Monday 28 March 2016

హిందూ ధర్మం - 201 (వేదంలో గోవధ ఖండన - 1)

ఇప్పటి వరకు ధార్మిక గ్రంధాల్లో గోవధ లేదన్న సంగతి చూశాం. ఇప్పుడు ధర్మవ్యతిరేకులు చేస్తున్న ఆరోపణలను ఎంత అసత్యమో, కుట్రపూరితమో చూద్దాం. నిజానికి ఈ వాదన ఈనాడు కొత్తగా వచ్చింది కాదు, వేదంలో గోవధ ఉందని ఆంగ్లేయులు వేదాలకు భాష్యాలు రాసే సమయం నుంచి ప్రారంభమైంది. అటు తర్వాత వక్రీకరణ కారులైన డి.ఎన్.జా, మహాదేవ్ చక్రవర్తి, వెండీ డాగ్నిర్ మొదలైన అనేకమంది వేదంలో గోవధ ఉందని ఆరోపించారు. మతమార్పిడి మూర్ఖులు, జాకిర్ నాయిక్ లాంటి అబద్ధాలకోరులు ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తారు. విచిత్రం ఏమిటంటే వీళ్ళకు మద్దతుగా మీడియా కూడా వేదంలో గోవధ ఉందని, వేదకాలం నాటి హిందువులు గోమాంసం తిన్నారని తెగ ప్రచారం చేసింది. ఇటువంటి సమయంలో ఈ వాదనలను తిప్పికొట్టడం ప్రతి ధార్మికుడి తక్షణ కర్తవ్యం.

వినా గోరసం కో రసో భోజనం
వినా గోరసం కో రసో భూపతినాం
వినా గోరసం కో రసో కామీనీనాం
వినా గోరసం కో రసో పండితానాం

ఇందులో గో అనే పదం ఉంది కనుక ఇది ఆవు గురించే అనుకుంటారు. అదే కమ్యూనిష్టులు, వక్రీకరణకారులైతే గోరసం అంటే గోమాంసం అని చెప్పి, గోమాంసం లేని భోజనం రుచికరం కాదంటున్నారు అంటూ తమ పిచ్చి వాదన మొదలుపెడతారు. ఆంగ్ల భాషకు బాగా అలవాటు పడి, అదే గొప్ప అనేకునేవారికి ఇది ఒక కనువిప్పు. ఆంగ్లం సంస్కృతం వలే సాంకేతిక భాష (Technical language) కాదు. దానికి సంస్కృతానికున్నంత విసృతమైన పరిధి లేదు. అసలు విషయం ఇలా ఉంది.

ఇందులో ముఖ్యమైన పదం గో (గోవు). గోవుకు వేదంలో 24 నానార్దాలున్నాయి. అందులో ఆవు, భూమి, ఇంద్రియాలు, వాక్కు కొన్ని. రసానికి కూడా అనేక అర్దాలున్నాయి.

మొదటి పంక్తిలో ఉన్న గోరసం ఆవు నుంచి వచ్చే పాల పదార్ధాల గురించి చెప్తోంది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనవాటిని ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటాము. మధురపాదార్ధాల్లో నెయ్యి తప్పక వాడతాము. నూనె, డాల్డా కంటే నెయ్యితో చేసినవే మరింత రుచికరంగానూ, పుష్టికరంగానూ ఉంటాయి. భోజనం ఆఖరులో పెరుగు లేదా మజ్జిగ అన్నం తినకుండా లేవకూడదనే ఆచారం కూడా ఉంది. మజ్జిగలో ఉన్న పోషకాలు, జీర్ణశక్తి అలాంటివి. పాలు గురించే చెప్పనవసరమే లేదు. కాల్షియం పొందాటానికి పాలు ముఖ్యమైన ఆహారం. అందువల్ల మొదటి పంక్తికి 'గోవు పాలు- పాల నుంచి వచ్చే పదార్ధాలు లేని భోజనంలో రుచి ఎక్కడ ఉంటుంది?' అని అర్దం.

రెండవ పంక్తిలో గోరసం రాజ్యం గురించి మాట్లాడుతున్నది. గో=భూమి, రసం=రాజ్యం. రాజ్యమే లేకపోతే రాజు అవసరమేంటి అని రెండవ పంక్తికి అర్దం. రాజ్యం ఉన్నప్పుడే పరిపాలన కొరకు, రాజు, మంత్రులు, సభ మొదలైనవన్నీ ఉంటాయి. అసలు ఆ రాజ్యమే లేకపోతే ఇవ్వనీ ఎవరికి కావాలి?

మూడవ పంక్తిలో గో=ఇంద్రియాలు. గోరసం= ఇంద్రియాలు చక్కగా పని చేయడం, లోపాలు లేకపోవటం. ఇంద్రియాలు పని చేయకపోతే (కళ్ళు ఉండీ చూడలేకపోతే, చెవులుండీ వినలేకపోతే, నోరు ఉండీ మాట్లాడలేకపోతే), అనగా వాటి యందు శక్తి లేకపోతే, వ్యక్తి అందమైన స్త్రీని/పురుషుడిని చూసి ఏం లాభం? ఇంద్రియాలే మనసుకు సంకేతాలను పంపిస్తాయి. అసలా ఇంద్రియాలే పని చేయకపోతే ఇక వ్యక్తి ముందు ఎంత అందాన్ని పెట్టినా, అతడు దేన్నీ ఆస్వాదించలేడు. అందమైన జలపాతం వద్దకు తీసుకువెళ్ళినా, శ్రావ్యమైన సంగీతం వినిపించినా, అతడికి ఏ తేడా అనిపించదు.

నాల్గవ పంక్తి లో గో=వాక్కు. గోరసం= మధురమైన పలుకులు. ఎంతటి పండితుడైనా మధురమైన మాటలు మాట్లాడలేకపోతే, కార్యసిద్ధి ఎలా కలుగుతుంది? మాటల చేత ఇతరులను మెప్పించి పనులు జరిపించుకోవచ్చు, నొప్పించి చేదగొట్టుకోవచ్చు. కనుక మధురమైన మాటలు పలకడం రాని పండితుడి ఉపయోగమేమిటి? అని నాల్గవ పంక్తి అర్దం.

ఇప్పుడు ఈ సుభాషితం వలన అర్దం చేసుకోవలసిందేమిటంటే సంస్కృతం అంత త్వరగా అభిప్రాయాలు ఏర్పరుచుకోనుటకు ఉపయుక్తంగా ఉండే చిన్న భాష కాదు. అది ఎంతో విస్తృతమైనది. దాన్ని అర్దం చేసుకోవాలంటే ఎంతో మేధాశక్తి ఉండాలి.

ఇప్పుడు మనం అధార్మికులు చేసే ఒక ఆరోపణనను చూద్దాం.

శతపధ బ్రాహ్మణం 3-1-2-21 లో యాజ్ఞవల్క్య మహర్షి 'నేను గోవు, ఎద్దు మాంసం తింటాను, ఎందుకంటే అది చాలా రుచికరంగా, మృదువుగా ఉంటుంది' అన్నారని వక్రీకరణ కారుల ఆరోపణ. యాజ్ఞవల్క్య మహర్షి గోమాంసం గురించి అక్కడ చెప్పలేదు. ఆ శ్లోకంలో గౌ అన్న శబ్దానికి ఇంద్రియాలు అనే అర్దం వస్తుంది. నేను ఇంద్రియాలను తిని, అనగా ఇంద్రియాలను జయించి, జితేంద్రియుడనవుతాను అని అన్నారు. అట్లాగే ధేను అనగా ఆవు అనే కాకుండా ఆవుపాలు అనే అర్దం తీసుకోవాలి. కాకపోతే వక్రీకరణ కారులు ఆవుపాలకు బదులు ఆవు అని, ఎద్దు దున్నగా వచ్చిన ధాన్యాలకు బదులుగా ఎద్దు మాంసం అని తప్పుడు అర్దాలను ఆరోపించి, యాజ్ఞవల్క్య మహర్షి గోమాంసం, ఎద్దు మాంసం తిన్నారని విషప్రచారం చేశారు. నిజానికి ఆయన 'నేను ఆవుపాలను, ఎద్దు దున్నిన పొలం నుంచి వచ్చిన ధాన్యాలను ఆహారంగా స్వీకరిస్తాను, ఎందుకంటే అవి రుచిగా, మృదువుగా ఉంటాయి' అని అన్నారు. వీటికి ప్రామాణికం పాణిని సూత్రాలు, అమరకోశం. పూర్తి వ్యాఖ్యానం తీసుకున్నప్పుడు ఆయన మాంస భక్షణకు వ్యతిరేకంగా మాట్లాడటం కూడా కనిపిస్తుంది.

To be continued .................

No comments:

Post a Comment