Tuesday 9 April 2024

శ్రీ గరుడ పురాణము (145)

 

అలాగుండి, దింపుడు కనులు కూడా వుండేవానికి పుత్రసంతానం కలుగదు; కలిగినా మిగలదు. నాల్గు కోణముల ముఖమున్నవాడు ధూర్తుడు.


కమలదళాల వలె కోమలములై కాంతివంతములైన కపోలాలు కలవాడు జీవితంలో కూడ శ్రేష్ఠ కాంతులతో ప్రకాశిస్తాడు; ధనవంతుడై స్వయంకృషితో పైకొస్తాడు. దానిమ్మపూవుతో సమానమైన నేత్రములున్నవాడు రాజు కాగలడు. పులి కన్నుల వాడు ముక్కోపి, ఎండ్రి కన్నులవాడు జగడాల మారి, పిల్లి లేదా హంస కన్నులున్నవాడు అధముడు అవుతారు. తేనెరంగు పింగలవర్ణము కలిసిన కనుల చాయగల వానిని లక్ష్మి ఎన్నడూ విడచి పెట్టదు. గోరోచనము, గురిగింజ, హరతాలము (వేషగాళ్ళు ముఖానికి పూసుకొనే పసుపు రంగు) కలిసిన పింగళవర్ణనేత్రుడు బలవంతుడు ధనవంతుడు.


నుదురు అర్ధచంద్రాకారంలో నున్నవాడు రాజు కాగలడు. పెద్ద నుదురు ధనసూచకం. చిన్న నుదురు ధర్మాత్మునికుంటుంది. లలాటమధ్యంలో అయిదు అడ్డరేఖలున్నవారు నూరేళ్ళు ఐశ్వర్యవంతులై జీవిస్తారు. నాలుగు రేఖలుంటే ఎనభై, మూడుంటే డెబ్బది, రెండుంటే అరవై, ఒకటుంటే నలభైయేళ్లు జీవిస్తారు. నుదుటిపై ఒక గీతా లేనివారికి పాతికేళ్ళే ఆయుర్దాయము. ఈ రేఖలు చిన్నవిగా ఉండే వ్యక్తికి ఆరోగ్యముండదు. లలాటంలో త్రిశూల చిహ్నంగాని, పట్టిసం గుర్తుగాని వున్నవాడు గొప్ప ప్రతాపవంతుడు, కీర్తి సంపన్నుడునైన రాజు కాగలడు.


శిరస్సు గొడుగులాగ వుండేవాడు రాజవుతాడు. పొడవు తలవాడు దరిద్రుడు, దుఃఖితుడు కాగలడు. గోళాకారంలో వుండి సమానమైన పొడవు వెడల్పులున్న తల గల గలవాడు సుఖపడతాడు. ఏనుగు తల ఆకారంలో శిరస్సు గలవాడు రాజసమానుడవుతాడు. విరలంగా, స్నిగ్ధమై, కోమలమై, తుమ్మెదల లేదా కాటుక రంగులో నున్న కేశములు గలవాడు అన్ని సుఖాలూ అనుభవిస్తాడు, రాజు కూడా కాగలడు. కఱకుగా బెరుకుగా వుండే కేశాలున్నవాడు, ముందు వైపు ముక్కలగు తల వెండ్రుకలున్నవాడు ఎక్కువగా దుఃఖాలనే అనుభవిస్తాడు.


(అధ్యాయం 63)


No comments:

Post a Comment