మహారాజుల అరచేతుల్లో పరమశుభకరములైన శంఖ, ఛత్ర, శిబిక, గజ, పద్మాకార చిహ్నాలుంటాయి. కుంభ, అంకుశ, పతాక, మృణాళ చిహ్నాలు అతులనీయ ఐశ్వర్యం గల మహారాజల కరతలంపై వుంటాయి. అరచేతిలో త్రాటిగుర్తున్న వారికి గోధనం మెండుగా వుంటుంది. స్వస్తిక చిహ్నమున్నవారు సమ్రాట్లవుతారు. చక్రం, కత్తి, తోమరం, విల్లు, బల్లెం ఆకారంలో గుర్తులు అరచేతిలో నున్నవారు కూడా రాజులవుతారు.
చేతిలో రోకలి గుర్తున్నవారు యజ్ఞాది కర్మకాండలు చేయించడంలో నిష్ణాతులవుతారు; వేదికాకారమున్నవారు 'అగ్నిహోత్రి' అనే పదానికర్హులౌతారు; నూయి, దేవకుల్యం, త్రికోణం వున్నవారు ధార్మికులు.
అంగుష్ఠమూలంలో దళసరి రేఖలున్నవారికి కొడుకులూ, పలచటి గీతలున్నవారికి కూతుళ్ళూ ఎక్కువగా పుడతారు. చిటికెన వేలి మూలంలో మొదలై చూపుడు వేలి మూలందాకా పయనించే రేఖ గలవారు నూరేళ్ళూ జీవిస్తారు. కాని, ఆ రేఖ ఎక్కడైనా విచ్ఛిన్నమైపోతే, చెట్టు మీది నుండి క్రిందపడి మరణిస్తారు. రేఖలు మరీ ఎక్కువగా నున్న మానవులు దరిద్రులౌతారు. చిబుకం కృశించిపోయినట్లుండుట ధనహైన్యానికీ, మాంస పుష్టితో నుండుట సంపన్నతకీ సూచనలు.
స్నిగ్ధంగా, దిట్టంగా సమానభాగాలలో వుండే సుందర, తీక్షదంతాలు శుభప్రదం. రక్తవర్ణంలో, సమతలంగా, నున్నగా, పొడుగ్గా వుండే నాలుక మంచి లక్షణం, ధనికుల ముఖాలు కొంచెం కోలగానూ, నిర్ధనుల వదనాలు పొడవుగానూ, రాజుల ముఖాలు, సౌమ్యంగా, బలంగా, నున్నగా, మలరహితంగానూ వుంటాయి. పాపకర్ముని మొగము భయాక్రాంతంగానూ, ధూర్తుని వదనం నలుపలకలుగానూ వుంటాయి. దింపుడు ముఖాలు పుత్రహీనులకూ, చిన్నముఖాలు పీనాసులకూ ఉంటాయి. భోగుల ముఖాలు, సుందరంగానూ, కాంతివంతంగానూ, కోమలంగానూ, మీసాలతోనూ వుంటాయి.
చోరవృత్తిని ఇష్టపడే పురుషుని ముఖం నిస్తేజంగా, ముడుచుకున్నట్లుండి, ఎఱ్ఱని మీసాలతో ఎఱ్ఱని గెడ్డంతో వుంటుంది; స్త్రీముఖంలో గెడ్డం, మీసాలు వుండవు. చిన్న చెవులూ, ఎఱ్ఱని, పెద్ద వెంట్రుకలూ గలవారు పాపకర్మం చేస్తూ మృతి చెందుతారు. శంకువు ఆకారంలో చెవులున్నవారు రాజులౌతారు గానీ చెవులలో ఎక్కువ వెంట్రుకలు మొలిస్తే శీఘ్రమరణముంటుంది. పెద్ద చెవులవారు ధనికులౌతారు. గండస్థలం క్రిందికున్నవారు భోగులౌతారు; పూర్ణంగా, సుందరంగానున్నవారు మంత్రులవుతారు.
No comments:
Post a Comment