Showing posts with label చంధస్సు. Show all posts
Showing posts with label చంధస్సు. Show all posts

Monday, 21 September 2015

హిందూ ధర్మం - 176 (ఛంధస్సు - 4)

వైదిక విజ్ఞానాన్ని రక్షిచడంలో ఛంధస్సు ఎంతో ఉపయోగపడుతుంది. యజ్ఞాల్లోనే కాక వైదిక గ్రంధాల యందు ఎటువంటి మార్పులు, చేర్పులు జరగకుండా చూడటం, జరిగినవాటిని పసిగట్టడం, దోషాలను దిద్దడానికి ఇది సహాయపడుతుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ. భారతదేశాన్ని అక్రమంగా తమ గుప్పిటలోనికి తీసుకున్న ఆంగ్లేయులు, తమ మత ప్రచారం కోసం ఈ దేశపు సంస్కృతిని, చరిత్రను నాశనం చేయడానికి ఎంతో ప్రయత్నించారు. అందులో భాగంగా చరిత్రను వక్రీకరించారు. సుమారు 3000 సంవత్సరాల చరిత్రను తొక్కేశారు. ఎందరో రాజులు, కవులు, శాస్త్రజ్ఞుల కాలాన్ని తగ్గించి వేశారు. అలాంటిదే ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రజ్ఞుడైన ఆర్యభట్టు విషయంలో జరిగింది. ఆర్యభట్టు కలియుగం 360 (క్రీ.పూ.2742)వ సంవత్సరంలో జన్మించనట్టుగా పురాణాలు నిర్ధారించాయి. ఆర్యభట్టు కూడా ఈ విషయాన్ని ఆర్యభట్టియం అనే గ్రంధంలో స్వయంగా తానే చెప్పుకున్నాడు. ఆర్యభట్టీయం కాలక్రమపాదంలోని ఈ శ్లోకాన్ని కోట వేంకటాచలం తమ 'భారతీయ శకములు' అనే గ్రంధంలో ఉటంకించారు.

షష్ట్యబ్దానాం షడ్భిః యదావ్యతీతాఃత్రయశ్చ యుగపాదాః
త్ర్యధికావింశతిరబ్దాస్తదేవ మమజన్మనః అతీతాః

కలియుగమునందు 6 సార్లు 60 ఏళ్ళు గడిచినప్పటికి నాకు 20 ఏళ్ళు .......... అని ఆర్యభట్టు చెప్పుకున్నాడు. అంటే ఆర్యభట్టు కలియుగం 337 లో జన్మించారు. కానీ ఈ విషయం బ్రిటీష్ వారికి మింగుడుపడలేదు. ఆ సమయానికి భారతదేశంలో ఖగోళశాస్త్రం అభివృద్ధి చెందిందని చెప్పడం వారికి నచ్చలేదు. వారు భారతీయుల కోసం రాసిన బానిస చరిత్రలో క్రీ.పూ. నాటికి ఇంకా వేదాల రచనే పూర్తి కాలేదు. అలాంటిది అప్పటికి ఖగోళ శాస్త్రవేత్త భారత్‌లో జన్మించాడని చెప్తే, వారి చరిత్ర తప్పని తేలుతుంది. కలియుగ ప్రారంభ కాలాన్ని క్రీ.పూ.1900 కు కుదించాలని అనుకున్న విలియం జోన్స్ వంటివారికి, ఋగ్వేదాన్ని క్రీ.పూ. 1200 వ ఏట రాసి ఉంటారని భావించిన మాక్స్ ముల్లరి కి, ఆర్య్భట్టు క్రీ.పూ.2742 లో జీవించారని చెప్పడం కొరకరాని కొయ్యగా, అంగీకరించకూడిన సత్యంగా కనిపించింది. అందువల్ల వారు కలియుగం క్రీ.పూ.3102 లో ప్రారంభం కావడం, ఆర్యభట్టు కలియుగం 337 లో జన్మించడం అసత్యమని ప్రచారం చేశారు. ఎందుకంటే పాశ్చాత్య మత విశ్వాసాల ప్రకారం ఈ ప్రపంచం యొక్క సృష్టి క్రీ.పూ.4004 సంవత్సరంలో మాత్రమే జరిగింది. అంతకముందు ఏమీ లేదన్నది వారి మతగ్రంధాల సారం. అందువల్ల 18 వ శత్బాదపు పాశ్చాత్య చరిత్రకారులు ఈ సృష్టి వయసు కొన్ని కోట్ల సంవత్సరాలని అంగీకరించలేకపోయారు. అందుకే లక్షలు, కోట్ల సంవత్సరాల క్రితం చారిత్రఘటనలను (పురాణాలను) కల్పితాలని ప్రచారం చేశారు. మనవారి మాటల కంటే ఆ తెల్లవారి మాటల మీదే అధికనమ్మకమున్న మనవారు కొందరు ఇంకో అడుగు ముందుకేసి, ఏకంగా ఆర్యభట్టీయంలోనే మార్పులు చేశారు. సుధాకరద్వివేది అనే వక్రీకరణకారుడు ఆర్యభట్టియంలోని శ్లోకాన్ని మార్చివేసి, ఆర్యభట్టును కలియుగం 3600 వ సంవత్సరానికి లాక్కొని వచ్చారు. పై శ్లోకంలో షడ్భిః - ఆరు చేత అనే పదాన్ని షష్టిః - అరవై అని మార్చేశాడు. క్రీ.శ.18 వ శతాబ్దంలో వ్రాతప్రతులను అచ్చువేయించి ఆయన చేసిన వక్రీకరణ, ఘోరమైన తప్పకు కారణమైంది. క్రీ.పూ.28 వ శతాబ్దికి చెందినవాడైన ఆర్యభట్టు క్రీ.శ.6 వ శత్బాది వాడనే భ్రమ వ్యాపించింది.

ఆర్యభట్టు రాసిన శ్లోకం ఛంధోబద్ధం. అందువల్ల అందులో మార్పులు చేయడం అసాధ్యం. షడ్భిః అన్న పదానికి 6 చేత గుణించడం అనే అర్దముంటే, షష్టిః అనే పదానికి 60 అనే మాత్రమే అర్దం వస్తుంది. కానీ 60 చేత గుణించడమని మాత్రం రాదు. 60 చేత అని చెప్పడానికి షష్టిభిః అని ఉండాలి. కానీ అలా అని షడ్భిః బదులు షష్టిభిః అని మారిస్తే, పద్యంలో ఒక అక్షరం ఎక్కువైపోతుంది, అప్పుడు ఛంధస్సు దెబ్బతింటుంది. అందుకోసమే షష్టిః గా మార్చాడు ద్వివేది. కానీ టియస్ నారాయణ శాస్త్రి అనే జాతీయచరిత్రకారుడు దొంగను పట్టుకున్నారు. ఏజ్-ఆఫ్-ఆదిశంకర అనే తన గ్రంధంలో ద్వివేదిని కడిగేశారు శాస్త్రిగారు. దక్షిణభారతదేశంలోని వ్రాతప్రతులన్నింటిలో షడ్భిః అనే ఉంది కానీ, ఎక్కడా షష్టిః అనే లేదని నిరూపించి నిలదీశారు. ఇప్పటికి వందేళ్ళు గడించినా, ద్వివేది నుంచి కానీ, ఆయన మిత్రులు, అనునూయుల నుంచి కానీ సమాధానం రాలేదు. ఇలా ఒక్క అక్షరం కూడా మార్చడానికి లేకుండా, కొత్త అక్షరం చేరిస్తే పట్టుకునే విధంగా, ప్రతుల్లో మార్పులు చేస్తే, అర్ధరహితం అయ్యేవిధంగా ఉంటాయి ఛంధోబద్ధమైన రచనలు. ఈ విధంగా ఛంధస్సు వైదిక గ్రంధాలను కాపాడుతోంది.

ఈ మధ్య క్రైస్త్వ మిషనరీలు, ఇస్లాం మతమార్పిడి కారులు కూడా వైదిక రచనల్లో కొత్త శ్లోకాలను చొప్పించి, సనాతనగ్రంధాల్లో ఏసు, మహమ్మద్ ఉన్నారని మభ్యపెట్టి మతమార్పిడి చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. హిందువులందరి దగ్గర వేదాలు ఉండవు కనుక, వేదంలో ఫలాన చోట ఇలా ఉంది, ఫలాన చోట మా ప్రవక్త గురించి అలా ఉందని మాయమాటలు చెప్తున్నారు. కానీ వారు చూపిన శ్లోకాలను వైదిక ఛంధస్సు తెలిసిన పండితుని వద్ద చూపిస్తే, అసలు గుట్టు బయటపడుతుంది. వేదం మొత్తం ఛంధోబద్ధంగా ఉంటుంది. కానీ వీరు కల్పించిన శ్లోకాలకు ఛంధస్సు ఉండనే ఉండదు. ఆ శ్లోకాలు చదివిన పండుతులకు ఎక్కడ లేని నవ్వోస్తుంది. వైదిక ఛంధస్సు నేర్చుకోవడం చాలా కష్టం. కానీ మతమార్పిడి కోసం రక్తబలి, రక్తతర్పణం అంటూ కొన్ని శ్లోకాలని తయారుచేసి, వాటిని ఆ వేదంలో అక్కడ ఉంది, ఈ వేదంలో ఇక్కడ ఉందంటూ చెప్పి వేదాల్లో ఏసును చూపే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా బూటకం. వేదాల్లో ఏసు లేడు, మహమ్మద్ లేడు. ఇటువంటి అనేక విషయాల్లో తప్పులను పట్టుకోవడానికి, నిజానిజాలను తెలుసుకోవటానికి ఛంధస్సు ఇప్పటికీ ఉపయోగపడుతోంది.

To be continued ...........

ఈ రచనకు సహాయపడిన గ్రంధం - తంగేడుకుంట హెబ్బార్ నాగేశ్వరరావు గారి 'తరతరాల భరతజాతి. చరిత్రలొ వక్రీకరణలు... వాస్తవాలు'  

Sunday, 13 September 2015

హిందూ ధర్మం - 175 (ఛంధస్సు - 3)

భూమ్యాకర్షణ పరిధిలోగానీ, అంతరిక్షంలో కానీ నీరు లేదనుకుందాం. ఇక మిగిలింది సూర్యమండంలం, నక్షత్ర మండలం. సూర్యునిలో మనకు అప్పుడప్పుడు కొన్ని మచ్చలు కనపడుతుంటాయి. సూర్యగోళంలో హైడ్రోజన్, హీలియం వాయువుల ఘర్షణల వల్ల, హీలియం హైడ్రోజన్ గా మారే క్రమంలో వెలువడే రేడియోధార్మిక శక్తి వల్ల ఎగిసిపడే పెద్ద పెద్ద మంటలవి. ఈ మంటలే మనకు మచ్చలుగా కనిపిస్తుంటాయి. గ్రహణం సమయంలో వీటిని గమనిస్తారు. ఇవి కూడా ఎల్ల కాలం ఉండవు. కొంతకాలం ఉండి మాయమవుతుంటాయి. వీటిని సన్‌స్పాట్స్ అంటున్నారు. ఈ సన్‌స్పాట్స్‌లో జరిగే మార్పులు భూవాతావరణంపై ప్రభావాన్ని చూపిస్తాయి. వీటి కారణంగా కూడా తుఫానులు, అతివృష్టి, అనావృష్టి సంభవిస్తాయి. అనగా సూర్యునిలో జరిగే మార్పులకు, భూమికి సంబంధం ఉన్నదని స్పష్టమవుతోంది. వీటిని సరి చేయడం ద్వారా ప్రాకృతిక ఉపద్రవాల నుంచి భూమిని, భూవాతావరణాన్ని రక్షించడం కోసం ఋషులు మనకు కొన్ని రకాల యజ్ఞప్రక్రియలను అందించారు. వాటిలో సప్తఛంధస్సులలో చివరిదైన జగతీ ఛంధస్సు కలిగిన మంత్రాలను పఠిస్తారు. ఇవి పఠించడానికి పట్టే సమయం చాలా ఎక్కువ. హోమగుండం కూడా భారీగా ఉంటుంది. అందువల్ల అందులో నుంచి యజ్ఞాగ్ని కూడా ఉధృతంగా ప్రజ్వరిల్లుతుంది. అటువంటి అగ్నిలో వేయబడిన హవనసామగ్రిలోని మూలికలు, ఇతర ద్రవ్యాలు అతి సూక్ష్మాణువులుగా విడిపోయి, తేలికపడి సూర్యమండలాన్ని కూడా చేరుతాయి. దాంతో అక్కడ ఏర్పడిన మచ్చల వల్ల సంభవించే విపత్తులను నివారించవచ్చు. అందుకే యజుర్వేదం జగతీఛంధస్సు, సూర్యుడిని, నక్షత్రలోకాలను వశపరుచుకుంటుందని చెప్తోంది.

సాధారణ యజ్ఞంలో వేయబడిన ఆవునెయ్యి, ఇతర సామగ్రి, సూక్ష్మీకరించబడి భూఉపరితలం నుంచి 8 కిలోమీటర్ల పై వరకు వెళుతుంది. అక్కడకు చేరు 10 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి, ప్రభావాన్ని చూపిస్తుంది. ఇందులో మంత్రం కీలకపాత్ర పోషిస్తుంది. రాకెట్‌ను అంతరిక్షంలో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టాడానికి, దాన్ని కేవలం ప్రయోగించి ఊరుకోరు. రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ, కంప్యూటర్ల ద్వారా దానికి ఆదేశాలు పంపిస్తుంటారు. అట్లాగే యజ్ఞంలో కూడా. యజ్ఞంలో ఆహుతివ్వబడినవి అణువులుగా మారి, అంతరిక్షాన్ని చేరి, నిర్దేశిత ప్రయోజనాన్ని కలిగంచేందుకు వీలుగా, వాటి గతిని నిర్దేశిస్తుంది మంత్రం. మంత్రం యొక్క తరంగాలకు అంత శక్తి ఉంది. అవి కేవలం మర్త్యలోకన్నే కాదు, అనేకానేక ఇతర లోకాలను సైతం ప్రభావితం చేస్తాయి. ఇందులో ఛంధస్సు ప్రధానం. ఏదో మామూలుగా మంత్రం పఠిస్తే సరిపోదు. మంత్రాన్ని ఛంధోబద్ధంగా చదవాలి. అప్పుడే ఆశించిన ప్రయోజనం చేకూరుతుంది. ప్రయోగశాలలో ఒక వాయువును ఉత్పత్తి చేయటానికి కొన్ని నిర్దేశిత పద్ధతులను పాఠిస్తారు రసాయనశాస్త్ర విద్యార్ధులు. ఎలా పడితే అలా, ఎప్పుడంటే అప్పుడు రసాయనాల కలపరు. దానికి నిర్దేశిత పరిణామం ఉంటుంది. రసాయనచర్య జరగడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకు వేచి ఉండాలి. అప్పుడే ఆశించిన ఫలం కనపడుతుంది. యజ్ఞంలో కూడా అంతే. దానికి ఛంధస్సు ఉపయోగపడుతుంది.


To be continued ......................

ఈ రచనకు సహాయపడిన గ్రంధం: శ్యాం ప్రసాద్ గారు రాసిన 'రండి,మన భూగోళాన్ని కాపాడుకుందాం, యజ్ఞం ద్వారా.' 

Monday, 7 September 2015

హిందూ ధర్మం - 174 (ఛంధస్సు - 2)

యజ్ఞాల్లో ఛంధస్సు ప్రాముఖ్యత - యజ్ఞం అనేది ఏదో మాములు క్రతువు కాదు. దానికి ఒక ఉద్ద్యేశం ఉంది, విధానం ఉంది, ప్రయోజనముంది. ఏ ఫలితాన్ని ఆశించి యజ్ఞం చేస్తున్నామనే దాన్ని అనుసరించి ఛంధస్సును నిర్ణయిస్తారు. భూ ఉపరితలం నుంచి కొంత ఎత్తువరకు గాయత్రి ఛంధస్సు పరిధి, ఆ పొరలో షడ్జః స్వర ప్రభావం, దానిపైన ఉష్ఠిక్ ఛంధస్సు, అందులో రిషభ స్వర ప్రభావం, దానిపైన గాంధార, అలా చివరి పరిధిగా జగతి చంధస్సు, దాని స్వర ప్రభావం ఉంటాయి. వేదపండితుడికి కేవలం యజ్ఞం ఎలా చేయాలనే అవగాహనయే కాక, మేఘమండలం యొక్క పరిస్థితి, యజ్ఞం చేయబడే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితి, పర్యావరణం మొదలైన అనేక విషయాల గురించి అవగాహన ఉంటుంది. ఒకవేళ వర్షం కోసమై యజ్ఞం నిర్వహిస్తుంటే, అక్కడున్న మేఘమండలాన్ని అనుసరించి ఏ ఛంధస్సుతో కూడిన వేదమంత్రాలతో ఆహుతులిస్తూ యజ్ఞం చేస్తే, ఆ ఆహుతి ప్రభావం వల్ల వర్షం కురుస్తుందో పరిశీలించి, ఆ ఛంధస్సునే వాడతారు. అప్పుడు తప్పక వర్షం కురుస్తుంది.


అది ఎలాగంటే ఛంధస్సులో మొదటిదైన గాయత్రి ఛంధస్సులో 24 అక్షరాలుంటాయి. ఇది తక్కువ అక్షరాలు గల మంత్రం. దీన్ని చదవడానికి ఒక క్రమపద్ధతి ఉంది. ఆ పద్ధతిలో చదువుతూ, మంత్రం పూర్తయ్యాక స్వాహా అంటూ ఆహుతులిస్తారు. ప్రతి ఆహుతికి, ఆహుతికి మధ్య మంత్రం చదవటంలో కొంత సమయం పడుతుంది. యజ్ఞం అనేది సామాన్యమైన ప్రక్రియ కాదు. సైన్సు పరిభాషలో చెప్పాలంటే అందులో అనేక రసాయనిక పరిచర్యలు (కెమికల్ రియాక్షన్లు) చోటు చేసుకుంటాయి. అగ్నిలో ఏది పడితే అది ఆహుతి ఇవ్వరు. దానికి శాస్త్రప్రమాణం ఉంది. ఏ ప్రయోజనాన్ని ఆశించి యజ్ఞం చేస్తున్నామనే దాన్ని అనుసరించి ఏమి ఆహుతు ఇవ్వాలనేది ఉంటుంది. విషయంలోకి వస్తే, ఆహుతులిచ్చిన తర్వాత, ఆ కొద్ది సమయంలో, ఇవ్వబడిన ఆహుతి కొంతవరకు సూక్ష్మీకరింపబడి గాలిలో కలుస్తుంది. పూర్తిగా సూక్ష్మికరించబడి ఉండదు కనుక భూమ్యాకర్షణ శక్తిని మించి పైకి పోలేదు.  ఆకాశంలో ఒక పరిధివరకు మాత్రమే ఈ అణువులు వెళతాయి. ఆ సమయంలో ఆకాశంలో మేఘాలుండి వాతావరణం తేమగా ఉంటే, గాయత్రి ఛంధస్సుతో కూడిన మంత్రాలతో ఆహుతులివ్వడం చేత వర్షం కురుస్తుంది. (ఎలా జరుగుతుందన్నది కూడా సశాస్త్రీయంగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు విషయం అది కాదు.) ఈ విషయాన్నే యజుర్వేదం 'పృధివ్యాం విష్ణుర్వ్యక్రసంగ్ గాయత్రేణ ఛంగసా్' - యజుర్వేదం 2-25 అంటున్నది. అయితే ఈ విధంగా నీటి అణువులు భూమ్యాకర్షణ పరిధిలో లేనప్పుడు అంతరిక్ష, ద్యులోకముల నుంచి వర్షం కురిపించే ప్రయత్నం చేయాలి.

ఇందుకోసం వేదపండితుడు త్రిష్టుప్ ఛంధస్సుతో కూడిన మంత్రాలతో ఆహుతులివ్వాలి. ఈ మంత్రాలు 44 అక్షరాలు కలిగి ఉంటాయి. ఆకాశంలో మేఘాలుండవు. మేఘాలు నిర్మించి, అంతరిక్షంలో నుండి (ఇక్కడ అంతరిక్షం అంటే భూమి మొదలు గ్రహాలు మొదలైనవి ఉన్న శూన్య ప్రదేశం కాదు) నీటిని ఆకర్షించి, వర్షం కురిపిస్తారు. దీని కోసం పెద్ద హోమగుండాన్ని నిర్మిస్తారు. దానికి నిర్దేశిత ప్రమాణాలున్నాయి. వాటి గురించి వేదంగామైన కల్పం వివరిస్తుంది. త్రిష్టుప్ ఛంధస్సులో 44 అక్షరాలు ఉన్నందున, ఈ ఛంధస్సు కలిగిన మంత్రాల ఉఛ్చారణకు గాయత్రి ఛంధస్సు మంత్రానికి పట్టిన సమయానికి రెట్టింపు సమయం పడుతుంది. అందుచేత యజ్ఞాగ్ని కూడా రెట్టింపుగా ప్రజ్వరిల్లుతుంది. ఇందులో వేయబడిన ద్రవ్యం అధికసమయం ఖాళీ సమయం దొరకడం వలన, మరింత సూక్ష్మీకరించబడి, సూక్షమైన అణువులుగా విడిపోయి, మరింత తేలికగా మారి, భూమ్యాకర్షణ పరిధిని అంతరిక్షాన్ని చేరుకుంటుంది. దీన్నే యజుర్వేదంలో త్రిష్టుప్ ఛంధస్సు అంతరిక్షాన్ని వశపరుచుకోవటం అన్నారు. అలా అక్కడకు చేరి, నీటి అణువులను ఆకర్షించి మేఘనిర్మాణం చేసి, వర్షం కురిపిస్తుంది.      

To be continued ...........................

సేకరణ: శ్యాం ప్రసాద్ గారు రాసిన 'రండి,మన భూగోళాన్ని కాపాడుకుందాం, యజ్ఞం ద్వార.' పుస్తకం నుంచి 

Sunday, 30 August 2015

హిందూ ధర్మం - 173 (చంధస్సు)

చంధస్సు శాస్త్రం - ఇది వేదానికి కాళ్ళు వంటిది. వేదం చంధస్సు ద్వారానే నడుస్తుంది. వేదమంత్రాలను రక్షించడానికి, వాటిలో కొత్త పదాలను, అక్షరాలను చేర్చకుండా ఉండాటానికి, వేదం యొక్క యదార్ధస్వరూపాన్ని కాపాడటానికి, స్వరబద్ధంగా వేదాన్ని చదవటంలో దోషాలు దొర్లకుండా ఉండటానికి ఈ శాస్త్రం వచ్చింది. వేదమంత్రాల గతి తప్పకుండా ఉండటానికి, వాటిని సులువుగా జ్ఞాపకం ఉంచుకునేందుకు ఛంధస్సు ఉపయోగపడుతుంది. చంధస్సు అన్నప్పుడు ఇది వేదమంత్రాలను చదివే పద్ధతిని తెలిపేదిగా అర్దం చేసుకోవాలి. ఈ శాస్త్రం చాలా పెద్దది, సముద్రమంత విశాలమైనది. ఇందులోకి దిగడమే తప్ప, తేలడం ఎప్పటికో జరుగుతుంది, అది కూడ అతికొద్దిమంది పండితులకు మాత్రమే.

ఒక మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో, ఆ మంత్రాన్ని ఎంత సమయం చదవాలో, దానికున్న నియమాలేమిటో ఇది వివరిస్తుంది. వేదం మొత్తం చంధోబద్దంగానే ఉంటుంది. అందుకే అసలు వేదానికే చందస్సు అనే పేరు కూడా ఉంది. వైదికమైన ఛంధస్సుల గురించి వివరణ మొట్టమొదటగా సాంఖ్యాయన శ్రౌత సూత్రాల్లో కనిపిస్తుంది. కానీ దీనిమీద పూర్తి వివరణ ఇచ్చింది మాత్రం పింగళ మహర్షి. ఛంధః సూత్ర అనే తన గ్రంధం 8 వ అధ్యాయంలో మహర్షి పింగళుడు వీటిని ప్రస్తావించారు.

వేదపారాయణం వినడం వలన ప్రశాంతత లభించడం, దివ్యానుభూతులు కలగడం సంగీతం రోగాలను నయం చేయడం మొదలైన అనేక విషయాలను ప్రస్తావించినప్పుడు, ఛంధస్సు గురించి చెప్తారు. మొత్తం 7 రకాల ఛంధస్సులు వేదంలో ఉన్నాయి. అవి గాయత్రి, ఉష్ఠిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి ఛంధస్సులు. వాటికి వరుసగా షడ్జ, వృషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాద అనే స్వరాలున్నాయి. వీటి నుంచే స, రి, గ, మ, ప, ద, ని అనే సప్తస్వర సంగీతం ఊపిరి పోసుకుంది.

వేదం అనగానే గుర్తుకు వచ్చేది యజ్ఞం. యజ్ఞంలో ఛంధస్సుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వేదమంత్రాలన్నీ ఛందోబద్ధాలు. ఏ ఫలితాన్ని ఉద్ద్యేశించి యజ్ఞం చేస్తున్నారు, ఏ కాలంలో, వాతవరణ పరిస్థితుల్లో చేస్తున్నరనే విషయాన్ని అనూరించి ఛంధస్సులను వాడతారు. ఛంధస్సు, వేదసంగీత ధ్వని స్వరాలకుండే ప్రభావశక్తిని ఋషులు పరిశీలించి అనేక పరిధులుగా విభజించారు. ఒక్కో పరిధిలో ఒక్కో ఛంధస్సు పని చేస్తుంది.  

To be continued ................