Tuesday, 21 February 2023

శ్రీదత్త పురాణము (57)

 


గురువులు నేర్పుతున్న అన్ని విద్యలలోనూ ఆరితేరుతున్నాడు. క్రమ క్రమంగా యుక్తవయస్సు వచ్చింది. యువరాజుకు పట్టాభిషేకం చేయిద్దామని కృతవీర్యుడు ఉబలాటపడుతున్నాడు. పైకి అంటే ఎవరు ఏమి అంటారోనని గేలిచేస్తారేమోనని సంశయిస్తున్నాడు. తీరా సింహాసనంమీద కూర్చోబెడితే సరిగా పరిపాలన కొనసాగించలేకపోతే బిడ్డడికి ప్రజల ముందు తలవంపులు తెచ్చి పెట్టిన వాళ్ళమవుతామని దిగులుతో వున్నాడు. దీనికి పరిష్కారం ఎలాగ ? అవి రేయింబవళ్ళు ఆలోచిస్తున్నాడు. దారి దొరకడం లేదు. చిరవకు ఆయుర్దాయమే తీరిందో లేదా ఆ దిగులే ప్రాణాలు హరించిందో గాని కృతవీర్యుడు హఠాత్తుగా దివంగతుడయ్యాడు.


అరాచకం ఏర్పడకూడదని మంత్రి పురోహితులు అందరూ ఒకనాడు కార్తవీర్యార్జునుణ్ణి సమీపించి పట్టాభిషేకమునకు అంగీకరించమన్నారు. అతడు మాత్రం అంగీకరించలేదు. అవిటివాణ్ణి, ప్రజారక్షణ చెయ్యలేను. అది చెయ్యలేనపుడు పెట్టాభిషేకం జరిపించుకో కూడదు. ప్రజలు పన్నులు కట్టేదిరాజు రక్షిస్తాడని దానికి సమర్ధుడు కానివాడు సింహాసనమెక్కి ప్రజాధనాన్ని భోగాలకు ఖర్చుపెడితే వాడు చోరుడు క్రింద లెక్క. రౌరవాది నరకాలకు పోతాడు. పోనీ పరిపాలన రాజ్య సంరక్షణ బాధ్యతలు మీకందరికి అప్పగించి నేను నామ మాత్రపు రాజుగా కిరీటం పెట్టుకొని కూర్చుందామంటే అప్పుడు మీ చేతుల్లో కీలు బొమ్మను అవుతాను. ఇది గుర్తించిన ప్రజలు నన్ను అపహాస్యం చేస్తారు. ఇరుగు పొరుగు రాజులు నవ్వుతారు. అవమానిస్తారు. నేను స్వయంగా నా అంతటనేను చేసుకోలేని పరిపాలన పరుల మీద ఆధారబడిన ఏలుబడి ఎంత అందంగా ఉంటుందో మనందరకు తెలిసిందే. అపరాధుల్ని నిర్ధారించలేము. నిరపరాధుల్ని రక్షించలేము. న్యాయమే జరుగుతుందో అన్యాయమే జరుగుతుందో గుర్తించలేను. ఇంకొకరి ఇష్టాఇష్టాల ప్రకారంగా నిరపరాధుల్ని శిక్షింపజేయవచ్చు. అపరాధుల్ని విడిపించవచ్చు. నా పరిపాలన గ్రుడ్డి దర్భారుగా వుంటుంది. పాపఫలాలు మాత్రం మిగిలి నరకానికిపోతాను. నూరు కళ్ళతో పరిపాలన కొనసాగించిన తెలియక జరిగే అపచారాలు ఉంటాయి. కాబట్టి రాజ్యం నరకం ధ్రువమ్ అన్నారు. అలాంటి నేను మరొకరి చేతుల్లో కీలు బొమ్మనయితే ఈ పుట్టుకలోనే ఇక్కడే నరకం అనుభవించవలసివస్తుంది. ఏ జన్మలో ఎవరికి ఏ అపచారం తెలిసి చేసానో, తెలియక చేసానో ఈ అవిటితనం సంప్రాప్తించింది. ఇప్పుడిక తెలిసితెలిసి పాపం మూటగట్టుకోలేను. అందుచేత ఈ కిరీటాన్ని నేను మోయలేను.


Monday, 20 February 2023

శ్రీదత్త పురాణము (56)



దత్తుడు ఉల్లాసంగా అమ్మపాదములకు నమస్కరించి అనుజ్ఞ తీసికొని సహ్యాద్రి వైపు బయలుదేరాడు. అలా దత్తుడు సహ్యాద్రిని రాజధానిగా చేసుకొని ముల్లోకాలలోని భక్తులను ఉద్ధరిస్తూ, సాధుజనులను రక్షిస్తూ, క్రూర రాక్షసులను సంహరిస్తూ, యోగ రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఆయన ప్రవృత్తి లోకోత్తరంగా వుంటుంది. ఆయన లీలలు ఊహాతీతంగా వుంటాయి. ఒకప్పుడు ఆయన శాంతమనోహరమైన యతిరూపాన్ని ధరిస్తే మరొకప్పుడు భీభత్స భయంకర రూపాన్ని పొందుతూ వుంటాడు. ఏ రూపంలో వున్నా పైకి ఎలా కన్పించినా ఆయన మాత్రం యోగ నిష్టుడే! ఆయన యోగానికి చ్యుతిలేదు. దానికి భంగంలేదు. ఆయన నామ స్మరణచాలు, మానవుల పాపాల్ని దహింపజేయడానికి. అశాంతిలో అల్లాడుతున్నవారు హృదయాన్ని నిర్మలం చేసుకోవాలంటే ఆయన కథల కన్నా ప్రశస్తమైన సాధనాలు లేవు. ఆయన కథలు, లీలలు అనంతములు. వాటిని వివరించి చెప్పాలంటే వేయితలల ఆదిశేషుడికైనా సాధ్యంకాదు.


మానవశరీరంతో అవతరించిన దత్తస్వామి ఎంతోమంది మానవులను పరిపరి విధాలుగా ఉద్ధరించాడు అంటూ సుమతి ముగించాడు. అప్పుడు సుమతి తండ్రి సుమతితో నాయనా రాజవంశంలో పుట్టి రజోగుణంతో జీవించే శ్రీకార్తవీర్యార్జునుడు దత్తుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకోవాలని వుంది. ఆ మహావీరుడి కథ చెప్పి, నా సంశయాలు తొలగించు అన్నాడు.


కార్త వీర్యార్జున వృత్తాంతం


తండ్రి తప్పకుండా చెబుతాను విను. హైహయవంశంలో కృతవీర్యుడు అనే రాజు వుండేవాడు. మాహిష్మతీపురమును రాజధానిగా చేసుకొని ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తూ వుండేవాడు. సర్వ సద్గుణ సంపన్నుడతడు. వేద విహితకర్మలు తాను ఆచరిస్తూ ప్రజలచేత ఆచరింపజేసేవాడు. ప్రజలకు ఎంత ప్రేమ పాత్రుడో శత్రువులకు అంత భయంకరుడు. ఇతడికి చాలాకాలం సంతానం లేదు. మహారాణి ఎన్నెన్నో నోములు నోచింది. వ్రతాలు చేసింది. తీర్థయాత్రలు చేసింది. కనిపించిన దేవతకల్లా మ్రొక్కింది. ఏ దేవత కరుణించిందో గాని ఏ మహనీయుడి ఆశీస్సులు ఫలించాయోగాని, చివరకు ఆమె కడుపుపండి నవమాసాలు మోసిన పిదప మగబిడ్డడు చొట్ట చేతులతో జన్మించాడు. రాజదంపతులు దిగులు చెందారు. ప్రజలంతా అయ్యోపాపం అనుకున్నారు. అసలు సంతానమే లేకపోతే ఒక బాధ. కానీ ఈ అవిటివాణ్ణి చూస్తూ రోజూ బాధే. వీడు పరిపాలనకు పనికిరాడే. నా తరువాత ఈ రాజ్య భారాన్ని ఎవరు మోస్తారు, అని కృతవీర్యుడు బెంగ పెట్టుకున్నాడు. చూద్దాం రాజవైద్యుల కృషి ఫలితంగా కాని, ఏ మహానీయుడు దయవల్లనో అవిటితనం పోకపోతుందా అని తమని తాము నమ్మపలుకుకుంటూ కాలంగడిపారు ఆ రాజదంపతులు. సకాలంలో జాతకర్మాదిక్రియలన్నీ జరిపించి, భూరిదక్షిణలతో వేదశాస్త్ర విద్వాంసులను సంతృప్తిపరచి అర్జునుడు అని నామకరణం చేసారు. కృతవీర్యుని పుత్రుడు కనుక కార్తవీర్యార్జునుడు అయ్యాడు. చేతులు చచ్చుబడ్డాయి అన్నమాటే గాని అర్జునుడి శరీరం అంతా వజ్ర తుల్యంగా వుంది. తెలివితేటలు అపారం. 

Sunday, 19 February 2023

శ్రీదత్త పురాణము (55)

 


దత్తుని వైరాగ్య స్థితి - యోగం


తండ్రీ దత్తుని యోగస్థితిని తెలియజెప్పుతాను విను అంటూ చెప్తున్నాడు సుమతి. ముని కుమారులను పరీక్షించిన దత్తుడు ఆశ్రమం చేరుకున్నాడు. ఇన్నేళ్ళుగా ఎటుపోయాడో ఏమయ్యాడో అనుకున్న అనసూయమ్మ తన ముద్దు బిడ్డను చూచి ఆనందంతో పొంగిపోయింది.


దత్తస్వామి తల్లి పాదాలకు నమస్కరించి అమ్మా భక్త జనులను ఉద్దరించడానికి నేను సహ్యాద్రి పర్వతానికి వెళ్తాను అనుమతి ఇవ్వు అన్నాడు.


ఎన్నాళ్ళకో ఇంటికొచ్చిన కొడుకుని చూస్తున్న ఆనందం నీరుకారిపోయింది. చిరకాలంగా అనంత తపోసంపన్నురాలయినప్పటికి పుత్రవ్యామోహం ఆమెను దుఃఖసాగరంలో ముంచెత్తింది. వెళ్ళడానికి వీలులేదని దత్తస్వామిని నిర్బంధించింది.


దత్తస్వామి సంకల్పం చాలా కఠినం. తాను కూడా వెళ్ళక తప్పదన్నాడు. అనసూయ మాతకు దుఃఖం పట్టరానిదయింది. దుఃఖంచేత మోహంచేత ఆమె తెలివి మేఘం కప్పిన ఆకాశంవలె నిండిపోయింది. దత్తయోగీంద్రుడు కూడా మొండిపట్టువదలలేదు.


చివరకు దుఃఖము కోపము ఆగక ఆ తల్లి ఇలా అంది. దత్తా నువ్వు యోగివే అవ్వవచ్చు గురువుని అవ్వవచ్చు అయినా నాకు బిడ్డవని మర్చిపోకు. నీకీ చర్మ దేహం ఇచ్చింది నేను, మర్చిపోరు. కనుక నువ్వు వెళ్ళదలచుకుంటే నేనిచ్చిన ఈ చర్మం నాకిచ్చి వెళ్లు అన్నది.


అది విని దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ వున్నాడు. ఆ నవ్వు చూసి అనసూయమాత బిత్తరపోయింది. ఆమె ఆ తేరుకునే లోపునే దత్తుడు తన గోళ్ళతో చర్మాన్ని పరపరా చీల్చి అంగీ విప్పినట్లుగా విప్పి తల్లి చేతుల్లో పెట్టాడు. దత్తస్వామి అలా చర్మాన్ని వలుస్తూ వుంటే ఆ తల్లి మనసులోని అజ్ఞాన పొరలు వీడిపోతున్నట్లుగా అనిపించింది. చర్మావరణం లేకుండా రక్తమాంసమయమై దివ్యకాంతులు వెదజల్లుతున్న దత్తస్వామి వికృతరూపం చూసేసరికి ఆమె దృష్టి అంతర్ముఖమైంది. ఆ దృష్టికి అనిర్వచనీయమైన దివ్యజ్యోతి ఒకటి సాక్షాత్కరించింది. ఆ దివ్యజ్యోతి దర్శనంతో ఆమెకు అనన్యమైన, ఆనందమైన శాంతి, కాంతి లభించింది. దుఃఖ స్పర్శలేని ఆనందాన్ని దర్శించిన ఆ తల్లి ప్రశాంత వదనంతో మధురంగా బిడ్డవంక చూచి చేతుల్లో వున్న చర్మాన్ని అంగీ తొడుగుతున్నట్లుగా మరల తొడిగింది. అమ్మ గంభీరస్వరంతో ఇలా అంది. గురుదత్తా నీవు జగత్తులను చీకటిలో నుండి వెలుగులోకి నడిపించడానికి అవతరించిన జగద్గురుడవు. నీకు అవధులులేవు. జన్మ వినాశనాలు లేవు. నాకీ సత్యాన్ని దర్శింపజేశావు. ఇంక నీ ఇచ్ఛావరంగా సహ్యాద్రి పర్వతంపై కొలువుండి భక్తుల హృదయాలను ఏలుకో. విశ్వశ్య కళ్యాణమస్తు ! అన్నది.

Saturday, 18 February 2023

శ్రీదత్త పురాణము (54)

 


అప్పుడు అమ్మ ఆలోచించి ధర్మాధర్మాల మధ్య చేజిక్కించుకో జూచిన వీరు సామాన్యులు కారని తలచి అయ్యలారా అలాగే వడ్డిస్తాను దయజేయమని వేడుకున్నది.


అనసూయదేవి కుటీరము లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకలకు నమస్కరించి స్వామి గృహస్థుల ఇంటికి దేహి అని వచ్చిన వారికి చేతనయినది సమర్పించవలెనని నియమం. అట్లుగాక ఆ నియమాన్ని మీరితే ఆకలితో తిరిగివెళ్ళిపోయినవారు గృహస్థుల పుణ్యాన్ని తీసికొని పోతారు అన్నది శాస్త్ర వాక్యము. కనుక నేను వారు నా బిడ్డలనే భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకొని నగ్నంగా భోజనం వడ్డించడానికి వెళ్ళేసరికి ఆ ముగ్గురూ పసిపిల్లలై కేరింతలు కొడుతూ వున్నారు. అప్పుడు అమ్మకు స్తన్యం వచ్చింది. బట్టలను ధరించి ముగ్గురు పసిబాలురను మూడు ఉయ్యాలలలో పడుకోబెట్టి జరిగిన కథనే జోలగాపాడుతూ వుంది అమ్మ. ప్రపంచాన్ని సృష్టిచేసి అలసినవాడిలా బ్రహ్మ జగత్తు పాలించి సోలిపోయిన వానిలా విష్ణువు హాయిగా ఉయ్యాలల్లో ఆదమరచి నిద్రపోతున్నారు. ఇంతలో అత్రి మహర్షి వచ్చి జరిగింది తెలుసుకొని వారిని స్థుతించాడు. అతని సోత్రములకు తృప్తి చెందిన త్రిమూర్తులు తమతమ నిజరూపాలతో దర్శనమిచ్చారు. అత్రిమహర్షి అనసూయాదేవితో "దేవీ వీరు నీ పాతివ్రత్యం పరీక్షించడానికి వచ్చారు. నీకు కావలసినవరం కోరుకో" అన్నాడు. అప్పుడు అనసూయాదేవి పాపుల్ని ఉద్దరించడానికి లోకకళ్యాణ నిమిత్తం ధర్మాన్ని సంరక్షించటం కొరకు మీ ముగ్గురు పుత్రులుగా జన్మించాలని కోరిక అంది.


ఇంతలో అక్కడ ముగ్గురమ్మలు ప్రత్యక్షమై సిగ్గుతో తలలు వంచుకున్నారు. అప్పుడు త్రిమూర్తులు, చూచారా, అమ్మ మహిమ అని తమతమ భార్యలతో అన్నారు. వారు మరింత సిగ్గుతో తలలు దించుకున్నారు. అపుడు త్రిమూర్తులు అమ్మతో " అమ్మా! మమ్ము మేము మీకు సంపూర్ణంగా దత్తత చేసుకుంటున్నాము. అలనాడు సుమతీ కౌశికుల విషయంలో మీకు వరం ఇచ్చాం కదా అని దివ్యమైన అనుగ్రహాన్ని ప్రసాదించారు. అట్టి వరప్రభావం వల్లనే అనసూయ గర్భాన్ని ధరించి త్రిమూర్తులను తన బిడ్డలుగా చేసుకోగలిగింది అని సుమతి తన తండ్రితో త్రిమూర్తుల ఆవిర్భావానికి గల పుణ్యగాధను వినిపించాడు.


Friday, 17 February 2023

శ్రీదత్త పురాణము (53)


ఇంకొకసారి పాపరతులైన జనుల స్పర్శవల్ల గంగాదేవి తన పవిత్రతను కోల్పోయి నల్లబడగా ఆ తల్లి తన కమండలంలోని జలాన్ని చల్లి గంగాదేవి కాలుష్యాన్నంతా క్షణంలో భస్మంచేసింది. ఇలాంటి మహాకార్యాలు చాలా చేసారు ఆ పుణ్యదంపతులు. అంతటి పుణ్యదంపతుల, తపోతేజోవంతుల గారాలబిడ్డడే మన దత్తుడు.


అంతే కాదు తండ్రీ! త్రిమూర్తులు వారి గర్భాన్నే జన్మించడానికి ఇంకా కారణాలు వున్నాయి. విను చెప్తాను. ఒకనాడు నారదుడు త్రిలోకాల్లో తిరుగుతూ తిరుగుతూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అనసూయాసాధ్వి గొప్ప దనాన్ని పొగుడుతూ వున్నాడు.


ఏం చిత్రమోగాని ముల్లోకాలు ఏలే ముగ్గురు అమ్మలకు సామాన్య మానవ మాత్రురాలను పొగుడుతూ వుంటే అసూయ బయలు దేరిందట. దాంతో వారు ఆమెను పరాభవించాలనే ఉద్దేశ్యంతో ఇనుప గుండ్లను సృష్టించి అవి వండించమని నారదుని చేతికిచ్చి పంపారట. నారదుడు ఇనుపగుండ్లను తీసికొని ఋక్షాద్రిపై తపస్సు చేస్తున్న అత్రి అనసూయల ఆశ్రమానికి వచ్చి అత్రి అనసూయల మహాత్మ్యాన్ని వేనోళ్ళ పొగిడి తన దగ్గరున్న శనగలు అమ్మచేతికిచ్చి అవి వండి పెట్టమని ప్రార్థించాడట. అవి మాత్రం ఇనుపగుళ్ళలా వున్నాయి. అనసూయామాత చేతి స్పర్శ వాటికి తగలగానే వాటిలో కఠినత్వం పోయిందట. అమ్మ తన సంకల్పబలంతో వాటిని అవలీలగా మ్రగ్గించి నారదుని చేతికిచ్చిందట. క్రమంగా అవి కమ్మని సువాసనలు వెదజల్లాయట. నారదుడు పరమానంద భరితుడై శెలవుతీసికొని వెళ్ళిపోయాడు.


నారదుని ఎదుట తమకు జరిగిన పరాభవం భరింపరానిదై ముగ్గురమ్మలు పట్టుబట్టి ఈమారు స్వయంగా తమ భర్తల్నే పంపించారు. అమ్మ పాతివ్రత్య మహిమను తగ్గించమని కోరారు. త్రిమూర్తులు వృద్ధ బ్రాహ్మణుల రూపంలో అత్రి ముని ఆశ్రమం చేరుకొని భవతీ భిక్షాందేహి అని అడిగారు.


అప్పుడు అనసూయాదేవి వారిని జూచి అయ్యలారా అత్రిముని తపస్సుకై అరణ్యంలోకి వెళ్ళారు. వారు వచ్చేంతవరకూ కూర్చుని మా ఆతిధ్యాన్ని స్వీకరించమని కోరింది. అప్పుడు వారు అమ్మా మీ వారెప్పుడు వస్తారో తెలియదు. వారు వచ్చే వరకూ మేము ఉండలేము. ఆకలి మమ్మల్ని బాధిస్తున్నది. భోజనం పెట్టు అన్నారు. అనసూయాదేవి కుటీరంలోకి వెళ్ళి భోజనాలు త్వరత్వరగా సిద్ధంచేసి వారు కూర్చుని తినడానికి వీలుగా ఆసనాలు సిద్ధంచేసి వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీరు ఇచ్చి భోజనానికి దయజేయమని వేడుకున్నది. అప్పుడు వారు అమ్మా మాకు ఆతిధ్యమిస్తానని మాట ఇచ్చావు కాని మాదొక నియమం ఉన్నది. నీవు కట్టుకున్న బట్టలను విడిచి నగ్నంగా మాకు వడ్డిస్తేనే మేము భోంచేస్తాము అన్నారు.


Thursday, 16 February 2023

శ్రీదత్త పురాణము (52)

 

తన కుమారుడు యింతగా చెప్తుంటే తండ్రికి నమ్మిక నెమ్మది నెమ్మదిగా కుదురుతోంది. నాయనా! సుమతీ! అంతో ఇంతో అనుభవం ఉండి సాత్విక మార్గంలో తపస్సు చేసుకొనే మునికుమారులే దత్తుడి లీలలు అర్ధం చేసుకోలేక దూరమయ్యారంటే యిక నేనెంత. నా తెలివెంత? దత్తుని లీలలు అత్యద్భుతంగా ఉన్నాయి. యింకా యింకా వినాలనిపిస్తున్నది. సుమతీ! త్రిమూర్తిస్వరూపుడైన దత్తుని కనిన అనసూయాత్రిదంపతులు ఎంత పుణ్యాత్ములో వారి తపోమహిను ఎంతగొప్పదో కదా అని అడిగాడు.


అప్పుడు సుమతి ఇలా చెప్తున్నాడు. తండ్రీ! అత్రి మహర్షి ఋగ్వేదంలోని శాకల శాఖా పంచమ మండలాన్ని తన తపో మహిమతో దర్శించగలిగాడు. ఆ వేద భాగంలో అగ్నిలింగస్తుతి, అమరేంద్ర ప్రస్తావన మొదలైన అంశాలు ఉండటంవల్ల అది ఐహికాముష్మికాలు రెండింటిని నిరుపద్రవంగా సాధించగల సామర్ధ్యం కలది.


ఒకసారి కృత యుగంలో రోగాలు పెచ్చుపెరిగి ప్రాణిలోకానికి హాని అవుతుంటే అత్రి మహానుభావుడే ఆయుర్వేదమనే ఉపదేశాన్ని సందర్శించి ప్రాణికోటికి అందించాడు. మరొక్కప్పుడు మనువు చేత భోదింపబడిన ధర్మశాస్త్రం దురవగాహంగా వుందని ప్రజలంతా చింతిస్తూ వుంటే, తేట తేట మాటలతో తానే స్వయంగా ఒక ధర్మశాస్త్ర స్మృతిని ప్రవేశపెట్టాడు.


మరొకప్పుడు దేవదానవ యుద్ధంలో సూర్యచంద్రులు శత్రువులకు బందీలైన కారణంగా లోకం అంధకారమయం కాగా దేవతల ప్రార్ధనల వల్ల ఆ మహానుభావుడే తానే సూర్యుడు చంద్రుడు అయ్యి లోకాలకు వెలుగు అందించాడు.


అలా అత్రి మహర్షి లోక కళ్యాణ నిమిత్తమై చేసిన అద్భుత కృత్యాలు ఎన్నెన్నో. ఎన్నింటినని మనం చెప్పుకోగలం. ఇక అనసూయా సాధ్వి గురించి చెప్పాలంటే అద్వితీయ పాతివ్రత్య రూప మహాద్భుత తపః పరమావధియైన అమ్మ చేసిన మహత్తర కృత్యాలకు సాటిలేదు.


ఒకప్పుడు ఎండలు విపరీతమయి గంగానది ఎండిపోతే అనసూయమ్మ మునిజనుల సౌకర్యార్ధమై నదిని మరల పునరుజ్జీవింప చేసింది. మరొకప్పుడు మహాక్షామం సంభవించి నేలలో మొలకన్నది కూడా లేకుండా మాడిపోతూ వుంటె అనసూయా సాధ్వి అనేక వందల, వేల మంది మునిజనులకు తానే స్వయంగా వండి వడ్డించింది. వారందరికి కందమూల ఫలాలు ఇచ్చి పోషించింది.


Wednesday, 15 February 2023

శ్రీదత్త పురాణము (51)

 


మరొక రోజు సాయంకాలం సరోవరంలో స్నానానికి దిగాడు, శిష్యగణం, మిత్రగణం కూడా వెంట ఉన్నారు. ఉన్నట్టుండి దత్తుడు మాయమయ్యాడు. శిష్యులు హాహాకారాలు చేసారు. ఇంతలో ఎవరో శిష్యులలో ఒకడు ఇది మనకు మరో పరీక్ష. కంగారుపడకండి అన్నాడు. అనుకున్నట్టే దత్తస్వామి సరోవర మధ్యభాగంలో ప్రత్యక్షమయ్యాడు. దివ్యాంబరాలు ధరించి, దివ్యమయిన భూషణములతో దత్తుడు ధగధగ లాడుతున్నాడు. చేతిలో మధుపాత్ర ఆరారగా మద్యం సేవిస్తున్నారు. ఎరుపెక్కిన కన్నులు తడబడుతున్న పలుకులు, ఒక అందాలరాశి బంగారు పాత్రతో మద్యం తెచ్చి పాత్రలోనింపింది. దత్తస్వామి ఆమె కొంగు పట్టుకొని లాగాడు. ఆమె వయ్యారంగా నాట్యభంగిమలో వచ్చి స్వామి వారి ఒడిలో వాలింది. ముద్దులు, మురిపాలు ఆలింగనాలు ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. మధ్యమధ్యలో యిద్దరు ఒకే పాత్రలోని మద్యము సేవిస్తున్నారు. ఒకరు మీద ఒకరు నీళ్ళు చల్లుకుంటున్నారు. కూనిరాగాలు తీస్తున్నారు. గిలిగింతలు పెట్టుకుంటున్నారు. విరగబడి నవ్వుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు వాలిపోతున్నారు. బుగ్గలు కొరుక్కుంటున్నారు. నెట్టుకుంటున్నారు. అంతలోకే మళ్ళీ దగ్గరకు లాక్కొంటున్నారు.

గట్టుపై నిలబడి వింతగా చూస్తున్న శిష్యులు, మిత్రులు గుసగుసలు ఆడుకుంటున్నారు. ఏమిటీ దారుణమని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇతన్ని మనం గురువుగా నమ్మింది. ఇతడా మనకు మోక్షం ప్రసాదించేది? యోగ సాధనంటే యిదేనా? మద్యపానము, మదవతీగా నమూనా? అయ్యోయ్యో ఎంత పొరపాటు చేసాం, ఎన్ని వందల సంవత్సరాలు వ్యర్ధం చేసుకున్నాం. అందరి మనుస్సులో యిదే ఆలోచన బయలుదేరింది. పదండి పదండి అనుకున్నారు. అందరు సరస్సువైపు తిరిగి చీత్కారాలు చేస్తూ కొందరు, మెటికలు విరుస్తూ కొందరు, ముక్కున వేలుంచుకుంటూ కొందరు, మొత్తం మీద అందరూ ఈ ఆశ్రమం పరిసర ప్రాతాలలోనే మనం ఉండకూడదు, దూరంగా పోదాం పదండి అనుకుంటూ వెళ్ళిపోయారు. దత్తాత్రేయుడు హమ్మయ్య అనుకున్నారు. మాయామదవతిని, మధుపాత్రను ఉపసంహరించాడు. నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి గట్టుకు చేరుకున్నాడు. ఆశ్రమంలోకి ప్రవేశించి యోగనిష్ఠలో కూర్చున్నాడు.

తండ్రీ! విన్నావు కదా, నీ మనస్సులో చాలా సందేహాలు తలెత్తాయని నాకు తెలుసు, మహాయోగికి సాధ్యాసాధ్యములు లేవు. అతడు సాధారణ నియమాలన్నిటికీ అతీతుడు. తన యోగసిద్ధికోసం అన్నింటినీ వదులుకుంటాడు, ఏదైనా చేస్తాడు. సృష్టి అంతా అతనికి ఒక ఆటబొమ్మ. ఒక్కొక్క బొమ్మతో కాసేపు ఆడుకుంటాడు. మరుక్షణంలో దానినే నిర్దాక్షిణ్యంగా కాలదన్నుతాడు. ఆయన దేనికీ లోనుకాడు. తండ్రీ! దేనిని ఆశించినా వాయువుకి అంటులేనట్లే, మహాయోగులకు కూడా ఏ దోషాలు అంటవు. వారేది చేసినా అది ఒక క్రీడ మాత్రమే. ఈ రహస్యం తెలియాలంటే యోగసాధనలో ఒకమెట్టైనా ఎక్కాలి. లేకపోతే ఆ శిష్య బృందాలవలె, అపార్థాలతో అసహ్యంతో పారిపోవలసివస్తుంది. తెలుసుకోగలిగిన వారు గురుకటాక్షానికి పాత్రులై ముక్తిపొందుతారు. అలా పొందిన వారు చాలా మంది ఉన్నారు. అందులో కార్త వీర్యార్జునుడు ఒకడు. తండ్రీ, దత్తయోగీంద్రుడని తలచుకుంటే చాలు సకల పాపాలు పటాపంచలవుతాయి. ముక్తి కాంత స్వయంగా మన ఎదురు నిలుస్తుంది.