Friday, 31 October 2014

సర్దార్ వల్లభాయ్ పటేల్

ఈ రోజు ( 31 అక్టోబరు) భారతదేశ తొలి హోంమంత్రి, ఉక్కుమనిషిగా చెప్పుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్గారి జయంతి. 

ఆంగ్లేయుల నుంచి భారత్‌కు స్వాతంత్ర్యం తెచ్చుకున్నా, భారతదేశం మొత్తం ఐక్యంగా లేదు. స్వాంతత్రానంతరమూ కూడా మన దేశంలో 565 సంస్థానలు / స్వతంత్రరాజ్యాలు ఉన్నాయి. చాకచక్యంగా దౌత్యం నడిపి వాటినన్నిటిని సంవత్సర సమయంలోనే, భారతదేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ పటేల్ గారిది. పాకిస్థాన్ కంటే ముందే లక్షద్వీప్ చేరుకుని భారత పతాకం ఎగురవేసి, లక్ష్వద్వీప్ దీవులను భారత్‌లో విలీనం చేశారు. పాకిస్థాన్ గుజరాత్‌లోని జునాగర్హ్, కాశ్మీర్, హైద్రాబాద్‌ల పై పేచి పెడితే, జునాగర్హ్‌లో రెఫరెండం నిర్వహించి, జూనాగర్హ్‌ను భారత్‌లో విలీనం చేశారు.

హైద్రాబాద్‌ సంస్థానంలో ముస్లింలు 10% ఉంటే హిందూ జనాభ 90% ఉండేది. అటువంటి హైద్రాబాద్‌ను నిజాం నవాబు పాకిస్థాన్‌లో విలీనం చేయడానికి చేసిన ప్రయత్నాలను చిత్తు చేశారు. రజాకార్ల పేరుతో హిందువులను ఊచకోత కోస్తూంటే చూడలేక హైద్రాబాద్‌పై సైనిక చర్య జరిపి, హైద్రాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. ఇందుకోసం ఆయన అనేక నిందలు పడవలసి వచ్చింది.

ఆ కాలంలో హైద్రాబాద్‌లో కాంగ్రెస్ కంటే కన్యూనిస్ట్‌ల బలం అధికంగా ఉండేది. హైద్రాబాద్‌ను భారతదేశంలో విలీనం చేస్తే అక్కడ కమ్యూనిస్టులు బలపడతారని, కాకుండా అదే స్థితిలో కొన్నాళ్ళు ఉంచేస్తే, నిజాం సర్కార్ కమ్యూనిస్టులను నాశనం చేస్తుందని, ఆ తరువాత మెల్లిగా హైద్రాబాదును భారత్‌లో విలీనం చేసే ప్రయత్నం చేయడం వలన కాంగ్రెస్ రాజకీయ లబ్ధి పొందవచ్చని నెహ్రూ భావించారు. హైద్రాబాద్‌ను భారత్‌లో కలుపుదామని పటేల్ ప్రతిపాదించగా, పటేల్ మతతత్వవాది అని నెహ్రూ విమర్శించారు. కానీ ఉక్కు మనిషి సర్దార్ వీటికి బెదరలేదు. హైద్రాబద్ ప్రజల దీనబ్రతులకు స్వాతంత్ర్యం ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకుని, నెహ్రూ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో తన అధికారశక్తితో హైద్రాబాద్ రాజ్యం చుట్టూ సనికులను దింపి, 5 రోజుల్లో నిజాం హైద్రాబాద్‌ను భారత్‌కు అప్పగించేలా చేశారు. నిజాం హైద్రాబద్‌ను భారత్‌లో కలిపారన్న వార్త రేడియోలో విన్న హైద్రాబద్ జనం సంబరాలు చేసుకున్నారు.

నిజానికి కాశ్మీర్ సమస్యనే కాదు, కాశ్మీర్ రాజు కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశారు. అప్పుడు పాకిస్థాన్ యుద్ధానికి సిద్ధమైంది, భారత్ పాకిస్థాన్‌ను మట్టి కరిపిస్తుందని నెహ్రూ వద్ద సమాచారం ఉన్నా, నెహ్రూ తాను గొప్పగా దౌత్యం నిర్వహిస్తానని చెప్పుకోవడానికి ఐక్యరాజసమితి వద్దకు కాశ్మీర్ సమస్యను తీసుకువెళ్ళారు. కాశ్మీర్ సమస్యను కూడా పరిష్కరిస్తానని సర్దార్ చెప్పినా, నెహ్రూకున్న వ్యక్తిగత కారణాల రీత్యా అందుకు అంగీకరించలేదు. అప్పటినుంచి కాశ్మీర్ ఇప్పటివరకు రగులుతూనే ఉన్నది.

భారతదేశ తోలి ప్రధాని కావలసిన వ్యక్తి. 1946లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి(congress presidency) ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గెలిచిన వారు అధ్యక్ష పదవితో పాటు ప్రధాన మంత్రిగా కూడా పనిచేయాలని తీర్మానించారు. గాంధీ 16 రాష్ట్రాల ప్రతినిధులను పిలిచి సరైన వ్యక్తిని ఎన్నుకోమని చెప్పారు. 16లో 13 రాష్ట్రాల ప్రతినిధులు వల్లభాయి పటేల్ పేరును ప్రతిపాదించారు. గాంధీ నెహ్రూకు ఈ విషయం చెప్పి,సర్దార్ ను ప్రధాన మంత్రిని చేయాలన్న విషయం పై మీ అభిప్రాయం చెప్పండి అనగా,ఆయన తల దించుకోని మౌనంగా ఉన్నారు. నెహ్రూ కు ప్రధాని కావలన్న అలోచన ఉంది అని అర్దం చేసుకున్న గాంధీ సర్దార్ కు చిన్న కాగితం మీద ఏదో వ్రాసి ఇవ్వగా ఆయన ప్రధాన మంత్రి పదవికి పోటినుండి తప్పుకున్నారు. గాంధీ చెప్పిన మాటకు కట్టుబడి తన ప్రధాని పదవిని నెహ్రూకు త్యాగం చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్. 

Tuesday, 28 October 2014

శివారాధన

ఓం నమః శివాయ

కార్తీకమాసంలో శివారాధనకు చాలా ప్రత్యేకత ఉంది. శివం అంటే శుభం, శోభనం, మంగళం అనే అర్దాలున్నాయి. దేవాదిదెవుడు, మహాదేవుడు, లయకారుడైన శివుడు భోళాశంకరుడు (అంటే అడిగిన వెంటనే వరాలు కురిపిస్తాడు, కొద్దిగా పూజ చేసిన, బోలెడు ఫలితాన్ని ఇస్తాడు, చిన్న సేవకే మురుసిపోతాడు). యోగ సంప్రదాయంలో శివుడు యోగులు యోగి, సృష్టిలో ఆదియోగి. శివుడి ద్వారానే లోకానికి యోగా, ధ్యానం మొదలైన విద్యలు పరిచయమయ్యాయి. కనుక యోగ సాధన చేసేవారు, పురోగతి కోసం తప్పకుండా శివారాధన చేయాలి.

శివారాధన చాలా సులువు. పెద్దగా పూజా సంభారాలు అవసరంలేదు, ఆడంబరాలు అసలే అవసరంలేదు. కాసిన్ని నీరు అభిషేకిస్తే చాలు, పొంగిపోతాడు. మంత్రాలు రావన్న బాధ అవసరంలేదు, ఓం నమః శివాయ అన్న మంత్రం చాలు. శివుడు యోగి అయినా, ఐశ్వర్యానికి అధిపతి. పూజించినవారికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. దక్షిణామూర్తి రూపంలో విద్యను, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. శివుడు విద్యను ప్రసాదిస్తాడు కనుకే అక్షరాభ్యాసంలో ముందుగా "ఓం నమః శివాయ సిద్ధం నమః" అని రాయిస్తారు.

అటువంటి శివుడికి కార్తీకం అత్యంత ప్రీతికరం. ఈ కార్తీకంలో ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి. పెద్దగా ఆర్భాటం అవసరంలేదు. చిన్న శివలింగానికి, ఒక గ్లాసుడు మంచినీరు పోస్తూ, ఓం అని కానీ, లేక ఓం నమః శివాయ అని కానీ, మనసులో స్మరించుకుంటే చాలు, పెద్ద అభిషేకం చేసినట్టు పొంగిపోతాడు. అభిషేకం చేసే అవకాశం లేకపోతే, కనీసం మానసికంగా పూజించినా చాలు. మీ మనసులోనే ఒక శివలింగాన్ని ఊహించుకుని, మీరు మీకు నచ్చిన ద్రవ్యాలతో అభిషేకం చేస్తునట్టు భావించి, మనసులో పూజించినా, ఫలితం వేసేస్తాడు పరమశివుడు.

శివపూజకు స్త్రీపురుష భేధం లేదు, వర్ణాశ్రమ బేధం అంతకంటే లేదు, ఎవరైనా, పరమశివుడిని అర్చించవచ్చు. ఉదయమే అరించాలన్న నియమం లేదు. శివుడికి ప్రదోష పూజ చాలా విశిష్టవంతమైంది. ప్రదోషం అంటే సాయంకాల సమయం. ఉదయమంతా ఆఫీసులో గడిపినా, సాయంకాలం ఇంటికి వచ్చాకా, ఆరాధన చేయవచ్చు. ఈ కార్తీకం నుండి శివారాధన ప్రారంభించండి.  

Sunday, 26 October 2014

నాగుల చవితి విశేషాలు

కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి - విశేషాలు

మన దేశంలో ప్రాచీన కాలం నుండి నాగపూజ చేసే ఆచారం ఉంది. కార్తీక శుద్ధచవితిని నాగులచవితిగా జరుపుతారు. పూజించడం అంటే గౌరవించడం అని అర్ధం. వ్యవాసాయంలోనూ, జీవవైవిధ్య రక్షణలోనూ ప్రధానపాత్ర పోషిస్తూ భూమిపై సమతుల్యానికి, జీవనానికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడుతున్న సర్పజాతికి నీరాజనం పట్టి, గౌరవించడమే ఇక్కడ పూజించడం అని అర్ధం చేసుకోవాలి.

ఉదయమే తప్పకుండా తలంటుస్నానం చేయాలి. ఈ రోజు చేసే తలస్నానం కళ్ళు, చెవులకు సంబంధించిన సమస్త రోగాలను తొలగిస్తుంది.

నాగులచవితి రోజున ఉపవాసం ఉండి పాముపుట్టను పూజించాలి. పుట్టలో ఆవుపాలు పోయాలి. పుట్టను పూజించే అవకాశం లేనప్పుడు నాగవిగ్రహాన్ని పాలతో అభిషేకించాలి. సాధారణంగా ప్రతిచోట ఆలయాలలోనూ, రావి, వేప చెట్ల క్రిందా ఈ నాగవిగ్రహాలు / నాగబంధం ఉంటుంది.

ఒక విషయం గుర్తుంచుకోండి. పాములు సరీసృపాలు కనుక పాలు త్రాగవు. అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు, దేవతసర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మాములు పాములు పాలు త్రాగితే అరగక కక్కెస్తాయి, మరణిస్తాయి కూడా. దేవత సర్పాలు ఎక్కడపడితే అక్కడ ఉండవు. మనిషి కంటికి కనిపించవు, అంటే మానవ కదలికలను లేని మహారణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టలో పాక్యేట్ల కొద్ది పాలు పోయకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి, రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగితావి ప్రసాదంగా స్వీకరించడం మంచిది. ఇక నాగదేవత పూజలో పసుపుకుంకుమలను పుట్ట దగ్గర వాడవద్దు. పసుపు అంటే పాములకు అలర్జీ. పసుపు వాటి శరీరానికి అంటుకోవడం వలన కూడా అవి మరణీంచే అవకాశం ఉంటుంది. పండుగ పూట పాపం చేయకండి. పసుపుకుంకుమలను పుట్ట దగ్గర వాడకండి. ఇటువంటి మరికొన్ని విషయాలను నాగపంచమి సంధర్భంగా ప్రచురించడం జరిగింది. లింక్‌లో http://goo.gl/B7ljRm గమనించగలరు.   

నాగులచవితికి నువ్వులపిండి, చలిమిడి, వడపప్పు, చిమ్మిలి తప్పనిసరిగా నివేదనగా సమర్పించాలి. ఇవి గర్భదోషాలను తొలగిస్తాయి, ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.      

పుట్ట దగ్గర / నాగబంధం దగ్గర పూజించాకా, ఇంటి గడప దగ్గర కూడా పాలుపోయాలి. ప్రతి ఇంటి గుమ్మం దగ్గర నాగరాజు కొలువుండి ఇంటిని రక్షిస్తుంటాడు. కనుక ఇంటి గడప మీద పాలు పోయండి, కాసింత చిమ్మిలి, చలివిడి పెట్టండి, ఒక అరటిపండు ముక్క పెట్టండి. నాగులను పాలు పోసి పూజించాం కనుక ఈ రోజు తరిగిన కూరలు తినకూడదని పెద్దలు చెప్తారు. కనుక ఆహారం తీసుకునేవారు, కత్తితో కూరలు కోయకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి.

మరునాడు ఇంట్లో బంగారంతో కాని,వెండితో కాని,కొయ్యతో(చెక్క) కాని,మట్టితో కాని చేసిన నాగప్రతిమను పంచామృతాలతోనూ,జాజి,సంపెంగ లాంటి సువాసనగల పూలతోనూ పూజించాలి. ఈ నాగపూజ వలన సర్పదోషాలు నశిస్తాయి.  

Friday, 24 October 2014

భగినీహస్తభోజనం

కార్తీక శుద్ధ విదియ, యమద్వితీయ, భగినీహస్తభోజనం

భగినీ అంటే తోబుట్టువైన స్త్రీ అంటే అక్క లేదా చెల్లి అని అర్ధం. సనత్కుమార సంహితలో ఈ యమ ద్వితీయ, భగినీహస్తభోజనం విశేషాలు చెప్పబడ్డాయి. సూర్యునికి ఇద్దరు భార్యలు ఛాయా, ఉష. సూర్యునకు ఛాయాదేవి వలన కలిగిన సంతానం యముడు, యమున. యముడి చెల్లెలు యమున. యమునా దేవి ప్రతిరోజు తన ఇంటికి వచ్చి విందు భోజనం చేసి వెళ్ళమని యముడిని ప్రార్ధిస్తూ ఉండేది. యముడికి తీరికలేక - ఎన్నోసార్లు వస్తానని చెప్పినా వెళ్ళలేదు. ఒకనాడు చెప్పకుండానే తన కుటుంబంతో కలిసి యమున ఇంటికి వెళ్తాడు. ఆ రోజే కార్తీక శుద్ధ ద్వితీయ.

చెల్లులు మహానందంతో అన్నకు, ఆయన కుటుంబానికి రుచికరమైన విందుభోజనం పెట్టింది. సంతోషించిన యముడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. యమున "అన్నా!  ప్రతిసంవత్సరం ఇదే విదియ నాడు నా ఇంటికి వచ్చి, నా చేతి వంటలు స్వీకరించి, నన్ను దీవించాలి. అంతేకాదు, ఈ కార్తీకశుద్ధవిదియ నాడు ఎవరు సోదరిహస్త భోజనం చేస్తారో వారు నరకాన్ని పొండకూడదు" అని అర్ధించింది. యముడు "తధాస్తు!శుభమస్తు! " అని అనుగ్రహిస్తూ "అమ్మా!ఈ దినం ఎవరు యమునా నదిలో స్నానం చేసి, పితృదేవతలకు తర్పణం చేసి, తన సోదరిని గౌరవించి, ఆమె చేతి భోజనం చేస్తారో వాళ్లు ఎన్నటికి నరకద్వారాన్ని చూడరు" అని అంటాడు.

కనుక కార్తీకశుద్ధవిదియ రోజున సోదరి ఇంట భోజనం చేసినవారు పరలోకంలో సుఖిస్తారని, ఏ సోదరి తన సోదరునికి ఈ రోజున భోజనం పెడుతుందో, అన్నను గౌరవిస్తుందో, ఆమె దీర్ఘసుమంగళిగా ఉంటుంది. ఇదే రోజున 'భ్రాతృ ద్వితీయను కూడా చేస్తారు. పేరు తేడా తప్ప మిగితాది అంతా అదే పద్ధతి. భ్రాతృ ద్వితీయలో సొదరి తన సోదరులకు నూతనవస్త్రాలిచ్చి గౌరవిస్తుంది. యమద్వితీయలో సోదరుడు సోదరికి వస్త్రాభరణాలు ఇచ్చి దీవిస్తాడు.
             
సోదరీసోదర ప్రేమలను కలకాలం నిలిపేందుకు,బంధాలను మెరుగుపరిచేందుకు ఇది ప్రతీక. అన్న చెల్లెలి అభుదయాన్ని, సౌమాంగల్యాన్ని, చెల్లులు అన్న శ్రేయస్సును, దీర్ఘాయువును ఆకాంక్షించే పవిత్ర పర్వదినం - ఈ పండుగ.

హరిః ఓం

సేకరణ: సప్తగిరి, నవంబరు 2012  

Thursday, 23 October 2014

కార్తీక మాసం

కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి వస్తుంది కనుక ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. కార్తీకమాసానికి కౌముది మాసం అని పేరు కూడా ఉంది. కౌముది అంటే వెన్నెల. ఈ మాసంలో చంద్రుడి నుంచి వచ్చే వెన్నల అమృత బిందువులను వర్షిద్తుంది. సంవత్సరంలో 12 నెలల్లో దేవతలను ఎక్కువగా పూజించడానికి కార్తీకమాసం శేయస్కరం. ఈ మాసంలో శివకేశవులిద్దరిని కలిపి ఆరాధించాలి. కార్తీకపురాణంలో రోజుకో అధ్యాయం చదవడం మంచిది.

ఆచరించవలసినవి - ఈ నెలలో కార్తీకస్నానం, కార్తీకదీపం, ఉపవాసం చాలా ముఖ్యమైనవి. రోజూ తెల్లవారు జామునే దగ్గరలో ఉన్న నది, చెరువు, తటాకం లోనో లేదా బావి దగ్గరో తలస్నానం చేయాలి. ఈ స్నానం సూర్యోదయానికి కంటె ముందే మిగియాలి. ఇంకా చెప్పాలంటే నక్షత్రాలు వెళ్ళకముందే స్నానం చేయాలి. ఇలా చేసే స్నానం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన|
ప్రీత్యర్ధం తన దేవేశ దామోదర మయా సహ||

అనే మంత్రం చెప్పి తలస్నానం చేయాలి. ఈ కార్తీకస్నానం కాయిక, వాచిక, శారీరిక దోషాలను తొలగిస్తుంది.

స్నానం తరువాత శివుడిని బిల్వదళాల (మారేడు ఆకులు) తోనూ, విష్ణువును తులసిదళాలతోనూ పూజించాలి. అలాగే ఈ నెలలో తుమ్మి పూలతో శివుణ్ని, అవిసె పూలతో విష్ణువును పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది.

ప్రతి రోజూ ఉదయం (సూర్యోదయానికి ముందు), సాయంకాలం ఇంటి గడపల దగ్గర, తులసి చెట్టు దగ్గర "ఆవునెయ్యితో" దీపారాధన తప్పనిసరిగా చేయాలి. ఈ మాసంలో చేసే దీపారాధనకు చాలా ప్రాముఖ్యం ఉంది. కార్తీకమాసం మొత్తం ఏకభుక్తం (ఒక పూట మాత్రమే భోజనం చేయడం) ఉండడం, పగలు ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయడం చేత పుణ్యం సిద్ధిస్తుంది, ఆరోగ్యం రక్షింపబడుతుంది. పగలంతా ఉపవాసం చేయలేనివారు అల్పాహారం తీసుకోవచ్చు (బ్రహ్మచారులు (పెళ్ళి కానివారు), 80 సంవత్సరములు పైబడినవారు, ఆనారోగ్యంతో బాధపడేవారు, కాయకష్టం చేసేవారు (శారీరకశ్రమతో పని చేసేవారు, బలహీనులు) ఈ ఉపవాసం చేయనవసరంలేదు). ఈ నెలంతా ఉపవాసం చేయలేనివారు కనీసం సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాసశివరాత్రి లాంటి పర్వదినాలలో అయినా ఆచరించడం ఉత్తమం.

ఈ మాసం మొత్తం బ్రహ్మచర్యాన్ని పాటించాలి, కార్తీకం లో ఉల్లి, ఇంగువ, పుట్టగొడుగులు, గంజాయి, ముల్లంగి, ఆనపకాయ, మునగకాడలు, వంకాయ, గుమ్మడికాయ, వాకుడు, పుచ్చకాయ, వెలగపండు, నూనె, చద్ది మొదలైనవీ, రెండుమార్లు వండిన అన్నం, మాడిన అన్నం, మినుములు, పెసలు, సెనగలు, ఉలవలు, కందులు మొదలైన ధాన్యాలు (ద్విదళాలు) వాడరాదు. మాంసాహారాలు, బిర్యానీలు, బయట అమ్మె వంటకాలు, చిరుతిళ్ళు, మసాలాపదార్ధాలు తినడం నిషిద్ధం. ఉపవాసం పక్కన పెట్టేసినా, అందరూ ఆచరించదగ్గవి ఆహారనియమాలు పాటించడం, ఉదయమే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం ముగించడం, రోజు దీపం వెలిగించడం. ఈ రెండు చేసినా, అతిత్వరలో జీవితంలో పెనుమార్పు కనిపిస్తుంది.

ఓం నమో శివనారాయణాయ 

బలి పాడ్యమి

కార్తీకశుద్ధ పాడ్యమి, బలిపాడ్యమి

కార్తీక శుద్ధ పాడ్యమికే బలి పాడ్యమి అని పేరు. ఈ పాడ్యమి బలిచక్రవర్తికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు తెల్లవారుజామునే లేచి బలిచక్రవర్తిని పూజించాలి. బియ్యపు పిండితో బలిచక్రవర్తి బొమ్మను గీచి పూజ చేయవచ్చు. పూజ సమయంలో

బలిరాజ నమస్తుభ్యం
విరోచనసుత ప్రభో,
భవిష్యేంద్ర సురారాతే
పూజేయం ప్రతిగృహ్యతాం

అని ప్రార్ధించాలని, గోవర్ధనపూజ చేయాలని, ఆవులను అలంకరించి స్వేచ్చగా తిరగనివ్వాలని, శక్తి కొలది దానం చేయాలని చెప్తారు.

ఇది బలచక్రవర్తికి సంబంధించిన కధ. వామనుడైన విష్ణువుకు 'మాట తిరుగని మానధనుడైన బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని దానం చేశాడు. అందుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమన్నాడు.

అప్పుడు బలిచక్రవర్తి "దేవా! నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను. నాకోసం కోరడానికి ఏమి లేదు. లోకం కోసం ఒక వరం అర్ధిస్తున్నాను. ఇష్టమైతే అనుగ్రహించు. నేను దానమిచ్చిన భూమిని వామనుడివై అంతటా ఆక్రమించావు. కనుక నీ మూడు అడుగులకు సంకేతంగా - ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ద పాడ్యమి (3 రోజులు) - భూలోకంలో బలిచక్రవర్తి రాజ్యంగా ఉండాలి. నా రాజ్యంలో దీపదానం, దీప పూజ చేసే ఇంట్లో నీ భార్య లక్ష్మీ దేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికి చీకటే ఉండాలి" అన్నాడు. విష్ణువు తధాస్తు అన్నాడు.

బలిచక్రావర్తి కార్తీకశుద్ధపాడ్యమి - తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి సాయంకాలం వస్తాడు. అతనివెంట గదాధరుడైన భగవంతుడు మహావిష్ణువు వస్తాడు. ఇలా భక్తుడూ, భక్తరక్షకుడైన భవంతుడు - ఇద్దరు వస్తారు కనుక వీధులు శుభ్రంగా ఉండి, ప్రతి ఇంటి ముంగిట దీపాలూ, మామిడితోరణాలు, రంగురంగుల ముగ్గులూ ఉండటం చూసి, తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందం, ఉత్సాహం, భోగభాగ్యాలతో హాయిగా ఉన్నరాని బలి సంతోషపడతాడు. భగవంతుడు ఆనందిస్తాడు. అందువల్ల దీపావళి మరుసటి రోజు 'బలి పాడ్యమి 'అయ్యింది. అంతేకాని జంతుబలులతో విందుచేసుకోవడం బలి పాడ్యమి కాదు.
         
సేకరణ: శ్రీ శైలప్రభ, అక్టోబరు 2012, సప్తగిరి, అక్టోబరు 2011

Wednesday, 22 October 2014

దీపావళి విశేషాలు

దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపమాలికలతో లక్ష్మీదేవికి నీరాజనమిచ్చే రోజు కావడం చేత దీనికి దీపావళి అని పేరొచ్చింది. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం.


పురాణప్రాశస్త్యం - త్రేతాయుగంలో రావణాసురిడిని చంపిన శ్రీ రామచంద్రుడు ఆశ్వీయుజ అమావాస్య రోజునే అయోధ్యకు చేరుకున్నాడు. తమకు ప్రియాతిప్రియమైన రాముడు 14 ఏళ్ళ తర్వాత తిరిగి తమ వద్దకు వస్తున్నాడనే సంతోషంతో అయోధ్యలో పండుగ వాతావరణం ఏర్పడింది. ప్రజలు శ్రీ రాముడిని దీపాలు వెలిగించి ఆహ్వానించారట. అయోధ్య మొత్తం దీపకాంతులతో అలంకరించారని, చరిత్రలో జరిగిన ఈ సంఘటనకు గుర్తుగా దీపావళీ జరుపుకుంటారని ఒక కధనం.

ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు నరకాసుర వధ చేసిన తర్వాత అనేకమందికి విముక్తి లభించింది, అనేకమంది స్త్రీల జీవితాల్లో వెలుగు వచ్చింది. నరకాసురవధకు సంతొషించిన ప్రజలు అమావాస్య రోజున దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి, ఆనందాన్ని వ్యక్తం చేసారు. అది కూడా ఈ రోజునే. నరకుడంటే అహకారం. అహకారం నశించినవారికి జీవితంలో చీకటి అనేదే ఉండదు. అహం నశించడం, జ్ఞానం కలగడం ఒకేసారి జరుగుతాయి. జ్ఞానం వ్యక్తిలో ఉన్న సంచితకర్మ ఫలాలను, పూర్వజన్మ వాసనలను నశింపజేస్తుంది. దానికి ప్రతీకగా అమావాస్య రాత్రి దీపాలు వెలిగిస్తారు.

ఆచరించవలసినవి -  ఈ రోజున తెల్లవారు జామున్నే(వెకువ జామున/సూర్యోదయానికి గంటన్నర ముందు)తలకి నువ్వుల నూనె పెట్టించుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల కొమ్మలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈరోజు చేసే అభ్యంగనస్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది.

దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీ పూజ చేయాలి. కాగా కొన్ని ప్రాంతాల్లో పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. దీపావళి రోజున లక్ష్మీ దేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా,మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళ వుంచిపోతుందని చెప్పబడింది. అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రంగా చేసి, లక్ష్మీదేవి రావాలని కోరుతూ ఇంటిని అలంకరించాలి.

ఇక సాయంకాలం ఇంటి ముంగిట, ఆలయాలు, మఠాల ముంగిట, గో శాలల్లోనూ దీపాలను వెలిగించాలి. చీకటిపడే సమయాంలో దీపదానం చేసి, మండుతున్న కట్టేల్ని త్రిప్పాలి. ఇలా త్రిప్పడం చేత పీడ పొతుందని చెప్తారు. నిజానికి దీపావళి కొంతవరకు పితృదేవతలకు సంబంధిచిన పండుగ.  దీపావళీ సాయంత్రం గొంగూర కాడల మీద దీవిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయి. తద్వారా పితృదేవతలు సంతసిస్తారు, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుంది.  తరువాత అలక్ష్మి (దరిద్రం) తొలగడానికి లక్ష్మీ పూజ చేయాలి. ఆకులతో దొన్నెలు కుట్టి, దీపాలు వెలిగించి, నదుల్లోనూ, చెరువుల్లోనూ, సరోవరాల్లోనూ, బావుల్లోనూ వదలాలి. దీపావళీ అర్దరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, అలక్ష్మీని బయటకు పంపాలి.

నూతన వస్త్రాలు ధరించాలి. అన్నదానం చేయాలి. అర్ధరాత్రివేళ చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళతోనూ, డిండిమం అనే వాయిద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠాలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని శాస్త్రవచనం.
(ఇందులో కొంత భాగం  సేకరణ: శ్రీ శైలప్రభ,అక్టోబరు 2012,సప్తగిరి,అక్టోబరు 2011  )

దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి.

అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ఆకాశదీపం (దేవాలయాల్లో అయితే ధ్వజస్థంభానికి వెలిగిస్తారు, మనం ఇళ్ళ పైకప్పు మీద పెట్టాలి), నదుల్లోనూ, చెరువుల్లోనూ దీపాలను వదలాలి. ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో (నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి. నువ్వుల నూనె దీపాలనే వెలిగించండి. మట్టి ప్రమిదలనే వాడండి. 

శాస్త్రీయ కారణం -  కొద్దిపాటి టపాసులు పేల్చడం వెనుక కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు భూమి నుంచి పుట్టే వివిధ రకములైన క్రిమికీటకాలు రోగాలను కలిస్తాయి. దీపావాళి నాటి రాత్రి కాల్చే మందుగుండు సామగ్రి నుంచి వెలువడే పొగ, వాసన ఈ కాలంలో వ్యాపించే దోమలను, క్రిములను హరింపజేస్తుంది. కానీ మరీ ఎక్కువగా కాలిస్తే, ఆ పొగ మనకూ హాని చేస్తుంది, శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. 

అందరికి దీపావాళి శుభాకాంక్షలు.