Friday 26 April 2024

శ్రీ గరుడ పురాణము (160)

 


బలాసురుని ఎముకలు ఎక్కడెక్కడైతే పడ్డాయో అక్కడ అవి వజ్రాలుగా నానా రూపాలలో ఏర్పడ్డాయి. హిమాచల, మాతంగ, సౌరాష్ట్ర, పౌండ్ర, కళింగ, కోసల, వేణ్వాతట, సౌవీర అను పేర్లు గల ఎనిమిది భూభాగాలు వజ్రక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. హిమాలయంలో పుట్టిన వజ్రాలు తామ్రవర్ణంలోనూ; వేణుకాతటంలో ప్రాప్తించినవి చంద్ర సమాన శ్వేతకాంతులలోనూ; సౌవీర దేశంలో లభిస్తున్నవి నీలకమల, కృష్ణమేఘ వర్ణంలోనూ; సౌరాష్ట్ర ప్రాంతీయ వజ్రాలు తామ్రవర్ణంలోనూ, కళింగ దేశీయ వజ్రాలు బంగారు రంగులోనూ వెలుగులను విరజిమ్ముతూ వుంటాయి. ఈ కోవలోనే చెప్పుకోతగ్గ కోసల దేశీయ వజ్రాల వర్ణం పసుపు పచ్చ కాగా పుండ్ర దేశీయ వజ్రాలు శ్యామల వర్ణంలోనూ మతంగ క్షేత్రపు వజ్రాలు లేత పసుపు రంగులోనూ వుంటాయి.


ఒక కొన్ని ప్రత్యేక లక్షణాలున్న వజ్రంలో నిత్యం ఎవరో ఒక దేవత నివసిస్తుండడం జరుగుతుంది. అత్యంత క్షుద్ర వర్ణం అంటే ఒక రంగు ఉందని అనిపిస్తుంటుంది గాని అది ఏ రంగో తెలియనంత లేత రంగు తొలి లక్షణం. ప్రక్కలలో స్పష్టంగా కనిపించే రేఖ, బిందు మాత్రం నలుపు కాక పదక (కాకి పాదం), త్రాసదోషరాహిత్యం, పరమాణువంత తీక్షమైన ధార - ఈ లక్షణాలు దేవవాస వజ్రానివి.


వజ్రం యొక్క రంగుని బట్టి అందులో ఏ దేవతలుంటారో శాస్త్రంలో వుంది. ఆకుపచ్చ తెల్ల, పచ్చ, పింగళ, నల్ల, రాగి రంగుల వజ్రాల్లో క్రమంగా విష్ణువు, వరుణుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, మరుత్తులు ప్రతిష్టితులై వుంటారు.


ఏయే వర్ణాల వారికేయే రంగుల వజ్రాలు (ధరించుటకు) ప్రశస్తమో కూడా శాస్త్రంలో చెప్పబడింది. బ్రాహ్మణులకు శంఖ, కుముద, లేదా స్పటిక సమాన శుభ్ర వర్ణమున్న వజ్రాలు ప్రశస్తం. క్షత్రియులు శశ (చంద్ర) వర్ణం లేదా బభ్రు- ధూర వర్గాలు లేదా కనుపాపల రంగులో నుండు వజ్రాలను ధరించడం మంచిది. వైశ్యులు కుంకుమ లేదా లేత అరిటాకు రంగులో వున్న వకాలను పెట్టుకోవాలి. శూద్రులకు వెండి రంగులో నున్న వజ్రాలు శ్రేష్టం.


విద్వాంసులు రాజులకు ముఖ్యంగా రెండు రంగుల వజ్రాలు మిక్కిలి ప్రశస్తమనీ ఇవి మిగతా వర్ణాలకు అంతగా మేలు చేయవనీ చెప్తారు. జవావర్గం (ఎరుపులో ఒక రకం?), పగడ సమాన రక్తవర్ణం కలిపి వున్న వజ్రం లేదా మామిడిపండు రసం వంటి పసుపు రంగు వజ్రం రాజులకు లాభదాయకం.



No comments:

Post a Comment