Thursday, 25 April 2024

శ్రీ గరుడ పురాణము (159)

 


దేవతలు, యక్షులు, సిద్ధులు, నాగులు, ఆ బలాసురుని శరీరాన్ని ఆకాశమార్గంలో గొనిపోసాగినారు. ఆ యాత్రా వేగం వల్ల అతని శరీరం తనంతట తాను ముక్కలైపోయి పృథ్విపై అక్కడక్కడ పడినది.


సముద్రాల్లో, నదుల్లో, పర్వతాల్లో, వనాల్లో, మైదానాల్లో ఎక్కడెక్కడ రంచమాత్రమైనా (అత్యల్పపరిమాణం) ఆ మహాదాత శరీర శకలాలు పడ్డాయో, అక్కడక్కడ, రత్నాల గనులేర్పడ్డాయి. వాటి నుండి వెలికితీయబడిన రత్నాలకూ (వజ్రాలకూ) అద్భుత శక్తులున్నట్లు కనుగొనబడింది. రత్నాలలో వజ్రం, ముక్తిమణి, పద్మరాగం, మరకతం, ఇంద్రనీలం, వైదూర్యం, పుష్పరాగం, కర్కేతనం, పులకం, రుధిరం, స్పటికం, ప్రవాళం మొదలగు పేర్లతో ప్రత్యేక లక్షణాలతో ఇవి ప్రకాశిస్తున్నాయి. జ్ఞానపు ఆవలియొడ్డును చేరగలిగినంతగా తెలివిడి కలిగిన పారదర్శులు, విద్వజ్జనులు ఈ యీ రత్నాలకు ఆయా పేళ్ళను వాటి వాటి లక్షణాలను, కలిమి ఫలాలను కూలంకషంగా విశ్లేషించి వివేచించి పెట్టారు.


ఈ విద్వాంసులు ముందుగా రత్నం యొక్క ఆకారం, రంగు, గుణం, దోషం, పరీక్ష, మూల్యాదుల జ్ఞానాన్ని తత్సంబంధిత సర్వశాస్త్రాలనూ అధ్యయనం చేసి దాని ఆధారంగా శుభాశుభాలను నిర్ణయిస్తారు. ఈ అధ్యయనం అరకొరగా వుంటే అశుభాలు కలుగుతాయి. ఇక్కడొక విచిత్రమేమిటంటే తప్పుడు రత్నాన్ని ధరించినవారికే గాక ఆ రత్నాన్ని పెట్టుకొమ్మని సలహా ఇచ్చిన వారికి కూడ దుష్ఫలితాలు కలుగుతుంటాయి. కాబట్టి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన తరువాతనే రత్నశాస్త్రులయ్యే సాహసం చేయాలి.


ఐశ్వర్యాన్ని కోరుకొనేవారు గాని ఇతరులు గాని బాగా పరీక్ష చేయబడిన, అత్యంత శుద్ధమైనవిగా ధ్రువీకరింపబడిన రత్నాలనే ధరించాలి. రాజులైతే అట్టి రత్నాలను సంగ్రహించి వుంచాలి. కొన్నింటిని కాలానుగుణంగా ధరించాలి.


ఇక రత్న ప్రభావాల విషయానికొస్తే సర్వ ప్రథమంగా మహాప్రభావశాలిగా చెప్పబడుతున్న వజ్రం గురించి తెలుసుకోవాలి.


No comments:

Post a Comment