Sunday 1 August 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (68)



సద్వర్తనము వదలక యుండిన మనుజుడు పూజ్యుడు జన సమాజమునన్


సేతువు నిర్మించి, సముద్రం దాటి ఆవలితీరం చేరి యుద్ధ సన్నద్ధులై చివరిసారిగా రావణునికి హితవు చెప్పటకై రాముడు అంగదుని రాయబారిగా పంపినాడు. అంగద రాయబారం విఫలమైంది. వానరసేన రాక్షసులను ఢీకొంది. పోరు భీకర రూపం దాల్చింది. ధూమ్రాక్ష, వజ్రదంష్ట్ర, అకంపన, ప్రహస్తాది రాక్షస వీరులు రాము నెదిరించి అసువులు బాసారు. కుంభకర్ణుడు కుంభినీ ధవుని చేరాడు. ఇంద్రజిత్తు మాయా యుద్ధం ప్రారంభించాడు. బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాడు. రామ, లక్ష్మణ, సుగ్రీవ, అంగద, జాంబవంతాది వానర, భల్లూక వీరులు మూర్ఛతులయ్యారు. వానర సైన్యంలో ఇరువురుని మాత్రమే బ్రహ్మాస్త్రం కట్టడి చేయలేక పోయింది. ఆ ఇరువురూ విభీషణ, ఆంజనేయులు. వారు ఆహవరంగం అంతా కలయతిరుగుతూ- "యీ పరిస్థితినుండి తమ వారి నెలాగ తప్పించాలి" అని ఆలోచిస్తున్నారు. ఇంతలో జాంబవంతుని సమీపించారు. విభీషణుడు జాంబవంతుని "తాతా! ఎలా ఉన్నావు" అన్నాడు.


"విభీషణా! నా శరీరం బాణాహతికి దెబ్బతిన్నది. చూపు మందగించింది. చూడలేకున్నాను. నీ స్వరాన్నిబట్టి గుర్తించాను. ఆంజనేయునికి క్షేమమా?" అన్నాడు.


భల్లూకరాజు మాటలు విభీషణుని ఆనందాశ్చర్యాలకు లోను చేసినయ్. 


రామ లక్ష్మణులనో- సుగ్రీవునో- అంగదునో అడుగక ఆన్జనేయుని క్షేమం విచారిస్తున్నావేమి రాజా! అనగా—


అస్మిన్ జీవతి వీరోతు హతమమవ్యహతం బలం

హనూమత్యుజ్ఘిత ప్రాణే జీవనోపి మృతావయం.

ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమోయది

వైశ్వానర సమో వీర్యే జీవితాశా తతో భవేత్.


విభీషణా! ఆంజనేయుడు జీవించియున్న- వానర వీరులందరూ మరణించిననూ జీవించియున్నట్లే. పావని పరమపదించిన అందరం జీవించి ఉన్నా జీవచ్ఛవాలమే. వాయువేగము గలవాడూ, పరాక్రమంలో ఆగ్నిసముడూ అంజనా నందనుడు.

అదే సమయానికి అచటికి చేరుకున్న పావని—— 

తతో వృద్ధ ముపాగమ్య నియమే నాభ్యవాదయేత్ 

గృహ్య జాంబవతః పాదౌ హనుమాన్ మారుతాత్మజః.


తనపై ప్రగాఢ విశ్వాసముంచిన జాంబవంతుని పాదద్వయము నంటి శిరము వంచి నమస్కరించాడేగాని పొగడ్తగా భావించి అహంకరించలేదు. గర్వమెరుగని వినయవంతుడు. ఆడంబర మెరగని నిరాడంబరుడు. ఇంతటి మన్నన పొందిన హనుమ వినయం ప్రధానం అన్న సందేశం ఇచ్చాడు జగానికీ సన్నివేశంలో. దీనిని వివరించే ఒక చక్కని సుభాషితం మనకుంది. ఆచరించి చూపండి.


తన నడవడి సత్పురుషులు

కొనియాడగ సుబ్బకదియ గుణముగ దద్వ 

ర్తనమున్ వదలక యుండిన

మనుజుడు పూజ్యుండు జన సమాజములో నన్ 

No comments:

Post a Comment