Saturday 30 November 2019

ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా?

బయట వినిపించే మాటల్లో ఇదొకటి. కుటుంబసభ్యులు ఎవరైనా మరణిస్తే, ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదని ప్రచారం చేస్తున్నారు. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు, దేవతలందరిని ఒక బట్టలో చుట్టి, అటక మీద పెట్టేస్తారు. సంవత్సరీకాలన్నీ అయిపోయిన తర్వాత మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను క్రిందకు దింపి, శుభ్రం చేసి పూజ చేస్తారు. అంటే ఆ వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దీపారాధాన, దైవానికి పూజ, నివేదన ఉండవన్నమాట. ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రం ఇలా చెప్పలేదు. 

దీపం లేని ఇల్లు స్మశానంతో సమానం. దీపం శుభానికి సంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలు వస్తారు. ప్రతి ఇంట్లోను నిత్యం దీపారాధాన అనేది జరగాలి. మరణం సంభవించిన ఇంట్లో 11 వ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12 వ రోజు శుభస్వీకారం జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు. అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది. అంతేకానీ ఏడాది పాటు దీపం వెలిగించకూడదని, పూజలు చేయకూడదని చెప్పలేదు. నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని, అర్ఘ్యప్రధానం వరకు బాహ్యంలో చేసి, మిగితాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్పింది. ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు. మనం నిత్యం ఇంతకముందు ఏదైతే చేస్తున్నామో, అది నిరభ్యంతరంగా కొనసాగినవచ్చు. కొత్త పూజలు అనేవి ప్రారంభించకూడదు. ఇంతకముందు రోజూ ఆలయానికి వెళ్తుంటే, సూతకం అయిన తర్వాత కూడా యధావిధిగా ఆలయదర్శనం చేయవచ్చు. 

మనం నిత్యం అర్చించడం వలన మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారు. అలా ఏడాది పాటు వారికి ధూప, దీప, నైవేధ్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా, బట్టలో చుట్టి పక్కన పెట్టడమే తప్పు. కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన, దైవారాధన జరగాలి. ఇంటికి గానీ, ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా, వాటిని అన్నిటిని ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు ఉంటుంది. కనుక ఎన్నడూ దైవారాధన, దీపారాధన మానకూడదు. ఈ విషయంలో చేయవచ్చు అనేకంటే చేసి తీరాలి అని చెప్పడం సరైన సమాధనం అవుతుందేమో! 

No comments:

Post a Comment