Saturday 20 April 2024

శ్రీ గరుడ పురాణము (154)

 


నాభి, స్వరం స్వభావం - ఈ మూడూ గంభీరంగా వుండాలి. లలాటం, ముఖం, వక్షస్థలం విశాలంగా వుండాలి. నేత్రాలు, కక్షలు, నాసిక, మెడ, తల, దీర్ఘంగా ఎత్తుగా వుండాలి. జంఘలు, గొంతు, లింగము, పిరుదులు పొట్టిగావుండాలి. నేత్రాంతాలు అనగా కనుకొలకులు, అరికాళ్ళు, నాలుక, పెదవులు - ఈ యేడూ రక్తవర్ణంలో వుండాలి. దంతాలు, వేళ్ళు, పర్వాలు, గోళ్ళు, కేశాలు - ఈ అయిదూ పొడవుగా వుండాలి. అలాగే స్తనాల మధ్యభాగమూ, రెండు భుజాలూ, దంతాలూ, నేత్రాలూ, నాసికా, దీర్ఘంగా వుండడం కూడా శుభలక్షణాలే.” 


స్త్రీల ప్రత్యేక లక్షణాలను సముద్రుడీ* విధంగా తెలిపాడని విష్ణుభగవానుడూ సూతమహర్షీ ప్రవచింపసాగారు. (* ఈ శాస్త్రం సముద్రునిచే కొంత వ్రాయబడి మరింత క్రోడీకరింపబడి ఆయన చేతనే ప్రపంచానికి ప్రసాదింపబడిది కాబట్టి ఆయన పేరిటనే సాముద్రికశాస్త్రంగా ప్రసిద్ధి గాంచింది. అయితే దీనిని ప్రారంభించినవారు మాత్రం 

శివపుత్రుడైన కార్తికేయుడు. ఈ మహావిషయం భవిష్య పురాణంలో వివరంగా చెప్పబడింది.) 


"రెండు పాదాలూ నున్నగా, సమాన తలాలతో, రాగి రంగులో మెరుస్తూ వుండే గోళ్ళతో, చిక్కని వేళ్ళతో, ఉన్నత అగ్రభాగాలతో నుండుట మహారాజ్ఞీ లక్షణము. ఈ లక్షణమున్న స్త్రీని పెళ్ళాడినవాడు తప్పనిసరిగా రాజవుతాడు.


గూఢమైన చీలమండలూ, పద్మపత్ర సమానాలైన అరికాళ్లూ శుభలక్షణాలు. చెమట పట్టని అరికాళ్ళు శుభసూచకాలు. వాటిలో మీన, అంకుశ, ధ్వజ, వజ్ర, పద్మ, హల చిహ్నాలున్నామె రాణి అవుతుంది. రోమరహిత, సుందరశిరావిహీన, కోలజంఘలున్న స్త్రీ శుభలక్షణం.


No comments:

Post a Comment