచి వపను తీసి, యజ్ఞంలో వేస్తారు. చూడండి,  విషయాన్ని ఎంత దారుణంగా పక్కదోవ పట్టించారో!.

ఇంతకంటే నికృష్టమైన, నీచాతినీచమైన వక్రీకరణ ఉంటుందా? దీన్ని మనం అంగీకరించాలా? కానీ విదేశీయుల కుట్ర ఎటువంటిదంటే ఇప్పుడు ఈ దేశంలో అనేకమంది పండితులు కూడా వక్రీకరించిన విషయమే కొన్ని సవరణలతో సత్యమని భావిస్తున్నారు. పాపం! వారికి కూడా నిజం తెలియదు. ఈ విషయంలో ఆర్యసమాజం వారు నిరుక్తం ఆధారంగా పరిశోధన చేసి, సనాతనధర్మానికి చేసిన సేవ మరువజాలనిది.

To be continued ....................

Sunday, 24 April 2016

హిందూ ధర్మం - 205 (అశ్వమేధయాగంలో అశ్వబలి లేదు - 1)

వక్రీకరణ - అశ్వమేధ యాగంలో అశ్వాన్ని బలి ఇస్తారు.

వాస్తవం -  అశ్వమేధయాగంలో గుఱ్ఱాన్ని ఉపయోగించే మాట నిజం కానీ బలి మాత్రం ఇవ్వరు. అసలు అశ్వమేధ యొక్క ఉద్దేశ్యం జంతుబలి కాదు, దేశ సంరక్షణ, సరిహద్దుల పటిష్టత అని ఆర్యసమాజ స్థాపకులు మహర్షి స్వామి దయానందులు వేదోక్తంగా నిరూపించారు.

రాష్ట్రంవా అశ్వమేధః (దేశమే అశ్వమేధం. (దేశసంరక్షణ కొరకు చేసేది)) అని శతపధ బ్రాహ్మణం 13.16.3 చెప్తున్నది.
ఇప్పుడు మనం అనుకుంటున్న సమాఖ్య వ్యవస్థ (Federalism) వేదంలో ఉంది. భారతదేశం ఒక దేశంగా ఏర్పడింది 1947 తర్వాత 1950లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ద్వారా కాదు. ఈ దేశానికి ఎన్నో యుగాలు చరిత్ర ఉంది. అనేక మన్వతరాల నుంచి, కల్పాల నుంచి భారతదేశం ఏకఖడంగా ఉంది. ఎందరో రాజులు ఈ దేశాన్ని పరిపాలించారు. అనేకులు చక్రవర్తులై, సామ్రాట్టులై ప్రపంచాన్ని భారతదేశం పాదల చెంతకు తీసుకువచ్చారు. ఇప్పుడున్న వ్యవస్థలో దేశానికి ఒక ప్రధాని, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నట్టుగానే పూర్వం కూడా అఖండ భారతానికి ఒక చక్రవర్తి, ఆయన క్రింద అనేక సామంత రాజులు చిన్న చిన్న రాజ్యాలను పాలిస్తూ ఉండేవారు. ఇప్పటిలాగే అప్పుడు కూడా రాజ్యంగం ఉన్నది. అప్పట్లో అది ధర్మంగా ఆధారంగా, శృతిని, స్మృతులను అనుసరించి ఉండేది. నిజానికి ధర్మమే దైవం ఏర్పరిచిన రాజ్యాంగం. అప్పుడు దాన్నే అనుసరించేవారు. దానికి ఎవరూ అతీతులు కారు, మార్పు చేసే అవకాశం(యుగధర్మం తప్పించి తరచు మార్పు చేసే అవకాశం) కూడా ఉండేది కాదు. ఎప్పుడైనా సామంత రాజులు గర్విష్టులై, చక్రవర్తికి కప్పం కట్టకుండా, తన రాజ్యాన్ని ఈ దేశం నుంచి వేరు చేయాలనే చర్యలకు పాల్పడినప్పుడు చక్రవర్తి అశ్వమేధ యాగం చేసేవారు. అందులో యాగ అశ్వానికి ఇది అశ్వమేధ యాగ పశువు అని కనిపించే విధంగా ఒక పతాకం (జెండా) కట్టి, దాని వెనుక సైన్యాన్ని కాపలాగా పంపించేవారు. ఆ గుర్రం దేశం మొత్తం సంచారం చేస్తుంది, దాన్ని ఎవరు అడ్డుకోరు. అడ్డుకుని, బంధించినవారు ప్రభువుతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. దాన్ని అడ్డుకోవడమంటే దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను ప్రశ్నించడమే. ఓడితే కప్పంతో బాటూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలా ఆ గుర్రం దేశం మొత్తం సంచారం చేసి, తిరిగి యాగస్థలికి రావడంతో యాగం ముగుస్తుంది. అందులో అశ్వాన్ని బలి ఇవ్వడమేమీ ఉండదు. ఇందులో అశ్వమే ప్రధానం కానుక, ఆ గుర్రాన్ని యాగపశువు అన్నారు కానీ, దాన్ని బలి ఇస్తారని కాదు. కొన్ని యగాల్లో యజమానే యాగపశువు అని శాస్త్రం చెప్తోంది. అంటే యజమానిని బలి ఇస్తున్నారా? లేదు కదా. దేశంలో ఏర్పడ్డ చీలికను తొలగించి, సామంత రాజులందరూ ధర్మం ఆధారంగా ఏర్పడిన విశాల రాజ్యానికి కట్టుబడి ఉంటామని చెప్పడమే అశ్వమేధం యొక్క ప్రధాన ప్రయోజనం. ఇది దేశంలో అసంతృప్తులను నశింపజేసి, సరిహద్దులను పటిష్టం చేస్తుంది. అంతర్గత ఐక్యతను కాపాడుతుంది.

ఈ అశ్వమేధ యాగం ఈ అఖండభారతంలో ఎన్నో సార్లు జరిగింది. ద్వాపరయుగంలో ధర్మరాజు ప్రభువుగా కృష్ణుని సంకల్పంతో అఖండభారతం 18 రాష్ట్రాలతో, ఒకే రాజ్యాంగంతో, సమాఖ్య వ్యవస్థగా అవతరించింది. అప్పటి నుంచి అధర్మాన్ని అనుసరించారని ఈ పవిత్ర భూమి నుంచి వెలివేయబడ్డవారు తిరిగి ఈ దేశం మీద దండెత్తినప్పుడు, తమ మతాన్ని ఈ భూమిలో వ్యాపింపజేసి, అంతర్గతంగా విబేధాలను సృష్టించి, దేశాన్ని బలహీనం చేయాలని చూసిన ప్రతిసారి ఈ దేశపు రాజులు అశ్వమేధం నిర్వహించారు. కలియుగంలో కూడా క్రీ.శ. 7 వ శతాబ్దం వరకు, భారతదేశం కేంద్రీకృతవ్యవస్థ పతనమయ్యేవరకు ఈ దేశంలో అశ్వమేధాలు నిర్వహించారట. భౌద్ధం ప్రబలి, కొన్ని రాజ్యాలను అఖండభారతవని నుంచి వేరు చేయాలనుకున్నప్పుడు, హిందూ ప్రభువులు, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీన్ని నిర్వహించి, దేశ సరిహద్దులను పటిష్టం చేశారు.

ఒకనాడు ఇప్పటి పర్షియా, ఇరాన్, మెసపుటామియా, ఇరాఖ్ వరకు భరతవర్షం భారతదేశపు రాజుల ఆధీనంలో, ఈ భారతభూమిలో భాగంగా ఉండేది. అటుపక్క మధ్య ఆసియా లోని కశ్యప సముద్రం (కాస్పియన్ సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఒకప్పుడు హిందువులైన పారశీకులు అధర్మాన్ని పాటించడం వలన దేశ బహిష్కారానికి లోనుకాగా, సరిహద్దుల్లో తిష్టవేసి, ఈ సంస్కృతి మీద ద్వేషంతో మన దేశంలో తమ మతాన్ని ప్రచారం చేసి, కొన్ని ప్రాంతాలను దేశం నుంచి వేరు చేశారు. అటు తర్వాత బౌద్ధులు. అంతర్గతంగా, ఈ దేశంలో ఉంటూనే, ఈ ధర్మం మీద ద్వేష భావనతో, కొన్ని రాజ్యాలను అఖండభారతం నుంచి వేరు చేశారు. (ఆ కారణంగానే అఖండభారతం అనేక ముక్కలైంది. అటు తర్వాతా ఆయా ప్రాంతాల మీద ఇతర మతాలు దండెత్తడం వలన, బౌద్ధం లాంటివి కూడా అక్కడ నశించాయి.) వీరు ధర్మానికి వ్యతిరేకులు కనుక, అశ్వమేధం లాంటి యాగాలు చేస్తే, తమకు రాజకీయ ప్రాభవం దక్కదని, యజ్ఞయాగాది క్రతువులను నిరసించారు. ఆ ప్రభావంతో ఈ దేశంలో అనేక రాజులు సరిహద్దులను పటిష్టం చేసే ఇటువంటి యాగాలను విస్మరించి, అహింస పేరుతో మౌనం వహించి, అఖండభారత విచ్ఛిన్నానికి కారుకులయ్యారు. అయినప్పటికి ధర్మజ్వాల నశించలేదు. క్రీ.పూ. 7 వ శతాబ్దంలో వచ్చిన ఆదిశంకరుల ప్రభావం ఈ దేశంపై 1500 సంవత్సరాలు ఉన్నది. ఆయన ధర్మానికి కొత్త ఊపిరిలూదారు. అందుచేత విక్రమాదిత్యుడు, శాలివాహానుడు మొదలైన రాజులు భరతవర్షం కోల్పోయిన భాగాలను తిరిగి ఈ దేశంలో విలీనం చేశారు.

To be continued ............