Showing posts with label మట్టి. Show all posts
Showing posts with label మట్టి. Show all posts

Thursday, 15 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 8



పంచభూతాలకు శక్తులున్నాయని మన శాస్త్రకారుల మాట. నీటికి మన భావాలను గ్రహించి, దానికి అనుగుణంగా మారే లక్షణం ఉంది. దీన్ని జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిరూపించారు. అలాగే భూమికి, వాయువుకు, ఆకాశానికి, అనలానికి కూడా కొన్ని శక్తులున్నాయి. మహాపురుషులు, అవతారమూర్తులు తపస్సు చేసిన ప్రదేశాలు, నివాసం ఉన్న ప్రదేశాల్లో అక్కడి పంచభూతాల్లో వారి శక్తి నిక్షిప్తమై ఉంటుంది. బృందావనాన్ని దర్శించిన కొందరు పరమభక్తులు, యోగులు అక్కడి వాయు మండలంలో ఇప్పటికి నిక్షిప్తమై ఉన్న శ్రీ కృష్ణుని వేణునాదాన్ని విని పరవశిస్తారు. ఇలా అనేక ఉదాహరణలున్నాయి, కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం శృంగేరి. అక్కడికి శంక్రులు వెళ్ళేసరికి ఒక కప్ప ప్రసవిస్తూ ఉంటే, పాము పడగపట్టి నీడ ఇస్తుంది. అలాగే విద్యారణ్యులు విజయనగరం వెళ్ళినప్పుడు కుందేళ్ళు వేటకుక్కలను తరమడం చూసి, అక్కడే నగరానికి పునాది వేస్తారు. అది అక్కడి మహత్యం. మహాత్యం అంతా ఆ ప్రదేశంలో ఉన్న పంచభూతాల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి వలన వస్తుంది. పుణ్యక్షేత్రం అంటే కూడా అంతే. క్షేత్రం వేరు, అక్కడి ఆలయంలో ఉన్న మూర్తి వేరు కాదు. తిరుమల వెళ్ళడం అంటే, ఆనందనిలయంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరుని మూర్తి ఒక్కటే కాదు, ఆ కొండ, ఆ గాలి, ఆ నడకదారి ........... సర్వమూ గోవిందుడే. ఆ కొండ మీద చెత్త వేస్తే, గోవిందుడి మీద వేసినట్లే. హరిద్వార్, ఋషికేశ్, కైలాస మానస సరోవరం వంటి ప్రదేశాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అవి తపోభూములు. అక్కడున్న ఆలయంలో భగవంతునికి అపచారం చేస్తేనే పాపం కాదు, ఆ ప్రదేశంలో చేయకూడని పనులు చేసినా, దాన్ని కలుషితం చేసినా, ఈర్ష్యా, అసూయ, ద్వేషం మొదలైన దుర్భావాలకు లోనయినా, అది అపచారమే. అది ఆ ప్రదేశంలో ఉన్న పంచభూతాల్లోకి చెడు సంకేతాలను పంపుతుంది.

అలాగే మట్టికి కూడా తనలో కొంత శక్తిని నిక్షిప్తం చేసుకునే శక్తి ఉంది. ఇది మనకు వినాయకచవితిలో కనిపిస్తుంది. వినాయక చవితికి మృత్తికతో చేసిన గణపతిని పూజించిన తర్వాత, దాన్ని నిమజ్జనం పేరున జలములలో కలిపేస్తాము. ఏ మట్టి ప్రతిమలోనికైతే మనం గణపతిని ఆవాహన చేసి, అర్చించి, తిరిగి యధాస్థానానికి పంపామో, ఆ ప్రతిమ ఆ తర్వాత కూడా దైవీశక్తిని, మంత్రశక్తిని తనలో నిక్షింప్తం చేసుకుని ఉంటుంది. అందుకే దాన్ని ఎక్కడపడితే అక్కడ పడవేయరు. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ప్రవహించే నీటిలో కలుపుతారు. దాని వలన ఆ మట్టి, దానితో పాటున్న మంత్ర/ దైవ శక్తి నీటిలో కలుస్తుంది, ఆ శక్తిని నీరు గ్రహిస్తుంది. ఆ జలములు ఎంత దూరం ప్రవహిస్తాయో, అంతదూరం ఈ శక్తి వ్యాపిస్తూ వెళుతుంది. సూర్యరశ్మికి ఆ నీరు ఆవిరై అక్కడి ప్రదేశాన్ని పవిత్రం చేస్తుంది, వర్షం కురిసినప్పుడు, ఆ జలములతో పాటే ఆ శక్తి భూమికి దిగి ఈ భూమిని పవిత్రం చేస్తుంది, పంటల ద్వారా ఆహారంలోకి చేరి, మనస్సులను పవిత్రం చేస్తుంది. అందుకే మన ధర్మంలో కొన్ని క్రతువుల తర్వాత నీటిలో విగ్రహాలను విసర్జిస్తారు. పూజ చేసిన వారికే కాదు, సమస్త భూమండలానికి ఆ ఫలితం అందుగాకా! అందరూ పవితులు అవుదురు గాకా! అన్నదే మన ధర్మ ఆదర్శం. లోకాసమస్తా సుఖినోభవంతు అన్న మంత్రానికి ఇది నిదర్శన పూర్వక ఉదాహరణ.

ఇలా ఇప్పటికి ఎన్నోసార్లు ఎందరో ఈ భూమండలాన్ని పవిత్రం చేశారు. నదీనదాలు, అడవుల మొదలు సమస్త ప్రకృతిలో, మానవులలో శాంతి కొరకు ఇలాంటివి చేసి, ఆ శక్తిని ప్రవేశపెట్టారు. కనుక అన్నిటియందు దైవశక్తి ఉంది, ఇవన్నీ ఒకనాడు నా పూర్వీకుల చేత పవిత్రం చేయబడ్డవే అనే భావనతో నేను వాటిని కలుషితం చేయను, ఇదంతా బ్రహ్మ మయమే అనేవాడే నిజమైన హైందవుడు.

మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభి మంత్రితాః ||

To be continued ..............

Monday, 12 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 7



ఇప్పటివరకు ఆరోగ్యపరంగా, మానసికంగా మనకూ మట్టికి సంబంధం చూశాం. ఇప్పుడు ఆధ్యాత్మిక కోణం దర్శిద్దాము. ఈ శరీరంలో పంచభూతాలతో నిర్మితమైనట్టే, షట్చక్రాల్లో మూలాధారం నుంచి విశుద్ధి చక్రం వరకు క్రమంగా 5 చక్రాలు పృధ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశ తత్త్వాలను కలిగి ఉంటాయి. కుండలిని జాగృతి జరగాలన్నా, లేదా మనస్సు, శరీరం సమతుల్యంతో జీవించాలన్నా, ఈ తత్త్వాలు శుద్ధంగా ఉండాలి. ఇవి చెడిపోవడం వలన అనేక సమస్యలు వస్తాయి. జగ్గీవాసు దేవ్ అంటారు, అధికంగా మానవులంతా భౌతిక, మానసిక క్రియల వలలో ఇరుక్కుని ఉంటారు. వీటిని దాటి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మొదట మనమీ పంచభూతాలను శుద్ధి చేసుకోవాలి. అప్పుడు భౌతిక, మానసిక స్థితులకు, నీ సహజ స్థితికి మధ్య తేడాను గమనించగలవు అని.

నిజానికి ఈ భూతశుద్ధి తంత్రశాస్త్రాల్లో చెప్పబడిన ప్రక్రియ. అయితే మన సనాతన ధర్మ జీవన విధానం ఎటువంటిదంటే అనేక ప్రక్రియలను మన జీవన విధానంలో భాగం చేశారు ఋషులు. మూలాధారం పృధ్వీ తత్త్వం. భూమికి దూరంగా జరిగితే శరీరంలో ఈ భూతం చెడిపోతుంది. అందువలన ఆధ్యాత్మిక ఉన్నతి అక్కడే ఆగిపోతుంది. అసలు మూలాధారమే ప్రారంభస్థానం. అక్కడి నుంచి కుండలిని జాగృతి జరగాలంటే పృధ్వీ భూతం శుద్ధి జరగాలి. అందుకోసం చెప్పుల్లేకుండా సారవంతమైన మట్టిలో నడవడం, మొక్కలకు పాదులు తీయడం, నీరు పెట్టడం, మట్టిలో పని చేయడం, పెద్ద పెద్ద వృక్షాలను స్పృశించడం, వాటి క్రింద కూర్చోవడం వంటివి రోజూ చేయాలి. అప్పుడే ఆ భూతశుద్ధి జరుగుతుంది. ఇలా ఒక్కో చక్రానికి, ఒక్కో భూతానికి సంబంధం ఉంటుంది. వాటికి దగ్గరగా బ్రతక్కపోతే, ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు. అందుకే నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితిలో ఒకమాట అన్నాడు - యోగా ప్రజలను ప్రకృతికి దగ్గర చేస్తుందని. దాని అర్దమిదే. ఈ శరీరం పంచభూతాలతో ఏర్పడిందని, వాటికి దూరంగా అసహజంగా బ్రతికితే ఇవి చెడిపోతాయనే స్పృహ కలిగి ఉండాలి.

అయితే కేవలం దగ్గరగా జరిగితే సరిపోదు. బయట ఉన్న పంచభూతాలను కూడా శుద్ధంగా ఉంచాలి, కాలుష్యం చేయకూడదు. యత్పిండాండే తత్బ్రహ్మాండే అని మనకు శాస్త్రంలో చెప్పబడింది. పిండాండంలో ఉన్నదేదో, అదే బ్రాహ్మాండంలో కూడా ఉన్నది అని. బయట ఉన్న బ్రహ్మాండాన్ని కలుషితం చేస్తే, ఈ పిండాండం (శరీరం) కూడా కలుషితమవుతుంది. నేలలో ప్లాస్టిక్ కవర్లు పడేయడం, మొక్కలను, అడవులను నరికేసి నేలకోతకు కారణమవ్వడం, మట్టిలో హానికారక రసయానలు కలపడం, భూసార క్షీణతకు కారణమవ్వడం, ప్రకృతి వ్యవస్థ దెబ్బతినేలా మట్టిని, ఇసుకను తవ్వి తరలించేవారికి, కొండలను మైనింగ్ పేరుతో పెద్ద పెద్ద బాంబులు పెట్టే పేల్చేచారికి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండనే ఉందడు. అది శూన్యం. వాళ్ళకు భక్తి ఉండచ్చు కాక, కానీ ఆధ్యాత్మికంగా వారు ఎదగడమన్నది ఉండనే ఉండదు. ఎందుకంటే ఈ భగవంతుని శివుడిగా పూజిస్తే, ఈ భూమి పార్వతి. సర్వేశ్వరునిగా నారాయణుని ఆరాధిస్తే, కనిపించే ఈ జగత్తు భూ, నీలా, లక్ష్మీ దేవి. శక్తికి అపచారం చేసి, బ్రహ్మాన్ని చేరుకోవాలనుకోవడం కల. మిగితా భూతాలను కూడా కలుషితం చేస్తే ఇలానే ఫలితాలు ఉంటాయి. అందుకే ప్రకృతిని ప్రేమించేవారికి (మన దేశంలో హోలీకి, వినాయకచవితికి, దీపావళికి మాత్రమే నిద్రలేచే కుహనా పర్యావరణ వేత్తల గురించి కాదు చెప్పేది) ఆధ్యాత్మికత త్వరగా వంటబడుతుంది. ఎందుకంటే వారే ప్రక్రియ చేయకుండానే వారిలో పంచభూతాలు శుద్ధి జరిగి ఉంటాయి. ఇది పాశ్చాత్యుల్లో కనిపిస్తుంది. వారి మతం వేరైనా, అందులో ప్రకృతిని దోచుకోమని స్వయంగా చర్చియే చెప్పినా, అక్కడి ప్రజలు పృకృతిని కాలుష్యరహితంగా ఉంచుతున్నారు. అందుకే వారు సనాతన ధర్మంలోకి వచ్చి, ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతులను పొందుతున్నారు. విదేశీయుల్లో హిందువులుగా మారిన వారిలో 99% మంది ప్రకృతి ప్రేమికులే.  మనకు భక్తి ఉంది, కానీ వారికి భక్తితో పాటు ఆధ్యాత్మిక అనుభూతులు కూడా మెండుగా ఉన్నాయి. దానికి కారణమిదే. కాబట్టి మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, ప్రకృతికి దగ్గరగా బ్రతకాలి. అందుకే ఋష్యాశ్రమాలన్నీ ప్రకృతి మధ్యనే ఉంటాయి, ప్రకృతిని రక్షిస్తూ, పర్యావరణ హితంగా ఉంటాయి. మానవుడు ఈ ప్రకృతిలో అంతర్భాగమే కాని దాన్ని అనుభవించడానికి పుట్టినవాడు కాదు, దానికి అతీతుడూ కాదు.

To be continued ..........

Saturday, 10 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 6



ఇంతకముందు చెప్పుకున్నాం కదా, మట్టిలో 18 రకాల సూక్ష్మపోషకాలు ఉంటాయని. అలాగే ఈ శరీరాన్ని తగులబెట్టినప్పుడు మిగిలేది 20 గ్రాముల మట్టి మాత్రమే. మళ్ళీ అందులో కూడా అవే 18 రకాల సూక్ష్మపోషకాలు ఉంటాయి. అది శరీరానికి, మట్టికి ఉన్న సంబంధం. రాజీవ్ దీక్షిత్ గారంటారు, మట్టి పాత్రలలో వండిన ఆహారం తినడం వలన మాన పూర్వీకులకు జీవితాంతం కళ్ళజోడు రాలేదు, పళ్ళు ఊడిపోలేదు, మోకాళ్ళ నొప్పులు, డయాబిటిస్ వంటి సమస్యలు రాలేదు. శరీరానికి కావల్సిన పోషకలు సక్రమంగా అందుతుంటే జీవితాంతం మన పనులన్నీ ఎవరి మీదా ఆధారపడకుండా చేసుకుంటూ జీవించగలం. అది ఒక్క మట్టి పత్రలలో వండిన ఆహారం భుజించడం వల్లనే సాధ్యమవుతుంది. మట్టిపాత్రలో వండిన ఆహారంలో పోషకాలు ఒక్కటి నాశనమవ్వవు, 100% శాతం అందులో రక్షించబడతాయి. ఆ తర్వాత ఉపయోగపడేది కాంస్యం లేదా కంచు. అందులో 97% పోషకాలు ఉంటాయి, 3 % నశిస్తాయి. ఆ తర్వాత ఇత్తడి పాత్ర. అందులో 93% వరకు పోషకాలు రక్షించబడతాయి. ఇదంతా మేము 3000 ఏళ్ళకు పూర్వం మన భారతదేశంలో జీవించిన మహర్షి వాగ్భటాచార్యులు పొందుపరిచిన ఆయుర్వేద సూత్రాల నుంచి గ్రహించి, వాటిని సి.డి.ఆర్.ఐ. (Central Drug Research Institute) శాస్త్రవేత్తల ద్వారా పరిశోధన చేయించాము. అందులో వారు అంగీకరిచిన మరో సత్యం ఏమిటంటే ప్రెషర్ కుక్కర్ లో వండిన ఆహారం దీర్ఘకాలంగా విషంగా పని చేస్తుందని. ఇది కూడా వాగ్భటులు చెప్పిన సూత్రల్లో ఉంది. ఇంకోటి, ఈ అల్యూమినియం అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఈ పాత్రలో ఆహరం వండుకుని, మళ్ళీ మళ్ళీ తింటూ ఉండేవారికి మధుమేహం, జీర్ణసంబంధిత వ్యాధులు, టిబి, ఆస్తమా, కీళ్ళ వ్యాధులు తప్పకుండా వస్తాయి. ఇలాంటి పాత్రలలో వండిన ఆహారంలో కేవలం 7% నుంచి 13% వరకు మాత్రమే పోషకాలు ఉంటాయి. ఇది ఆ కేంద్రప్రభుత్వ పరిశోధనా సంస్థ వారు అంగీకరించారు. కానీ వారే విషయం బయట పెడితే, ఈ ప్రెషర్ కుక్కర్ కంపెనీలు వారిని ఉండనివ్వవని చెప్పారు. అందుకే మనం ఇప్పుడు ఇండియా పద్ధతి నుంచి భారతీయ పద్ధతికి, మన అసలుసిసలైన సంప్రదాయంలోకి అడుగుపెట్టాలి. మట్టి పాత్రలలో విశిష్టత మీకు ఇంకా తెలియాలంటే డయాబిటీస్ ఉన్నవారికి ఈ పద్ధతిలో మట్టి పాత్రలో వండిన భోజనాన్ని మహర్షి వాగ్భటాచార్యుని సూత్రాల ప్రకారంగా పెట్టి చూడండి. కొన్ని నెలల్లోనే వారు మధుమేహం నుంచి విముక్తులవుతారు. అందుకే మనం మట్టికి దగ్గరగా జరగాలి.

ఈ మట్టికి మానవశరీరానికి ఉన్న సంబంధం శాస్త్రాల్లో ఇలా అనేక విధాలుగా చెప్పబడింది. నిత్యం భగవంతుని ఆరాధనలో 'లం పృధ్వీ తత్వాత్మికై గంధం సమర్పయామి' అని అమ్మవారికి లేదా భగవానునికి అర్పిస్తాము. అందులో మనం చెప్పేది పృధ్వీ తత్త్వానికి గంధం ప్రతీక. పంచభూతాల్లో భూమికి, పంచతన్మాత్రల్లో  వాసనకు సంబంధం ఉంది. ఎప్పుడైతే మనం భూమి, మట్టికి దూరంగా అసహజమైన జీవనం గడుపుతామో, అప్పుడు ముక్కుకి తన సహజ లక్షణమైన వాసనలను పసిగట్టే లక్షణం తగ్గిపోతుంది. ఇది ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధనల్లో కూడా వెల్లడయ్యింది. కాలుష్యం వలన, సారవంతమైన మట్టికి దూరంగా జీవించడం వలన మానవుడి వాసనలు పసిగట్టే లక్షణం దారుణంగా పడిపోతున్నదని, కనీసం అప్పుడప్పుడైనా పల్లుటూళ్ళకు వెళ్ళి అక్కడ ప్రకృతికి దగ్గరగా జీవించాలని అందులో పేర్కొన్నారు. ఇది 3-4 క్రితం పత్రికల్లో ప్రచురితమైంది. ఇలా చూసుకుంటే మనం మట్టికి దూరంగా జరగడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాము.

విచిత్రమేమిటంటే మట్టిలో క్రిములున్నాయని పిల్లల్ని మట్టిలో ఆడుకోనివ్వరు తల్లిదండ్రులు. వాళ్ళు ఏడవకుండా సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, టివిలు ఇస్తారు. ఒకసారి పరిశోధనలు చూడండి. మీ సెల్ ఫోన్ తెర మీద ఎన్ని క్రిములుంటాయో తెలుసా? టాయిలెట్ డోర్ హ్యాండిల్ మీద ఉన్నన్ని క్రిములు. కంప్యూటర్ కీ బోర్డు ఏమీ తక్కువకాదు. బాత్రూం దగ్గర కాళ్ళు తుడుచుకోవడానికి వేసే డోర్ మ్యాట్ మీద ఉన్నన్ని క్రిమిలు కీబోర్డు మీదుంటాయి. టివి రిమోట్ మీద కూడా దగ్గర దగ్గరగా అన్నే ఉంటాయి. అసలు మనం వాటిని వదిలి ఉండేదెప్పుడు? వాటిని ముట్టుకుని, ఆ తర్వాత ఎన్ని పనులు చేస్తామో, తినడం కూడా. చక్కగా బయట ఆడుకోకుండా వారిని అదుపు చేసి, ఇంట్లో అసహజమైన వస్తువులతో వారికి మనేమి ఇస్తున్నాం? మనమేమి పొందుతున్నాం? ఆరోగ్యమా? అనారోగ్యమా?

To be continued .................

Friday, 9 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 5



చిన్నప్పుడు మేము మట్టిలోనే ఆడుకునేవాళ్ళము. ఎంతగా ఆడుకునేవాళ్ళమంటే ఒళ్ళంతా చెమటలు పట్టేలా. అయితే కొంచం పెద్దయాక స్కూల్ లో మాకు చెప్పారు, మట్టిలో క్రిములు ఉంటాయి, మట్టికి దూరంగా ఉండాలి, మట్టి ముట్టుకుంటే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి అని. నిజానికి అలా పుస్తకాల్లో ఉంది, అదే టీచర్లు చెప్పారు. అప్పటి నుంచి మట్టికి దూరమయ్యాము అనారోగ్యం వస్తుందన్న భయంతో. చాలా ఏళ్ళ తర్వాత ఇలానే యూ ట్యూబ్ లో సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రవచనం ఒకటి విన్నాను. అందులో ఆయన ఆయుర్వేదం గురించి చెప్తూ ఇలా అన్నారు. ఇప్పుడు మనకు అనేక ఆనారోగ్య సమస్యలు రావడానికి కారణం మనం పంచభూతాలకు దూరమవ్వడమే, ఎందుకంటే ఈ శరీరం, మనస్సు పంచభూతాల వల్లనే ఏర్పడ్డాయి. ఈ శరీరం పంచభూతాలే తప్ప మరొకటి కాదు. ఎప్పుడైతే శరీరం, మనస్సు వాటికి దూరంగా జరుగుతాయో, అప్పుడే మానసిక, శారీరిక అనారోగ్యం ఏర్పడుతుంది. మా ఆశ్రమంలో ఉన్న వైద్యశాలకు నిత్యం అనేకమంది రోగులు వస్తూ ఉంటారు. వారికి మేము కేవలం ఔషధాలే ఇవ్వము, అంతకంటే ముందు మట్టిలో పని చేయమంటాము, మొక్కలకు పాదులు తీసి, నీళ్ళు పెట్టమంటాము, మట్టి ఎత్తమంటాము. కొందరికైతే ఔహధాలు అసలే ఇవ్వము, కేవలం ఇవి మాత్రమే ఆచరించమని చెప్తాము. అలా కొద్దిరోజులు వారికి ఆచరించడంతోనే వారి రోగాలను నయమై, వారు ఇంటి ముఖం పడతారు. ఇప్పుడు మనకు సంక్రమిస్తున్న అనేక అనారోగ్య సమస్యలకు కారణం మనం ప్రకృతికి, పంచభూతాలకు దూరంగా జరగడమే.

ఇది విన్న తర్వాత నాకర్దమయ్యింది మనమేమి కోల్పోతున్నామో. ఇంతలో అనుకోకుండా ఒకరోజు మా ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మట్టిలో చెప్పులేకుండా నిల్చోవాల్సి వచ్చింది. ఆ సమయానికి నాలో పైత్య దోషం ప్రకోపించి, వేడి పెరిగింది. ధ్యానం మొదలైన ప్రక్రియలు చేయడం వలన శరీరంలో జరిగే చాలా సూక్ష్మ చర్యలను కూడా గమనించే శక్తి కలుగుతుంది, ఏకాగ్రత వలన. అది ధ్యానం చేసే చాలామందికి తెలిసిన విషయం. అప్పుడు గమనించాను, మట్టి నా శరీరంలో ఉన్న వేడిని తనలోకి లాగేస్తోందని. కాసేపు నిల్చుంటేనే శరీరంలో ఉన్న అధికవేడిని మట్టి/ భూమి లాగేసింది. ఆ తర్వాత ఎన్నోసార్లు చేసి చూశాను, పైత్యం ప్రకోపించిన ప్రతిసారీ ఇదే చేశాను. మళ్ళీ మళ్ళీ నాకు నేను ఋజువు చేసుకున్నాను. అప్పుడర్దమైంది మట్టికి ఉన్న శక్తి. ఇలా నాకే కాదు, ఇంతకముందు ఆయుర్వేదం గురించి చెప్పిన అనీల్ కిషన్ కి కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి.

చాలామంది అంటారు, మట్టిలో నడిస్తే కాళ్ళు పగులుతాయని. కానీ అది పెద్ద అపోహ. కాళ్ళు పగిలేది మట్టిలో నడిస్తే కాదు, దుమ్ములో నడిస్తే. మట్టికి, దుమ్ముకు చాలా తేడా ఉంది. మట్టికి ఎంతో హీలంగ్ పవర్ ఉంది. సారవంతమైన మట్టిలో నడిస్తే, కాళ్ళ పగుళ్ళు కూడా వేగంగా, ఏ మందు రాయకుండానే మానిపోతాయి. చాలామంది ఉదయం వ్యహాళికని వెళతారు, వెళ్ళడం మంచిదే కానీ, వేలకు వేలు పెట్టి దాని కోసం ప్రత్యేక బూట్లు కొని, అవి వేసుకుని వెళతారు. అప్పుడేమీ లాభం లేదు. ఏదైనా చేయాలనుకుంటే గాజుముక్కలు లాంటివి లేని చోట, మట్టిలో ఒట్టి కాళ్ళతో నడిచి చూడండి, ఎంతో మార్పు కనిపిస్తుంది, శరీరం తనంతట తానే రోగాలను నయం (Healing) చేసుకుంటుంది. అది మట్టికి ఉన్న శక్తి. కానీ మట్టి సారవంతమై ఉండాలి, పవిత్రంగా, కాలుష్యరహితంగా ఉండాలి. మనం మరమనుషులుగా కాక, మట్టి మనుషులుగా బ్రతకాలి.

To be continued ..........

Thursday, 8 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 4



ఇప్పుడు ప్రజలు ఎదురుకంటున్న ఆరోగ్యసమస్యల్లో ఒకటి బి 12 విటమిన్ లోపించడం. వినడానికి ఏదో ఒక చిన్న విటమిన్ లోపంగానే అనిపిస్తుంది కానీ, అది లోపిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. నాడీసంబంధం సమస్యలు చాలా తీవ్రంగా వస్తాయి. ఈ మధ్య ఇది చాలా ఎక్కువైంది. ఇది లోపించినవారు పడే బాధ, నొప్పులు వర్ణానతీతం. చాలామంది ఆసుపత్రిలో చేరి సిలైన్లు, ఇంజెక్షన్లు తీసుకుని చికిత్స చేయించుకున్నారు. ఇలాంటి వారిని నేను ప్రత్యక్షంగా చూశాను. డాక్టర్లు, ఫార్మా కంపెనీలు అంటాయి, బి 12 లోపం శాఖాహారులకు తప్పకుండా కలుగుతుంది, ఈ విటమిన్ మాంసాహారంలోనే అధికంగా ఉంటుంది, శాఖాహారులు ఖచ్చితంగా ఇంజెక్షన్లు తీసుకోవాలి అని. ఇదే విషయం మీద నా మిత్రుడు, అనీల్ కిషన్ పురాతన ఆయుర్వేద గ్రంధాలపై పరిశోధన చేస్తున్నారు. వారంటారు 'మాంసాహారం తినే పులితో పోల్చుకున్నప్పుడు, బరువు తక్కువగా ఉన్న మేక లేదా జింకలో బి12 అధికంగా ఉంటుంది. సమస్య శాఖాహారంలో లేదు, అందులో సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్లనే వస్తోంది. పైగా మాంసాహారంలో ఉండే బి12, ఆహారం వండే సమయంలోనే చాలా శాతం నశించిపోతుంది. ఈ బి 12 అనేది మట్టిలో అధికంగా ఉంటుంది, మీకు ఎప్పుడైనా వెంటనే బి 12 రావాలంటే మట్టిలో పని చేయాలి, మట్టి పిసకడమో, మొక్కలు నాటడమో, లేద మట్టి తొక్కడమో చేయాలి. అప్పుడు ఇంజెస్కన్ కంటే వేగంగా ఈ విటమిన్ శరీరానికి చేరుతుంది. టాబ్లెట్లు, ఇంజెక్షన్లు తాత్కాలిక ఉపశమనం కలిగించినా, జీవన విధానంలో మార్పు చేసుకోవాలి. మట్టికి దగ్గరగా బ్రతకాలి. అయితే మట్టి గురించి చెప్పుకున్నప్పుడు ఈ బి 12 నేది చాలా చిన్న విషయం. మట్టిలో యోగిని అనే సూక్ష్మజీవులు ఉంటాయి. అవి శరీరానికి ఎంతో అవసరం. మన శరీరంలో మనకు మంచి చేసే రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అవి నిర్వర్తించే కార్యాన్ని అనుసరించి వాటికి పేర్లను నిర్ణయించారు ఋషులు. శరీరంలో కాళీ అనే సూక్ష్మక్రిములు ఉంటాయి. ఎలాగైతే ఆదిపరాశక్తి కాళీ రూపంలో దుష్టులను హతమార్చిందో అలా ఇవి రోగకారక క్రిముల పై పోరాడి వాటిని శరీరం నుంచి బయటకు పంపేస్తాయి. అందుకే వీటికి ఆ పేరు. అలాంటివే ఈ యోగిని కూడా. ఇది ఎంతో పెద్ద సబ్జెక్టు. కానీ ఈ యోగిని క్రిముల లక్షణం ఏమిటంటే ఇవి శరీరంలో బి12 ఉత్పత్తి జరిగేలా చూస్తాయి. ఇలాంటి క్రిములు కేవలం మంచి సారవంతమైన మట్టిలో చెప్పులేకుండా ఒట్టి కాళ్ళతో నడవడం చేత, తేమ కలిగిన పచ్చని ప్రాంతాల్లో నివసించడం చేత, పెద్ద పెద్ద, బాగా వయసున్న వృక్షాల దగ్గరకు వెళ్ళడం చేత, వాటి గాలిని పీల్చడం చేత శరీరంలోనికి ప్రవేశించి, రోగాలను నివారిస్తాయి. అదేకాకుండా ఆవుపేడతో కళ్ళాపి చల్లిన చోటా, ఆవుపేడ అలికిన కూడా ఈ యోగిని క్రిములు ఉంటాయి. (అప్పుడు నాకర్దమయ్యింది, మన సంప్రదాయంలో ఇల్లంతా పేడతో ఎందుకు అలుకుతారో, ఇంటి ముందు కళ్ళాపి ఎందుకు చల్లుతారో). ఇలా మట్టి ద్వారా, శాకాహారం ద్వారా వచ్చే బి12 మాంసాహారం ద్వార లభించే బి12 కంటే ఎంతో శ్రేష్టమైనది. శరిరంలో ఈ సూక్ష్మక్రిములు ఉంటే విషాన్ని సైతం జీర్ణం చేసుకుని అమృతంగా మార్చుకోవచ్చు. వారికి మంచి ఆలోచనా శక్తి ఉంటుంది, శారీరిక పుష్టి ఉంటుంది, ఆహారం జీర్ణం కాకపోవడమనేది వీరి విషయంలో ఒక పెద్ద జోక్. వీరికి అసలా బాధే ఉండదు. కాబట్టి మనం మన జీవన విధానాన్ని మార్చుకోవాలి, మట్టికి, మొక్కలకు దగ్గరగా జరగాలి'.

ఈ తరానికి తెలియదు కానీ ఒకప్పుడు మనమంతా మట్టిలో ఆడుకున్నవాళ్ళమే. అప్పుడు మనమేమీ చెప్పులు వేసుకోలేదు. ఎంతో హాయిగా గంతులు వేసేవారము. మనకంటే మన అమ్మనాన్నలు, తాతయ్యల చిన్నతనానికి వెళితే, వారు ఇంకా ఎన్నో ఆడుకునేవారు, పంటపొలాల్లో, చెట్ల మీద లేదా చెట్ల క్రింద. అందుకే వారు ఏ రోగం లేకుండా హాయిగా ఉన్నారు. వాళ్ళ శరీరంలో ఈ సూక్ష్మ క్రిములు అధికంగా ఉండేవి. అందుకే వారికి స్థూలకాయం రాలేదు, జీర్ణ సమస్యలు రాలేదు, మలబద్ధకం అసలే లేదు. కానీ ఇప్పుడున్న తరాన్ని చూస్తే, వారు మట్టికి దూరమయ్యి, అనేక రోగాలకు దగ్గరవుతున్నారు.

మృత్తికే దేహిమే పుష్టిం త్వయీ సర్వం ప్రతిష్టితం ..........................
(ఆ మృత్తికా, మాకు పుష్టినివ్వు, సర్వం నీలోనే ఉంది (ఈ శరీరానికి కావల్సిన విటమిన్లు కూడా))

మనం ఎంత చక్కగా ఆడుకున్నాం, ఆ రోజులే వేరు అని అనుకుంటూ ఉందామా లేక మన పిల్లల్ని వాటికి దగ్గర చేసి, వాళ్ళు జీవితాలు పండిద్దామా? మనం కూడా మళ్ళీ దగ్గరయ్యి ఆరోగ్యంగా జీవిద్దామా? లేకపోతే మందులు మింగుతూ ఇలానే ఉందామా?

To be continued ...........

Wednesday, 7 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 3



మృత్తికే దేహిమే పుష్టిం త్వయీ సర్వం ప్రతిష్టితం |
తన్మే నిర్ణుదా మృత్తికా తయా హతెనా పాపేన గచ్ఛామి పరమాంగతిం ||

ఓ మృత్తికా! నాకు పుష్టినివ్వు. సర్వంలో నీలోని దాగి ఉంది, అన్ని సంపదలకు మూలం నీవు. నాకు మార్గదర్శనం చేసి, నా పాపాలను తొలగించు. నువ్వలా నా పాపాలను నశింపజేయగానే నేను ఊర్ధ్వలోకాలకు వెళ్ళగలను, నీ దయతో పరమగతి అయిన మోక్షాన్ని సైతం పొందగలను.

ఒకసారి రాజీవ్ దీక్షిత్ గారు పూరీ జగన్నాధస్వామి రధోత్సవం చూడాటానికి వెళ్ళగా, అప్పుడు వారికి అక్కడ పప్పన్నం ప్రసాదం పెట్టారట. అది ఎంతో రుచిగా ఉండడంతో, ఇది ఎలా వండారు, దీని ప్రత్యేకత ఏమిటని ఆరా తీస్తే, అక్కడ మట్టిపాత్రలలో వండి నివేదన చేస్తారని తెలుసుకున్నారు. అక్కడున్న శంకరాచార్య పీఠాధిపతితో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ మట్టిపాత్రలలో ప్రసాదం వండడానికి గల కారణం ఏమిటి? అని అడగ్గా, మట్టి పవిత్రమైనది, భగవంతునికి నివేదన చేసేది పవిత్రంగానే ఉండాలి, అందుకే మట్టి పాత్రలలో వండుతామని స్వామి వారు సమాధానమిచ్చారు. అయితే దీన్ని పరీక్ష చేయించాలనుకున్న రాజీవ్ దీక్షిత్ గారు దాన్ని భువనేశ్వర్ లో ఉన్న సి.ఎస్.ఐ.ఆర్. (CISR) కు తీసుకెళ్ళి పరిశోధించమంటే, దానికి దాదాపు 6 నెలల సమయం పడుతుందని, అయినా తమ వద్ద అన్ని పరికరాలు లేవని, అందుకని ఆ ప్రసాదాన్ని దిల్లీ వెళ్ళి పరీక్ష చేయించమని చెప్పారు. అది అప్పటికి వండి కొన్ని గంటలు గడించి, దిల్లీ వెళ్ళాలంటే సుమారు 36 గంటలు పడుతుంది. అప్పటికి ఇది పాడవుతుంది కదా అని రాజీవ్ గారు అనగా, అది పూరీ ప్రసాదమని, మట్టి పాత్రలో వండబడుతుంది కనుక పాడవ్వదు అని చెప్పారు అక్కడి శాస్త్రవేత్తలు. ఆయన దాన్ని దిల్లీ తీసుకెళ్ళి పరీక్షలు చేయించగా తేలిందేమిటంటే పప్పులో 18 రకాల సూక్ష్మపోషకాలుంటాయి (Micro Nutrients), అవే దానిలో ఉన్న బలం, ఆ 18 లో ఒక్కటి కూడా ఈ ప్రసాదంలో తగ్గలేదట. పూర్తిగా 100% ఉన్నాయట. వంటనే ఆయన ప్రెషర్ కుక్కర్ లో వండిన పదార్ధాన్ని పరీక్ష చేయిస్తే, అందులో కేవలం 13 శాతం పోషకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, మిగితా 87 % పోషకాలు లోపించాయని (నశించాయని) తేలింది. ఆ విషయం చెప్పి రాజీవ్ దీక్షిత్ గారంటారు పూరీలో పూజారులు సైన్సు చదవలేదు, అందుకని వాళ్ళు శాస్త్రీయంగా చెప్పలేకపోయారు, అయినా మట్టి పవిత్రమైనదని చెప్పారు. నేను సైన్సు చదివి కూడా పరీక్ష చేయిస్తే గాని తెలుసుకోలేకపోయాను. అందుకే మన భారతీయ సంస్కృతిలో అనాదిగా మట్టి పాత్రలలో వంట వండడమే సంప్రదాయంగా వస్తోంది. అల్యూమీనియం ముడిపదార్ధం మన భూమిలో పుష్కలంగా ఉన్నా, మన పూర్వీకులు ఏనాడు దాన్ని ఉపయోగించలేదు. అదేకక మట్టి పాత్రలో వండిన పదార్ధానికి రుచి కూడా అద్భుతంగా వస్తుంది. మట్టికి ఆ శక్తి ఉంది.

ఇంకా వారంటారు వైజ్ఞానికంగా మన శరీరం అంతటా ఉండేది మట్టియే. ఈ శరీరానికి కావల్సిన 18 సూక్ష్మపోషకాలన్నీ మట్టిలోనే ఉంటాయి. ఆ పోషకాలనే మొక్క గ్రహించి పప్పుధాన్యాల్లో నిక్షిప్తం చేస్తుంది. అందుకే ఆ 18 పోషకాలు పప్పులో ఉంటాయి. మళ్ళీ ఇవే 18 పోషకాలు గోమూత్రంలో కూడా ఉంటాయి.

అందుకే ఇప్పటికీ లలితా సహస్రనామ పారయణ చేసేవారు అమ్మవారికి, ఆ నామావళిలో చెప్పబడిన నివేదనలు సిద్ధం చేయడానికి ఇప్పటికీ మట్టిపాత్రలనే వాడతారు, ఆవు పిడకలను వంటచెరుకుగా వాడుతూ కుంపటి మీద వండుతారు. పవిత్రత కోసమని. అదే శ్రద్ధకు నిదర్శనమని లలితాసహస్రనామ బాష్యం ప్రవచనం చెప్తూ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు అన్నారు.

అందుకే సారవంతమైన మట్టిని కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే శరీరానికి పుష్టికరమైన ఆహారం అందుతుంది. ఇప్పుడు అఘమర్షణ సూక్తంలో చెప్పిన 'మృత్తికే దేహిమే పుష్టిం' అనే మాట ఎంత సత్యమో అర్దమయ్యిందా? ఈ పొషకాలే కాకుండా ఇంకా ఏమేమి పోషకాలున్నాయో పరిశీలిద్దాం.

To be continued ...........

Tuesday, 6 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 2



మృత్తికే హరమే పాపం యన్మయా దుష్కృతం కృతం |
మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభి మంత్రితాః ||

ఓ మృత్తికా! నేను చేసిన పాపాలను, దుష్కృతాలను నశింపజేయి. నీవు బ్రహ్మ చేత సృష్టించబడ్డ దానవు, మరియు కశ్యప ప్రజాపతి చేత మంత్రపూతమై పవిత్రం చేయబడ్డావు. ఆయన పవిత్రం చేసిన మృత్తికను తిరిగి ఈ భూమంతా చల్లాడట.

ఈ మంత్రాల్లో ఎంతో అర్దం దాగి ఉంది. మట్టి పవిత్రత ఎంత గొప్పదంటే ఒకసారి పార్వతీ దేవి శివుడితో 'మీరు బంగారు, వెండి, ఇత్తడి మొదలైన అనేక లింగాల్లో అర్చించబడతారు కదా. మీకు ఏ లింగార్చన అంటే ఇష్టం?' అని అడిగింది. అప్పుడు శివుడు 'నాకు అన్నిటికంటే పార్ధివ లింగార్చన అంటే ఇష్టం' అని సమాధానం ఇస్తాడు. పార్ధివ లింగం అంటే మట్టితో చేసిన లింగం, దానికి మిగితా లోహాలతో చేసినవేవీ సాటి రావంటాడు. పార్ధివ లింగాన్ని అర్చిస్తే, కోరికలు తొందరగా నెరవేరుతాయని శాస్త్రంలో చెప్పబడింది. కానీ ఈ లింగాన్ని ఎప్పటికప్పుడు చేసి, పూజ ముగియగానే ఉద్వాసన చెప్పి, నిమజ్జనం చేయాలి. శివుడలా చెప్పడానికి మట్టి అందరికీ అందుబాటులో ఉండడం ఒక కారణమైతే, మట్టికున్న పవిత్రత రెండవ కారణం. అలా పరమశివుడే మట్టి పవిత్రతను చాటాడు.

ఒకసారి లింగ పురాణానికి వెళదాం - గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?"

"మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది అని సూతుడు సమాధానం చెప్తూ ఇంకా అనేక విషయాలను చెప్తాడు. (మహాగణపతి పురాణం(బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మీనరసింహరావు)

ముద్గల పురాణంలో గణేశ చతుర్థీ రోజున కేవలం మట్టి గణపతిని మాత్రమే పూజించాలని చెప్పబడింది. ఇతర లోహాలతో చేసిన గణపతులను అర్చించాలని అందులోలేదు. ఎందుకంటే ఆ తిధి నాడు వచ్చే గణపతి శక్తిని ఆకర్షించే శక్తి ఒక్క మట్టికే ఉంది. భగవంతుని దేనిలోకి ఆవహన చేస్తామో, అది పవిత్రమై ఉండాలని శాస్త్రము చెప్తున్నది. ఆ పవిత్రత మట్టికి ఉంది కనుక ఆ పర్వంలో మృత్తికా గణపతి పూజ. ఎన్నో విషయాలను చెప్పినా మన పురాణాలు, అరటి తొక్కలతో, చింతపిక్కలతో గణపతిని తయారు చేయమని చెప్పలేదు, ఇప్పుడు మనం చేస్తున్నట్లుగా. ఏమి? వారికి తెలియదా? చింతపిక్కలతో, పూలరెక్కలతో, గాజుముక్కలతో విగ్రహాలు చేయచ్చని? అదికాదు సంగతి. అలా చేసినవి పవిత్రతను నిలుపుకోలేవు. ఆ దైవీ శక్తిని ఆకర్షించలేవు.

మనం ఏ పూజ చేసినా, నూతన కార్యం ప్రారంభించినా, ముందుగా పసుపు ముద్దతో గణపతిని చేసి, ఆ తర్వాత పని మొదలుపెడతాము. ఒకవేళ పసుపు గణపతిని కొలిచే వీలు లేని పరిస్థితి వస్తేనో? అప్పుడు మట్టిబెడ్డను తెచ్చి, అందులోకి గణపతి ఆవహన చేసి పూజించినా, అంతే సమానమైన ఫలితం వస్తుందని చెప్పారు.

గతభాగంలో మనం చెప్పుకున్న మంత్రం నిత్యం పఠించకపోయినా, యజ్ఞయాగాది క్రతువుల సమయంలో నదీస్నానం చేస్తారు. అప్పుడు కూడా నదిలోంచి మట్టిని తీసి, ఒంటికి రాసుకుని, శిరస్సును ధరించి, ఆ సూక్తాలు చదివి స్నానం చేస్తారు. పవిత్రత కోసం. అంటే ఇక్కడ మనకు ఏమి అర్దమవుతున్నది, మట్టి పవిత్రతకు చిహ్నం. మరి మనం మట్టిని పవిత్రంగా ఉంచుతున్నామా?

To be continued .........

Monday, 5 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 1



మట్టే మన ఆహారం. అవును, మట్టే మన ఆహారం. మీరు విన్నది నిజమే. అదేమిటని అడుగుతారేమో! మట్టి నాణ్యతను బట్టే మొక్కలో పోషకాలు తయారువుతాయి. మొక్క తనకు కావల్సిన పోషకాలన్నీ మట్టి నుంచి తీసుకుంటుంది. 45% మినరల్స్, 25% గాలి, 25% నీరు, 5 % ఆర్గానిక్ తో తయారవుతుంది మట్టి. మీకో విషయం తెలుసా? ఉపరితల భాగంలో ఉందే ఒక అంగుళం మట్టి (Top soil) ఏర్పడటానికి 100 ఏళ్ళు పడుతుంది. అదే మట్టి కలుషితమైతే? సారం కోల్పోతే? మానవుడి చర్యల వలన వికృతమైతే? మానవులు తీసుకునే ఆహారం కలుషితమవుతుంది, సారహీనమవుతుంది. ఆరోగ్యం, బలం ఇవ్వాల్సిన ఆహారం, అనారోగ్యాన్ని ఇచ్చి బలహీనులను చేస్తుంది. బలహీనమైన జాతి నశిస్తుంది. మానవసమాజం కుప్పకూలుతుంది. మానవ అకృత్యాల వలన సారం, జీవం కోల్పోతున్న మట్టిని సంరక్షించడానికి ఐక్యరాజ్య సమితి డిసెంబరు 5 ను ప్రపంచ మృత్తికా దినోత్సవంగా ప్రకటించింది. ఒకసారి మట్టికి మన హిందూ సంస్కృతిలో ఉన్న వైశిష్ట్యం తెలుసుకుందాం.

రుద్రాయా’తతావినే క్షేత్రా’ణాం పత’యే నమో నమః’ సూతాయాహం’త్యాయ వనా’నాం పత’యే నమో నమో రోహి’తాయ స్థపత’యే వృక్షాణాం పత’యే నమో నమో’ ............. కృష్ణ యజుర్వేదంలో శ్రీ రుద్రంలో ఉన్న మంత్రమిది.  ధర్మమార్గంలో నడించేవారిని రక్షించువాడు, మా పొలాలను/ మట్టిని/ భూమిని రక్షించువాడు, అందరిని నడిపించువాడు, శత్రువుల చేత హతం చేయబడనివాడు, అడవుల రూపంలో ఉన్నవాడు/ వనాలను రక్షించువాడు, వాక్కును ప్రసాదించినవాడు, విశ్వాన్ని నిర్మించి పోషిస్తున్నవాడు, వృక్షరూపంలో ఉన్నవాడు/ వృక్షాలకు అధిపతి అయిన రుద్రునకు మా నమస్కారాలు అని పదేపదే నమస్కరించడం కనిపిస్తుంది. అందులో ఎంతో చక్కగా చెప్పారు, దీన్ని ఎన్నో కోణాల్లో దర్శించవచ్చు. ఇప్పటికి ఈ అంశానికే పరిమితమవుదాము. క్షేత్రానికి ఒక అర్దంలో మట్టి కూడా వస్తుంది. మట్టిరూపంలో ఉన్న శివునకు నమస్కారాలు అని, ఇంకో అర్దంలో మృత్తికకు అధిపతి, రక్షకుడైన శివునకు నమస్కారాలు అని అర్దం. దీనిబట్టి మనమేం అర్దం చేసుకోవాలి, మట్టిని కలుషితం చేయడం, భూసారం క్షీణించే చర్యలకు దిగడం రుద్రునకు చేసే అపచారం.

చమకంలోనికి వెళితే, అశ్మా చ’ మే మృత్తి’కా చ మే గిరయ’శ్చ మే పర్వ’తాశ్చ మే - అనే మంత్రంలో ఋషి, మాకు మంచి సారవంతమైన మృత్తికను ఇవ్వు అని అడుగుతున్నాడు.

అఘమర్షణ సూక్తం అనే సూక్తం వేదంలో ఉంది. అది స్నానం సమయంలో పఠిస్తారు. అది మట్టి విలువను ఎంతో గొప్పగా ప్రతిపాదిస్తోంది.

అశ్వక్రాంతే రధక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా 
శిరసాధారయిష్యామి రక్షస్వమాం పదేపదే

అంటూ ఉండే మంత్రం మట్టి శిరస్సుపై ధరించి స్నానం చేయడం వలన రక్షణ కలుగుతుందని చెప్తోంది. ఒకప్పుడు మట్టినే స్నానానికి వాడేవారు, బట్టల మురికి వదిలించడానికి కూడా మట్టినే వాడేవారని రాజీవ్ దీక్షిత్ గారు పలు ఉపన్యాసాల్లో చెప్పారు. దానికి కారణం మట్టిని ఉపయోగించడం వలన భూమి, నీరు కలుషితం కావు, రెండవది, అది సహజసిద్ధంగా తయారైనది. శరీరానికి హాని చేయనిది, పైగా పోషకాలను అందించేది. ఇప్పుడు మనం వాడే సబ్బులు చర్మానికి మంచివికావు, బట్టలకు మంచివికావు, పర్యావరణానికీ మంచివి కావు. అంతేనా? ఆ స్నానానికి వాడే సబ్బులను తయారు చేశాక, పరీక్షల కోసమని వాటిని జంతువుల మీద రకరకాలుగా ప్రయోగిస్తారు. కొన్నిటిని వాటి కంట్లోకి చొప్పించి, కళ్ళు పోతాయా లేదా అని పరీక్షిస్తారు. షాంపూల గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీలేదు. అంత హింసతో కూడుకున్నవి వాడటం అవసరమా? అలాంటి హింసకు పరోక్షంగా కారణమవుతున్న వాటి వినియోగదారులు మోక్షాన్ని పొందగలరా? కనీసం అలా ఆలోచించడానికి పాత్రులా?

To be continued ..............
http://techfactslive.com/world-soil-day-theme-quotes-history/15869/