Friday 5 April 2024

శ్రీ గరుడ పురాణము (141)

 


సింహ లగ్నంలో పుట్టినామెకు పుత్రసంతానం అల్పం. కన్యాలగ్నంలో పుట్టిన కలికి రూపవతి; తులా లగ్నంలో పుట్టిన తెఱవ రూపవతీ, ఐశ్వర్యవంతురాలూ కూడా అవుతుంది. వృశ్చిక లగ్నంలో పుట్టిన వనితకి కర్కశ స్వభావముంటుంది. ధనుర్లగ్నంలోనైతే సౌభాగ్యవతీ, మకరలగ్నంలోనైతే తనకన్న తక్కువ స్థాయి పురుషుని పెండ్లి చేసుకొనేదీ అవుతుంది. కుంభలగ్నంలో పుట్టినామెకు మగ పిల్లలు తక్కువ. మీనలగ్నంలో పుట్టిన మీనాక్షి వైరాగ్యయుక్త అవుతుంది*. (* ఈ ఒక్క అంశాన్నే పట్టుకొని స్త్రీల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేయడం ప్రమాదం. ఇలాంటి అంశాలు కనీసం యాభై దాకా పరిశీలించి అప్పుడు ఆ స్త్రీ ఎలాంటిదో ఆలోచించాలి. కనీసం పది జ్యోతిశ్శాస్త్రగ్రంథాలైనా చదవకుండా జాతకాలు చెప్పెయ్యకూడదు.)


ఇక రాశుల చర, స్థిర భేదాలు చూద్దాం.


తుల, కర్కాటక, మేష, మకరాలు, చరరాశులు. ఈ రాశులున్నపుడు యాత్రకు వెళ్ళవచ్చు. సింహ, వృషభ, కుంభ, వృశ్చిక రాశులు స్థిరరాశులు. ఇవి ఉన్నపుడు స్థిరమైన కార్యాలు చేపట్టాలి.


కన్య, ధను, మీన, మిథునాలు ద్విస్వభావమున్న రాశులు. చర, స్థిర-రెండు స్వభావాలూ గల కార్యాలను, విద్వాంసులు, ఈ రాశులున్న కాలంలో చేపడతారు.


యాత్రలను చరలగ్నాలలోనూన, గృహప్రవేశాది స్థిరకార్యాలను స్థిరలగ్నాలలోనూ చేయాలి. దేవతాదుల స్థాపనా, వైవాహిక సంస్కారాలూ ద్విస్వభావ లగ్నాలలో జరగడం అన్ని విధాలా శ్రేయస్కరం.


పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మూడింటినీ, నందాతిథులంటారు. అలాగే విదియ, సప్తమి, ద్వాదశిలను భద్రా తిథులనీ, తదియ, అష్టమి, త్రయోదశులను జయాతిథులనీ అంటారు. ఇకపోతే చవితి, నవమి, చతుర్దశి ఈ మూడిటినీ రిక్తాతిథులని వ్యవహరిస్తారు. రిక్తాతిథులలో ఎట్టి శుభకార్యమునూ చేయరాదు.


సౌమ్యస్వభావుడైన బుధుడు చర స్వభావం గల గ్రహం. గురుడు క్షిప్ర, శుక్రుడు మృదు, రవి ధ్రువ ప్రకృతులు గలవారు. శని దారుణ, మంగళుడు ఉగ్ర, చంద్రుడు సమ తత్త్వములు గలవారు.


No comments:

Post a Comment