అరచేతి భాగాలు అణగిపోయినట్లుండేవారికి పిత్రార్జితం దక్కదు. మణికట్టు చక్కగా, బలంగా, సుగంధయుక్తగా వుండడం రాజ లక్షణం. ముక్కలుగా, భాగాలు కలిపినట్లుగా, శబ్దం చేస్తూ వుండే మణికట్టు గలవారు నిర్ధనులూ, నీచప్రవృత్తి గలవారూ కాగలరు.
గోళాకారంలో, లోతుగానున్న అరచేతులు ధనవంతులకుంటాయి. ఉన్నత కరతల మున్నవారు దాతలూ, విషమభాగాలున్నవారు కఠోర మనస్కులూ కాగలరు. లక్క రసం రంగులో అరచేతులున్నవారు రాజులవుతారు. పసుపు రంగు అరచేతులున్నవారిలో వ్యభిచరించే లక్షణముంటుంది. గరుకుగా అరచేతులున్నవారు నిర్దనులవుతారు.
ఊక (పొట్టు) రంగులో గోళ్ళున్నవారు నపుంసకులౌతారు. కుటిలంగానూ, బద్దలుగానూ గోళ్ళున్నవారు ధనహీనులవుతారు. రంగు విరిగినట్లున్న గోళ్ళున్నవారు తర్కం చేస్తారు. రాగివర్ణంలో రక్తం కనిపిస్తూ వుండే గోళ్ళున్నవారు రాజులు కాగలరు.
బొటనవ్రేలిలో యవచిహ్నము అత్యధిక ధనప్రాప్తి గల వారికుంటుంది; వైభవం కూడా వుంటుంది. అంగుష్ఠ మూలభాగంలో యవచిహ్నమున్న వారికి అధిక పుత్రసంతానం ప్రాప్తిస్తుంది. వేళ్ళలోని పర్వాలు పొడవుగా నున్నవారు పుత్రపౌత్రాభివృద్ధిని చూస్తూ చాలా కాలం జీవిస్తారు. విరళాంగళులు దారిద్య్ర సూచకములు. సఘనాంగళులున్నవారు ధన సంపన్నులవుతారు. మణికట్టులో పుట్టిన మూడురేఖలు కరతల భాగాన్ని దాటుకొని పోయి వ్రేళ్ళదాకా వెళితే చాలా మంచిది. అది చక్రవర్తి లక్షణము.
అరచేతిలో రెండు మీనరేఖలున్నవారు యజ్ఞకర్తలూ, దాతలూ అవుతారు; వజ్రాకార ముంటే ధనవంతులు, చేపతోక వంటి గుర్తులుంటే విద్వాంసులూ కాగలరు.
No comments:
Post a Comment