కాలిబొటనవ్రేలు దిబ్బగా వుండేవాడు భాగ్యహీనుడు; వికృతంగా వుండేవాడు దుఃఖపీడితుడు. ఆ వేలు వంకరగా, చిన్నదిగా, విరిగినట్టు వుండేవాడు కష్టాలపాలవుతాడు.
కాలిచూపుడు వేలు బొటన వ్రేలికన్నా పెద్దది కలవానికి స్త్రీ సుఖం ఎక్కువగా ప్రాప్తిస్తుంది. చిటికెన వేలు సామాన్యంగా కంటే పెద్దది గలవాడు బంగారాన్ని పొందుతాడు. గోళ్ళు పాడైపోయినట్లుగా కనబడేవానికి శీలముండదు, అలాగని కామభోగమూ అనుభవంలోకి రాదు.
తొడలపై రోమాలుంటే ధనం నిలువదు. తొడలు చిన్నవిగా వుంటే ఐశ్వర్యం పడుతుంది. కాని, బంధనాల్లో వుండిపోతుంది. లేడితో సమానమైన జంఘలున్నవాడు రాజ్యాన్ని సంపాదిస్తాడు. పొడవుగా దిబ్బగా వుండే తొడలున్నవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. పులి లేదా సింహపు తొడలవాడు ధనికుడు కాగలడు. మోకాలు మాంసరహితంగా నున్న వానికి పరదేశ మరణం ప్రాప్తిస్తుంది. వికట జానువు దరిద్రహేతువు. మోకాళ్ళు కాస్త క్రిందికి వున్నవాడు ఏ ఆడదాన్నయినా గెలుచుకోగలడు. అక్కడ ఎక్కువ మాంసమున్నవాడు రాజవుతాడు. శ్రేష్ఠమైన పశు, పక్షి (సింహం, ఏనుగు, హంస) గమనము గలవాడు రాజుగాని గొప్ప ధనికుడు గాని కాగలడు.
కమలం రంగులో రక్తమున్నవాడు ధనవంతుడవుతాడు. ఎరుపు, నలుపు కలగలసిన రుధిర వర్ణమున్నవాడు అధముడు, పాపకర్ముడు కాగలడు. పగడపు రంగులో నుండి తేటగా మెరిసే రక్తము గలవాడు ఏడు ద్వీపాలకు అధిపతి కాగలడు. లేడి లేదా నెమలి పొట్ట ఉత్తమ పురుష లక్షణము. పులి, సింహము లేదా కప్ప (కడుపు వంటి) కడుపు రాజలక్షణము. పులి వంటి పీఠము సేనాపతి లక్షణము. సింహం పీఠం వలె పొడవుగా నుండే పీఠము గల వానికి బంధనాలెక్కువ. తాబేలు పీఠము సకలైశ్వర్య సంపన్న లక్షణము. విశాలంగా, ఎత్తుగా, పుష్టిగా రోమయుక్తమైయున్న వక్షఃస్థలము గల పురుషుడు శతాయువు, ధనవంతుడునై అన్ని భోగాలనూ అనుభవింపగల అదృష్టవంతుడు కాగలడు.
చేతిలో మీనరేఖ గలవాడు గొప్ప కార్యసాధకుడు, ధనవంతుడు, పుత్రవంతుడు కాగలడు. తుల, వేది చిహ్నమున్నవాడు వ్యాపారంలో లాభాన్నార్జించగలడు. చేతిలో సోమలతా చిహ్నమున్నవాడు ధనికుడై యజ్ఞం చేస్తాడు. పర్వత, వృక్ష చిహ్నాలున్న వాని వద్ద లక్ష్మి స్థిరంగా వుంటుంది. అనేక సేవకులకు స్వామి కాగలడు. శూలము, బరిసె, బాణము, తోమరము, ఖడ్గము లేదా ధనుస్సు వంటి చిహ్నమేదైనా అరచేతిలో గలవాడు యుద్ధ విజయుడు. ధ్వజం కాని శంఖంగాని వుండే సముద్ర, ఆకాశయానాలు చేసి వ్యాపారాల్లో బాగా గడిస్తాడు. శ్రీవత్స, కమల, వజ్ర, రథ లేదా కలశ చిహ్నమున్న పురుషుడు శత్రురహితుడైన రాజు కాగలడు. కుడిచేతి బొటన వ్రేలిలో యవధాన్యపు గుర్తున్నవాడు, అన్ని విద్యలలో ఆరితేరినవాడవుతాడు; ప్రవక్త కూడా కాగలడు. చిటికెన వేలిక్రింది నుండి చూపుడు వేలి మధ్యదాకా ఆగకుండా పయనించే రేఖగలవాడు వందేళ్ళ దాకా (ప్రస్తుతం కాలంలో) జీవిస్తాడు.
No comments:
Post a Comment