Showing posts with label ఆయుర్వేదం. Show all posts
Showing posts with label ఆయుర్వేదం. Show all posts

Monday, 3 August 2020

మన చుట్టూ దొరికే ఔషధ మొక్కలు

పిప్పింటాకు - గాయాల మీద దీని పసరు వేస్తే మాడిపోతుంది.


బ్రహ్మేడు చెట్టు - మేడి, పనస,అంజీరా జాతికి చెందినట్టు ఉంటుంది..ఆకులు విస్తర్లు కుట్టడానికి వాడతారు. కాయలు మేడి పండ్లలా ఉన్నా తినడానికి పనికిరావు


గంజి చెట్టు గూర్చి చెప్పుకున్నాము కదా ఇంతకు మునుపు..దాని పండ్లు ఇలా ఉంటాయి..తింటే అజీర్తి దరి చేరదు
దీన్ని కామంచి లేక కామాక్షి చెట్టు అని కూడా అంటారు. దీనికాయలు బుజ్జి బుజ్జి టమాటాలల్లే ఉంటాయి.లోపల గింజలు.పచ్చిగా ఉన్నప్పుడు కొద్దిగా వగరుగా,దోరగా,పండిన తర్వాత టమాటా రుచిలో ఉంటాయి.ఇది చక్కెర వ్యాధికి మంచి మందు. దీనా ఆకులు వేళ్ళు మొత్తం చెట్టు వైద్యానికి పనికివస్తుంది. ఈ ఆకులతో కూర చేస్తారు. కంటి చూపుకి చాలా మంచిది


ఊడగ చెట్టు..దీని పండ్లు ఎర్రగా నిగనిగ లాడుతూ ఉంటాయి..వీటిని ఉడుత లు బాగా తింటాయి. ఈ చెట్టు బాగా పొడవుగా పెరిగి మంచి చెక్కను ఇస్తుంది. అప్పట్లో ఎక్కువగా పట్టె మంచాలకు ఈ చెక్కనే వాడేవారు.. ఇపుడంటే టేకు అవీ ఇవీ ఇంతకు మునుపు దీనినే వాడే వారు. జుట్టుకు చాలా మంచిది..ఆరుద్ర కార్తె కు వీటి పళ్ళను సేకరించి తైలం చేస్తారుట.


శ్రీగంధం
- వీర నరసింహ రాజు గారి సౌజన్యంతో 

Sunday, 3 May 2020

ఆయుర్వేదం - ఆహారం స్వీకరించే పద్ధతి



మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష (12) 

ఆయుర్వేదం  - ఆహారం స్వీకరించే పద్ధతి 

మన ఆచారవ్యవహారాలను తులనాడటం చాలా సులభం. నోటికి ఏది వస్తే అది అది అనచ్చు. కానీ వాటి వెనుకనున్న శాస్త్రీయతను అర్ధం చేసుకుంటే వాటిని నెత్తిన పెట్టుకుంటాము. అవి ఆచరణలోకి రావడానికి ఎంత సమయం పట్టి ఉంటుందో, కాలక్రమంలో వాటి మీద ఎంత పరిశోధన జరిగి ఉంటుందో ఆలోచిస్తే మతిపోతుంది.

ముందు మజ్జిగన్నం లేదా పెరుగున్నం తిని, ఆ తర్వాత సాంబారు, చివరలో కూర, పచ్చడి కలుపుకుని తినకూడదా? ఈ సందేహం మీకు ఎప్పుడూ రాలేదా? ఏ ఆహారం ఎలా, ఎప్పుడు స్వీకరించాలి అనేది ఆయుర్వేదం చెబుతుంది. ఆకలి కలిగినప్పుడు కడుపులో ఉదజహరికామ్లము (హైడ్రోక్లోరిక్‌ యాసిడ్) ఉత్పన్నమై, ఆహారన్ని పచనం చేయడానికి సిద్ధమవుతుంది. ముందుగా గట్టిగా ఉన్న పదార్ధాలను కలుపుకోవాలి, అంటే కూర, పొడి వంటివి. ఎందుకంటే ఈ ఉదజహరికామ్లము మనం తినే ఆహారాన్ని పచనం (అరిగిస్తూ) పలుచన (dilute) అవుతుంది. కనుక మొదట కూరను కలుపుకుంటాము, పొడి ఎండు పదార్ధము కనుక దానిలో తేమశాతం తక్కువ గనక మొదటి ప్రాధాన్యం దానికి ఇచ్చారు. ఆ తర్వాత కూర, పప్పు. కూర కంటే పప్పు కొంచం పలుచగా ఉంటుంది (ఇక్కడ గోదావరి జిల్లాల వారైతే ముందు పప్పు, ఆ తర్వాత కూరా కలుపుకుంటారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వారు ముందు కూర, ఆ తర్వాత పప్పు కలుపుకుంటారు. ఈ నాలుగుజిల్లాల వంట పద్ధతిలో స్వల్ప తేడాలు కూడా ఉంటాయి).  వీటి తర్వాత వచ్చేది సాంబారు లేదా పప్పుచారు. ఆ తర్వాత రసము, పాయసము, చివరలో మజ్జిగ. మజ్జిగ అనేది చాలా పలుచని పదార్ధము. అంటే నీ ఉదరంలో జీర్ణం చేసే ఆమ్లాలు పలుచున అవుతున్న కొద్దీ, నువ్వు స్వీకరించే ఆహారం పలుచున అవుతూ వస్తుంది.

దీని గురించి కంచి పరమాచార్య స్వామి వారు ఇలా అన్నారు - "విదేశాల్లో ఆహారం అనేది చివరలో ఫలాహారముతో ముగుస్తుంది, దాన్ని వాళ్ళు డెజెర్ట్స్ (desserts) అంటారు. దక్షిణభారత దేశంలోని ఆహారపద్ధతిలో, రసం కలుపుకుని తిన్న తర్వాత మొదటలో విస్తరిలో వడ్డించిన తీపి పదార్ధాలు తింటారు. ఆ తర్వాత చివరగా మజ్జిగను కలుపుకుంటారు. తీపి పదార్ధాలు మన పళ్ళకు (దంతములకు) హాని కలిగిస్తాయి. మజ్జిగ యొక్క రుచి పులుపు. చివరలో పులుపు మరియు ఉప్పు కలిగిన మజ్జిగను స్వీకరించడంవలన దంతాలకు బలం చేకూరుతుంది. ఈ పద్ధతిని అమెరికెన్ ఆహార శాస్త్రజ్ఞుడు సైతం కొనియాడారు. పంటినొప్పి వచ్చినప్పుడు వేడినీటితో పుక్కిలిస్తాము. విదేశీయులకు చిన్న వయస్సులోనే పంటి సమస్యలురాగా, మనకు మాత్రం జీవితాంతం వరకు బలమైన దంతాలు ఉండటంలో రహస్యం ఇదే."

అదేగాక ఆయుర్వేదంలో మజ్జిగ గుణాలను బాగా కొనియాడారు. మజ్జిగ అనేది ఆయుర్వేదంలో విషహారిణి. మనం తిన్న అన్నంలో ఏదైనా విషాలు కలిస్తే, వాటిని మజ్జిగ హరిస్తుంది. పైగా జీర్ణశక్తిని పెంచుతుంది. కొవ్వును తగ్గిస్తుంది. అందుకే మనము మజ్జిగతో ఆహారం ముగిస్తాము.

కేవలం ఒకే రకమైన ఆహారం - ఉదాహరణకు కేవలం పచ్చడి అన్న, కూర అన్నం, మజ్జిగ అన్నం - స్వీకరించమని ఆయుర్వేదం చెప్పదు గతి లేకపోతే తప్పించి. ఆహారంలో ఆరు రుచులు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఆయుర్వేదం చెబుతుంది. కనుక ఎప్పుడైనా పిల్లలు అడిగితే, వారికి మన పూర్వీకులు అందించిన ఈ పద్ధతిని వివరించి, దాని వెనుకనున్న శాస్త్రీయతను చెప్పండి.

Friday, 9 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 5



చిన్నప్పుడు మేము మట్టిలోనే ఆడుకునేవాళ్ళము. ఎంతగా ఆడుకునేవాళ్ళమంటే ఒళ్ళంతా చెమటలు పట్టేలా. అయితే కొంచం పెద్దయాక స్కూల్ లో మాకు చెప్పారు, మట్టిలో క్రిములు ఉంటాయి, మట్టికి దూరంగా ఉండాలి, మట్టి ముట్టుకుంటే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి అని. నిజానికి అలా పుస్తకాల్లో ఉంది, అదే టీచర్లు చెప్పారు. అప్పటి నుంచి మట్టికి దూరమయ్యాము అనారోగ్యం వస్తుందన్న భయంతో. చాలా ఏళ్ళ తర్వాత ఇలానే యూ ట్యూబ్ లో సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రవచనం ఒకటి విన్నాను. అందులో ఆయన ఆయుర్వేదం గురించి చెప్తూ ఇలా అన్నారు. ఇప్పుడు మనకు అనేక ఆనారోగ్య సమస్యలు రావడానికి కారణం మనం పంచభూతాలకు దూరమవ్వడమే, ఎందుకంటే ఈ శరీరం, మనస్సు పంచభూతాల వల్లనే ఏర్పడ్డాయి. ఈ శరీరం పంచభూతాలే తప్ప మరొకటి కాదు. ఎప్పుడైతే శరీరం, మనస్సు వాటికి దూరంగా జరుగుతాయో, అప్పుడే మానసిక, శారీరిక అనారోగ్యం ఏర్పడుతుంది. మా ఆశ్రమంలో ఉన్న వైద్యశాలకు నిత్యం అనేకమంది రోగులు వస్తూ ఉంటారు. వారికి మేము కేవలం ఔషధాలే ఇవ్వము, అంతకంటే ముందు మట్టిలో పని చేయమంటాము, మొక్కలకు పాదులు తీసి, నీళ్ళు పెట్టమంటాము, మట్టి ఎత్తమంటాము. కొందరికైతే ఔహధాలు అసలే ఇవ్వము, కేవలం ఇవి మాత్రమే ఆచరించమని చెప్తాము. అలా కొద్దిరోజులు వారికి ఆచరించడంతోనే వారి రోగాలను నయమై, వారు ఇంటి ముఖం పడతారు. ఇప్పుడు మనకు సంక్రమిస్తున్న అనేక అనారోగ్య సమస్యలకు కారణం మనం ప్రకృతికి, పంచభూతాలకు దూరంగా జరగడమే.

ఇది విన్న తర్వాత నాకర్దమయ్యింది మనమేమి కోల్పోతున్నామో. ఇంతలో అనుకోకుండా ఒకరోజు మా ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మట్టిలో చెప్పులేకుండా నిల్చోవాల్సి వచ్చింది. ఆ సమయానికి నాలో పైత్య దోషం ప్రకోపించి, వేడి పెరిగింది. ధ్యానం మొదలైన ప్రక్రియలు చేయడం వలన శరీరంలో జరిగే చాలా సూక్ష్మ చర్యలను కూడా గమనించే శక్తి కలుగుతుంది, ఏకాగ్రత వలన. అది ధ్యానం చేసే చాలామందికి తెలిసిన విషయం. అప్పుడు గమనించాను, మట్టి నా శరీరంలో ఉన్న వేడిని తనలోకి లాగేస్తోందని. కాసేపు నిల్చుంటేనే శరీరంలో ఉన్న అధికవేడిని మట్టి/ భూమి లాగేసింది. ఆ తర్వాత ఎన్నోసార్లు చేసి చూశాను, పైత్యం ప్రకోపించిన ప్రతిసారీ ఇదే చేశాను. మళ్ళీ మళ్ళీ నాకు నేను ఋజువు చేసుకున్నాను. అప్పుడర్దమైంది మట్టికి ఉన్న శక్తి. ఇలా నాకే కాదు, ఇంతకముందు ఆయుర్వేదం గురించి చెప్పిన అనీల్ కిషన్ కి కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి.

చాలామంది అంటారు, మట్టిలో నడిస్తే కాళ్ళు పగులుతాయని. కానీ అది పెద్ద అపోహ. కాళ్ళు పగిలేది మట్టిలో నడిస్తే కాదు, దుమ్ములో నడిస్తే. మట్టికి, దుమ్ముకు చాలా తేడా ఉంది. మట్టికి ఎంతో హీలంగ్ పవర్ ఉంది. సారవంతమైన మట్టిలో నడిస్తే, కాళ్ళ పగుళ్ళు కూడా వేగంగా, ఏ మందు రాయకుండానే మానిపోతాయి. చాలామంది ఉదయం వ్యహాళికని వెళతారు, వెళ్ళడం మంచిదే కానీ, వేలకు వేలు పెట్టి దాని కోసం ప్రత్యేక బూట్లు కొని, అవి వేసుకుని వెళతారు. అప్పుడేమీ లాభం లేదు. ఏదైనా చేయాలనుకుంటే గాజుముక్కలు లాంటివి లేని చోట, మట్టిలో ఒట్టి కాళ్ళతో నడిచి చూడండి, ఎంతో మార్పు కనిపిస్తుంది, శరీరం తనంతట తానే రోగాలను నయం (Healing) చేసుకుంటుంది. అది మట్టికి ఉన్న శక్తి. కానీ మట్టి సారవంతమై ఉండాలి, పవిత్రంగా, కాలుష్యరహితంగా ఉండాలి. మనం మరమనుషులుగా కాక, మట్టి మనుషులుగా బ్రతకాలి.

To be continued ..........

Thursday, 8 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 4



ఇప్పుడు ప్రజలు ఎదురుకంటున్న ఆరోగ్యసమస్యల్లో ఒకటి బి 12 విటమిన్ లోపించడం. వినడానికి ఏదో ఒక చిన్న విటమిన్ లోపంగానే అనిపిస్తుంది కానీ, అది లోపిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. నాడీసంబంధం సమస్యలు చాలా తీవ్రంగా వస్తాయి. ఈ మధ్య ఇది చాలా ఎక్కువైంది. ఇది లోపించినవారు పడే బాధ, నొప్పులు వర్ణానతీతం. చాలామంది ఆసుపత్రిలో చేరి సిలైన్లు, ఇంజెక్షన్లు తీసుకుని చికిత్స చేయించుకున్నారు. ఇలాంటి వారిని నేను ప్రత్యక్షంగా చూశాను. డాక్టర్లు, ఫార్మా కంపెనీలు అంటాయి, బి 12 లోపం శాఖాహారులకు తప్పకుండా కలుగుతుంది, ఈ విటమిన్ మాంసాహారంలోనే అధికంగా ఉంటుంది, శాఖాహారులు ఖచ్చితంగా ఇంజెక్షన్లు తీసుకోవాలి అని. ఇదే విషయం మీద నా మిత్రుడు, అనీల్ కిషన్ పురాతన ఆయుర్వేద గ్రంధాలపై పరిశోధన చేస్తున్నారు. వారంటారు 'మాంసాహారం తినే పులితో పోల్చుకున్నప్పుడు, బరువు తక్కువగా ఉన్న మేక లేదా జింకలో బి12 అధికంగా ఉంటుంది. సమస్య శాఖాహారంలో లేదు, అందులో సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్లనే వస్తోంది. పైగా మాంసాహారంలో ఉండే బి12, ఆహారం వండే సమయంలోనే చాలా శాతం నశించిపోతుంది. ఈ బి 12 అనేది మట్టిలో అధికంగా ఉంటుంది, మీకు ఎప్పుడైనా వెంటనే బి 12 రావాలంటే మట్టిలో పని చేయాలి, మట్టి పిసకడమో, మొక్కలు నాటడమో, లేద మట్టి తొక్కడమో చేయాలి. అప్పుడు ఇంజెస్కన్ కంటే వేగంగా ఈ విటమిన్ శరీరానికి చేరుతుంది. టాబ్లెట్లు, ఇంజెక్షన్లు తాత్కాలిక ఉపశమనం కలిగించినా, జీవన విధానంలో మార్పు చేసుకోవాలి. మట్టికి దగ్గరగా బ్రతకాలి. అయితే మట్టి గురించి చెప్పుకున్నప్పుడు ఈ బి 12 నేది చాలా చిన్న విషయం. మట్టిలో యోగిని అనే సూక్ష్మజీవులు ఉంటాయి. అవి శరీరానికి ఎంతో అవసరం. మన శరీరంలో మనకు మంచి చేసే రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అవి నిర్వర్తించే కార్యాన్ని అనుసరించి వాటికి పేర్లను నిర్ణయించారు ఋషులు. శరీరంలో కాళీ అనే సూక్ష్మక్రిములు ఉంటాయి. ఎలాగైతే ఆదిపరాశక్తి కాళీ రూపంలో దుష్టులను హతమార్చిందో అలా ఇవి రోగకారక క్రిముల పై పోరాడి వాటిని శరీరం నుంచి బయటకు పంపేస్తాయి. అందుకే వీటికి ఆ పేరు. అలాంటివే ఈ యోగిని కూడా. ఇది ఎంతో పెద్ద సబ్జెక్టు. కానీ ఈ యోగిని క్రిముల లక్షణం ఏమిటంటే ఇవి శరీరంలో బి12 ఉత్పత్తి జరిగేలా చూస్తాయి. ఇలాంటి క్రిములు కేవలం మంచి సారవంతమైన మట్టిలో చెప్పులేకుండా ఒట్టి కాళ్ళతో నడవడం చేత, తేమ కలిగిన పచ్చని ప్రాంతాల్లో నివసించడం చేత, పెద్ద పెద్ద, బాగా వయసున్న వృక్షాల దగ్గరకు వెళ్ళడం చేత, వాటి గాలిని పీల్చడం చేత శరీరంలోనికి ప్రవేశించి, రోగాలను నివారిస్తాయి. అదేకాకుండా ఆవుపేడతో కళ్ళాపి చల్లిన చోటా, ఆవుపేడ అలికిన కూడా ఈ యోగిని క్రిములు ఉంటాయి. (అప్పుడు నాకర్దమయ్యింది, మన సంప్రదాయంలో ఇల్లంతా పేడతో ఎందుకు అలుకుతారో, ఇంటి ముందు కళ్ళాపి ఎందుకు చల్లుతారో). ఇలా మట్టి ద్వారా, శాకాహారం ద్వారా వచ్చే బి12 మాంసాహారం ద్వార లభించే బి12 కంటే ఎంతో శ్రేష్టమైనది. శరిరంలో ఈ సూక్ష్మక్రిములు ఉంటే విషాన్ని సైతం జీర్ణం చేసుకుని అమృతంగా మార్చుకోవచ్చు. వారికి మంచి ఆలోచనా శక్తి ఉంటుంది, శారీరిక పుష్టి ఉంటుంది, ఆహారం జీర్ణం కాకపోవడమనేది వీరి విషయంలో ఒక పెద్ద జోక్. వీరికి అసలా బాధే ఉండదు. కాబట్టి మనం మన జీవన విధానాన్ని మార్చుకోవాలి, మట్టికి, మొక్కలకు దగ్గరగా జరగాలి'.

ఈ తరానికి తెలియదు కానీ ఒకప్పుడు మనమంతా మట్టిలో ఆడుకున్నవాళ్ళమే. అప్పుడు మనమేమీ చెప్పులు వేసుకోలేదు. ఎంతో హాయిగా గంతులు వేసేవారము. మనకంటే మన అమ్మనాన్నలు, తాతయ్యల చిన్నతనానికి వెళితే, వారు ఇంకా ఎన్నో ఆడుకునేవారు, పంటపొలాల్లో, చెట్ల మీద లేదా చెట్ల క్రింద. అందుకే వారు ఏ రోగం లేకుండా హాయిగా ఉన్నారు. వాళ్ళ శరీరంలో ఈ సూక్ష్మ క్రిములు అధికంగా ఉండేవి. అందుకే వారికి స్థూలకాయం రాలేదు, జీర్ణ సమస్యలు రాలేదు, మలబద్ధకం అసలే లేదు. కానీ ఇప్పుడున్న తరాన్ని చూస్తే, వారు మట్టికి దూరమయ్యి, అనేక రోగాలకు దగ్గరవుతున్నారు.

మృత్తికే దేహిమే పుష్టిం త్వయీ సర్వం ప్రతిష్టితం ..........................
(ఆ మృత్తికా, మాకు పుష్టినివ్వు, సర్వం నీలోనే ఉంది (ఈ శరీరానికి కావల్సిన విటమిన్లు కూడా))

మనం ఎంత చక్కగా ఆడుకున్నాం, ఆ రోజులే వేరు అని అనుకుంటూ ఉందామా లేక మన పిల్లల్ని వాటికి దగ్గర చేసి, వాళ్ళు జీవితాలు పండిద్దామా? మనం కూడా మళ్ళీ దగ్గరయ్యి ఆరోగ్యంగా జీవిద్దామా? లేకపోతే మందులు మింగుతూ ఇలానే ఉందామా?

To be continued ...........

Sunday, 20 November 2016

హిందూ ధర్మం - 229 (జ్యోతిష్యం - 11)



తిధుల గురించి గత భాగాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు వారాల గురించి తెలుసుకుందాం. వారం అంటే 7 రోజులు. కాలమానాన్ని వారాలుగా విభాగం చేసి గణించిన ఘనత మన ఋషులకే చెల్లింది. నేడు ప్రపంచమంతా కాలగణనలో వారమంటే 7 రోజులుగానే స్వీకరిస్తోంది. ఈ పద్ధతి మన సనాతన సంస్కృతిలో సృష్ట్యాది నుంచి ఉంది. తిధికి, వారానికి తేడా ఉంది. తిధి చంద్రుని గమనంతో సంబంధం కలిగి ఉంటే, వారం (రోజు / Day) సూర్య సంబంధమైనది. ఉదయాద్ ఉదయం వారః అని అంటుంది శాస్త్రం. అంటే ఒక సూర్యోదయం నుంచి మరుసటి సూర్యోదయం మధ్య కాలమే వారం. ఇక్కడ వారమంటే రోజు అని అర్దం. ఏడువారాల నగలంటే వారంలో 7 రోజులు ధరించే ఒక్కో రకమైన నగలనే అర్దంవస్తుంది కానీ 7 ను 7తో హెచ్చిస్తే (7x7) వచ్చే 49 రోజులకు సరిపడే నగలని కాదు. ఈ ఏడువారాలు అనేమాట కూడా ఆ వారం నుంచి తీసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం సనాతంధర్మంలో జ్యోతిష్యం ఆధారంగా ఒక రోజు మారిందని లెక్కించాలంటే సూర్యోదయన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. సూర్యోదయం మార్పుకు సంకేతం. ఒక్క ప్రకృతిలోనే కాదు, ఈ భూమిపై జరిగే అన్ని క్రియల్లోనూ మార్పు సంభవిస్తుంది. సూర్యుడు హారిజోన్ దాటగానే శరీరంలో ప్రాణశక్తి పైకి వెళ్ళడం ప్రారంభిస్తుంది. ఊపిరిలో మార్పు కనిపిస్తుంది. అప్పటివరకు నిలకడగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా సనన్ని గాలులు వీయడం ప్రారంభవుతుంది. ఆ గాలులు ఎంతో శక్తిని, ఆరోగ్యాన్నిస్తాయి అంటుంది ఆయుర్వేదం. అందుకే సూర్యోదయానికి ముందే లేవాలి. అదేకాక ఆ సమయం శరీరశుద్ధికి ఎంతగానో అనువైనది, ఎందుకంటే ఆయుర్వేదపరంగా రాత్రి ముగుస్తున్న సమయం (సుర్యోదయానికి పూర్వం) వాతానికి చెందిన సమయం. అందుకే అప్పటికే లేచి మలమూత్ర విసర్జన ముగించాలి, తద్వార శరీరం లోపల శుద్ధి చేసుకోవాలి, ఆ తర్వాత స్నానం చేసి బాహ్యశుద్ధి చేసుకోవాలి, ప్రాణాయామది క్రియలు చేసి, ప్రాణశుద్ధి, సంధ్యావందానికి సిద్ధమై, జపం చేసి మనస్శుద్ధి చేసుకోవాలి. పసిపిల్లలు, జంతువులు, పక్షులు సైతం ప్రకృతిలో కలిగే ఈ మార్పును ముందే గ్రహించగలుగుతాయి, తమను తాము ఆ మార్పుతో సమన్వయం చేసుకోవడం కోసమే తెల్లవారుఝామునే మేల్కోంటాయి. కానీ అన్ని తెలుసనుకున్న, ఇంగ్లీష్ విద్యలు బాగా అబ్బిన చదువుకున్న 'అవిద్యావంతులు' మాత్రమే ఆ సమయంలో గురకపెట్టి నిద్రపోతారు. పైగా తమ ఇంట్లో పసిపిల్లలు ఆ సమాయనికి మేల్కోంటే, వాళ్ళని కూడా నిద్రబుచ్చి, ఆ పిల్లలకున్న ప్రాకృతమైన జ్ఞానం కంటే తమకున్న అజ్ఞానమే గొప్పదాని వాడి మీద కూడా రుద్దుతారు. పక్షులు, జంతువులు కూడా ఈ సమయానికి మేల్కొని తమ శరీరాలు బయట ప్రపంచంలో ఉండే ప్రాణశక్తిని గ్రహించేందుకు సిద్ధం చేసుకుంటాయి. ఇది విశ్వంలో సహజంగా ప్రతి రోజు కలిగే మార్పు.

అదే అర్దరాత్రి 12 గంటలకు ఏ మార్పూ కలగదు. పైగా అది నిశాచర జీవులు తప్ప మిగితా అన్ని జీవాలు తప్పక నిద్రించాల్సిన సమయం అంటుంది మన శాస్త్రం. ఆ సమయంలో శరీరం ఉదయం కోల్పోయిన శక్తిని పొందుతుంది, అలసిన శరీర భాగాలు తిరిగి శక్తివంతమయ్యేలా ఓజస్సు ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో జీవక్రియలన్నీ చాలా నెమ్మదిస్తాయి. అసలు ఆ సమయంలో మెల్కొనకూడదు. అలాంటిది రాత్రి 12 కు రోజు మారుతుంది అంటారు పాశ్చాత్యులు. ఎవరిదైనా పుట్టిన రోజు ఉంటే, వాడిని ఆ సమయం వరకు నిద్రపోనివ్వరు, లేదా నిద్రపోయినా, ఫోన్ చేసి, వాడి నిద్ర చెడగొట్టి శుభాకాంక్షలు చెప్తారు. అవి శుభాకాంక్షలా? లేక ఆరోగ్యానికి అశుభాకాంక్షలా? ఎవరికైనా ఒకరి మీద ప్రేమ ఉంటే, వాడు నిద్రపోతున్నాడు, లేపకండి, గట్టిగా శబ్దాలు చేయకండి అంటారు. అంతేకానీ ఇదేంటో, మనం ఎక్కడి నుంచి చూసి తలకు ఎక్కించుకున్నామో కానీ, ప్రాణస్నేహితుడని హాయిగా నిద్రపోతున్నవాడిని సైతం పుట్టిన రోజని ఆకాశం ఊడిపడ్డట్టు నిద్రలేపుతారు. న్యూ ఇయర్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అది ప్రపంచ తాగుబోతుల దినోత్సవం ............. అధికారికంగా ప్రకటించకపోయినా. జీవక్రియలు నెమ్మదించే సమయమని ముందే చెప్పుకున్నాం కదా, అయినా అలాంటి సమయంలో వీళ్ళు కేకులు తిని, మందు కొట్టి వేడుకలు జరుపుకుంటారు. ఆరోగ్యం నోట మన్ను కొడతారు, పటాసులు కాల్చి మిగితా జీవాల నిద్ర చెడగొడతారు. అది ఏ మార్పూ కలగని సమయం. కానీ వారికి రోజు మారుతుంది !? మారిందా? మారిందనుకుంటున్నారా?

అంటే మనం గమనించాల్సింది మన ధర్మంలో రోజు మార్పంటే నూతన శక్తి, నూతన ఉత్తేజం. మన ధర్మంలో మార్పు అంటే ఎవరో మనుష్యులు నిర్ణయించేది కాదు, ఈశ్వరుడు నిర్ణయించినది, ప్రకృతిబద్ధమైనది. పాశ్చాత్యులు వారి రోజు మార్పును నిద్రలోనో, మత్తులోనో ఆహ్వానిస్తే, హిందువులు మాత్రం దానికి సిద్ధపడి ముందే స్వాగతం పలుకుతారు. అది సుప్రభాతం.

To be continued .............

Sunday, 31 January 2016

హిందూ ధర్మం - 193 (గోవు ప్రాముఖ్యత - 5)

గోమూత్రానికున్న మరిన్ని ఔషధ లక్షణాలు తెలుసుకుందాం. మనం నిత్యం తీసుకునే ఆహారం పూర్తిగా జీర్ణం కాక చాలా కొద్ది భాగం (Residue) శరీరంలో మిగిలిపోతుంది. ఈ విషాలను ఆయుర్వేదం ఆమం (Toxins) అంటుంది. వ్యాయామం, యోగాసనాలు, సరైన జీవనవిధానం, అప్పుడప్పుడు ఉపవాసాల ద్వారా దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేసే పద్ధతి సనాతన ధర్మం అందించింది. అయితే ఇలా మిగిలిపోయిన జీర్ణం కానీ పదార్ధాలు శరీరంలో విషాలుగా మారి, జబ్బులను కలిగిస్తాయి. జబ్బులను నయం చేసుకోవటానికి మందులను అధికంగా వాడినప్పుడు, రోగం తగ్గినా, ఆ మందులలోని కొంత భాగం వ్యర్ధ పదార్ధంగా దేహంలో మిగిలిపోతుంది. కాలక్రమంలో అది మురుగిపోయి, ఆమంగా మారి, కొత్త జబ్బులను కలిగిస్తుంది. మానవులకు ఈ ఆమం పెరిగిపోవడం వలన అనేకానేక వ్యాధులు వస్తాయి. శరీరంలో ఇతర మార్గాల ద్వారా ఏర్పడిన ఆమాన్ని తొలగించేందుకు ఔషధాలున్నాయి కానీ, ఔషధాల వలన ఏర్పడిన ఆమాన్ని తొలగించే మందులు ప్రపంచంలో లేవు. దీని విరుగుడు ఒక్క గోమూత్రం మాత్రమే. గోమూత్రాన్ని లేదా పంచగవ్యాన్ని 40 రోజుల పాటు ఉదయం పొరగడుపున నిర్ణీత పద్ధతిలో స్వీకరిస్తే, అది ఆమాన్ని హరించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతటి శక్తి గోమూత్రానికుంది.

శరీరం కఫ, వాత, పైత్యాలనే మూడు దోషాలతో ఏర్పడిందని ఆయుర్వేదం చెప్తోంది. వీటినే త్రిదోషాలు అంటారు. ఇవి సమంగా ఉంటేనే వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. ఈ 3 దోషాలు ఏది ఎక్కువైనా, అది రోగాలను కలిగిస్తుంది. జబ్బు ఒకటే కావచ్చు, కానీ దాన్ని కలిగించిన దోషం వేరై ఉండచ్చు. అందుకనే ఆయుర్వేదంలో బయటకు కనిపించే లక్షణాలను చూసి రోగానికి ఔషధమివ్వరు. మూలం ఏంటో కనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఈ త్రిదోషాలకు జన్యుపరమైన సంబంధం కూడా ఉందని ఈ మధ్యనే సిసిఎంబి వారి పరిశోధనలో తేలింది. వేళ ఏళ్ళుగా ఆయుర్వేదం చెప్తున్న త్రిదోషాలను ఇన్నాళ్ళు అంగీకరించని ప్రపంచం ఈ పరిశోధనతో సత్యమని ఒప్పుకుని తీరాల్సి ఉంటుంది. ఈ త్రిదోషాలను సమంగా ఉంచే లక్షణం గోమూత్రానికుంది.  గోమూత్రాన్ని స్వీకరిస్తే కఫ, వాత, పైత్యాలు అదుపులోకి వస్తాయి.

గోమూత్రం కాలేయ పని తీరును మెరుగుపరుస్తుంది. కాలేయం (Liver) బాగుంటే శుద్ధమైన రక్తం ఏర్పడుతుంది. ఫలితంగా రోగనిరోధశక్తి పెరుగుతుంది.

శరీరానికి శక్తినిచ్చే కొన్ని సూక్ష్మపోషకాలు (micro-nutrients) దేహంలో ఉంటాయి. ఇవి మూత్రవిసర్జన ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. వీటిని శరీరం అధికంగా కోల్పోతే వృద్ధాప్యలక్షణాలు త్వరగా వస్తాయి. గోమూత్రంలో ఈ సూక్ష్మపోషకాలను భర్తీ చేసే అనేక తత్త్వాలు ఉండడం చేత, దాన్ని స్వీకరించినవారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రావు.

మానసిక ఆందోళన నాడీవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. గోమూత్రాన్ని హృద్యమని, మేధ్యమని అన్నారు. అనగా అది మెదడుకు, గుండెకు శక్తినిస్తుందని అర్దం. గోమూత్రం మెదడు, గుండెకు ఆందోళన వలన నష్టం కలగకుండా రక్షిస్తుంది. ఆయా భాగాలను రోగాల నుంచి కాపాడుతుంది.

 Source: https://cowurinebenefit.wordpress.com/2012/10/06/cow-urine-benefits/

To be continued ....................

Sunday, 17 January 2016

హిందూ ధర్మం - 192 (గోవు ప్రాముఖ్యత - 4)

సుశ్రుత సంహిత ప్రకారం గోమూత్రం చేదు, ఘాటు, వేడిగా ఉంటుంది. త్వరగా జీర్ణమవుతుంది. మెదడుకు బలాన్నిస్తుంది, దగ్గును నయం చేస్తుంది. పొత్తి కడుపు నొప్పి, దురద, తామర, మలబద్దకం, నోటి రోగాలను నశింపజేస్తుంది. బొల్లి, కుష్టు వ్యాధి, బస్తి రోగాన్ని నాశనం చేస్తుంది. నేత్ర వ్యాధులకు మంచి ఔషధం గోమూత్రం. అమీబియాసిస్, విరేచనాలు, డయేరియా, వాతం వలన కలిగే అన్ని రోగాలు, దగ్గు, వాపు, ఉదర వ్యాధులు గోమూత్రం వలన నయమవుతాయి. గోమూత్రం యాంటి-బయోటిక్. కామెర్లు, ప్లీహవ్యాకోచము, చెవి వ్యాధులు, ఉబ్బసం, మలబద్దకం, రక్తహీనత పూర్తిగా తగ్గిపోతాయి. అన్ని మూత్రాల్లోకి గోమూత్రానికి ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందువలన గోమూత్రాన్ని మాత్రమే వాడాలి - సుశ్రుత సంహిత

గోమూత్రం ఉప్పగా, ఘాటుగా, వేడిగా ఉండి, త్వరగా జీర్ణమవుతుందని, ఆకలిని పెంచుతుందని, పైత్యరసాన్ని పెంచుతుందని, కొద్దిగా తీపిగా ఉంటుందని, మలబద్దకాన్ని నివారిస్తుందని, శరీరంలోని వ్యాధులను కూకటి వ్రేళ్ళతో పెకిలించి వేస్తుందని ఆర్యబిషక చెప్తోంది. అవేగాక దగ్గు, కుష్టు, కడుపునొప్పి, ఉదర సంబంధ వ్యాధులు, రక్తహీనత, బొల్లి, నొప్పులు, మూలశంకవ్యాధి, తామర, ఉబ్బసం, ప్రేగు కోశ వ్యాధులు, జ్వరము, ఒళ్ళు మంటలు, నోరు, కంటి వ్యాధులు, స్త్రీలకు వచ్చే జబ్బులు. మూత్రవ్రోధము, జిగట విరోచనాలను నయం చేస్తుందని చెప్తోంది.

భావప్రకాశ అనే ఆయుర్వేదం గ్రంధం గోమూత్రం గుణాలను గురించి ఈ విధంగా చెప్తొంది. గోమూత్రం చేదు, ఘాటు, వేడి, ఉప్పగా  తక్కువ లవణాలు కలిగి ఉంటుంది. ఆకలిని పెంచుతుంది. మెదడు కణజాల వృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. కఫాన్ని, పైత్యాన్ని హరిస్తుంది, జీర్ణరసాన్ని వృద్ధి చేస్తుంది. కడుపు నొప్పు, గ్యాస్, ఇతర ఉదర సంబంధ వ్యాధులు, తామర, నేత్ర దోషాలు, అన్ని రకాల నోటి దోషాలు నయం చేస్తుంది. బొల్లి, కుష్ఠులను నశింపజేస్తుంది. దగ్గు, ఊపిరాడకపోవడం, కామెర్లు, రక్తహీనత, జిగట విరోచనాలు, కీళ్ళ నొప్పులకు ఔషధం గోమూత్రం. హానికారక క్రిములని చంపేస్తుంది. కేవలం గోమూత్రం త్రాగడం వలననే అన్ని రోగాలు నశిస్తాయి. కాలేయానికి మేలు చేస్తుంది. వాపులు, మంటలు, మూలశంక, మలబద్ధకం, ఉదరవ్యాధులుకు గొప్ప ఔషధకారి. చెవిలో వేసుకుంటే అన్ని రకాల కర్ణవ్యాధులు తొలగిస్తుంది. మూత్రకోశ వ్యాధులు, ఆమం పెరిగిపోవడం వలన వచ్చే వ్యాధులు, కండరాల వ్యాధులు, అనేక వ్యాధులను నయం చేయగల శక్తి గోమూత్రానికుంది.

To be continued .................

Source:
http://www.blog.gomataseva.org/natural-healing-of-cow-dung/
https://trueayurveda.wordpress.com/2014/04/09/cow-dung-uses-and-used-for-centuries/

Wednesday, 13 January 2016

ధనుర్మాస వ్రతం - ఆరోగ్యం - ఆయుర్వేదం

ధనుర్మాసం హేమంత ఋతువులో వస్తుంది. ఈ సమయానికి భారతదేశంలో చలి విపరీతంగా ఉంటుంది, పొగమంచు కారణంగా సూర్యుడి కిరణాలు భూమిని అధికంగా చేరలేవు, ఫలితంగా అరుగుదల, ఇతర జీవక్రియలు నెమ్మదిస్తాయి. అదే ఆకులు రాలి ప్రకృతి మొత్తం కళావీహినమైన కారణం చేత మనసుని జడత్వం, బద్దకం ఆక్రమిస్తాయి. హిందూ ధర్మం అంటే విశ్వధర్మం, మనిషి విశ్వానికి అనుగుణంగా బ్రతకడం జీవించడమే, ఆఖరున విశ్వాత్మలో ఐక్యమవడమే ఈ ధర్మం యొక్క లక్ష్యం. ఈ ధనుర్మాస వ్రతం ఆచరించేవారు ఉదయం వేకువజామునే లేచి పూజ ముగించి సూర్యోదయానికి పూర్వమే భగవంతునికి నివేదన చేయడం కూడా పూర్తి చేయాలి. ప్రతి రోజు ఒక్కో ప్రత్యేకమైన వంటకం ఉంటుంది, పులగం, కట్టెపొంగలి, చక్రపొంగలి, పరమాన్నం, పులిహోర ఇలా అన్నమాట. వాటిలో ఏఏ పదార్ధాలు వేయాలో, ఎప్పుడు వేయాలో, ఎంత వేయాలో కూడా ముందే నిర్ణయించారు పెద్దలు.

ఇందులో ఆయుర్వేద శాస్త్రం ఇమిడి ఉంది. మిరియాలు, శొంఠి, ధనియాలు, ఇంగువ మొదలైనవి ఉపయోగిస్తారు. ఇవి ఔషధగుణం కలిగినవి. ఈ కాలంలో వచ్చే అనారోగ్యాలను అరికట్టే శక్తి వీటికి ఉంది. ఇవే కాక దద్దోజనం కూడా వండుతారు. అసలు సూర్యోదయానికి ముందే నివేదన పూర్తి చేయాలన్న నియమం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ఇది చలికాలం, పగలు తక్కువ, రాత్రి సమయం ఎక్కువ. సూర్యాస్తమాయం తర్వాత 1-2 గంటల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనైన రాత్రి భోజనం ముగించాలి, అప్పుడే ఆహారం అరిగి, ఆరోగ్యంగా ఉండగలం. హేమంత ఋతువులు సూర్యాస్తమయం సాయంత్రం 5:30లో అవుతుంది. అంటే 7:30 లోపు రాత్రి భోజనం ముగించాలి. ఆ తర్వాత ఏమి తిన్నా అరగడం కష్టం. రాత్రి సమయం ఎక్కువ కావడం చేత ఉదయం సూర్యోదయం 6:30 కు అటుఇటుగా అవుతుంది. ఉదయం 8:30 కు ఉదయం భోజనం చేస్తామనుకున్నా, మధ్యలో 13-14 గంటల సమయం జీర్ణవ్యవస్థ ఖాళిగా ఉంటుంది. ఇంతసేపు ఖాళీగా ఉంటే, కడుపులో గ్యాస్ ఏర్పడి కొత్త రోగాలు వస్తాయి. కనుక ఇది ఆలోచించిన ఋషులు ఉదయమే అందరూ స్నానాలు ముగించి సూర్యోదయానికల్లా పూజ ముగించమన్నారు. సూర్యోదయం అవ్వగానే ఆహారం స్వీకరించవచ్చు కనుక ఈ ప్రసాదంగా చేసిన ఔషధవంటకాలను భుజిస్తారు. దద్దోజనం వంటివి గ్యాస్ ఏర్పడకుండా హరిస్తాయి. ఉదయం పరగడుపున ఏది స్వీకరిస్తమో, దాన్ని శరీరం పూర్తిగా స్వీకరిస్తుంది. ఔషధ తత్వాల ఆహారం స్వీకరిస్తే, రోగనిరోధకశక్తి పెరిగి ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

భోగి విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు.
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_10.html

గొబ్బెమ్మల విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు.
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_8.html

రంగవల్లులు - ఆరోగ్యం విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post.html

భోగి పండ్లెందుకు పోస్తారు కోసం ఈ లింక్ చూడండి
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_12.html

ఆండాళ్ అమ్మవారి కధ కోసం ఈ లింక్ చూడండి.
http://ecoganesha.blogspot.in/2016/01/blog-post_13.html