Tuesday, 2 April 2024

శ్రీ గరుడ పురాణము (138)

 


యాత్రలో ఎడమవైపు నక్క, ఒంటె, గాడిద కనిపించడం మంగళప్రదమే. కాని పత్తి, మందులు, నూనె, రగులుతున్న, అగ్ని జుట్టు విరబోసుకున్న మనిషి, పామును పట్టుకున్న వాడు, నగ్నంగా నున్న పెద్దవారు కనిపించడం అశుభసూచకం; మంచిది కాదు.


తుమ్ములు కూడా అన్నీ చెడ్డవి కావు. తూర్పు వైపు తుమ్ము వినిపిస్తే మంచిది. పడమటి నుండి తుమ్ము వినిపిస్తే తీపి పదార్థాలు లభిస్తాయి. వాయవ్యం నుండి వినిపిస్తే ధనప్రాప్తి వుంటుంది. ఉత్తరం వైపు నుండి వినిపిస్తే కలహం వస్తుంది.


ఆగ్నేయం నుండి తుమ్ము వినిపిస్తే శోక, సంతాపాలు కలుగుతాయి. దక్షిణం వైపు నుండైతే హాని వస్తుంది. నైరృత్యం ఆగ్నేయం వలెనే ఈశాన్యం వైపు నుండి వినిపించే తుమ్ము అత్యంత ప్రమాదకరం; మరణసమానమైన కష్టాలు కలుగుతాయి.


సూర్యభగవానుని ప్రతిమను మనిషి ఆకారంలోనే చేయాలి. సూర్య ప్రతిమను తయారు చేసిన రోజున ఆయన ఏ నక్షత్రంలో వున్నాడో చూసుకొని దాని నుండి మూడు తారలను లెక్కగట్టి వాటిని ఆ ప్రతిమ యొక్క మస్తకంపై నిర్మించాలి. ఆ రోజు వున్న నక్షత్రాన్ని ముఖంపై అంకితం చేయాలి. దానికి తరువాత వచ్చే నక్షత్రాలను భుజాలపై స్థాపించాలి. వాటి తరువాత రెండింటిని ఇరుహస్తాలపై చిత్రించాలి. అనంతరం వచ్చే అయిదు నక్షత్రాలనూ ప్రతిమ హృదయంపై లిఖించి, తరువాతి దానిని నాభి మండలం లోనూ, ఆ తరువాత నక్షత్రాన్ని పిరుదుల మధ్యా లిఖించాలి. తరువాత రెండు తారలను మోకాళ్ళపైనా, మిగిలిన వాటిని సూర్యదేవుని చరణాలపైననూ లిఖించాలి.


ఇక సూర్య చక్రం వివరాలను వినండి. దాని చరణాలపై జాతకుని జన్మ నక్షత్రం పడితే వాడు అల్పాయుష్కుడౌతాడు. మోకాళ్ళపై పడితే విదేశయానం చేస్తాడు. గుహ్యస్థానం పై పడితే స్త్రీలతో నెక్కువగా సుఖించేవాడవుతాడు. నాభిస్థానంపై పడితే అల్పసంతోషి అవుతాడు. జన్మనక్షత్రం సూర్యదేవుని హృదయస్థానం పై పడ్డవాడు మహేశ్వరుని యంతవాడు కాగలడు. చేతులలోపడితే దొంగవుతాడు. భుజాలపై అయితే అస్థిరుడూ, కంధాలపైనైతే (కుబేరునంత) ధనికుడూ, ముఖంపైనేతే తీపి పదార్థాలు ప్రాప్తించేవాడూ కాగలరు. 


మహేశా! ఏ మనిషి జన్మనక్షత్రమైతే సూర్యుని మస్తకంపై నున్న నక్షత్రమవుతుందో అతడు నిత్యం పట్టు వస్త్రాలే ధరించు ప్రధాన వ్యక్తి కాగలడు. 


(అధ్యాయం -60)


No comments:

Post a Comment