Wednesday 13 January 2016

ధనుర్మాసం - ఆండాళ్ అమ్మవారు

అంతరిక్షం మొత్తాన్ని 360°గా, 12 రాశులుగా విభజించింది జ్యోతిష్య శాస్త్రం. అందులో సూర్యుడు ప్రతి రాశిలోకి ప్రవేశించే సమయాన్నే సంక్రమణం అంటారు. సూయుడు ఒక్కో రాశిలో నెలరోజులు ఉంటాడు. అలా మనకు ఒక ఏడాదిలో 12 సంక్రాంతులు వస్తాయి. సూర్యుడు ప్రవేశించడమేంటి అనే అనుమానం వస్తుంది. భూభ్రమణంలో కలిగే మార్పులను అనుసరించి, భూమి యొక్క అక్షాంశ, రేఖాంశలను బట్టి, భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరాన్ని అనుసరించి ఈ నిర్ణయం జరుగుతుంది. మనం భూమిపై నుంచి గమనిస్తాం కనుక, సూర్యుడు ప్రవేశించాడంటున్నాం. అలా సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో మొదలవుతుంది ధనుర్మాసం. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు అత్యంత విశేషమైన మాసం ఇది. అన్ని పండుగులు చంద్రమానం ప్రకారం చేసుకున్నా, ధనుర్మాసాన్ని సౌరమానం ప్రకారం పాటిస్తాం. ధనుర్మాసం అనగానే గుర్తుకు వచ్చేది తిరుప్పావై, ఆండాళ్ అమ్మవారు, రంగవల్లులు, గొబ్బెమ్మలు.

ఆండాళ్ అమ్మవారు ఈ మాసంలో శ్రీ కృష్ణుడి గురించి వ్రతం చేసి ఆయన్ను చేరుకున్నారు. కలియుగంలో 93వ సంవత్సరంలో శ్రీ ఆండాళ్ తమిళనాట శ్రీవిల్లిపుత్తూర్ లోని వటపత్రశాయి మందిర తులసి వనంలో విష్ణుచిత్తులవారికి (పెరియాల్వార్) లభించారు ఆండాళ్ అమ్మవారు. తమిళంలో కోదై అనగా తులసి మాల అని అర్థం, తండ్రి ఆమెను కోదా అని పిలిచేవాడు, క్రమేపి ఆపేరే గోదాగా మారింది. తండ్రిపెంపకంలో ఆమెకు కృష్ణ పరమాత్మ పట్ల గొప్ప భక్తి అలవడింది. కాలక్రమంలో ఆమె కృష్ణుడినే తన పతిగా భావించింది. తన తండ్రి కృష్ణుడికి తులసి మాలలు సమర్పించేవారు, గోదాదేవి విష్ణుచిత్తులవారికి తెలియకుండా ఆ మాలలు తాను ధరించి, తను భగవంతుని వివహామాడటానికి సరిపోదునా అని చూసుకుని, మురిసిపోయి, తన తండ్రికి తెలియకుండా ఆ మాలలను యధావిధిగా బుట్టలో ఉంచేది. ఒకనాడు తండ్రికి మాలాలో వెంట్రుక కనిపిచగా, అది గోదా ధరించిందని గ్రహించి, ఒకరు ధరించిన మాలను స్వామికి సమర్పించడం తప్పని సమర్పించలేదు. ఆ రాత్రి స్వామి స్వప్నంలో కనిపించి, తనకు గోదా ధరించిన మాల అంటే ఇష్టం అని, అది ఎందుకు సమర్పించలేదని ప్రశ్నిస్తాడు. ఆ సంఘటనతో గోదాదేవి కారణజన్మురాలని అర్ధం చేసుకుని, మమ్మల్ని కాపాడుటకు వచ్చావని, ఆమెను ఆండాళ్ అని పిలవటం మొదలుపెట్టారు విష్నుచిత్తుడు. అప్పటినుంచే రోజు ఆండాళ్ సమర్పించిన మాలనే స్వామికి సమర్పించేవారు. గోదాదేవికి పెళ్ళి వయసు రాగానే తండ్రి వరుని వెదకటానికి సిద్ధమవ్వగా, ఆమె కృష్ణున్ని మాత్రమే వివాహమాడుతానని పంతంతో చెప్తుంది. కాని తండ్రి కృష్ణుడు ఉండేది ద్వాపరంలో నందగోకులమనే ప్రాంతము అని, అది చాలదూరము, కాలము కూడా వేరని, ఇప్పుడు కృష్ణుడిని కేవలం అర్చామూర్తిగానే చూడవచ్చని చెప్తారు. విష్ణుచిత్తులవారు వివిద దివ్యక్షేత్రాలలోని ఆయా మూర్తుల వైభవాన్ని కీర్తించగా, గోదాదేవి శ్రీరంగంలో ఉన్న రంగనాయకులని తనకు వరునిగా తలచింది. శ్రీరంగనాథున్ని వివాహమాడుటకై తాను "తిరుప్పావై" మరియు "నాచియార్ తిరుమొఱ్ఱి" అనే దివ్యప్రభందాలను పాడారు. ఆ తర్వాతా ఆమె శ్రీ రంగనాధుని వివాహమాడి, ఆయనలో ఐక్యమైంది.

ఆండాళ్ అమ్మవారు చేసిన ఆ గానాన్ని ఈ ధనుర్మాసం నెల రోజులు వైష్ణవదేవాలయాల్లో సుప్రభాతానికి బదులుగా గానం చేస్తారు. శైవాలయాల్లో ఇదె సమయంలో తిరువెంబావైని గానం చేస్తారు. భోగి పండుగనాడు గోదారంగనాయకుల కళ్యాణం చేస్తారు.
----------------------------------------
భోగి విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు.
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_10.html

గొబ్బెమ్మల విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు.
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_8.html

రంగవల్లులు - ఆరోగ్యం విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post.html

భోగి పండ్లెందుకు పోస్తారు కోసం ఈ లింక్ చూడండి
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_12.html

ధనుర్మాస నివేదనలు - ఆయుర్వేదం - ఆరోగ్యం కొరకు ఈ లింక్ చూడండి.
http://ecoganesha.blogspot.in/2016/01/blog-post_49.html 

No comments:

Post a Comment