పాము పొట్టవలె పొట్ట ఉన్నవాడు అధిక భోజనుడు, దరిద్రుడు అవుతాడు. విశాలంగా వెడల్పుగా, గంభీరంగా, గుండ్రంగా నున్న బొడ్డు గల పురుషునికి ధనధాన్యాలూ సకల భోగాలూ వుంటాయి. పొట్టిగా నీచంగా వుండే నాభి గల వానికి ఎన్నో దుఃఖాలు సంక్రమిస్తాయి. బలికి (అనగా బొడ్డుకి పైన కడుపులోపడే సన్నటి మడత) క్రింద విషమంగా వుండే బొడ్డు గలవానికి ధనహాని కలుగుతుంది. దక్షిణావర్త నాభి బుద్దికీ, ఎడమవైపు వంగే బొడ్డు శాంతికీ సూచకాలు. నూరు దళాల కమలానికి వుండే కర్ణికలాంటి నాభి మహారాజు లక్షణం. పొట్టలో ఒక సన్నటి మడత వున్నవాడు శస్త్రంచే చంపబడతాడు. రెండున్నవాడు స్త్రీ భోగి, మూడున్నవాడు రాజు లేదా ఆచార్య పీఠము, నాలుగున్నవాడు అనేక పుత్రవంతుడు అవుతారు.
భుజాలు గట్టిగా, పుష్టిగా, సరిసమానంగా నున్న నరుడు రాజవుతాడు; సుఖపడతాడు. వక్షస్సు ఉన్నతంగా, సాపుగా, పుష్టిగా, విశాలంగా నున్నవాడు రాజ సమానుడవుతాడు. దట్టమైన రోమాలుండి, ఎగుడు దిగుళ్ళుగా, ఆర్చుకుపోయినట్లుండే వక్షం దరిద్రుడి కుంటుంది. వక్షం రెండు వైపులా సమానంగా ధనవంతుడికుంటుంది. పుష్టిగా వుండే వక్షఃస్థలం శూర వీర లక్షణం. గడ్డము వంకరగా వుండేవాడు ధనహీనుడు; ఉన్నతంగా సమానంగా వుండేవాడు భోగి. బలంగా లేకుండా అణగియున్నట్లుగా కనిపించే మెడ ధనహీనుని లక్షణం. ఎద్దు మెడలాగా పుష్టిగా వుండే మెడ శూర వీర లక్షణం. లేడి మెడవాడు దానిలాగే పిరికివాడుగా వుంటాడు. చిలుక, ఒంటె, ఏనుగు, కొంగల మెడల వలె పొడవుగా నుండి, శుష్కించినట్లుడే మెడ గలవాని వద్ద ధనం నిలువదు. చిన్న మెడవాడు ధనికుడు, భోగి కాగలడు. పుష్టి, దుర్వాసనలేమి, సమత, చిన్న రోమాల కలిమి బాహు మూలములకు మంచి లక్షణాలు. అవి ఐశ్వర్యవంతుని కుంటాయి.
భుజాలు పైకి లాగబడినట్లుండేవాడు బంధనాల్లో పడతాడు. చిన్న భుజాలు దాసుడికీ ఎగువ దిగువ భుజాలు దొంగకీ వుంటాయి. ఆజానుబాహువులు సర్వశుభ లక్షణం. చేతిపై భాగంలో గోతులున్నవాడికి పిత్రార్జితం లభించదు, పిరికితనం కూడా వుంటుంది.
ఎత్తుగా వుండే కరతలమున్నవాడు దాని కాగలడు. కరతలం విషమంగా వుండే వాడి జీవితం కూడా కలిమి లేముల మయమవుతుంది. లక్కవలె ఎఱ్ఱనైన అరచేతులు కలవాడు
రాజవుతాడు. పచ్చని కరతలం వాడికి జీవితంలో ఒక గమ్యముండదు. అదే నల్లగా,
నీలంగా వుంటే మత్తు పదార్థాలు సేవించే వాడవుతాడు. గరుకుగా వుంటే నిర్ధనుడౌతాడు.
చంద్రమండలము వంటి ముఖమున్నవాడు ధర్మాత్ముడవుతాడు. తొండం ఆకారంలో ముఖమున్నవాడు భాగ్యహీనుడు. వంకరగా, ముక్కలనతికినట్లుగా, సింహం ముఖం వలె
ముఖమున్నవాడు దొంగ కాగలడు. సుందరమై కాంతియుక్తమై, మంచి జాతికి చెందిన
ఏనుగు వలె పరిపుష్టమైన వదనము రాజ లక్షణము. గొట్టె కోతి ముఖ కవళికలు ధనవంతునికుంటాయి. సాధారణం కంటె పెద్ద, చిన్న, పొడవైన ముఖాలు క్రమంగా దరిద్ర, మూర్ఖ, పాపాత్మ లక్షణాలు. పురుషుని ముఖం ఆడదాని ముఖంలా వుండకూడదు.
No comments:
Post a Comment