Showing posts with label శివయోగసాధన. Show all posts
Showing posts with label శివయోగసాధన. Show all posts

Wednesday, 8 November 2017

శివయోగసాధన- తీర్థయాత్ర ప్రయోజనాలు- స్వామి శివానంద



ఓర్టెల్ యొక్క వైద్యగ్రంథంలో మీకు కొన్ని వివరణలు కనిపిస్తాయి. కొన్ని హృదయ సంబంధ వ్యాధులకు, రోగిని మెల్లిగా కొండలు ఎక్కమంటారు. కాబట్టి కైలాస యాత్ర, ఆధ్యాత్మిక ప్రయోజనాలను పక్కన పెట్టి, అనేకమైన చిన్న చిన్న హృదయ వ్యాధులను తొలగిస్తుంది. గుండె ఉత్తేజితమై బలం పొందుతుంది. మొత్త గుండె, నాడి, శ్వాసకోశ, ఆహార సంబంధిత, శరీరావరణకు సంబంధించిన వ్యవస్థలన్నీ పూర్తిగా బాగుచేయుబడతాయి మరియు శుద్ధవుతాయి. ఆవిరి స్నానం చేయాల్సిన అవసరంలేదు. నడక వలన మీరు బాగా చెమటోడ్చుతారు. శరీరం మొత్తం శుభ్రము, ఆక్సిజనీకరణమైన రక్తంతో నిండుతుంది. అంతటా నిండిన ఎత్తైన దేవదారు వృక్షముల నుంచి వచ్చే చిరుగాలి, దేవదారు నూనెతో నిండి, ఊపిరితిత్తుల్లో రోగరహితం చేస్తుంది, మరియు లోనికి తీసుకుంటే క్షయరోగము నయమవుతుంది. అధికంగా ఉన్న కొవ్వు తగ్గుతుంది. లావాటి వ్యక్తులకు కైలాస యాత్ర అనేది స్థూలకాయ నివారణకు గొప్ప చికిత్స. ఎన్నో రకాల ఉదర సంబంధ వ్యాధులు, ఊరిక్ యాసిడ్ సమస్యలు మరియు అనేక రకాల చర్మరోగాలు నివారణమవుతాయి. మీకు 12 సంవత్సరాల వరకు ఏ రోగం రాదు ఎందుకంటే మీరు నూతన ఋణవిద్యుత్కణాలు, నూతన అణువులు, నూతన కణాలు, నూతన త్రసరేణువులు, నూతన (పరమాణు)కేంద్రకాలతో జీవరసము మఱల బలం పొంది మీరు శక్తిని పొందుతారు. ఇది అర్థవాదం (గొప్పతనం చెప్పటం) కాదు. మీకు ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడతాయి. కైలాసయాత్ర మీకు చక్కని ఆరోగ్యాన్ని మరియు ఆధ్యాత్మిక ఆశీస్సులను తీసుకువస్తుంది. జయము! శంభునకు, కైలాసంలో తన శక్తి అయిన పార్వతితో ఉండే శివునకు జయము! తన భక్తులకు ముక్తినిచ్చే వానికి జయము. హర, సదాశివ, మహాదేవ, నటరాజ, శంకర మొదలైన నామాలు గలవాడికి జయము.
ఈ జీవితం యొక్క లక్ష్యం భగవత్ సాక్షాత్కారం, కేవలం అది మాత్రమే మనల్ని సంసారదుఃఖాల నుంచి, జననమరణ చక్రం నుంచి విముక్తిని కలిగిస్తుంది. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, యాత్రలు మొదలనవి నిష్కామంగా చేయటం చేత పుణ్య సముపార్జన జరుగుతుంది. ఇది పాపరాశి దగ్ధమవటానికి కారణమై, మనస్శుద్ధిని ఇస్తుంది.  మనోశుద్ధి సంసారం యొక్క నిజతత్త్వాన్ని తెలుసుకొనటానికి, దాని అసత్యము మరియు విలువలేని గుణాన్ని తెలుసుకొనుటకు దారి తీస్తుంది. దీన్నుంచి వైరాగ్యం జనియించి, మోక్షకాంక్ష కలుగుతుంది. దీని నుంచి ఆ దిశగా వెళ్ళే మార్గాన్వేషణ తీవ్రమవుతుంది. దీన్నుంచి అన్ని కర్మలను త్యజించడం వస్తుంది. తద్వారా యోగాభ్యాసం అలవాటై, మనస్సు ఆత్మలో లేదా బ్రహ్మంలో లీనమవటం అలవాటుగా మారుతుంది. ఇది అవిద్యను తొలగించే 'తత్త్వమసి' మొదలైన శృతి వ్యాక్యాలు అర్ధం చేసుకోవటానికి కారణమై, తన ఆత్మలో స్థిరంగా నిలువటానికి తోడ్పడుతుంది. అందుకే మీరు గమనిస్తే, కైలాసయాత్ర అనేది భగవత్ సాక్షాత్కారానికి పరంపరమైన సాధన అవుతుంది, ఎందుకంటే అది చిత్తశుద్ధిని మరియు నిధిధ్యాసను కలిగిస్తుంది. ధ్యానం అనేది సూటియైన సాధన. ప్రాపంచిక విషయాల్లో, బరువుబాధ్యతల్లో ఇరుక్కుపోయిన గృహస్థులకు ఈ యాత్రలో గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఈ యాత్ర తర్వాత మనస్సు ఎంతో ఉపశమిస్తుంది. అంతేగాక, యాత్ర సమయంలో వారు అనేక సాధువులను, సన్యాసులను దర్శిస్తారు. చక్కని సత్సంగం దొరుకుతుంది. వారు వారి సందేహాలను తీర్చుకోవచ్చు. ఆధ్యాత్మికసాధనలో వారికి అనేక రకాలుగా సాయం అందుతుంది. ఇది యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం.


మీ స్ఫురణకు మరొక్కసారి తీసుకువస్తాను, వేదాల చివరి మాటలు, ఉపనిషత్తులు చెప్పింది- తత్త్వమసి, నా ప్రియమైన పాఠకులార. ఓం తత్ సత్, ఓం శాంతి, సకల జీవులకు శాంతి కలుగుగాక.

- స్వామి శివానంద 

Monday, 6 November 2017

శివయోగసాధన- ప్రసాదం యొక్క మహత్యం- స్వామి శివానంద

ప్రసాదం అంటే శాంతినిచ్చేది. కీర్తనం, పూజ, ఆరాధన, హవనం మరియు హారతి సమయంలో బాదాం, పాలు, మధురపదార్ధాలు, పండ్లను స్వామికి అర్పిస్తారు. బిల్వపత్రాలు, పువ్వులు, తులసీ, విభూతితో పూజించి, వీటిని స్వామి నుంచి ప్రసాదంగా ఇస్తారు. పూజ మరియు హవనంలో పఠించిన మంత్రాల వలన వాటికి అద్భుతమైన శక్తులు ఆవహించి ఉంటాయి.

ప్రసాదం గొప్ప శుద్ధిని ఇస్తుంది. ప్రసాదం సర్వరోగనివారిణి/ చింతామణి. ప్రసాదం అనేది ఆధ్యాత్మిక అమృతం. స్వామి అనుగ్రహమే ప్రసాదం. ప్రసాదం శక్తి స్వరూపం. ప్రసాదం అనేది మూర్తీవభించిన దైవత్వం. ఎంతో మంది నిజాయతీగల సాధకులకు ప్రసాదం ద్వారానే ఎన్నో అద్భుతమైన అనుభూతులు కలుగుతాయి. నయంకాని ఎన్నో రోగాలు నయమవుతాయి. ప్రసాదం శక్తినిస్తుంది, జీవం పోస్తుంది, పుష్టినిస్తుంది మరియు భక్తిని పుట్టిస్తుంది. దాన్ని గొప్ప విశ్వాసంతో స్వీకరించాలి.

బృందావనం, పండరీపురం లేదా బెనారస్ లో ఒక వారం నివసించండి. ప్రసాదం యొక్క మహత్యం మరియు అద్భుతమైన ప్రభావాలను మీరు అనుభూతి చెందుతారు. ప్రసాదం ధీర్ఘాయువు, చక్కని ఆరోగ్యం, శాంతి మరియు శౌభాగ్యాలను అందరికి ఇస్తుంది. శాంతిని మరియు పరమానందాన్ని ఇచ్చే ప్రసాదానికి జయము. ప్రసాదాన్ని ఇచ్చే భగవంతునకు జయము. అమరత్వాన్ని మరియు నశించని ఆనందాన్నిచ్చే పరమాత్మకు జయము.

విభూతి పరమశివుని ప్రసాదం, నుదుటన ధరించాలి. కొద్ది భాగం లోపలికి తీసుకోవచ్చు.

కుంకుమ అనేద శ్రీ దేవి లేదా శక్తి యొక్క ప్రసాదం, రెండు కనుబొమ్మల మధ్య (భ్రూమధ్యంలో/ ఆజ్ఞా చక్రం) లో ధరించాలి.

తులసి అనేది శ్రీ మహావిష్ణువు, రాముడు లేదా కృష్ణుని ప్రసాదము, లోపలికి తీసుకోకూడదు. బాదం, కిస్‌మిస్, మధురపదార్ధాలు, ఫలాలు మొదలైనవి లోనికి తీసుకోవచ్చు.

ముఖ్య్మైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ ప్రసాదాలను ఇస్తారు.

- స్వామి శివానంద 

Sunday, 5 November 2017

శివయోగసాధన- శివుడిని పొందే మార్గాలు- స్వామి శివానంద

మూడువేళ ఏళ్ళక్రితం తిరుమూలర్ తిరుమంత్రం అనే కావ్యాన్ని రచించారని చెప్తారు. అది శైవ మతం మరియు తాత్త్వికత యొక్క ఆచరణీయ/ వ్యవహారిక మరియు సిద్ధాంతపరమైన అంశాలను వెళ్ళడిస్తుంది. పతి (శివుడు), పశు (జీవుడు) మరియు పాశము (బంధము) గురించిన పురాతన పద్ధతిని ఈ గ్రంథం వివరిస్తుంది. ఈ క్రింద చెప్పేది తిరుమంత్రంలో తిరుమూలర్ యొక్క వ్యాఖ్యానం.

భగవంతుడు మాత్రమే గురువు. అతడే శివుడిని లేదా సత్ ను చూపిస్తాడు. సత్-గురు అంటే అంబలం లేదా చిదాకాశ శివుడు. నువ్వు గురువు కోసం నీ హృదయంలో వెతకాలి. జ్ఞానం, భక్తి, పవిత్రత మరియు సిద్ధులు గురువు అనుగ్రహంతో ప్రాప్తిస్తాయి. పవిత్రత, వైరాగ్యం మొదలైనవి ఉన్న సాధకులలో అనుగ్రహం ఉదయిస్తుంది.

ఆర్తి/ కుతూహలంతో ఉన్న సాధకుడు గురు పరం నుంచి సహాయం తీసుకోవాలి. గురు పరం సాధకునకు ఆధ్యాత్మిక సూచనలు ఇస్తారు. అప్పుడు శుద్ధ గురువు అతనిపై దైవానుగ్రహాన్ని అనుగ్రహిస్తాడు. సాధకునకు దైవానుగ్రహం లభించగానే అతనికి అనేక శక్తులు, పవిత్రత, మంత్రాలను తెలుసుకునే శక్తి, ఉన్నతమైన సిద్ధులు మొదలైనవి లభిస్తాయి. అప్పుడు చిదాకాశంలో సద్గురువు తానుగా చిదాకాశంలో వ్యక్తం/ ప్రత్యక్షమై మూడు బంధాలైన అణవ (అహంకారం), కర్మ మరియు మాయ ను త్రెంచి, అతడు అపరిమితమైన నిత్యానంద స్థితికి లేదా మోక్షానికి ప్రవేశించేందుకు సాయపడతారు. తర్వాత శివగురు తానుగా వ్యక్తమై సత్, అసత్, సదసత్ వ్యక్తమవుతాయి. జీవుడు ఈ అంతిమమైన జ్ఞానం పొందగానే, అతడు శివుడవుతాడు. ప్రారంభ మరియు అంతిమ దశల్లో వ్యక్తమైన గురువు సాక్షాత్తు శివుడే.

స్వామిని తన హృదయ కుహరంలో, రెండు కనుబొమ్మల మధ్య మరియు శిరస్సున ధ్యానించినప్పుడు, భక్తుడు స్వామి అనుగ్రహాన్ని పొందుతాడు. స్వామి యొక్క పవిత్ర పాదాలు ఎంతో స్తుతింౘదగ్గవి. " స్వామి పవిత్ర పాదాలే నాకు మంత్రము, సౌందర్యము మరియు సత్యము" అంటారు తిరుమూలర్.

జ్ఞేయం అనగా తెలుసుకోదగినది ఏదంటే, అది శివానందం, శివుడు మరియు ఆయన శక్తి (అనుగ్రహం) యొక్క సారం. జ్ఞాత (తెలుసుకునేవాడు) జీవుడు లేద జీవాత్మ. అతడు శివానందంలో ఉండటం చేత శివుడిని తెలుస్కుని, జ్ఞానాన్ని పొందుతాడు.

మోక్షం అంటే శివానందాన్ని పొందటం. మోక్షాన్ని పొందినవాడు, ఉన్నతమైన శివ జ్ఞానాన్ని పొందుతాడు. శివానందంలో నిశ్చలంగా ఉన్నవాడు జ్ఞానాన్ని మరియు మోక్షాన్ని పొందుతాడు. శివానందాన్ని అనుభూతి చెందిన వ్యక్తి అందులోనే ఎల్లకాలం ఉంటాడు. అతడు శివానందంలో శివుడు మరియు శక్తిని పొందుతాడు. శివశక్తుల కలయిక అయిన సత్యజ్ఞానాన్ని అతడు పొందుతాడు. వైరాగ్యం, బంధరాహిత్యం, త్యాగం, మరియు శివుని స్తుతించి నిరంతరం పూజించేవానికి శివ్డే మోక్షానికి దారి చూపుతాడు.

ప్రపమం మరియు ఇంద్రుని ప్రలోభాలను తట్టుకునే శక్తి శివభక్తునకు అతని తపస్సు ద్వారా లభిస్తుంది. ఇంద్రునిచే ఇవ్వబడే స్వర్గసుఖాలను అతడు పట్టించుకోడు. శివునిలో లీనమవటం చేత పొందిన పరమానందంతో అతడు సంతృప్తిగా ఉంటాడు.

సాధకుడు తీవ్రమైన సాధనలు చేసి, ఏకాగ్రతను సాధన చేసినప్పుడు, అతనికి అనేక శక్తులు లభిస్తాయి. వారి పదవులను కోల్పోతారేమోనని ఇంద్రుడు మరియు ఇతర దేవతలు ఎంతో భయపడతారు. అందుకే వారు అతని మార్గంలో అనేక అడ్డంకులను కలిగించి, పుష్పక విమానం, అప్సరసలు, మరియు ఇతర దేవలోక భాగాలను ప్రసాదించి అతడిని ప్రలోభపెడతారు. కానీ స్థిరమైన సాధకుడు దేనికీ లొంగడు. అతడు ఎన్నటికీ లొంగడు మరియు తన గమ్యమైన శివపదం లేదా అమరత్వానికి స్థానమైన పరమానందం వైపు నేరుగా నడుస్తాడు. లొంగినవాడు పతనమవుతాడు. విశ్వామిత్రుడు పతనమయ్యాడు.

ఋషి తిరుమూలర్ అంటారు: "పాండిత్య అహంకారాన్ని విడిచిపెట్టండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. లోనికి చూడండి. మీరు శివునిలో నిశ్చలంగా ఉంటారు. మిమ్మల్ని ఏదీ కదపలేదు. జననమరణాలనే లంపటాల నుంచి మీరు విడువడతారు."


శివసిద్ధాంతం అద్వైతాన్ని మాత్రమే బోధిస్తుంది. అది శివ అద్వైతం.

- స్వామి శివానంద 

Friday, 3 November 2017

శివయోగసాధన- శివలింగం చిన్మయం- స్వామి శివానంద



సదాశివుని నుంచి వచ్చే చైతన్యం యొక్క కాంతి, వాస్తవంలో శివలింగం. ఆయన నుంచి చరాచరమైన సృష్టి ఉద్భవిస్తుంది. ఆయనే అన్నిటికి లింగం లేదా కారణం. అంతిమంగా సమస్త ప్రపంచం ఆయనలోనే ఐక్యమవుతుంది. పీఠం అంబమయం సర్వం శివలింగశ్చ చిన్మయం అంటుంది శివపురాణం. పీఠం లేదా ఆధారంగా ఉండేది సమస్త ప్రకృతి లేదా పార్వతి, మరియు లింగం అనేది స్వయంప్రకాశమైన దేదీప్యమానమైన వెలుగులు ప్రసరించే చిన్మయ పురుషుడు. ప్రకృతి పురుషుల సమాగమము లేదా పార్వతీ పరమేశ్వరుల సమాగమమే ఈ ప్రపంచానికి కారణం. శివపురాణం సనత్కుమార సంహితలో, పరమశివుడు ఇలా అంటాడు: "ఓ పార్వతీ, పర్వతరాజు పుత్రిక, లింగమే సమస్తానికి మూలకారణం అని, ప్రపంచం లింగమయం లేదా చిన్మయమని తెలుసుకుని, నన్ను లింగరూపంలో పూజించే వ్యక్తి కంటే నాకు దగ్గరివాడు వేరొకడు లేడు."

లింగం అండాకారంలో ఉంటుంది. అది బ్రహ్మాండాన్ని సూచిస్తుంది. బ్రహ్మాండంలో ఉన్నదంతా లింగమే. సమస్త ప్రపంచమూ శివస్వరూపమే. ప్రపంచమే లింగము. లింగము కూడా శివుని రూపమే.

ప్రకృతి పురుషుల సమాగమం ద్వారా సృష్టి ప్రభావితమవుతుందని లింగం సూచిస్తుంది. అంటే అది లయం, జ్ఞానం, వ్యాప్యం, ప్రకాశం, ఆరథప్రకాశం, సామర్ధ్యం మరియు పై అర్ధాన్ని సూచిస్తుంది. లింగం అంటే ప్రపంచం మరియు జీవులు లయమయ్యే స్థానం. అది సత్యం, జ్ఞానం, అనంతం అనేవాటిని కూడా సూచిస్తుంది. శివుడు సర్వవ్యాపకుడని, స్వయంప్రకాశ తత్త్వం కలవాడని అందులో అర్ధం దాగుంది. పైన చెప్పిన అనేక అర్థాలను మనం అర్ధం చేసుకునేందుకు లింగం చిహ్నము. అండలింగం, పిండలింగం, సదాశివలింగం, ఆత్మలింగం, జ్ఞానలింగం మరియు శివలింగం అనేవి ఆరు లింగాలు. ఈ లింగాలు అండ, పిండ, సదాశివ మొదలైన వాటి గుణాలను తెలుసుకుని, అర్ధం చేసుకునేందుకు పరిగణలోకి తీసుకుంటారు.

యోని (పానపట్టము) తో లింగం యొక్క సంయోగము అనేది పరమ సత్యం యొక్క నిశ్చల/స్థిర మరియు చంచల తత్త్వాల శాశ్వతమైన/ అద్యంతరహితమైన ఐకమత్యానికి నిదర్శనము. దృగ్గోచరమైన వైవిద్యాలు దేని నుంచి వచ్చాయో ఆ సనాతనమైన ఆధ్యాత్మిక మాతృ మరియు పితృ తత్త్వాల ఐకమత్యానికి ఇది నిరూపిస్తుంది. ఇది మార్పుచెందని తత్త్వం మరియు చంచలమైన, నిరంతరం మార్పు చెందే శక్తి యొక్క శాశ్వతమైన కలియిక.

ఇంకా, ఈ ఘనమైన భావనతో సాధకుల యొక్క నీచమైన కామవాంఛలు తొలగుతాయి. లింగం మరియు యోని యొక్క ఆధ్యాత్మీకరణం మరియు పవిత్రీకరణం అనేవి సాధకుడు కామపూరితమైన ఆలోచనల నుంచి విముక్తిని పొందేలా చేస్తాయి. ఉత్కృష్టమైన/శ్రేష్టమైన ఈ భావన ద్వారా అన్ని నీచమైన ఆలోచనలు క్రమంగా మాయమవుతాయి. ప్రపంచంలోని సమస్త కామంతో కూడిన సంబంధాలు సనాతనమైన ఆత్మానందంతో కూడిన, స్వయంవృద్ధి కలిగిన పరతత్త్వమైన చైతన్య శక్తి అయిన పరమశివుడు మరియు ఆయన శక్తి యొక్క అభివ్యక్తీకరణలుగా ఆధ్యాత్మీకరించబడుతాయి.  

యోని (పానపట్టము) తో లింగం యొక్క సమాగమము పరమశివుడు, ఆయన శక్తితో కలిసి చేసిన ఈ సృష్టిని సూచిస్తుంది.

విద్యావంతులుగా పిలువబడే ఈ ఆధునిక మానవులకు ఆధ్యాత్మిక లోదృష్టి మరియు తాత్త్వికత లేదు. వారి తీవ్ర అజ్ఞానం మరియు విచారణ శక్తి లేకపోవటం చేత, లోతైన ఆలోచన మరియు ఋషులతో సత్సంగం లేని కారణంగా వారు యోనితో లింగం యొక్క సంయోగాన్ని నీతిబాహ్యమని, అశ్లీలమని విమర్శిస్తారు. ఇది అత్యంత శోచనీయము మరియు దుఃఖప్రదము. అజ్ఞానంతో ఉన్న జీవులకు భగవంతుడు జ్ఞానం ప్రసాదించుగాక!

- స్వామి శివానంద

Wednesday, 1 November 2017

శివయోగసాధన- శివలింగ పూజ- స్వామి శివానంద

శివలింగ పూజ

శివలింగం అంటే పురుషాంగం లేదా   అని, ప్రకృతిలోని పునరుత్పత్తి శక్తికి సంకేతం అని జనబాహుళ్యంలో నమ్మకం ఉంది. ఇది ఉపేక్షింపరాని, తీవ్రమైన పొరపాటు మాత్రమే కాదు, తీవ్రమైన తప్పు కూడా. వేదకాలం తర్వాతి కాలంలో, లింగం అనేది శివుని పునరుత్పత్తి శక్తికి చిహ్నముగా మారింది. లింగం అనేది తారతమ్యము చూపే గుర్తు కావచ్చు, కాని అది కామానికి సంకేతం కాదు. మీరు లింగపురాణంలో చూస్తే, "ప్రధానం ప్రకృతిర్ యదాహుర్-లింగముత్తమం; గంధవర్ణరసైర్హీనం శబ్ద-స్పర్శ-విరాజితం" అని ఉంటుంది. ఆదిలో ఉన్న లింగం ముఖ్యమైనది మరియు వాసన, వర్ణం(రంగు), రుచి, వినికిడి (శబ్దము), స్పర్శ మొదలైనవాటికి అతీతమైనది. దాన్నే ప్రకృతి అనేవారు.

లింగం అంటే సంస్కృతంలో సంజ్ఞ/ గుర్తు/ చిహ్నము. అది ఒక ఉహను/ అనుమానాన్ని వ్యక్తపరిచే చిహ్నము. మీరు నదిలో పెద్ద వరదను చూస్తే, ఆ ముందురోజు భారీవర్షాలు కురిశాయని అనుమానం వ్యక్తం చేస్తారు. మీరు పొగను చూసినప్పుడు, నిప్పు ఉందని అనుమానిస్తారు/ ఊహిస్తారు. అనంతమైన రూపాలతో ఉన్న ఈ సువిశాలమైన ప్రపంచమే సర్వశక్తిమంతుడైన భగవంతుని లింగము (చిహ్నము). శివలింగం అనేది శివునికి చిహ్నము. మీరు ఒక్కసారి లింగాన్ని చూస్తే, మీ మనస్సు ఒక్కసారిగా ఉన్నత స్థితికి వెళ్ళి, మీరు స్వామి గురించి ఆలోచించడం మొదలుపెడతారు.

నిజానికి శివుడు నిరాకారుడు. ఆయనకు తనకంటూ ఒకరూపం లేదు, కానీ అన్నీ ఆయన రూపాలే. అన్ని రూపాల్లో శివుడు వ్యాపించి ఉన్నాడు. ప్రతి ఆకరం లేదా రూపం శివ లింగమే లేదా శివస్వరూపమే.

మనస్సును ఏకాగ్రం చేయటానికి శివలింగంలో అద్భుతమైన, గుహ్యమైన శక్తి ఉంది. అంజనం వేయడంలో మనస్సు ఎలాగైతే సులువుగా కేంద్రీకరించబడి ఉంటుందో, అలానే శివలింగం వైపు చూడగానే మనస్సు ఏకాగ్రతను పొందుతుంది. ఆ కారణంతోనే భారతీయ ప్రాచీన ఋషులు లేదా ద్రష్టలు, శివాలయాల్లో లింగాన్ని ప్రతిష్టించాలని సూచించారు.

శివలింగం తప్పులకు ఆస్కారం లేని మౌనంభాషలో "నేను అద్వీతీయుడను (రెండవది అనేది లేకుండా ఒక్కటైన ఉన్నావాడు), నిరాకారుడను" అని మీకు చెబుతోంది. శుద్ధమైన, పవిత్రమైన ఆత్మలు మాత్రమే ఈ భాషను అర్ధం చేసుకోగలవు. తక్కువ అవగాహన లేదా జ్ఞానం కలిగి కామంతో నిండిన ఉత్సాహంగల, అశుద్ధడైన విదేశీయుడు "ఓహ్! హిందువులు జననాంగాన్ని పూజిస్తారు. వాళ్ళు అమాయకులు, వాళ్ళకు తత్త్వజ్ఞానం లేదు" అని దూషణగా అంటాడు. విదేశీయులు తమిళం కానీ లేదా ఏ ఇతర భారతీయ భాష నేర్చుకున్నా, ముందు అతడు కొన్ని భూతు మాటలను ఏరుకుంటాడు. అది అతని ఉద్రేకమైన గుణం. అలాగే, ఉత్సాహం కల విదేశీయుడు, పూజించే చిహ్నాల్లో కూడా లోపాలు వెతుకుతాడు. లింగం అనేది నిరాకారుడు, అవిభాజ్యుడు, సర్వవ్యాపకుడు, సనాతనుడు, మంగళుడు, నిత్యశుద్ధుడు, ఈ సమస్త విశ్వంలో ఉన్న అమరత్వ సారమైనవాడు, మీ హృదయకుహరంలో కూర్చున్న మరణంలేనివాడు, నీ అంతర్యామి, లోపల దాగున్న ఆతం, పరంబ్రహ్మం అయిన పరమశివుఇని యొక్క బాహ్యచిహ్నము.  

శివలింగానికి మూడు భాగాలు ఉంటాయి. అట్టడుగు భాగం బ్రహ్మ-పిత, మధ్యభాగం విష్ణుపీఠం, పైభాగం శివపీఠం.

కొన్ని స్వయంభూ లింగాలు, కొన్ని నర్మదేశ్వరులు. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు మరియు 5 పంచభూత లింగాలున్నాయి. కేదార్నాథ్, కాశీ విశ్వనాథుడు, శొమనాథుడు, వైద్యనాథుడు, రామేశ్వరుడు, ఘృష్ణేశ్వరుడు, భీమశంకరుడు, మహాకాలుడు, మల్లిఖార్జునుడు, అమలేశ్వరుడు, నాగేశ్వరుడు మరియు త్ర్యంబకేశ్వరుడు - ద్వాదశ జ్యోతిర్లింగాలు. కాళహస్తీశ్వరుడు, జంబుకేశ్వరుడు, అరుణాచలేశ్వరుడు, కాంచీపురంలోని ఏకామబరేశ్వరుడు మరియు చిదంబరంలోని నటరాజు పంచభూతలింగాలు. మధ్యార్జున గా పిలువబడే తిరువిదైమరుదుర్ లో ఉన్న మహాలింగ ఆలయం దక్షిణభారతదేశంలో గొప్ప శివాలయం.

స్పటికలింగం కూడా శివుని చిహ్నమే. శివారాధనకు లేదా శివపూజకు దీన్ని నిర్దేశిస్తారు. అది స్ఫటికశిలతో చేయబడి ఉంటుంది. దానికి తనకంటూ ఒక రంగు ఉండదు కానీ దానికి దగ్గరగా ఉన్న వస్తువుల రంగును తీసుకుంటుంది. అది నిర్గుణపరబ్రహ్మాన్ని, లేదా నిర్గుణ పరమాత్మాన్ని మరియు నిర్గుణ శివుడిని సూచిస్తుంది.

నిజాయతీ గల భక్తునకు శివలింగం అంటే ఒక శిల కాదు. అది సమస్తైన తేజస్సు, చైతన్యం. ఆ లింగం అతడితో మాట్లాడుతుంది, ధారాళమైన కన్నీటిని కార్పిస్తుంది, గగుర్పాటు కలిగిస్తుంది, హృదయాన్ని కరిగిస్తుంది, అతడిని శరీరిక స్పృహ నుంచి పైకి తీసుకువస్తుంది మరియు భగవంతునితో సంభాషించి, నిర్వికల్ప సమాధిని పొందేలా చేస్తుంది. శ్రీ రాముడు రామేశ్వరంలో శివలింగాన్ని అర్చించాడు. విద్వాసుడైన రావణుడు శివపూజ చేశాడు. లింగంలో ఎంత అద్భుతమైన శక్తి ఉండి ఉంటుంది!

మీరంతా మనస్సుకు ఏకాగ్రతను ఇచ్చి, శిష్యునకు ప్రారంభంలో మనస్సు ఆయన వైపు వెళ్ళేలా చేసే శివుని చిహ్నమైన లింగపూజ ద్వారా నిరాకరుడైన శివుని పొందుగాక! 

- స్వామి శివానంద 

Monday, 30 October 2017

శివయోగసాధన- శివ జ్ఞానం- స్వామి శివానంద

శివ జ్ఞానం


శివుని పవిత్రనామాల జపము మరియు ధ్యానము మిమ్మల్ని అన్ని రకాల పాపాలు నుంచి విముక్తుడిని చేసి శివజ్ఞానం లేదా పరమానందం మరియు అమరత్వం దిశగా నడిపిస్తాయి. శివనామమే అన్ని మంత్రాల సారం.

శివుడి 60 రకాలుగా వ్యక్తమయ్యాడు. వృషభారూఢ, హరి-హర, నటరాజ, భైరవ, దక్షిణామూర్తి, అర్ధనారీశ్వర, భిక్షాటనమూర్తి, సోమశేఖరమూర్తి, ఊర్ధ్వనటనమూర్తి, కాలసంహార మూర్తి, జలంధర మూర్తి, శురసంహార మూర్తి, లింగోద్భవమూర్తి అనేవి ఆయన రూపాలు.

శివ అంటే సనాతనమైన ఆనందం, శుభం, పరమ-మంగళం. ఓం మరియు శివుడు ఒకరే. శాంతం శివం అద్వైతం అంటుంది మాండూక్య ఉపనిషత్తు. అన్యకులస్థుడు లేదా వెలివేయబడ్డవాడు కూడా శివుని ధ్యానించవచ్చు.

అగ్ని, గాయత్రి మంత్రము మరియు సూర్యునిలో శివుడు వ్యక్తమవుతున్నాడు. మీరు గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు లేదా అగ్నిని మరియు సూర్యభగవానుని పూజించినప్పుడు, మీరు శివుని యందు ధ్యానం చేయాలి.

పంచాక్షరి జపం మరియు శివుని యందు ధ్యానం అనేవి ప్రత్యేకంగా ప్రదోషకాలంలో లేదా సూర్యాస్తమాయనికి ముందు చేయాలి. ప్రదోషం అనేది పూర్ణిమ లేదా అమావాస్య తర్వాత వచ్చే పదమూడవ రోజు, దాన్నే మహాప్రదోషం అని కూడా అంటారు. ఈ సమయంలో దేవతలు శివాలయాన్ని సందర్శించి స్వామిని పూజిస్తారు. మహాప్రదోషసమయంలో మీరు ఆలయాన్ని సందర్శిస్తే, దేవతలను కూడా పూజించవచ్చు. మహాప్రదోషం రోజుల్లో శివభక్తులు సంపూర్ణ ఉపవాసం ఉంటారు.

శివభక్తుడు నుదుటన మరియు శరీరానికి విభూతి రాసుకోవాలి. అతడు రుద్రాక్షమాల ధరించాలి. అతడు బిల్వవృక్షం యొక్క ఆకులతో శివలింగాన్ని పూజించాలి. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని అతడు జపం మరియు ధ్యానం చేయాలి. వీటిలో చెప్పిన ప్రతి కర్మ చేత శివుడు ప్రసన్నుడవుతాడు. విభూతి లేదా భస్మం అనేది అత్యంత పవిత్రమైనది. అది సాక్షాత్తు శివుడు ధరిస్తాడు. రుద్రాక్షమాలలో ఉండే రుద్రాక్ష శివుని నుదుటన ఉన్న మూడవకన్నును సూచిస్తుంది. సంపదలకు అధిష్టాత్రీ అయిన లక్ష్మీదేవి నివసించే పంచస్థానాల్లో బిల్వ పత్రాలు ఒకటి.

జీవులకు బంధాన్ని, ముక్తిని కలిగించేది శివుడే. జీవుల తత్త్వమైన దైవత్వాన్ని అనుభూతిలో తెలియపరిచేవాడు శివుడే. మాయను శరీరం, ఇంద్రియాలు మరియు జగత్తుగా చేసి, జీవులను అందులోకి త్రోసినవాడు శివుడు. అహం (నేను) భావాన్ని కలిగించింది ఆయనే. వారిని కర్మలో బంధించి, వారి పాప, పుణ్య కర్మానుసారం ఆనందం మరియు దుఃఖాన్ని అనుభవించేలా చేస్తున్నది ఆయనే. ఇది జీవులు బంధంలో ఉండే స్థితి.

క్రమంగా వారిని అహంకారం, కర్మ మరియు మాయా పాశాల నుంచి విడిపించి, శివునిగా వారిని ప్రకాశిమపజేయువాడు శివుడే. ఇది స్వేచ్ఛ లేదా మోక్షం అనే స్థితి. శివుని అనుగ్రహం చేత మాత్రమే, వాళ్ళు అంతిమ స్థితి అయిన ముక్తిని చేరుకుంటారు.


అనవ, కర్మ, మాయ అనే మూడు మాలిన్యాల ప్రభావంలో ఉన్నప్పుడు జీవులకు స్వాతంత్రం ఉండదు. వారి అల్పజ్ఞానం మాత్రమే ఉంటుంది. 

శివుని అనుగ్రహం లభించడానికి ముందు జీవుడు తన తత్త్వం గురించి, శివునకు తనతో గల సమబంధం గురించి తెలుసుకోవాలి. జీవం లేదా ప్రాణం అనేది శరీరంలో ఉంది. శివుడు ప్రాణంలో ఉన్నాడు. ఆయన ప్రాణాలకే ప్రాణం, కానీ ప్రాణాలు మరియు శరీరం నుంచి వేరైనవాడు కూడా. శరీరంలో ప్రాణం లేకపోతే, శరీరం శవం అవుతుంది. అది ఎలాంటి కర్మ చేయలేదు. శివుడే ఈ శరీరానికి, ప్రాణానికి, జీవునకు ఆధారం. శివుడు లేకుండా జీవుడు ఏ కర్మ చేయలేడు. శివుడే బుద్ధిని ప్రచోదనం చేస్తాడు. ఎలాగైతే కంటికి చూసే శక్తి ఉన్నా, సూర్యకాంతి లేకుండా కన్ను చూడలేదో, అలానే శివుని కాంతి లేనిదే బుద్ధి ప్రకాశించదు.

చర్య, క్రియ, యోగం మరియు జ్ఞానం అనే నాలుగు సాధనలు మోక్షానికి నాలుగు మెట్లు. అవి మొగ్గ, పువ్వు, కాయ, పండు వంటివి. 

శివుడు క్రమంగా జీవాత్మలను అహంభావన, కర్మ మరియు మాయ నుంచి విముక్తుడిని చేస్తాడు. జీవులు ఇంద్రియసుఖాల పట్ల క్రమంగా విముఖత చెందుతాయి. సుఖదుఃఖాల్లో సమతుల్యతను పొందుతాయి. ఈశ్వరానుగ్రహంతో జననమరణాలకు కర్మయే కారణం అని అర్దం చేసుకుంటాయి. ఈశ్వరుని కోసం కర్మలు చేయడం, ఆయన భక్తులకు సేవ చేయడం ప్రారంభించి, మనఃశుద్ధిని పొందుతాయి. ఆత్మ లేదా శివుడు, శరీరం, ఇంద్రియాలు మరియు మనస్సు నుంచి వేరని, మనస్సుకు, వాక్కుకు శివుడు అతీతుడని అర్దం చేసుకుంటాయి. వారికి ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రం ప్రాముఖ్యత తెలుసుకుని ఉపదేశము పొంది, శివుని ధ్యానిస్తాయి.

వారు శివయోగాన్ని సాధన చేస్తారు. వారి హృదయాలు కరిగిపోతాయి. ద్రష్ట, దృష్టి మరియు దృశ్యం మాయమవుతాయి. ఇంద్రియ, మనస్సు మరియు బుద్ధికి సంబంధించిన చర్యలు ఆగిపోతాయి. వారి హృదయంలో ఉద్భవించిన దివ్యప్రేమ అనే ప్రవాహంతో శివుడిని అభిషేకించి, వారి హృదయాన్ని శివునకు పుష్పంగా అర్పిస్తాయి.


శివుని ఢమరు శబ్దాన్ని విని, శబ్దమార్గంలో ముందుకు నడిచి, చిదాకాశంలో నటరాజును దర్శించి, శివానందం అనే సముద్రంలో మునిగిపోతాయి. కర్పూరం అగ్నిలో కరిగినట్లుగా, వారు శివునితో ఏకమవుతారు.

- స్వామి శివానంద 

Friday, 27 October 2017

శివయోగసాధన- శివమానస పూజ & పంచాక్షరి మంత్రలేఖనం

శివమానస పూజ
మానసపూజ అంటే మానసికంగా పూజించడం. పువ్వులు, చందనం మొదలైనవాటితో చేసే బాహ్యపూజ కంటే మానసపూజ చాలా ప్రభావంతమైనది. మానసపూజ చేసినప్పుడు మీకు మరింత ఏకాగ్రత ఉంటుంది.

మానసికంగా స్వామిని వజ్రాలు, ముత్యాలు, పచ్చలు మొదలనవి పొదిగిన సింహాసనంపై కూర్చోబెట్టండి. ఆయనకు ఆసనం ఇవ్వండి. అర్ఘ్యం, మధుపర్కం మరియు అనేక రకాల పుష్పాలు, వస్త్రాలు మొదలనవి ఇవ్వండి. ఆయన నుదుటన మరియు శరీరానికి చందనం పూయండి. అగరబత్తీలు వెలిగించండి. దీపములు చూపించండి. కర్పూరం వెలిగించి, హారతి చూపించండి. అనేకరకాల ఫలాలు, మధురపదార్ధాలు, పాయసము, కొబ్బరికాయ మరియు మహానైవేద్యం సమర్పించండి. షోడశోపచారపూజ చేయండి.

పంచాక్షరి మంత్రలేఖనం
చక్కని పుస్తకంలో 'ఓం నమః శివాయ' అని అరగంట లేదా ఎక్కువ సమయం రాసుకోండి. ఈ సాధనను చేయడం ద్వారా మీకు మరింత ఏకాగ్రత వస్తుంది. ఇంకుతో మంత్రాన్ని స్పష్టంగా రాయండి. మంత్రాన్ని రాసేటప్పుడు మౌనాన్ని పాటించండి. మంత్రాన్ని మీరు ఏ భాషలోనైనా రాయవచ్చు. అటుఇటు చూడటం విడిచిపెట్టండి. మంత్రాన్ని రాసేటప్పుడు మానసికంగా మంత్రాన్ని ఉచ్ఛరించండి. మంత్రం మొత్తాన్ని ఒకేసారి రాయండి. మంత్రం రాసే పుస్తకం పూర్తవ్వగానే దాని మీరు ధ్యానం చేసుకునే గదిలో ఒక పెట్టెలో పెట్టుకోండి. సాధనలో క్రమబద్ధంగా ఉండండి.

చిన్న నోటుపుస్తకాన్ని మీ జేబులు పెట్టుకుని, ఆఫీస్ లో ఖాళీ సమయం దొరికినప్పుడు రాయండి. మీ జేబులు మూడు వస్తువులు పెట్టుకోండి, అవి భగవద్గీత, మంత్రం కోసం చిన్న పుస్తకం మరియు జపమాల. మీరు గొప్పగా ప్రయోజనం పొందుతారు.

- స్వామి శివానంద  

Thursday, 26 October 2017

శివయోగసాధన- శివారాధన- స్వామి శివానంద

శివారాధన


శివుడిని తన సగుణతత్త్వంలో శివలింగంగా పూజిస్తారు. సాధారణంగా శివభక్తులు పంచాయతనపూజ చేస్తారు. ఈ పూజలో శివ, గణేశ, పార్వతీ మాత, సూర్యనారాయణస్వామి మరియు సాలగ్రామాలను విధిగా ఆరాధిస్తారు.

శుభకరమైన రోజున పంచాయతన మూర్తులను తెచ్చుకోండి. గొప్ప విశ్వాసంతో వాటిని ఇంట ప్రతిష్టించండి. పెద్ద ఎత్తున ప్రత్యేకపూజలు, అర్చన, ఆరాధన, అభిషేకం నిర్వహించి బ్రాహ్మణులకు, మహాత్ములకు, పేదలకు అన్న సమారాధన చేయండి. దైవన్ని ప్రత్యేక గదిలో ప్రతిష్టించండి. ప్రతి రోజూ దేవాతమూర్తిని త్రికరణశుద్ధితో, విశ్వాసంతో పూజించండి. మీకు సమస్త సంపదలు, మనశ్శాంతి కలిగి, ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు సిద్ధిస్తాయి. మీరు ఐశ్వర్యవంతమైన జీవనం గడిపి, మరణం తర్వాత అమరత్వాన్నిచ్చే శివ సాయుజ్యాన్ని ప్రవేశిస్తారు.

అధికసంఖ్యలో బిల్వదళాలను కోసుకురండి. ధూపం, దీపం, కర్పూరం, చందనపు కడ్డీలు, శుద్ధజలం, అధికసంఖ్యలో పువ్వులు, స్వామికి నైవేధ్యాలు, కూర్చోవడానికి పీట, ఒక గంట, శంఖము మరియు పూజకు అవసరమైన ఇతర సంభారాలను సిద్ధం చేసుకోండి. సూర్యోదయానికి పూర్వం తెల్లవారుఝామునే నిద్రలేవండి. ముఖం కడ్డుక్కుని, స్నానం చేయండి. పూజకోసం పెట్టుకున్న ప్రత్యేకమైన పట్టు వస్త్రాలు ధరించండి. పూజాగదిని చక్కగా అలంకరించండి. స్వామి నామాలను చదువుతూ, ఆయన్ను స్తుతిస్తూ, స్తోత్ర పారాయణ చేస్తూ, ఆయనకు నమస్కరిస్తూ ఆ గదిలోకి ప్రవేశించండి. పూజగదిలోకి ప్రవేశించే ముందు కాళ్ళు కడ్డుక్కోండి. సుఖాసనం (మీకు అనువుగా ఉన్న ఆసనం) లో కూర్చుని పూజ ప్రారంభించండి. నిర్ణీత పద్ధతిలో పూజ ఆరంభించే ముందుగా మీరు సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత క్రమంగా కలశం, శంఖం, ఆత్మ, పీట (స్వామి ఆసనం) యొక్క పూజలను చేయాలి. అటు తర్వాత షోడశోపచార పూజ నిర్వహించి, మహామృత్యుంజయ మంత్రము, రుద్రపాఠము, పురుషసూక్తము, గాయత్రి మంత్రాలు జపించి, శుద్ధజలము, పాలు, చెఱుకురసము, నెయ్యి మరియు మీ శక్తి కొలదీ ఇతర ద్రవ్యాలతో లేద కేవలం శుద్ధజలంతో అభిషేకం చేయండి. 

రుద్రాభిషేకం అత్యంత ఫలప్రదం. మీరు కనుక రుద్రజపం చేసి అభిషేకం చేస్తే, మీ బాధలు, కష్టాలు మాయమై, విశ్వనాథుని అనుగ్రహంతో మానవజన్మ యొక్క లక్ష్యమైన పరమానాందాన్ని (మోక్షాన్ని) పొందుతారు. రుద్రం గొప్ప పవిత్రతను చేకూరుస్తుంది. రుద్రం మరియు పురుషుసూక్తంలో అగోచరమైన శక్తి దాగి ఉంది. రుద్రపారాయణంలో అద్భుతమైన ఉద్దీపనం ఉంది. పూజను ప్రారంభించి, దాని వైభావన్ని, తేజస్సును మీరే అనుభూతి చెందండి.

అభిషేకం తర్వాత, శివుడిని చందనం మరియు పువ్వులతో చక్కగా అలంకరించండి. తర్వాత ఆయన నామాలు 'ఓం నమః శివాయ', 'ఓం మహేశ్వరాయ నమః' మొదలైన నామాలను ఉచ్ఛరిస్తూ అర్చన చేయండి. సాధ్యమైతే ప్రతి రోజు 108 లేదా 1008 అర్చనలు చేయండి. అర్చన తర్వాత వివిధ దీపాలతో హారతి ఇవ్వండి- ఏక హారతి, బిల్వ (మూడు వత్తుల) హారతి, పంచహారతి మరియు కర్పూర హారతి ఇవ్వండి. గంటలు వాయించండి, తాళములు వేయండి, శంఖము మొదలైనవి ఊదండి. భగవంతునికి నైవేద్యం అర్పించండి.

హారతి తర్వాత, చామరలు వీస్తూ స్వామిని కొనియాడుతూ మహిమ్నా స్తోత్రం, పంచాక్షరీ స్తోత్రం మొదలైనవి చదవండి. పూజ మిగుంపులో 'కాయేన వాచా', 'ఆత్మ త్వం గిరిజామతేః' మరియు 'కరచరణ కృతం' మొదలైనవి చదవండి. స్వామికి సర్వం అర్పించండి. మీరు ఆయన చేతిలో ఒక వస్తువు మాత్రమేనని భావించండి. దైవానుగ్రహం కోసం మాత్రమే ప్రతిదీ చేయండి. నిమిత్త భావాన్ని వృద్ధి చేసుకోండి. భక్తులను సేవించండి. తన భక్తులకు సేవ చేస్తే, స్వామి చాలా సంతోషిస్తాడు. చివరలో భక్తులకు ప్రసాదం పంచండి. గొప్ప విశ్వాసంతో ప్రసాదాన్ని తీసుకోండి. భగవంతుని ప్రసాద వైభవం వివరించలేనిది. విభూతిని ప్రసాదంగా స్వీకరించి, నుడుటన ధరించండి.

మీరు బాహ్యవస్తువులతో సగుణారాధనలో పురోగమించినప్పుడు, మానసపూజను మొదలుపెట్టవచ్చు. మీకు స్వామి దర్శనం కలిగి బంధ విముక్తి కలుగుతుంది.

సోమవారాలు మరియు ప్రదోషాల్లో (త్రయోదశి నాడు) ప్రత్యేకపూజలు నిర్వహించండి. ఈ రోజులు మరియు శివరాత్రి స్వామికి అత్యంత పవిత్రమైనవి. పెద్ద ఎత్తున శివరాత్రి జరుపుకోండి. రోజంతా ఉపవసించండి. త్రికాలపూజ, ప్రత్యేక అభిషేకం, ఏకాదశ-రుద్ర జపం, సహస్రనామార్చన, రాత్రి వేళ జాగరణ, స్తోత్రపఠనం, శివపురాణ పఠనం, శివలీలల ప్రవచనాలు వినటం వంటివి చేయండి. మరుసటి రోజు పూజానంతరం అభిషేకం చేసిన నీటితో ఉపవాసం ముగించండి. నివేదనలు సమర్పించి, ప్రసాదాన్ని స్వీకరించండి. మీకు గొప్ప మనశ్శాంతి, ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. ఏ అవకాశాన్ని వదులుకోవద్దు. రోజు పూజించడం అనేది అన్ని సమస్యలకు పరిహారం, మీరు ఎన్నడూ దరిద్రాన్ని అనుభవించరు. నా మాటగా తీసుకుని, ఈ రోజు నుంచి పూజ ప్రారంభించండి.

-- స్వామి శివానంద  

Wednesday, 25 October 2017

శివయోగసాధన - శివుని యందు ధ్యానము - స్వామి శివానంద



సగుణ ధ్యానం- సగుణధ్యానం అంటే సాకరరూపం మీద ధ్యానం. ఒక విలుకాడు ముందుగా స్థూలమైన, పెద్ద వస్తువుపై గురి పెడతాడు. అటు తర్వాత మధ్యస్థంగా ఉన్న వస్తువుపై, అంతిమంగా చిన్న మరియు సూక్ష్మ వస్తువులపై బాణం సంధిస్తాడు. అలాగే, మొదట సగుణ ధ్యానంతో ప్రారంభించి, మనసు తర్ఫీదు పొంది, క్రమశిక్షణగా ఉన్నప్పుడు, అతడి నిరాకర, నిర్గుణ ధ్యానం చేయవచ్చు. సగుణ ధ్యానం అనేది నిర్దిష్ట వస్తువుపై ధ్యానం. సగుణ ధ్యానం అనేది కేవలం తన ఇష్టదైవం మీదే దృష్టి నిలపడం విశేషంగా ఇష్టమైన భక్తునకు నచ్చుతుంది. సగుణ ఉపాసన విక్షేపాన్ని తొలగిస్తుంది. మూడు నుంచి ఆరు నెలల వరకు శివుని మూర్తిపై త్రాటకాన్ని సాధన చేయండి.

అర్ధగంట నుంచి రెండు గంటలవరకు మూర్తి రూపంపై మానసికంగా త్రికుటిలో (రెండు కనుబొమ్మల మధ్యలో) ధ్యానం చేయండి. ఈశ్వరుడు విశ్వంలో ప్రతి వస్తువులో ఉనట్లుగా చూసి భావించండి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు, దేవత యొక్క మంత్రమైన 'ఓం నమః శివాయ' అను మానసికంగా మననం చేసుకోండి. ఈశ్వరుని గుణాలనైన సర్వవ్యాపకత్వం, సర్వశక్తివంతం, సర్వజ్ఞత్వము గురించి భావన చేయండి. ఈష్టదేవత నుంచి సాత్త్విక గుణాలు మీ వైపు వస్తునట్లుగా భావించండి. మీరు ఈ సాత్త్విక గుణాలను కలిగి ఉన్నట్లుగా భావించండి. ఇదే శుద్ధ లేదా సాత్త్విక భావన. మీరు సాధనలో చిత్తశుద్ధితో ఉంటే, ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో మీ ఇష్టదేవతా దర్శనం కలుగుతుంది. దీన్ని ఆచరించండి. ఇది ఏకాగ్రతకు సహాయపడుతుంది. మూర్తి యొక్క వివిధ శరీరభాగాలపై, శివుని చిత్రంపై, మనసుని నిలుపుతూ ధ్యానించండి. మీరు మామూలుగా కూర్చున్న ఆసనంలోనే కూర్చోండి. ఆయన నామాన్ని జపిస్తూ, ఆయన గుణాలైన ఆనందం, కాంతి, ప్రేమ మొదలైనవి ధ్యానిస్తూ ఆయన మూర్తివైపు కాసేపు చూడండి. జ్వలించే వెలుగుతో ఆయన్ను మీ హృదయంలో లేదా రెండు కనుబొమ్మల మధ్య ఆసీనుడిని చేసుకోండి. ఇప్పుడు మానసికంగా ఆయన పాదపద్మాలను ధ్యానించి, మీ నమస్సులు అందించండి. ఇప్పుడు మనసుని ఆయన నడుముకు కట్టుకున్న ఏనుగు చర్మం మీదకు, ఆయన హృదయాన్ని అలంకరించిన రుద్రాక్ష మాల మీదకు, సుందరమైన నీలకంఠం మీదకు, ధ్యానంతో ప్రసరిస్తున్న చక్కని కాంతి కలిగిన నిర్మలమైన ముఖం మీదకు, అంతర్ముఖ దృష్టి కలిగిన అర్ధ-నీమిలిత నేత్రాల మీదకు, ఫాలభాగం మధ్యలో ఉన్న అద్భుతమైన మూడవనేత్రం మీదకు తీసుకెళ్ళండి. అటు తర్వాత జటాజూటం, చల్లని చంద్రరేఖ మరియు జటల నుంచి ఉబికివస్తున్న పవిత్రగంగ మీదకు మనసును తీసుకెళ్ళండి. ఒక చేతిలో ఉన్న త్రిశూలం, ఇంకో చేతిలో ఉన్న ఢమరుకం మీదకు మనస్సును త్రిప్పండి. అన్ని విశేషాలు ముంగించేవరకు మీ మనసును అలా త్రిప్పండి. అప్పుడు మీ మనసును ముఖం యందు కానీ లేదా ఆయన పాదాలయందు కానీ నిలపండి. ఈ ప్రక్రియను పునఃపునః మననం చేయండి. నిరంతర సాధన ద్వారా, మీరు ధ్యాననిష్ఠులై శివునితో ఏకమవుతారు.

నిర్గుణ ధ్యానం:  ఇది శివుని తత్త్వమైన సర్వవ్యాపకత్వము, అవ్యక్తము, పరంబ్రహ్మ స్వరూపం పై ధ్యానం. ఈ ధ్యానంలో మీరు శివుడిని పరంబ్రహ్మంగా, నిరాకార, నిర్గుణ, సనాతన, అనంతుడిగా ధ్యానిస్తారు. ఆయన్ను శుద్ధుడు, సచ్చిదానందుడు, వ్యాపించిన ఆత్మస్వరూపుడు; నిత్య, శుద్ధ, సిద్ధ, బుద్ధ, ముక్త సనాతనమైన సర్వతంత్ర స్వతంత్రమైన బ్రహ్మంగా, అనంతమైన శుద్ధ చైతన్య సముద్రంగా ధ్యానిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని సర్వోత్కృష్టము, ఇంద్రియాతీతమైన శివ స్వరూపంగా గుర్తించుకోండి. చైతన్య, పరిపూర్ణ, ఏకసార, శాంత, మార్పు చెందని ఉనికిగా మిమ్మల్ని భావించండి.

ప్రతి అణువు, ప్రతి త్రసరేణువు, ప్రతి నాడి, రక్త నాళం, ధమని శక్తివంతమైన ఈ ఆలోచనలతో ప్రతిధ్వనించాలి. శివోహం అని పెదవితో జపించడం (పెదవి విరుపు/ నోటి మాట) అంత ఫలదాయకం కాదు. అది హృదయం, మస్తిష్కం మరియు ఆత్మ ద్వారా జరగాలి. ఈ భావన నిరంతరం కలిగి ఉండాలి. శివోహం అనే మంత్రాన్ని మననం చేస్తున్నప్పుడు దేహాత్మభావనను త్రోసివేయండి. మీరు శివోహం జపిస్తునప్పుడు ఇలా భావించండి:

నేను అనంతుడను  శివోహం శివోహం
సమస్తమైఅ కాంతిని నేను  శివోహం శివోహం 
సమస్త ఆనందాన్ని నేను  శివోహం శివోహం 
సమస్త కీర్తిని నేను   శివోహం శివోహం 
సమస్త శక్తిని నేను   శివోహం శివోహం 
సమస్త జ్ఞానం నేను   శివోహం శివోహం 
సమస్త ఆత్మానందం నేను   శివోహం శివోహం 

పైన చెప్పిన భావనలపై నిరంతరం ధ్యానించండి. ఉత్సుకత మరియు ఆసక్తితో నిరంతర ప్రయత్నం అనేది ఆవశ్యకమైనవి. విడువకుండా పైన చెప్పిన భావాలను మానసికంగా మననం చేయండి. మీరు సాక్షాత్కారం పొందుతారు.


- స్వామి శివానంద