Sunday 8 August 2021

శ్రీ హనుమద్భాగవతము (3)



అంజన పూర్వజన్మవృత్తాంతము


దేవలోకములో పుంజికస్థల అనే అప్సరస ఉన్నది. ఆమె సర్వగుణసంపన్నురాలు. పరమశివుని అవతారమైన దుర్వాసమహర్షి అమరావతికి వెళ్ళగా దేవేంద్రుడు పుంజికస్థలను ఆ మహాపురుషుని సపర్యలకు నియమించెను. ఆమె భక్తి భావముతో మహర్షి నారాధించి ఆయన అనుగ్రహమునకు పాత్రురాలయ్యెను, వరం అడగమని మహర్షి పలికారు. అందులకు పుంజికస్థల దేవతలకు సైతం అగమ్యమైన పరమపదాన్ని అర్థించింది. అపుడు దుర్వాసమహర్షి శ్రీహరి హర మహామంత్రాన్ని ఉపదేశించి తపస్సు చేయవలసినదిగా ఆమెను ఆదేశించారు.


మందాకినీనదీతీరములో మంత్రోపాసన చేయసాగింది. శ్రీహరిహర ఆమె యొనరించిన తపము నకు శ్రీ ఆదిపరాశక్తి, శ్రీమన్నారాయణుడు, శ్రీసదా శివుడు ప్రసన్నులై సాక్షాత్కరించారు. పుంజికస్థల పరమానంద భరితురాలై జరా వ్యాధిరహితము (జర = ముసలితనము, వ్యాధి = రోగము), పరమానంద నిలయమునైన పరమపదాన్ని అర్థించింది. అపుడు శ్రీహరిహరులిట్లు పల్కిరి. “దేవాంగనా ! నీకు పుణ్య శేషము ఉంది, నీ వా పుణ్యమును అనుభవించుటకు మరల వానరాంగనగా జన్మించాలి, తదనంతరము నీకు జన్మరాహిత్యము సిద్ధింస్తుంది, కావున వేరొక వరము అర్థించు”. పుంజికస్థల సంతానాభిలాష కలదియై ఇట్లు పలికెను “భక్త జనమందారులారా! నాకు మీ వంటిపుత్రుని ప్రసాదించం" డని కోరింది. ఆందులకు వారు “అప్సరసా! మావంటి వారు మరియొకరులేరు. కావును మేమే ఏకరూపులమై నీకు కుమారునిగా అవతరిస్తాము. వానరాధీశ్వరుడగు కుంజరుడు పరమభక్తాగ్రేసరుడు. నీవు వానికి పుత్రికగా జన్మింపు”మని ఆ దేశించి అంతర్హితులైరి.


బుద్ధిమంతుడు, పరమభాగవతోత్తముడు వానర రాజు నగు కుంజరునకు పుత్రికగా పుంజికస్థల జన్మించెను. ఆమె సాటిలేని సౌందర్యము కలది. ఆమె అందముతో సాటివచ్చు స్త్రీయెవ్వరును లేరు. మూడులోకములలో సౌందర్యగుణాలలో ప్రసిద్ధి చెందిన ఆ కుంజరునిపుత్రిక పేరు అంజన. అంజన గురించి మరియొక చరిత్ర కలదు. కల్ప భేదముననుసరించి ఈ ప్రసంగములన్నీ సత్యములే యని గ్రహించాలి.

No comments:

Post a Comment