Monday 15 July 2013

గ్రామదేవతను ప్రాధాన్యం ఏమిటి?

గ్రామదేవతయే గ్రామానికి అధిష్టాన దేవత. గ్రామదేవతలను ఈరోజున మనం మర్చిపోతున్నాం కాని మన సంస్కృతిలో గ్రామదేవతలకు పెద్దపీట వేశారు. గ్రామదేవతలు ఆదిశక్తి అంశలు, ప్రకృతి శక్తులు అంటుంది దేవీ భాగవతం. పేర్లు ఏవైనా కావచ్చు, ఆరాధానపద్ధతి మారవచ్చు కానీ శక్తి ఒక్కటే. దేశమంతా ప్రతి ఊళ్ళో ఒకటే శక్తిని కొలుస్తోంది.


మనం ఉండే ఊరి నుంచి ఇతర ప్రదేశానికో, లేక తీర్ధయాత్రకో తరలిపోయే ముందు, మనం నివసిస్తున్న ఊరి గ్రామదేవతను దర్శించాలి.

సర్వదా సర్వదేశేషు పాపుత్వాం భువనేశ్వరీ
మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానంద రూపిణీ

అని శ్లోకం చెప్పాలి.

సకల భువనాలకు ఈశ్వరి, మహామాయ, జగత్తును భరించే దానివి, సచ్చిదానందస్వరూపిణి, ఓ అమ్మా! ఎల్లప్పుడూ, అన్ని ప్రదేశాల్లో నన్ను రక్షించు అని శ్లోకార్ధం.

 ఊరి నుంచి ఏ కారణం చేత బయటకు వెళ్తున్నామో ఆమెకు చెప్పాలి. ఆమెకు మనం ఏ కారణం చేత వెళుతున్నామో  తెలియక కాదు, ఇన్నాళ్ళు మనందరిని రక్షిస్తూ ఉన్నది ఆవిడే కదా. మనమంతా రాత్రి హాయిగా పడుకున్న సమయంలో ఊరిలోకి ఏ దుష్టశక్తులు రాకుండా ఉండేందుకుగానూ ప్రతి రోజు రాత్రి గ్రామసంచారం చేస్తుంది గ్రామదేవత. మనకోసం అమ్మ నిద్రపోకుండా తిరిగుతుంటే మరి ఆమెను విస్మరించడం తగదు కదా. అందుకుగానూ ఆ చల్లనితల్లికి కృతజ్ఞలు చెప్పాలి. ఉదాహరణకు ఎవరైనా చదువు కోసం ఏ విదేశానికో వెళ్తున్నారనుకోండి. అప్పుడు అమ్మవారి దగ్గరకు వెళ్ళి అమ్మా! నేను నా ఉన్నత విద్య కోసం ఫలాన చోటుకు వెళ్తున్నాను తల్లీ. నీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండేలా అనుగ్రహించు అని ఆవిడను కోరాలి. మన వెళ్ళిన పని పూర్తియై తిరిగి మన ఉంటున్న గ్రామం/పట్టణం లోకి రాగానే మళ్ళీ గ్రామదేవత దర్శనం చేసుకోవాలని పెద్దల మాట. మన ఇంటిలో ఏ శుభకార్యం జరిగిన ముందుగా గ్రామదేవతకు ఆహ్వానం పంపాలి. సారె ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు. దేశాధినేతలు మొదలైనవారికి Protocol ఉన్నట్లే, దీనికి కూడా ఉంది. ముందు కులదేవతను స్మరించాలి. గణపతి, కులదేవత, ఇష్టదేవత, గ్రామదేవత,.... అలా ఉంటుంది.

మనం సొంతఊరు వదిలి వేరే ఊరికి జీవనం కోసం వెళ్ళినా, ముందు గ్రామదేవతను ప్రార్థించి కదలాలి. కొత్తగా స్థిరపడే ఊళ్ళో, లేదా పట్టణంలో అక్కడి గ్రామదేవతను అనుమతి అడిగి, ఆవిడను దర్శించి ప్రవేశించాలి. గ్రామదేవత అనుమతి లేకుండా ఎవరూ కొత్త ఊర్లలోకి వెళ్ళలేరు. అందుకే ఆవిడకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అక్కడి సంప్రదాయ పద్ధతిలో పూజించాలి.

గ్రామదేవత అంటే ఆ గ్రామంలో ఉండే అందరి ఇంటి ఆడపడుచు. ఆమెయే రాత్రి గ్రామసంచారం చేస్తూ గ్రామంలోకి అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది. గ్రామదేవతను ఎప్పుడూ విస్మరించకూడదు. తరుచుగా గ్రామదేవతను దర్శించుకోవాలి.

పిల్లలకు వచ్చే జ్వరాలు, వారికి ఉన్న బాలారిష్ట దోషాలను శమింపజేసే శక్తి గ్రామదేవతలకు ఉంది.

గ్రామదేవతల ఆలయాలకు ప్రత్యేకించి ఆగమాలు ఉండవు. అక్కడి అమ్మవారిని అందరూ దగ్గరకు వెళ్ళి పూజించవచ్చు. ఆ సదుపాయాన్ని శాస్త్రమే కల్పించింది. ఆ అమ్మవారికి ఎవరి పూజ వారు చేసుకోవచ్చు. గ్రామదేవతలకు నివేదనగా చద్ది పెడతారు, చద్ది అంటే పెరుగన్నం. చద్ది పెట్టడం వలన అమ్మవారు చల్లగా చూస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉల్లిపాయలు కూడా నివేదిస్తారు. అమ్మవారికి ఇచ్చే నైవేధ్యంలో ప్రధానంగా చద్ది, పుట్నాలపప్పు, బెల్లం, ఉల్లిపాయలు ఉంటాయి.

కొన్ని గ్రామాలకు ఆ గ్రామదేవత పేరు ఆధారంగానే పేరులు వచ్చాయి. అందుకు ఉదాహరణ ముంబాయి నగరం. ముంబాయి గ్రామదేవత ముంబాదేవి. ఆవిడకు ప్రత్యేక ఆలయం కూడా ఉంది.

ఈ రోజుకి కొన్ని గ్రామాల్లో ప్రజలు రాత్రి ఒకానొక సమయం దాటాక బయట తిరగరు. ఆ సమయంలో గ్రామదేవత సంచారానికి వస్తుందని చెప్తారు. తూర్పుగోదావరి జిల్లా 'లోవ' (విశాఖపట్టణానికి దగ్గరలో ఉన్నది) అనే గ్రామానికి అధిదేవత తలుపులమ్మ తల్లి. అక్కడ సాయంత్రం ఒక నిర్ణీత సమయం దాటక మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది. అప్పుడు తలుపులమ్మతల్లి అక్కడ సంచరిస్తుందని, ఆ సమయంలో అక్కడ ఉంటే మరణం తప్పదని అక్కడి ప్రజలు చెప్తారు.      

Originally Published: 15-July-2013
1st Edit: 1-August-2015 

No comments:

Post a Comment