Sunday, 22 March 2015

హిందూ ధర్మం - 151 (ఋషుల అత్యవసర సమావేశం)

మహాభారత యుద్ధం నాటికి వర్ణవ్యవస్థ మాత్రమే ఉండేది. కులవ్యవస్థలేదు. ఆ యుద్ధంలో ఎందరో యోధులు, వేదశాస్త్రాలను అభ్యసించిన పండితులు, అనేక నాగరికతలకు మూలపురుషులు, అనేక రాజ్యాల రాజులు పాల్గొన్నారు. అందులో వేదసారాన్ని ప్రచారం చేసిన పండితులు కూడా ఉన్నారు. ఈ యుద్ధం కారణంగా వారందరూ మరణించారు. అదీగాక, యుద్ధంలో వాడిన అస్త్రాలు పడి చాలా రాజ్యాలు తుడిచిపెట్టుకొని పోయాయి. అప్పటివరకు వేదం గ్రంధస్థం కాలేదు. ఆ యుద్ధం సమయానికి దాదాపు 197,29,43,963 సంవత్సరాలకు ముందు వేదం మానవాళికి ఇవ్వబండింది. అప్పటినుంచి పరంపరగా, ఎక్కడా ఆటంకం లేకుండా గురుశిష్యపరంపరగా వచ్చింది. కానీ ఈ యుద్ధం ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది. భారతదేశంలో రోడ్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని, రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలిగింది. ఇదంతా చూసిన ఋషులు, మునులు తీవ్ర ఆలోచనలో పడ్డారు. 'ఋషిః ఆ క్రాంతి దర్శనః' - భవిష్యత్తును దర్శించగలవారిని ఋషులు అంటారు. మానవజాతి మూలపురుషులైన ఋషులు ప్రపంచ భవిష్యత్తును గమనించారు.

అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఋషులందరూ భరతభూమికి తరలివచ్చారు. తొలిసారిగా 88,000 మంది మహర్షులతో భారతదేశంలో ఒక పెద్దసమావేశం జరిగింది. అది ఒకరకంగా అత్యవసరసమావేశం లాంటిదే. ప్రపంచభవిష్యత్తుపై మేధోమధనం జరిగింది. అది ఒక యజ్ఞం లాంటిది, అనేకులు దానిపై అభిప్రాయాలు పంచుకున్నారు. యుద్ధం ద్వాపరయుగాంతం యొక్క ప్రభావ ఫలితమే. అందుకే అంతపెద్ద జనవినాశనం సంభవించింది. శ్రీ కృష్ణపరమాత్మ మహానిర్యాణంతో ద్వాపరయుగాంతం అవుతుంది. అప్పుడు ప్రపంచాన్ని ఒక మహాజలప్రళయం ముంచెత్తుంతుంది. ప్రపంచనాగరికతలన్నీ నాశనమవుతాయి. అసలే వేదంలో ఉద్దండులైన వారందరూ యుద్ధం కారణంగా మరణించారు, వేదం నశించకపోయినా, వేదం తెలిసినవారందరూ నశించారు. వేదం నిరంతరం అధ్యయనం చేయాలి, అప్పుడే మానవజాతి పురోగమిస్తుంది, ప్రపంచం శాంతి మార్గంలో ప్రకృతి నియమాలకు లోబడి అభివృద్ధి చెందుతుంది. అందరూ రక్షించబడతారు. ................ రాబోయేది కలియుగం. ప్రజల్లో అధ్యాత్మిక భావన తగ్గిపోతుంది, నాస్తికం, దురాచారం, అధర్మం ప్రభలుతుంది. అప్పటివరకు శరీరంతో ఉన్న రాక్షసులు ఈ యుగంలో మానవ మనసుల్లో తిష్టవేస్తారు. వర్ణాశ్రమ ధర్మాలు మంటగలుస్తాయి. కొత్త మతాలు, వాదాలు పుట్టి జనాలను పక్కదారి పట్టిస్తాయి. అప్పటివరకు సమాజంలో సంచరించిన ఋషులు, మునులు ఇవి చూడలేక సమాజానికి దూరంగా తపస్సులో మునిగిపోతారు. ఎప్పుడో ఒకసారి ఒక మహానుభావుడికి దర్శనం ఇచ్చి, ధర్మరక్షణకు పురికొల్పుతారు.

ఇవన్నీ ఒక ఎత్తైతే  ఈ కలియుగంలో మానవుల ఆయుర్దాయం చాలా తక్కువ, కేవలం 120 సంవత్సరాలు మాత్రమే. అది కూడా సక్రమంగా వాడుకోరు. పైగా అల్పబుద్ధులు, అనంతమైన వేదాన్ని ధారణలో నిలుపుకోలేరు. కాబట్టి ఇప్పుడు వేదాన్ని గ్రంధస్థం చేయవలసిన అవసరం ఏర్పడింది అని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.. అది మహాసాహసకృత్యం, అప్పటివరకు ఎవరు చేయడానికి పూనుకోనిది.

To be continued ................

No comments:

Post a Comment