చర, క్షిప్ర స్వభావాలున్న గ్రహాలు (అంటే బుధుడు, గురుడు) శాసించే వారాల్లో అంటే బుధ, గురు వారాల్లో యాత్రలు చేయాలి. శుక్ర, ఆది వారాల్లో గృహప్రవేశాది కార్యాలను చేపట్టాలి.
శని, మంగళవారాల్లో యుద్ధాలకు క్షత్రియవీరులు బయలుదేరవచ్చును.
రాజ్యాభిషేకాలకూ, అగ్ని కార్యాలకూ సోమవారం ప్రశస్తదినంగా పరిగణింప బడుతుంది. ఇల్లు కట్టడాన్ని, సున్నాలేయడాన్నీ కూడా ఈ రోజే మొదలెట్టవచ్చు.
గురువారంనాడు వేదపాఠాన్నీ, దేవపూజనీ, వస్త్రాలంకార ధారణనూ చేయవచ్చును. శుక్రవారం కన్యాదానానికీ, గజారోహణకీ, శనివారం గృహప్రవేశ, గజబంధనాలకీ మంచివి.
(అధ్యాయం - 62)
సాముద్రికశాస్త్రానుసారం స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలు, మస్తక, హస్త రేఖలాధారంగా వ్యక్తుల ఆయుః పరిజ్ఞానం
మహేశా! ఇప్పుడు స్త్రీ పురుషుల అంగాలను బట్టి వారికుండే మంచి, చెడు బుద్ధులను సంక్షిప్తంగా వర్ణిస్తాను.
అరికాళ్ళు, అరిచేతులు కోమలంగా, మాంసపుష్టితో, రక్తవర్ణంలో వుండి, పాదాలు, చేతులు ఎత్తుగా, చెమట పట్టకుండా, రక్తనాళాలూ, ముడులూ కనబడకుండా ఎవనికైతే వుంటాయో అతడు రాజవుతాడు. అరికాలిలో అంకుశ చిహ్నమున్న వాడు సుఖి. అందమైన మడమ, తాబేటి రూపమున్న పాదము, వెచ్చటి శరీరము, రక్తవర్ణంలో, ముక్కలు కాకుండా, నల్లగీతలు లేకుండా వుండే గోళ్ళు కూడా రాజలక్షణాలే. కాలివేళ్ళొకదానికొకటి తగులుతూ వుండడం ఐశ్వర్యం లక్షణం. అలా తగలకుండా విడివిడిగా నున్నవాడు, తెల్లగా పారల్లాటిగోళ్ళు, పాదంపై నరాలు, ముడులు కనిపించేవాడు దరిద్రుడు. నిప్పుల్లో కాల్చబడిన మట్టిరంగులో పాదాలున్న వాడు బ్రహ్మహత్య చేస్తాడు. పచ్చని పాదాలవాడు తిరుగుబోతు; నల్లనిపాదాల వారు తాగుబోతు; తెల్లని పాదాల వాడు తిండిపోతు.
No comments:
Post a Comment