Thursday 28 November 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 32 వ భాగము



153. శిష్యుడు మొట్టమొదటగా తన గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన చూపిన మార్గంలో నడవాలి.
154. శిష్యుడు గురువు యొక్క ఇంట్లోనే ఉంటూ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటూ, గ్రంథాధ్యానం చేయాలి.
155. చద్ది అన్నము లేక పంచభక్ష పరమాన్నాము, మంచిదో, చెడ్డదో, ఎక్కువో, తక్కువో, ఏదైతే గురువు యొక్క పవిత్రమైన హస్తాల ద్వారా వస్తుందో/ అందుతుందో, ఆ ఆహారాన్నే శిష్యుడు స్వీకరించాలి/భుజించాలి.
156. మనస్సు యొక్క నీచమైన ప్రకృతిని శుద్ధి చేసుకోవాలి. శిష్యుడు గురువుకు ఈ విధంగా చెబుతాడు- "నాకు యోగాభ్యాసం చేయాలని ఉంది. నిర్వికల్ప సమాధిని పొందాలని ఉంది. మీ యొక్క పాదపద్మముల ముందు కూర్చోవాలని ఉంది. నేను మిమ్మల్ని శరణువేడాను". కానీ అతడు తన నీచమైన/ అల్పమైన ప్రకృతిని మరియు అలవాట్లను, అతని పాత స్వభావాన్ని, వ్యవహరించే తీరును, నడవడికను మార్చుకోడు.
157. అల్పమైన ప్రకృతిని మార్చడం అంత సులభం కాదు. అలవాట్ల యొక్క శక్తి చాలా బలంగా మరియు మొండిగా ఉంటుంది. దానికి ఎంతో సంకల్ప బలం ఉండాలి. సాధకుడు తన పూర్వపు అలవాట్ల యొక్క శక్తి వలన బలహీనుడిని భావిస్తాడు. అతడు నిరంతర జపము, కీర్తనము, ధ్యానము, నిస్వార్థ సేవ, సత్సంగము మరియు అలుపు చెందని స్వభావము ద్వారా తన సత్త్వాన్ని మరియు సంకల్ప బలాన్ని ఎంతో వృద్ధి చేసుకోవాలి. అతడు తనలోని దోషాలను ఆత్మపరిశీలన చేసుకుని తన యొక్క లోపాలను మరియు బలహీనతలను గ్రహించాలి. అతడు గురువు యొక్క మార్గదర్శనంలో జీవించాలి. గురువు శిష్యుని దోషాలను గ్రహించి/తెలుసుకుని వాటిని నిర్మూలించేందుకు తగిన మార్గాలను సూచిస్తాడు.
158. మోక్షాన్నిచ్చే నాలుగు సాధనాలను నీవు అలవర్చుకొని, అప్పుడు బ్రహ్మ శ్రోత్రియుడు, బ్రహ్మ నిష్ఠుడైన గురువు దగ్గరికి వెళ్ళాలి. నీ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. గురువు ఇచ్చిన ఆధ్యాత్మిక ఉపదేశం అనే సహాయంతో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలి. నీవు సరైన విధంగా మలుచుకునే వరకు, ఆయనతోనే జీవించాలి. జీవన్ముక్తి పొందిన మహాత్ముని నీతో వ్యక్తిగత సంబంధము కలిగి ఉండడం ఎంతో ఉన్నతిని కలిగిస్తుంది. నీకు తపన మరియు నిజాయితీ ఉంటే నీ గురువు చెప్పిన సూచనలు తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తే, నీవు నిరంతరం తీవ్రమైన ధ్యానం చేస్తే, పరమ లక్ష్యాన్ని ఆరు నెలల లోపే సాధిస్తావని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. దీన్ని నా మాటగా తీసుకో. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది.
159. ఈ ప్రపంచమంతా ప్రలోభాలతో మరియు దురాకర్షణలతో నిండి ఉంది. కాబట్టి కొత్తగా సాధన మొదలు పెట్టినవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు సరైన విధంగా రూపుదిద్దుకునే వరకు, ధ్యానంలో ఒక స్థాయికి చేరుకునే వరకు, వారు గురువు యొక్క పాదపద్మాల వద్ద కూర్చోవాలి. ఎవరైతే మొదటి నుంచి స్వతంత్రంగా ఉంటూ, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, గురువు గారి మాట పట్ల ఏ విధమైన శ్రద్ధ చూపించరో, వారు నిరాశాజనకమైన ఫలితాలకు దృష్టాంతాలు గా మారతారు. వారు లక్ష్యం లేని జీవితాన్ని గడుపుతూ, దశదిశ లేకుండా ప్రవాహానికిఅటు నుంచి ఇటు కొట్టుకుపోతున్న చెక్క దుంగ లాగా, సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ ఉంటారు.
160. మూర్ఖమైన శిష్యుడు తన పాత అలవాట్లనే పట్టుకుని ఉంటాడు. అతడు భగవంతునికి లేదా తన గురువుకి శరణాగతి చేయడు.
161. శిష్యుడు నిజంగా మెరుగుపడాలి అనుకుంటే అతను తన గురువు ముందు ముక్కుసూటిగా మరియు నిష్కపటంగా ఉండాలి.
162. విధేయత లేనివాడు, క్రమశిక్షణను ఉల్లంఘించి వాడు, తన గురువు ముందు యధార్ధముగా మాట్లాడనివాడు, ముక్కుసూటిగా మాట్లాడకుండా తన భావాలను దాచుకునేవాడు, గురువు లేదా ఆధ్యాత్మిక మార్గదర్శి కొరకు తన హృదయాన్ని తెరువలేనివాడు గురు వలన ఏ విధంగానూ లాభపడడు. అతడు తాను ఏర్పరుచుకున్న ఊబి లేదా బురదలో కూరుకుపోయి, ఆధ్యాత్మికపథంలో ఉన్నతిని పొందడు. ఎంత దయనీయమైన పరిస్థితి. నిజానికి అతనిది ఎంతో దౌర్భాగ్యము.
163. శిష్యులు భగవంతుడు లేదా గురువుకు సంపూర్ణముగా, నిష్కపటంగా, లోపరహితంగా, ఏ విధమైన ఫలములు ఆశించకుండా ఆత్మ సమర్పణ లేదా శరణాగతి చేయాలి.
164. గురువు చేయగలిగినదల్లా తన శిష్యులకు సత్యాన్ని ఎఱుకపరుచుకునే లేదా దివ్యజ్ఞానాన్ని తన ముందు ఉంచే మార్గాన్ని మాత్రమే తెలుపగలరు.
165. మోక్షానికి తగిన నాలుగు సాధనాలు కలిగి ఉన్న శిష్యుయ్డు, గురువు పాదాల వద్ద కూర్చుని శృతులను (వేదాలను) శ్రవణం చేస్తాడొ, తత్వమసి మొదలైన మహావాక్యాల ప్రముఖతను తెలుసుకొని, అటు తర్వాత లోతుగా విచారణ చేస్తాడు.

No comments:

Post a Comment