Tuesday 23 April 2024

శ్రీ గరుడ పురాణము (157)

 


స్వరోదయ విజ్ఞానం


మనిషి గొంతు ద్వారా చేసే కొన్ని కొన్ని శబ్దాలు, పలికే స్వరాలు కూడా కొన్ని కొన్ని కార్యాల శుభాశుభ ఫలితాలను సూచింపగలవు.


మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులుంటాయి. ఇవి నాభి ప్రదేశానికి దిగువగా వుండే కందస్థాన లేదా మూలాధారము నుండి బయలుదేరి శరీరమందంతటా విస్తరించి వుంటాయి. డెబ్బది రెండు వేల నాడులు నాభి మధ్య భాగంలోనే చక్రాకారంలో నిలచి వుంటాయి. వీటిలో వామ, దక్షిణ, మధ్యమ నామకాలైన మూడు శ్రేష్ఠ నాడులుంటాయి. వీటినే క్రమంగా ఇడా, పింగళా, సుషుమ్లా నాడులని వ్యవహరిస్తారు. వీటిలో వామ నాడి చంద్రుని వలెనూ దక్షిణ నాడి సూర్యుని వలెనూ, మధ్యమ నాడి అగ్ని వలెనూ ఫలాలనిస్తాయి. ఇవి కాలరూపిణులు.


వామనాడి అమృత రూప. ఇది జగత్తుని బ్రతికించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనిని 'ఆప్యాయితా' అంటారు. దక్షిణ నాడి తన రౌద్రగుణం వల్ల జగత్తుని మాడ్చేస్తుంది. అంటే శోషిల్లజేస్తుంది. శరీరంలో ఈ రెండు నాడులూ ఒకేసారి ప్రవహిస్తే అన్ని కార్యాలూ నాశనం కావచ్చు, మృత్యువే సంభవించవచ్చు.


యాత్రాదులకు బయలుదేరినప్పుడు వామనాడీ ప్రవాహమూ, ప్రవేశ సమయంలో దక్షిణ నాడీ ప్రవాహమూ శుభకారకములని గ్రహించాలి. చంద్రుని వలె జగత్తుకి కూడా ఆనందాన్ని కలిగించే కార్యాలను, సౌమ్యకార్యాలను ఇడా అనగా వామనాడి శ్వాసప్రవాహ కాలంలో జరపాలి. సూర్యసమాన, తేజస్వీ సమక్రూర కార్యాలను ప్రాణవాయువు పింగళ నాడి ద్వారా ప్రవహిస్తున్నప్పుడు చేపట్టాలి. యాత్రల్లో సర్వసామాన్య కార్యములందూ, విషాన్ని వదలగొట్ట వలసి వచ్చినపుడూ ఇడా నాడీ ప్రవాహం ప్రశస్తము. భోజనం, మైథునం, యుద్ధారంభాలలో పింగలనాడి సిద్ధిదాయకమవుతుంది. ఉచ్చాటన (మంత్ర) అభిచార కర్మలలోకూడా పింగల నాడి చలించాలి.


ముఖ్యంగా రాజులు మైథున, సంగ్రామ, భోజన సమయాల్లో శ్వాస కుడివైపున్న నాసికా రంధ్రంలోంచి బాగా ప్రవహిస్తోందో లేదో చూసుకోవాలి. అలాగే ఆయా అవసరాల్లో ఇడా నాడి ప్రవాహాన్నీ ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ వుండాలి. రెండు నాడులూ సమానంగా ప్రవహిస్తున్నపుడు ఏ ప్రముఖ కార్యాన్నీ మొదలెట్టకూడదు. విద్వాంసులైతే అటువంటి సమయాన్ని విషంతో సమానంగా పరిగణించి జాగ్రత్త పడాలి.


No comments:

Post a Comment