Sunday 3 May 2015

హిందూ ధర్మం - 157 (అధర్వణవేదం)

Adharvana veda

4. అధర్వణవేదం - అధర్వ, అంగీరసులు దర్శించి అందించిన వేదం కనుక దీనికి అధర్వణ వేదమని, అధర్వాంగీరసమని పేర్లు. పరబ్రహ్మం గురించి చెప్తుంది కనుక దీనికి బ్రహ్మవేదమని, ఆనందాన్నిస్తుంది కనుక ఛందోవేదమని దీనికి పేర్లు. నిరుక్తం 11.18 ప్రకారం ఏ వేదం వలన అన్ని రకాల సందేహాలు, లోపాలు తొలగిపోతాయో దాన్నే అధర్వణవేదం అంటారు. ఇందులో చెప్పబడ్డ జ్ఞానం, కర్మాచరణ, సాధన వివిధ రకాల శాస్త్రాలకు పరిపూర్ణతను ఇస్తుంది. అది సామాజిక శాస్త్రమైనా, భౌతిక శాస్త్రమైనా. అధర్వణవేదం విజ్ఞానము (Science), సాంకేతిక పరిజ్ఞానం (technology), ఆచరణాత్మకమైన సామాజిక శాస్త్రం (applied social sciences) మానవప్రవర్తన గురించి వివరిస్తుంది. అందువల్ల ఈ వేదంలో గణిత (mathematics), భౌతిక (physics), రసాయన (chemistry), జ్యోతిష్య (Astrology), విశ్వోద్భవ (Cosmology), వైద్య (Medicine) , వ్యవసాయ (Agriculture), వాస్తు (Engineering), రక్షణ (Military), వైమానికి (Aeronautics), సృష్టి ఆవిర్భావ, రాజకీయ (Politics), సామాజిక (Social sciences), మనస్తత్త్వ (Psychology), ఆర్ధిక (Economics) శాస్త్రాలు ఇందులో చర్చింబడిన ముఖ్యమైన అంశాలు. ఒకరకంగా చెప్పాలంటే అనేక శాస్త్రాల యొక్క ఎన్సైక్లోపీడియా (encyclopedia) అధర్వణవేదం. వైద్య, రసాయనశాస్త్రాలు ఇందులో ముఖ్యాంశాలు.

కానీ అధర్వణవేదమే అత్యధికంగా తప్పుగా అర్దం చేసుకోబడిన వేదం. 

ఈ వేదానికి 9 శాఖలుండేవి. కానీ ఇప్పుడు శౌనక, పిప్పలాద అనే 2 శాఖలు మాత్రమే మిగిలాయి. అందులో పిప్పలాద సంహితకు చెందిన ఒకే ఒక ప్రతి కాశ్మీరంలో దొరికింది. కానీ అది అసమగ్రంగా ఉంది. పిప్పలాదుని ప్రశంస ప్రశ్నోపనిషత్తులో కనిపిస్తుంది. ఈ శాఖకు 21 కాండలు ఉన్నాయని, దీని బ్రాహ్మణం  8 అధ్యాయాల గ్రంధమని తెలుస్తోంది. కానీ అది కూడా అసంపూర్తిగా దొరికింది.

ప్రస్తుతం అధర్వణ వేదానికి సంబంధించి శౌనకశాఖ ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంది. గుజరాత్, మహారాష్ట్ర బ్రాహ్మణులు దీని అధ్యయనం చేస్తున్నారు. మొత్తం అధర్వణ వేదానికి సంబంధించి గోపధ బ్రాహ్మణం ఒక్కటే లభిస్తోంది. ఇది పూర్వ, ఉత్తర భాగములుగా లభిస్తోంది. గోపధ బ్రాహ్మణం కూడా శౌనకశాఖకు చెందినదే. మొత్తం ఈ శౌనకశాఖలో 20 కాండలు, 732 సూక్తములు, 5897 మంత్రాలు ఉన్నాయి. ఈ వేదానికి సంబంధించి ఆరణ్యకాలేవీ అందుబాటులో లేవు.

అధర్వణవేదానికి సంబంధించి ప్రస్తుతం కఠోపనిషత్తు, ప్రశ్న, ముండక, మాండూక్య, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు లభ్యమవుతున్నాయి. మాండూక్యోపనిషత్తుకు గౌడపాదాచార్యులవారు కారిక రాశారు. ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతానికి ఈ ఉపనిషత్తే మూలమని ప్రసిద్ధి.

అధర్వణవేదంలో నిష్ణాతుడై యజ్ఞంలో పాల్గొనే అధర్వణవేద పండితుడిని బ్రహ్మ అంటారు. యజ్ఞసమయంలో లోపములు తలెత్తకుండా చూసుకోవడం, జరిగిన లోపాలను సవరించడం, యాగం సంపూర్ణంగా, శాస్త్రబద్ధంగా జరిగేలా చూడటం ఇతని కర్తవ్యం.

To be continued .....................

No comments:

Post a Comment