Tuesday 24 August 2021

శ్రీ హనుమద్భాగవతము (20)



శంకరుడు అంజనా దేవికి పుత్రరూపములో అవతరించాడు. జనన కాలమందె హనుమానుని సౌందర్యము సాటిలేనిదిగా, వర్ణింప నలవిగానిదిఫా ఉంది. ఆయన శరీర కాంతి పింగళ వర్ణము; రోమములు, నేత్రములు కూడా పింగళవర్గముగానే ఉన్నాయి. ఆయన విద్యుత్కాంతితో సమానమైన, సువర్ణ నిర్మితమైన, మనోహరమైన కుండలములను ధరించే అంజనా దేవి హృదయము నుండి అవతరించాడు. అతని శిరస్సుపై మణిజటితమైన కిరీటము శోభిల్లుతోంది. కౌపీనమును, అంగవస్త్రమును ధరించియున్నాడు. విశాలమైన ఆతని వక్షఃస్థలమున యజ్ఞోపవీతము, హస్తమున వజ్రము, కటిప్రదేశమున ముంజగడ్డితో పేనిన మొలత్రాడు శోభిల్లుతున్నాడు. తన పుత్రుని అలౌకికమైన రూపసౌందర్యాన్ని చూడగానే అంజనా దేవి ఆనందానికి అవధులు లేవు. 

పవిత్రమైన ఈ భూమిపై హనుమంతుడు అడుగు పెట్టగానే దశదిశలయందు హరోల్లాసములు వ్యాపించాయి. కపిరాజైన కేసరియొక్క ఆనందమునకు అవధులు లేకపోయాయి. దేవతలు, ఋషులు, కపులు, పర్వతములు, సరస్సులు, నదులు, సముద్రములు, పశుపక్షులు, భూమి, సర్వము పులకించినది. అంతటా ఆనందసామ్రాజ్యము వ్యాప్తమైనట్లు ఉండింది.

పరాశరసంహితలో శ్రీహనువదవతారప్రసంగము

ఒకప్పుడు మైత్రేయమహర్షి శ్రీ పరాశరమహర్షిని దర్శించి "మహాభాగా! శ్రీ ఆంజనేయుడనే నామముతో ప్రసిద్ధమైన భగవదవతారమును గుర్నిచి ప్రవచించండి. అతడెవ్వడు ? ఎవరికుమారునిగా అవతరించాడు? ఏయే దివ్యలీలలను ఒనరించాడు ? అతని అవతారమెట్టిది? వర్ణించు” అని అడుగగా శ్రీపరాశరుడు ఇట్లు పలికాడు.


No comments:

Post a Comment