Thursday 4 April 2024

శ్రీ గరుడ పురాణము (140)

 


అశ్వని, రేవతి, చిత్ర, ధనిష్ఠ నక్షత్రాలు కొత్త సొమ్ములు పెట్టుకోవడానికి ప్రశస్తాలు. మృగశిర, అశ్వని, చిత్ర, పుష్య, మూల, హస్త నక్షత్రాలు కన్యాదానానికీ, యాత్రలకూ, ప్రతిష్ఠాది కార్యాలకూ శుభప్రదాలు.


జన్మలగ్నంలో శుక్రుడూ, చంద్రగ్రహమూ గల వారికి శుభఫలాల ప్రాప్తి ఎక్కువగా వుంటుంది. ఈ రెండు గ్రహాలూ రెండవ ఇంట నున్న వారికీ శుభాలే వుంటాయి. తృతీయ భావంలో (అంటే మూడోయింట) చంద్ర, బుధ, శుక్ర, బృహస్పతులూ, చతుర్ధ భావంలో మంగళ, శని, చంద్ర, సూర్య, బుధులూ శ్రేష్టతను ప్రసాదిస్తారు. అలాగే పంచమభావంలో శుక్ర, బృహస్పతి, చంద్ర, కేతువులూ, ఆరోయింట శని, సూర్య, మంగళులూ, సప్తమ భావంలో బృహస్పతి, చంద్రులూ, అష్టమభావంలో బుధ, శుక్రులూ కూడా శుభాలనే ఇస్తారు. అదేవిధంగా నవమ స్థానంలో బృహస్పతీ, దశమ భావంలో సూర్యశనులూ, చంద్రుడూ, ద్వాదశ స్థానంలో బుధ, శుక్రులూ సర్వ విధాల సుఖాలనూ సమకూరుస్తారు. ఇక ఏకాదశ స్థానంలో ఏ గ్రహమున్నా శుభాన్నే ప్రదానిస్తుంది.


సింహంతో మకరం, కన్యతో మేషం, తులతో మీనం, కుంభంతో కర్కాటకం, ధనుస్సుతో వృషభం, మిథునంతో వృశ్చికరాశి యోగిస్తే మంచిది. దీన్ని షడష్టక యోగమంటారు. ఇది ప్రీతికారకం*. (* ఒక్క గరుడ పురాణంలోనే షడష్టక యోగం మంచిదని చెప్పబడింది. వధూవరుల జాతకాలకు సంబంధించి మిగతా అన్ని శాస్త్ర గ్రంథాలలోనూ ఇది అశుభకారకంగానే పరిగణింపబడింది. వరుని లేదా వధువు యొక్క జన్మ రాశి ఒకరిది రెండవవారికి ఆరవదిగాని ఎనిమిదవది గాని అగుటనే షడష్టకయోగమంటారు.)


(అధ్యాయం - 61)


లగ్నఫలాలు, రాశుల చర-స్థిరాది భేదాలు గ్రహాల స్వభావాల, ఏడు వారాలలో చేయవలసిన యోగ్య ప్రశస్తకార్యాలు.


ఈశ్వరాదులారా! సూర్యుడు ఉదయకాలం నుండి మేషాది రాశులలో వుంటాడు. ఆయన దినంలో క్రమంగా ఆరురాశులను దాటుకొని పోయి రాత్రిలో కూడా ఆరురాశులను దాటి వస్తాడు.


మేషలగ్నంలో పుట్టిన ఆడది గొడ్రాలు అవుతుంది. వృషభలగ్నంలోనైతే కామిని, మిథున లగ్నంలో పుడితే సౌభాగ్యశాలినీ కర్కాటక లగ్నంలోనైతే *వేశ్యా అవుతుంది. (* వేశ్య అనేది ఇప్పటి అర్థంలో వాడబడిన మాట కాదు. సూతుడు శౌనకాది మహామునులకు చెప్తున్న కాలంలో అదొక వృత్తి; కొన్ని సందర్భాలలో అదొక గౌరవప్రదమైన వ్యవస్థ కూడానూ. ఇప్పుడీ విషయాన్ని పట్టించుకోనక్కర్లేదు.)


No comments:

Post a Comment