Saturday, 31 August 2024

శ్రీ గరుడ పురాణము (280)

 


సుందరమైన స్వచ్ఛమైన నీటిలో మాలిన్యాన్ని పోస్తే తాగడానికి పనికిరాకుండా పోతుంది. అలాగే దుష్టునితోడి సాంగత్యం వల్ల మంచివాడు చెడిపోతాడు. (అటునుంచి ఇటుకాదు)


దుర్జనస్యహి సంగేన సుజనోఽపి వినశ్యతి । 

ప్రసన్నమపి పానీయం కర్దమైః కలుషీకృతం ॥


ధనాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తేనే ఆ ధనం సద్వినియోగమయిందనుకోవాలి. అంతేగాక సాధ్యమయినంతగా బ్రాహ్మణులను సర్వవిధాలా సన్మానించుకోవాలి. బ్రాహ్మణులు తినగా మిగిలినదానిని తినుటయే ఉత్తమ భోజనకర్మ అనబడుతుంది. పాపము చేయనివాడే బుద్ధిమంతుడు. హితము చెప్పి చేయువాడే మిత్రుడు. దంభరహితంగా, అనగా డాబు డప్పాలతో గొప్పలు చెప్పుకోకుండా ఆచరించే ధర్మమే వాస్తవిక ధర్మాచరణం.


తద్భుజ్యతేయ ద్విజ భుక్తశేషం 

సబుద్ధిమాన్ యోన కరోతిపాపం ।

తత్ సౌహృదం యత్రియతే పరోక్షే 

దంభైర్వినాయః క్రియతే స ధర్మః ॥


వృద్ధజనులు లేని సభ సభేకాదు. ధర్మోపదేశం చేయని వృద్ధుని వృద్ధునిగా పరిగణించరు. సత్యము నిముడ్చుకోని ధర్మము ధర్మమూ కాదు, కపటంతో నిండిన సత్యం సత్యమూ కాదు. కపటసత్యమనగా ఒక మనిషి చేసిన మంచిపనిని మన వాదనా పటిమతో కపట వ్యూహరచనాశక్తితో చెడ్డపనిగా నిరూపించి మనము లాభము పొందునట్టిది. ఇక్కడ మనం చెప్తున్నది సత్యమేకాని వక్రించి చెప్తాం. (ఉదాహరణకి పరశురాముడు కర్ణుని శపించడం సత్యమే. కాని కర్ణుడు బ్రాహ్మణుడు కాడు కాబట్టి శపించేశాడని చాలమంది అనేస్తున్నారు. పరశురాముడు బ్రాహ్మణులకే విద్య చెప్తానని 'బోర్డు' పెట్టుకొని కూర్చొనలేదు. భీష్మునికి పరశురాముడే గురుదేవుడు. ఆయన బ్రాహ్మణుడు కాదు కదా! పరశురాముడు కర్ణుని, అబద్ధమాడి మోసం చేసి విద్యను సంగ్రహించాడని కోపించి శపించాడు. కర్ణుడు శపింప బడడంసత్యమే. ఆతడు ఇతరులతో చెప్పుకున్నది మాత్రం కపటసత్యం. ఏకలవ్యుని విషయంలో కూడా ఇలాంటి కపట సత్యాలెన్నో జనశ్రుతిలో వున్నాయి. విశ్వనాథ పావని శాస్త్రిగారి 'ఆచార్య దాక్షిణ్యం' అనే నాటకం చదివితే ఆ కపట సత్యాలన్నీ కాలి బూడిదై పోతాయి.


నసాసభాయత్ర న సంతివృద్ధాః 

వృద్ధా నతే యేన వదంతి ధర్మం |

ధర్మః సనోయత్ర న సత్యమస్తి 

నైతత్ సత్యం యచ్ఛలే నానువిద్ధం ॥


(ఆచార .. 115/52)


మనుష్యులలో బ్రాహ్మణులు (అంటే కులం కాదు వర్ణధర్మం మాత్రమే) తేజస్సులో ఆదిత్యుడు, శరీరంలో శిరస్సు, వ్రతాలలో సత్యవ్రతం శ్రేష్ఠతమాలు.

No comments:

Post a Comment