Wednesday 10 April 2024

శ్రీ గరుడ పురాణము (146)

 


స్త్రీల శుభాశుభ లక్షణాలు


మెడ మీద రేఖ వుండి, కనుకొలుకులలో ఎరుపు జీర గల స్త్రీ ఏ యింటికి వెళితే ఆ యిల్లు దినదిన ప్రవర్ధమానమవుతూనే వుంటుంది.


లలాటంపై త్రిశూలరేఖ వున్న లలన వేలాదిమంది దాసదాసీ జనానికి స్వామిని కాగలదు. రాజహంస గమనము, లేడికనులు, అదే శరీరవర్ణము, తెల్లనై సమముగానున్న దంతాలు గల నారి ఉత్తమ స్త్రీ. కప్ప వంటి కడుపున్న కలికి ఒకే పుత్రుని కంటుంది. అతడే రాజవుతాడు.


హంస వలె మృదువచనము, తేనె వలె శరీర వర్ణము గల తెఱవ ధనధాన్య సమృద్ధిని కలిగియుంటూ ఎనిమిదిమంది పుత్రుల్ని కంటుంది. పొడవైన చెవులను, సుందరనాసికను, విల్లువలె వంపు తిరిగిన కనుబొమ్మలను కలిగిన కాంత అతిశయ సుఖాలననుభవిస్తుంది. మృదువుగా, నున్నగా, మెత్తగా నున్న తనువు, సన్నని రూపు, శ్యామల వర్ణం, మధుర భాషణం, శంఖ సమాన, కాంతులతో అతిశయ స్వచ్ఛత గల పలువరుస గల పడతి అన్ని రకాల ఐశ్వర్యాలనూ ప్రాప్తించుకోగలుగుతుంది.


విస్తారమైన జంఘలు, వేది వంటి మధ్యభాగము గల మగువ మహారాణి కాగలదు. ఎడమ స్తనంపై గానీ, చెవి, గుండె, చేతులపైగానీ ఉలిపిరి కాయైనా, అంతే పరిమాణం గల పుట్టుమచ్చయినా గానీ కల మహిళ తొలికాన్పులోనే సలక్షణుడైన పుత్రుని కంటుంది. రక్తవర్ణ పాదాలతో, ఎత్తు ఎక్కువగా లేని కాలిపై భాగంతో, చిన్న చీల మండలతో, సుందరములై కలిసియుండే వేళ్ళతో, లేత అరుణ నయనాలతో విలసిల్లే వనిత అదృష్టవంతురాలై అన్ని సుఖభోగాలకూ అర్హురాలవుతుంది. పెద్ద పెద్ద పాదాలు, అన్ని అంగాలపై రోమాలు, లావుగా నున్న చేతులు గల చేడియ దాసీదౌతుంది. పెద్ద పాదములు, వికృతవదనము, పైపెదవిపై రోమాలు వుండే పడతి పతి మరణానికి ప్రధాన కారణం కాగలదు.


ఉంగరాలు తిరిగే తలవెండ్రుకలు, కోలముఖం, దక్షిణావర్తమైన నాభి గల స్త్రీ తన పురుషుని వంశాన్ని అన్ని విధాల వృద్ధి పఱస్తుంది. బంగారుమేని వర్ణము, ఎఱ్ఱ కమలం రంగులో అరచేతులు గల అతివ శ్రేష్టురాలు, పతివ్రత అవుతుంది. వంకరులు పోవు కేశాలూ కోలకన్నులూ గల వనిత దుఃఖాలనే ఎక్కువగా అనుభవిస్తుంది. ఆమెకు భర్తృ వియోగం కలుగుతుంది.


No comments:

Post a Comment