Monday, 7 September 2015

హిందూ ధర్మం - 174 (ఛంధస్సు - 2)

యజ్ఞాల్లో ఛంధస్సు ప్రాముఖ్యత - యజ్ఞం అనేది ఏదో మాములు క్రతువు కాదు. దానికి ఒక ఉద్ద్యేశం ఉంది, విధానం ఉంది, ప్రయోజనముంది. ఏ ఫలితాన్ని ఆశించి యజ్ఞం చేస్తున్నామనే దాన్ని అనుసరించి ఛంధస్సును నిర్ణయిస్తారు. భూ ఉపరితలం నుంచి కొంత ఎత్తువరకు గాయత్రి ఛంధస్సు పరిధి, ఆ పొరలో షడ్జః స్వర ప్రభావం, దానిపైన ఉష్ఠిక్ ఛంధస్సు, అందులో రిషభ స్వర ప్రభావం, దానిపైన గాంధార, అలా చివరి పరిధిగా జగతి చంధస్సు, దాని స్వర ప్రభావం ఉంటాయి. వేదపండితుడికి కేవలం యజ్ఞం ఎలా చేయాలనే అవగాహనయే కాక, మేఘమండలం యొక్క పరిస్థితి, యజ్ఞం చేయబడే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితి, పర్యావరణం మొదలైన అనేక విషయాల గురించి అవగాహన ఉంటుంది. ఒకవేళ వర్షం కోసమై యజ్ఞం నిర్వహిస్తుంటే, అక్కడున్న మేఘమండలాన్ని అనుసరించి ఏ ఛంధస్సుతో కూడిన వేదమంత్రాలతో ఆహుతులిస్తూ యజ్ఞం చేస్తే, ఆ ఆహుతి ప్రభావం వల్ల వర్షం కురుస్తుందో పరిశీలించి, ఆ ఛంధస్సునే వాడతారు. అప్పుడు తప్పక వర్షం కురుస్తుంది.


అది ఎలాగంటే ఛంధస్సులో మొదటిదైన గాయత్రి ఛంధస్సులో 24 అక్షరాలుంటాయి. ఇది తక్కువ అక్షరాలు గల మంత్రం. దీన్ని చదవడానికి ఒక క్రమపద్ధతి ఉంది. ఆ పద్ధతిలో చదువుతూ, మంత్రం పూర్తయ్యాక స్వాహా అంటూ ఆహుతులిస్తారు. ప్రతి ఆహుతికి, ఆహుతికి మధ్య మంత్రం చదవటంలో కొంత సమయం పడుతుంది. యజ్ఞం అనేది సామాన్యమైన ప్రక్రియ కాదు. సైన్సు పరిభాషలో చెప్పాలంటే అందులో అనేక రసాయనిక పరిచర్యలు (కెమికల్ రియాక్షన్లు) చోటు చేసుకుంటాయి. అగ్నిలో ఏది పడితే అది ఆహుతి ఇవ్వరు. దానికి శాస్త్రప్రమాణం ఉంది. ఏ ప్రయోజనాన్ని ఆశించి యజ్ఞం చేస్తున్నామనే దాన్ని అనుసరించి ఏమి ఆహుతు ఇవ్వాలనేది ఉంటుంది. విషయంలోకి వస్తే, ఆహుతులిచ్చిన తర్వాత, ఆ కొద్ది సమయంలో, ఇవ్వబడిన ఆహుతి కొంతవరకు సూక్ష్మీకరింపబడి గాలిలో కలుస్తుంది. పూర్తిగా సూక్ష్మికరించబడి ఉండదు కనుక భూమ్యాకర్షణ శక్తిని మించి పైకి పోలేదు.  ఆకాశంలో ఒక పరిధివరకు మాత్రమే ఈ అణువులు వెళతాయి. ఆ సమయంలో ఆకాశంలో మేఘాలుండి వాతావరణం తేమగా ఉంటే, గాయత్రి ఛంధస్సుతో కూడిన మంత్రాలతో ఆహుతులివ్వడం చేత వర్షం కురుస్తుంది. (ఎలా జరుగుతుందన్నది కూడా సశాస్త్రీయంగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు విషయం అది కాదు.) ఈ విషయాన్నే యజుర్వేదం 'పృధివ్యాం విష్ణుర్వ్యక్రసంగ్ గాయత్రేణ ఛంగసా్' - యజుర్వేదం 2-25 అంటున్నది. అయితే ఈ విధంగా నీటి అణువులు భూమ్యాకర్షణ పరిధిలో లేనప్పుడు అంతరిక్ష, ద్యులోకముల నుంచి వర్షం కురిపించే ప్రయత్నం చేయాలి.

ఇందుకోసం వేదపండితుడు త్రిష్టుప్ ఛంధస్సుతో కూడిన మంత్రాలతో ఆహుతులివ్వాలి. ఈ మంత్రాలు 44 అక్షరాలు కలిగి ఉంటాయి. ఆకాశంలో మేఘాలుండవు. మేఘాలు నిర్మించి, అంతరిక్షంలో నుండి (ఇక్కడ అంతరిక్షం అంటే భూమి మొదలు గ్రహాలు మొదలైనవి ఉన్న శూన్య ప్రదేశం కాదు) నీటిని ఆకర్షించి, వర్షం కురిపిస్తారు. దీని కోసం పెద్ద హోమగుండాన్ని నిర్మిస్తారు. దానికి నిర్దేశిత ప్రమాణాలున్నాయి. వాటి గురించి వేదంగామైన కల్పం వివరిస్తుంది. త్రిష్టుప్ ఛంధస్సులో 44 అక్షరాలు ఉన్నందున, ఈ ఛంధస్సు కలిగిన మంత్రాల ఉఛ్చారణకు గాయత్రి ఛంధస్సు మంత్రానికి పట్టిన సమయానికి రెట్టింపు సమయం పడుతుంది. అందుచేత యజ్ఞాగ్ని కూడా రెట్టింపుగా ప్రజ్వరిల్లుతుంది. ఇందులో వేయబడిన ద్రవ్యం అధికసమయం ఖాళీ సమయం దొరకడం వలన, మరింత సూక్ష్మీకరించబడి, సూక్షమైన అణువులుగా విడిపోయి, మరింత తేలికగా మారి, భూమ్యాకర్షణ పరిధిని అంతరిక్షాన్ని చేరుకుంటుంది. దీన్నే యజుర్వేదంలో త్రిష్టుప్ ఛంధస్సు అంతరిక్షాన్ని వశపరుచుకోవటం అన్నారు. అలా అక్కడకు చేరి, నీటి అణువులను ఆకర్షించి మేఘనిర్మాణం చేసి, వర్షం కురిపిస్తుంది.      

To be continued ...........................

సేకరణ: శ్యాం ప్రసాద్ గారు రాసిన 'రండి,మన భూగోళాన్ని కాపాడుకుందాం, యజ్ఞం ద్వార.' పుస్తకం నుంచి 

No comments:

Post a Comment